‘మ్యాక్స్’ మూవీ రివ్యూ
తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న కన్నడ హీరో కిచ్చా సుదీప్.;
తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న కన్నడ హీరో కిచ్చా సుదీప్. ‘ఈగ’, ‘బాహుబలి’తో ఇంకా కొన్ని డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేశారు. దాంతో సుదీప్ సినిమాస్ కు ఇక్కడ మినిమం మార్కెట్ ఉంటుంది. తాజాగా కన్నడంలో నటించిన ‘మ్యాక్స్’చిత్రం తెలుగులో అదే టైటిల్ తో డబ్బింగ్ అయ్యి రిలీజైంది. కొత్త సంవత్సరం హడావిడిలో ఈ సినిమాని మన వాళ్లు పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు ఓటీటీలోనూ రిలీజైంది. (max movie review telugu)ఈ క్రమంలో ఈ చిత్రం కథేంటి, ఈ యాక్షన్ థ్రిల్లర్ కథతో ఆయన థ్రిల్‌ను ఏ మేరకు పంచాడో చూద్దాం?
స్టోరీ లైన్
చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ మహాక్షయ్ అలియాస్ మ్యాక్స్ (కిచ్చా సుదీప్) . ఎవరికీ భయపడని మ్యాక్స్ ఎవరైనా అన్యాయం జరిగిందంటే ఎదుటివాడు ఏ స్థాయి వాడైనా ముందుకు ముందు వెనకా చూసుకోకుండా వెళ్ళిపోతూంటాడు. దాంతో ఈ పోలీస్ అధికారి కు ఎప్పుడూ ట్రాన్స్‌ఫర్లు, సస్పెండ్‌లు. అలా ఓ కేసు విషయంలో సస్పెండ్ అయి, తిరిగి జాయినింగ్ ఆర్డర్ తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ కు వస్తాడు. అక్కడ ఓ మహిళా పోలీసుతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఇద్దరని తీసుకెళ్లి స్టేషన్‌లో పెట్టేస్తాడు. అనూహ్యంగా ఆ ఇద్దరూ స్టేషన్‌లో చనిపోతారు.
ఇక ఆ చనిపోయిన ఇద్దరు లోకల్ గా బలమైన పొలిటిషియన్స్ పరశురామ్ (శరత్ లోహితస్య), డేనియల్ (ఆడు కాలం నరేన్) కొడుకులు మైఖేల్ – వీరా. వీరిద్దరూ మంచి స్నేహితులు. తండ్రుల అధికారం చూసుకుని, ఇద్దరూ తమ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తూంటారు. పోలీసులే వారికి భయపడి తిరుగుతూంటారు. అలాంటి పవర్ ఫుల్ కుటుంబాలకు చెందిన వారు చనిపోతే ప్రభుత్వాలే కదలిపోతాయి. అలాంటిది పోలీస్ లు ఎంత అన్నట్లు భయం అక్కడ రాజ్యం ఏలుతూంటుంది.
ఈ క్రమంలో మ్యాక్స్ ఓ డెసిషన్ తీసుకుంటాడు. మైఖేల్ – వీరా ఇద్దరి శవాలను అక్కడి నుంచి రహస్యంగా తరలించేద్దామనీ, తాము వాళ్లని వదిలేసినట్టుగా, ఎవరో చంపేసినట్లుగా చెప్దామని మ్యాక్స్ అంటాడు. అందుకు అందరూ ఒప్పుకుంటారు. కానీ ఆ ఇద్దరి శవాలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తుండగానే, పరశురామ్ – డేనియల్ అనుచరులు పోలీస్ స్టేషన్ ను చుట్టుముడతారు. అప్పుడు మ్యాక్స్ ఏం చేస్తాడు? మైఖేల్ – వీరా మరణానికి కారకులు ఎవరు? మంత్రుల కుమారుల కోసం పోలీస్‌స్టేషన్‌పైకి దండెత్తిన గ్యాంగ్స్‌ని భయపడుతున్న తన పోలీస్ టీమ్ తో కలిసి మ్యాక్స్ ఎలా ఎదుర్కొన్నాడు?క్రైమ్ సీఐ రూప (వరలక్ష్మి శరత్‌కుమార్)కీ, మ్యాక్స్‌కీ మధ్య గొడవ ఏంటి? ఈ కథలో గని భాయ్ (సునీల్) ఎవరు? వంటి విషయాలను తెరపై చూడాల్సిందే.
ఎలా ఉంది
ఒక్క రోజు రాత్రిలో జరిగే ఈ కథను చూస్తూంటే కార్తీ ‘ఖైదీ’ గుర్తొస్తుంది. కథా నేపథ్యం, ఆ టోన్ కూడా రీసెంట్ గా చాలా కన్నడ , తమిళం యాక్షన్ థ్రిల్లర్ సినిమాల్ని గుర్తు చేస్తుంటాయి. అయితే యాక్షన్ డ్రామాతో ఆ సమస్యను దాటే ప్రయత్నం చేశారు. కానీ సినిమా కొంత లాగిన ఫీలింగ్ వస్తుంది. మంత్రుల కుమారులు చనిపోయారని బయటకు తెలియకుండా పోలీసులు జాగ్రత్తపడే సీన్, స్టేషన్‌పైకి దండెత్తిన గ్యాంగ్స్‌ని మ్యాక్స్ తనదైన స్టైల్ లో ఎదుర్కొనే సీన్స్ బాగున్నాయి. పోలీస్‌స్టేషన్, రౌడీల చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతూండటంతో కాస్తంత రిలీఫ్ ఉండే బాగుండేది అనిపిస్తుంది. ఇంతకు మించి కథా పరంగా విశ్లేషించే అంత కంటెంట్ సినిమాలో లేదు.
టెక్నికల్ గా
సినిమా ప్లస్ లలో శేఖర్ చంద్ర ఫొటోగ్రఫీ, అజనీష్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. గణేష్ బాబు ఎడిటింగ్ మరింత షార్ప్ గా చేయచ్చు అనిపిస్తుంది. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేయవచ్చని అనిపిస్తుంది. దర్శకుడు సుదీప్ మేనరిజమ్స్, మైండ్ గేమ్, పొలిటికల్ యాంగిల్ పై దృష్టి పెట్టారు. అలాగే , కథలో ట్విస్ట్ లు టైమ్ చూసి బాగానే పేల్చాడు.ప్రొడక్షన్ డిజైన్, ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి.
నటుల్లో కిచ్చా సుదీప్ (Sudeep) యాక్షన్ సీన్స్ బాగా ప్లస్ అయ్యాయి. గనీభాయ్ పాత్రలో సునీల్ జస్ట్ ఓకే అన్నట్లున్నాడు. వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar)కు ఈ సినిమాలో మంచి క్యారక్టర్ పడింది.
చూడచ్చా
కొన్ని కథా పరమైన లొసుగులు వదిలేస్తే ..ఈ రేసీ యాక్షన్ థ్రిల్లర్‌ని బాగానే ఎంజాయ్ చేయచ్చు
ఎక్కడుంది
జీ5 లో తెలుగులో ఈ సినిమా ఉంది