'కాఫీ విత్ ఎ కిల్లర్' ఓటీటీ మూవీ రివ్యూ!
అలా డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీనే 'కాఫీ విత్ ఎ కిల్లర్' ఎలా ఉంది ఈ సినిమా...చూడదగ్గదేనా?;
ఓటీటీల్లో రెండు రకాల సినిమాలు కనపడుతుంటాయి. ఒకటి థియేటర్ రిలీజ్ తర్వాత ఓటీటీలోకి వచ్చే సినిమాలు, కేవలం ఓటిటిల కోసమే తీసే సినిమాలు . అయితే థియేటర్ రిలీజ్ ల తర్వాత ఓటీటీ లోకి వచ్చే సినిమాలు గురించి పెద్దగా మాట్లాడుకునేది ఏమీ లేదు. వాటి గురించి ఆల్రెడీ ప్రేక్షకుడుకి తెలిసే ఉంటుది. రివ్యూలు ఉంటాయి. ఇక డైరెక్ట్ ఓటిటి రిలీజ్ సినిమాలకు ఇవేమి ఉండవు. ఓటీటీ లో రిలీజ్ అయ్యాక సినిమా బాగుందని టాక్ వస్తేనే చూస్తుంటారు. దానికి తోడు పబ్లిసిటీ కూడా పెద్దగా ఉండదు. అలా డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీనే 'కాఫీ విత్ ఎ కిల్లర్' . ఎలా ఉంది ఈ సినిమా...చూడదగ్గదేనా?
స్టోరీ లైన్
అదో కాఫీ షాప్. అక్కడకు రకరకాల జనం వస్తూంటారు. కొందరు అక్కడ వృత్తిపరమైన మీటింగ్ లు పెట్టుకుంటారు. మరికొందరు తమ జీవితాలకు సంభదించిన నిర్ణయాలు తీసుకోవడానికి మాట్లాడుకోవడానికి వస్తుంటారు. అలాగే అక్కడ కొన్ని డీల్స్ అవుతుంటాయి. సినిమా వాళ్లు స్టోరీ డిస్కషన్స్ చేస్తూంటారు. అలా వివిధ వ్యక్తులు,వృత్తులు వాళ్ళు అక్కడికి వచ్చి రకరకాల విషయాలను మాట్లాడుకుంటున్నారు. వాటిలో ఫ్యామిలీ డిస్కషన్స్, నిర్మాతకు స్టోరీ నెరేషన్, ల్యాండ్ డీలింగ్స్ వంటివి కూడా ఉంటాయి. అలాగే అక్కడికి ఓ కిల్లర్ కూడా ఒకరిని చంపేందుకు అక్కడకి వస్తాడు.
అక్కడికి వచ్చిన ఆ కిల్లర్ ....తనని నియమించిన వ్యక్తి ఇచ్చే ఆదేశం కోసం ఎదురుచూస్తూంటాడు. ఈలోగా ఆ కాఫీ షాప్ లో ఏదో క్రైమ్ జరుగుతుందనే అనుమానం రావడంతో ఓ పోలీస్ ఆఫీసర్ కూడా అక్కడికి చేరుకుంటాడు. ఇంతకీ ఆ కిల్లర్ ను నియమించింది ఎవరు? ఎవరిని చంపడానికి అతను రంగంలోకి దిగాడు? ఆ తర్వాత కిల్లర్ చేసే హత్యతో వాళ్ల జీవితాల్లో ఎలాంటి మలుపు తిరిగిందనేది, పోలీస్ ఆఫీసర్ ఏం చేశారు వంటి విషయాలతో నడిచేదే ఏ కాఫీ విత్ ఏ కిల్లర్ మూవీ కథ.
ఎలా ఉంది
ఇది చిన్న కాన్సెప్టు తో తయారు చేసిన కథ. క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్, సెటప్ తప్పించి చెప్పుకోవటానికి ప్రత్యేకంగా ఏమీ లేదు. పైపైనే రాసుకున్నారు. డెప్త్ గా డిజైన్ చేయలేదు. రకరకాల క్యారెక్టర్ వస్తూంటాయి. వెళ్తుంటాయి. కానీ ఏమీ గుర్తుండేలా బిహేవ్ చేయవు. ఇంతకు ముందు నిఖిల్ చేసిన ఓ సినిమాలో అంతా రైల్వే స్టేషన్ లోకి వచ్చి చేరుతారు. అక్కడ జరిగే కొన్ని సంఘటనలతో తెరకెక్కినట్లు మొత్తం కాఫీ షాప్ లో జరిగే ఈ కథలో రకరకాల పాత్రల చుట్టూ సినిమా తిరుగుతుంది. అయితే చూసేవారు ఇలా సింగిల్ లొకేషన్ లో తీసారా, ఎక్కువ చోట్ల తీసారా అనేది చూడరు. తమను కంటెంట్ కొట్టిపారేస్తుంది లేదా అనేది ముఖ్యం.
ముఖ్యంగా టైట్ స్క్రీన్ ప్లే ఈ కథలకు అవసరం. అదే ఈ సినిమాకు లోపించింది. ఉన్న పాత్రలకే దిక్కు లేదురా అంటే కొత్త పాత్రలు వచ్చి పోతుంటే విసుగొస్తుంది. కిల్లర్ ఎవరిని చంపుతాడనేది ఇంట్రెస్టింగ్ ఎలిమెంటే అయినా దాన్ని సాగతీసిన ఫీలింగ్ వచ్చింది. దాంతో కొన్ని సార్లు పేలని జబర్దస్త్ స్కిట్ లాగ ఒకే స్టేజిపై జరుగుతున్నట్లు అనిపించింది. ఏదైమైనా కంటెంట్, ప్రెజెంటేషన్ విషయంలో దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది.
టెక్నికల్ గా
స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే జస్ట్ ఓకే అన్నట్టు సాగాయి. తిరుమల నాగ్ డైలాగ్స్ సోసోగా ఉన్నాయి. అనుష్ గోరఖ్ ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్, భరత్ మధుసూదన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్లే ఉన్నాయి. రవిబాబు .. సత్యం రాజేష్ .. శ్రీనివాసరెడ్డి .. బెనర్జీ .. జెమినీ సురేష్ వంటివారు సినిమాను తన అనుభవంతో లాక్కెళ్లిపోయారు. కిల్లర్ గా టెంపర్ వంశీ బాగా చేశారు.
చూడచ్చా
ఖాళీగా ఉండి, చూడడానికి ఏ కొత్త సినిమా లేదనుకున్నప్పుడు ఈ సినిమా కాలక్షేపానికి పనికొస్తుంది.
ఎక్కడ ఉంది
ఆహా ఓటీటీ లో తెలుగులో ఉంది.