తమిళ డబ్బింగ్ 'కొళిపన్నై చెల్లదురై' చిత్రం OTT రివ్యూ!
తమిళంలో వచ్చిన 'కొళిపన్నై చెల్లదురై' కు తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇది. ఈ సినిమా ఎలా ఉంది. చూడదగిన సినిమానేనా చూద్దాం.
తమిళంలో భారతీరాజా టైమ్ నుంచి సహజమైన పాత్రలు, జీవితానికి అతి దగ్గరగా ఉంటే కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఎమోషన్ ప్రధానంగా సాగే ఈ కథల్లో ప్రధాన పాత్రల్లో స్టార్స్ ఉండాల్సిన అవసరం లేదు. గొప్ప లొకేషన్స్ అక్కర్లేదు. రిచ్ కాస్ట్యూమ్స్ అక్కర్లేదు. ఇవేమీ లేకుండా గ్రామీణ నేపథ్యంలో ఓ కథను తీసుకుని తమదైన శైలిలో చెప్తుంటారు. ఓటిటి వచ్చాక ఈ తరహా ప్రయత్నాలు మరి కాస్త ఎక్కువయ్యాయి. అలాంటిదే తాజాగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన ఈ చిత్రం. తమిళంలో వచ్చిన 'కొళిపన్నై చెల్లదురై' కు తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇది. ఈ సినిమా ఎలా ఉంది. చూడదగిన సినిమానేనా చూద్దాం.
స్టోరీ లైన్
గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. చెల్లదురై (ఏగన్) అతని చెల్లెలు సుధ (సత్య) కొన్ని పరిస్థితుల్లో చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం అవుతారు.ఈ క్రమంలో ఆశ్రయమిచ్చిన అమ్మమ్మ కూడా చనిపోవడంతో అనాథలు అవుతారు. అప్పుడు వారికి 'పెరియస్వామి' (యోగిబాబు) అండగా నిలబడతాడు. ఆయన సాయంతో జీవితాన్ని ఈదటం మొదలెడతారు. ఈ క్రమంలో 12 ఏళ్లు గడిచిపోతాయి.
ఇప్పుడు చెల్లదురై తాను కష్టపడి సంపాదిస్తూ, తన చెల్లెలిని చదివిస్తూ ఉంటాడు. అతను తన సొంత సుఖాలు, తనను ప్రేమించే సెల్వి ( బ్రిగిడ్) ని సైతం పక్కన పెట్టేస్తాడు. కానీ చెల్లి సుధ మాత్రం ఓ కుర్రాడితో ప్రేమలో ఉంటుంది. మొదట్లో కోప్పడినా తర్వాత ఓకే చెప్తాడు. పెళ్లి ఘనంగా చేయాలనుకుని ప్లాన్ చేసుకుంటాడు. అయితే అనుకోని విధంగా తన తల్లి, తండ్రి మళ్లీ జీవితంలోకి ప్రవేశిస్తారు.
ఓ రోజు గుడి మెట్ల మీద భిక్షాటన చేస్తున్న తల్లి కనపడుతుంది. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుస్తుంది. అదే సమయంలో తమను వదిలేసి వెళ్లిపోయిన తండ్రి అనారోగ్యంతో ఆ ఊరు వస్తాడు. అతనికి కిడ్నీ అవసరం. ఇప్పుడు అటు తల్లి, తండ్రి తమపైన ఆధారపడే పరిస్థితుల్లో ఉంటారు. అప్పుడు చెల్లదురై ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు. చివరకు వారి జీవన ప్రయాణం ఏమైంది అనేది మిగతా కథ.
ఎలా ఉంది
సినిమాలు నిజ జీవితంలోంచి వస్తే మంచిదే. రావాలి కూడా. అలాగని మరీ రా గా, ఎమోషన్స్ తో నిండి ఉండే సినిమాలు మన తెలుగు వాళ్లకు అలవాటు లేదు. కాస్తంత అయినా సినిమా టెక్ ఉండాలి. మరీ విషాదాలుపై తెరపై ప్రవహించేయకూడదు. అలాంటివి ఉన్నా షుగర్ కోటెడ్ గా చెప్పాల్సి ఉంది. దర్శకుడు శ్రీను రామ సామీ స్క్రిప్టు సరిగ్గా రాసుకోకపోవటంతో స్క్రిప్టు దశలోనే సినిమా విఫలమైంది. జీవితం అంతా ఊహించని మలుపులు అని మొదలుపెట్టిన ఈ సినిమా సెకండాఫ్‌లో స్క్రిప్ట్‌ని రాసుకున్న విధానం పూర్తిగా నిరాశపరిచింది.
సినిమాలో పాత్రలు సహజత్వంతో కనపడినా స్క్రీన్‌ప్లే లో తడబాటు వలన , కొన్ని కృత్రిమమైన సన్నివేశాలతో బోర్ కొట్టింది. తల్లిదండ్రుల ఎడబాటు , ప్రధాన పాత్రల నిస్సహాయత తో ప్రారంభ సన్నివేశాలు వేదనతో హత్తుకున్నా , ఆ తర్వాత వచ్చే ప్రేమ సీన్స్ లో విఫలమైంది. చాలా సార్లు సినిమా చూస్తున్నామా, మెగా డైలీ సీరియల్ చూస్తున్నామా అనే సందేహం వచ్చింది.
టెక్నికల్ గా ఈ సినిమా బాగుంది. సినిమాటోగ్రాఫర్ అశోక్ రాజ్. NR రఘునందన్ నేపథ్య సంగీతం సినిమాకు నిండుతనం, నేచురాలిటి తెచ్చాయి. అయితే పాటలు మనసుపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ సీరియల్ మోడ్‌లో సాగిన సెకండాఫ్ నిడివిని మరింత తగ్గించి ఉండొచ్చు.
నటీనటుల్లో ఎగన్ తన చెల్లెలుపై తనకున్న అపారమైన ప్రేమ, వాత్సల్యం చూపించే ఎక్సప్రెషన్స్ తో సినిమా మొత్తం బరువును మోస్తూ పాత్రకు అవసరమైన నటనను అందించాడు. హీరో చుట్టూ తిరిగే టెంప్లేట్ హీరోయిన్‌గా బ్రిగిడ సాగింది, ఆమె నటనలో ఇంకా చాలా నేర్చుకోవాలి. పెరియస్వామి పాత్రలో యోగిబాబు తన రెగ్యులర్ ఫన్నీ సెటైర్లు తగ్గించి అక్కడక్కడ పాత్రకు అవసరమైన భావోద్వేగాలను అందించారు. చెల్లెలుగా నటించిన సత్య కొన్ని చోట్ల అతిగా నటించింది.
చూడచ్చా
ఈ సినిమాలో హీరో చెల్లాదురై కు ఉన్నంత ఓపికా, సహనం మనకు కూడా ఉంటే ఖచ్చితంగా చూడవచ్చు.
ఎక్కడుంది
అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది