రత్నం" కాదు.. రంగు రాయి మాత్రమే!

ఈ వేసవి వినోదంలో తెలుగు ప్రేక్షకుల కోసం మొదటిగా వచ్చిన తమిళ డబ్బింగ్ సినిమా ఇది.

By :  Akhilaja
Update: 2024-04-26 11:08 GMT

ఈ వేసవి వినోదంలో తెలుగు ప్రేక్షకుల కోసం మొదటిగా వచ్చిన తమిళ డబ్బింగ్ సినిమా ఇది. తమిళంలో పాపులర్ హీరో విశాల్ తో సింగం సిరీస్ దర్శకుడు హరి తీసిన మూడో సినిమా ఇది. ఈ మధ్యకాలంలో ఒకటి రెండు తెలుగు సినిమాల(ఆ ఒక్కటి అడక్కు, ప్రతినిధి2, లవ్ మీ) విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చిన రత్నం సినిమా అక్కడక్కడ బాగుందనిపించినప్పటికి, సినిమా పరంగా, విపరీతమైన యాక్షన్ తో కూడిన చాలా సాధారణమైన సినిమా. తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇటువంటి సినిమాలు అలవాటు పడిన తమిళ ప్రేక్షకులను కూడా

ఇది పెద్దగా ఆకట్టుకోదు. దర్శకుడు హరి కి చాలా వేగమైన కథనంతో సినిమాను చకచకా నడిపిస్తాడు అన్న పేరు ఉంది. ఈ సినిమాలో కనీసం అది కూడా కనిపించలేదు. ఇంతకుముందు హీరో విశాల్ తో " భరణి", " పూజ" లాంటి విజయవంతమైన సినిమాలు తీసిన హరి ఈసారి మాత్రం ఒక సాధారణమైన సినిమా తీశాడు. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలకు ఉన్న సమస్య దీనికి కూడా ఉంది. అది సినిమా నిడివి. రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల పాటు ఇలాంటి సినిమా చూడడం ఎవరికైనా కష్టమే. కానీ ఒక విషయం ఉంది. ఈ సినిమాను 40 నిమిషాల ట్రిమ్ చేసి ఉంటే కనీసం చూడదగ్గ సినిమాగా ఉండేది. ఈ సినిమా కథ, కథనం గందరగోళంగా ఉన్నాయి. ముగ్గురు యాక్షన్ డైరెక్టర్లను పెట్టుకున్న దర్శకుడు హరి, ఈ సినిమాను యాక్షన్ తో నింపేశాడు. అది కూడా కొంచెం సేపే చూడదగ్గదిగా ఉంది. సినిమా ప్రారంభంలోనే దర్శకుడు ఈ సినిమా లో రక్తం వెలువలై పారుతుందని చెప్పేశాడు. ఆ తర్వాత అంత పని చేశాడు.

ఈ సినిమా కథ చాలా సింపుల్. ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో జరిగిన సినిమా. చిత్తూరులో ఒక ఎమ్మెల్యే పన్నీర్(సముద్రఖని), అతను పెంచుకున్న రత్నం(విశాల్) రౌడీగా, ఎమ్మెల్యేకు సహాయపడుతూ ఉంటాడు. ఎమ్మెల్యేను మామయ్యగా భావిస్తాడు. రొటీన్ సన్నివేశాలతో కథ నడుస్తుంది. మధ్యలో తమిళంలో పాపులర్ కామెడీ యాక్టర్ యోగి బాబు మనల్ని నవ్విస్తాడు. తర్వాత అతనికి నవ్వించే అవకాశం లేదు. ఇది కూడా ఒక మైనస్ పాయింట్.

