'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్' - ఈ కొత్త సిరీస్ కథేంటి, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?
'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్' - ఈ కొత్త సిరీస్ కథేంటి, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?;
-సూర్యప్రకాష్ జోస్యుల
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బాహుబలి ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నాలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ కథకు కంటిన్యూ చేస్తూ మూడో భాగం (బాహుబలి-3) కూడా వస్తుందన్నారు. దాని సంగతి ఏమో కానీ.. ఈ కథకు ముందు ఏం జరిగింది అంటే ప్రీక్వెల్ రాసుకుని ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ అనే టైటిల్ తో ఓ యానిమేటెడ్ సిరీస్ రెడీ చేసి మన ముందుకు తీసుకువస్తున్నారు.
'బాహుబలి' యానిమేటెడ్ వెర్షన్‌ను 'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్' (Baahubali Crown of Blood' అనే పేరుతో తీసుకు వస్తున్నట్లు రాజమౌళి ఇటీవలే ప్రకటించారు. అంతేకాదు, 'మాహిష్మతి ప్రజలు అతడి పేరును మంత్రంలా జపిస్తున్నప్పుడు, ఈ విశ్వంలోని ఏ శక్తి అతడు తిరిగి రావడాన్ని ఆపలేదు. యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ రాబోతోంది' అని తెలిపారు.
ఈ యానిమేటెడ్ సీరిస్ లో 'బాహుబలి'లో చూపించిన కథకంటే ముందు ఏ యే సంఘటనలు జరిగాయి అనే విషయాన్ని చూపెట్టబోతన్నట్లు తాజాగా వదిలిన ట్రైలర్ ద్వారా అర్దమవుతోంది. అమరేంద్ర బాహుబలిని భల్లాలదేవుడు వెన్నుపోటు పొడవడానికి ముందు కొత్త శత్రువుతో మాహిష్మతి చేసిన పోరాటాన్ని చూపించారు.
రక్తదూత్ అనే రాజు కట్టప్పను తన సేనాధిపతిగా నియమించుకొని మాహిష్మతి రాజ్యం మీదకు దండెత్తి వస్తాడు. ఇక సింహాసనం ఎక్కడం కోసం బాహుబలిని ఆ పదవి నుంచి ఎలా తప్పించాలా అనే తరుణం కోసం ఎదురుచూసే భల్లాలదేవ, తన సోదరుడు బాహుబలితో కలిసి రక్తదూత్ను ఎదురిస్తాడా లేదా అన్న విషయాల గురించి సాగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ యానిమేటెడ్ సిరీస్ తెరకెక్కినట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. చూస్తుంటే ఈ సిరీస్‌లోనే కట్టప్ప విలన్ అని తెలుస్తోంది. తమకు శిక్షణ ఇచ్చిన కట్టప్ప పైనే మన సైన్యం ఎలా గెలుస్తుందంటూ నేరుగా బాహుబలి, భల్లాలదేవే రంగంలోకి దిగటం ఇంట్రస్టింగ్ గా ఉంది. అలాగే తన జీవితం మొత్తం మాహిష్మతికే అంకితమిచ్చిన కట్టప్పే ఈ సరికొత్త కథలో అదే మాహిష్మతిపై పోరాటం చేయడం ఇంట్రెస్టింగ్ పాయింట్. అలాగే దండెత్తడానికి వచ్చిన కట్టప్ప మాహిష్మతికి కట్టుబానిసగా ఎలా మారాడు వంటి విషయాలు తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే.
ఈ షో క్రియేటర్, ప్రొడ్యూసర్ రాజమౌళి ఈ బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ గురించి మాట్లాడుతూ... "బాహుబలి ప్రపంచం చాలా పెద్దది. దానిని ఫిల్మ్ ఫ్రాంఛైజీ బాగా పరిచయం చేసింది. అయినా ఆ ప్రపంచంలో చూడటానికి ఇంకా చాలానే ఉంది. అక్కడి నుంచి వచ్చిందే ఈ బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్. బాహుబలి, భల్లాలదేవుడి జీవితాల్లోని ఓ రహస్యాన్ని, ట్విస్టులను ఇది ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ కొత్త కథను యానిమేటెడ్ రూపంలో అభిమానుల ముందుకు తీసుకురావడం చాలా ఉత్సాహంగా ఉంది" అని రాజమౌళి అన్నాడు.
ప్రభాస్ ఏమంటాడంటే... "ఇప్పటి వరకూ ఎవరూ చూడని ఈ బాహుబలి ప్రయాణంలో బాహుబలి, భల్లాలదేవుడు కలిసి రావడం చాలా ఎగ్జైటింగా ఉంది. సినిమాలో చూపించిన దాని కంటే ముందు జరిగిన స్టోరీయే ఈ బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్. బాహు, భల్లాల జీవితాల్లోని ముఖ్యమైన అధ్యాయం ఇది. దీనిని యానిమేటెడ్ ఫార్మాట్లో తీసుకురావడం బాగుంది. బాహుబలి ప్రయాణంలోని ఈ కొత్త ప్రయాణాన్ని చూడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని ప్రభాస్ అన్నాడు.
సిరీస్ స్ట్రీమింగ్ రైట్స్‌ను డిస్నిప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. తాజాగా ట్రైలర్ విడుదల చేస్తూ మే 17 నుంచి 'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్' రిలీజ్ చేయనున్నట్టు హాట్‌స్టార్ వెల్లడించింది. దీంతో ఈ యానిమేటెడ్ సిరీస్‌ను చూసేందుకు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి, దేవరాజన్ ఈ చిత్ర కథను క్రియేట్ చేయగా జీవన్ J. కాంగ్, నవీన్ జాన్‌లు దర్శకత్వం వహించారు. శోభుయార్లగడ్డతో కలిసి జక్కన్న, దేవరాజన్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ బాహుబలి యానిమేటెడ్ సిరీస్ మే 17నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.