ఇంటర్వెల్ వరకు కథ ను హరి చాలా స్లోగా నడపడం మరొక మైనస్. ఇంటర్వెల్ తర్వాత కొన్ని ట్విస్టులు ఉన్నప్పటికీ, వాటిని సరిగా అమర్చడానికి హరికి టైం లేకుండా పోయింది. రెండో సగంలో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని బాగానే ఉన్నాయి. కానీ మరీ అన్నీ చూసే ఓపిక ప్రేక్షకులకి ఉండకపోవచ్చు. చివరికి ఏం జరుగుతుందో అని అందరికీ తెలిసిపోతుంది. కాకపోతే హీరోయిన్ కి సంబంధించి ఒక ట్విస్ట్ మాత్రం కొంచెం కొత్తగా ఉంది, కథను కొంచెం వైవిధ్యంగా నడుపుతుంది అనిపించినప్పుడు, అది కూడా మళ్ళీ రొటీన్ తెలుగు(తమిళ) సినిమా లాగా అయిపోతుంది.

దర్శకుడు హరి సన్నివేశాలు ఒక విధంగా రాసుకుని , తీసేటప్పుడు ఇంకో విధంగా తీయబోయి, కొంత కన్ఫ్యూజ్ అయ్యి మరో విధంగా తీశాడు అనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా ఎప్పుడైనా అయిపోవచ్చు అని ప్రేక్షకుల కు అనిపించడం సహజం. అంతేకాకుండా సినిమా చూస్తున్నంత సేపు చాలా సన్నివేశాలు, ప్రేక్షకులకు ఇంతకుముందే చూసిన ఫీలింగ్ కలిగే అవకాశం ఉంది. సినిమాలో ఫోటోగ్రఫీ యాక్షన్ సీక్వెన్స్ లకి మాత్రం బాగానే పనికొచ్చింది.

ఇలాంటి సినిమాలకు నేపథ్య సంగీతం ఎలా ఉండాలో అలా ఇచ్చాడు దేవి శ్రీ ప్రసాద్. సినిమాలో " ఎటువైపో, ఎటువైపో", " ప్రాణం నా ప్రాణం" లాంటి ఒకటి రెండు పాటలు. సాహిత్య పరంగా, సంగీత పరంగా బానే ఉన్నాయి. హీరో విశాల్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. కాకపోతే ఈసారి మురళీ శర్మ విలనీ కొంచెం కొత్తగా ఉంది. అది బలహీనమైన సినిమాకు కొంత బలాన్ని ఇచ్చినా పెద్దగా ఉపయోగం లేదు. ఇక సముద్రఖని ఎమ్మెల్యేగా తన వంతు పాత్ర తాను పోషించినప్పటికీ సినిమాను ఎక్కువగా ఎలివేట్ చేయలేదు ఇక మల్లీ పాత్రలో ప్రియా భవాని శంకర్

బాగానే చేసింది. కానీ సరిగ్గా రాసుకోకపోవడం వల్ల ఆ పాత్ర తేలిపోయింది.

చిత్రీకరణలో స్టైల్ కి, వేగానికి పేరుగాంచిన దర్శకుడు హరి ఈ సినిమాను (యాక్షన్ సీక్వెన్స్ లు తప్ప) తన శైలికి భిన్నంగా స్లోగా తీయడం వల్ల సినిమా సాధారణంగా మారిపోయింది. అయితే వాటిని వేగంగా తీసినప్పటికీ సినిమా గొప్పగా ఉండేదేమీ కాదు గాని, చూడదగ్గదిగా మాత్రం ఉండేది.

తారాగణం:విశాల్,ప్రియ భవాని శంకర్, సముద్రఖని,గౌతమ్ మీనన్,యోగి బాబు,మురళీ శర్మ, మోహన్ రామన్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హరి

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

ఛాయాగ్రహణం: ఎం సుకుమార్

ఎడిటర్: టి. ఎస్. జయ్

నిర్మాతలు: కార్తికేయన్ సంతానం, సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్

నిర్మాణ సంస్థలు: స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్, శ్రీ సిరి సాయి సినిమాస్

విడుదల తేదీ: ఏప్రిల్ 26, 2024

Tags:    

Similar News