కంప్లీట్ యాక్షన్: ‘రైఫిల్‌ క్లబ్‌’రివ్యూ

మళయాళంలో హిట్టైన సినిమాలు చాలావరకూ తెలుగు వెర్షన్ ఓటీటీలో దొరుకుతున్నాయి.;

Update: 2025-01-17 07:41 GMT

మళయాళంలో హిట్టైన సినిమాలు చాలావరకూ తెలుగు వెర్షన్ ఓటీటీలో దొరుకుతున్నాయి. వాటిని మనవాళ్ళు బాగా ఆదరిస్తున్నారు. అదొక ప్రత్యేకమైన ఆదాయ మార్గంగా మళయాళ పరిశ్రమ భావిస్తోంది. అందుకు తగ్గట్లే చాలా సినిమాలు రూపొందుతున్నాయి. అవి బాగుంటున్నాయి కూడా. అక్కడ థియేటర్ లో హిట్ అయిన సినిమాలు కూడా ఇక్కడ మరింత ఆడియన్స్ ని సంపాదించుకో గలుగుతున్నాయి. ఆ క్రమంలోనే ఇప్పుడు ‘రైఫిల్‌ క్లబ్‌’ (Rifle Club ott) థియేటర్ రన్ పూర్తి చేసుకుని ఓటీటీ లోకి దూకింది. ట్రైలర్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసి ఈ సినిమా అతితక్కువ బడ్జెట్‌ నిర్మించారు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.30 కోట్లు వసూలుచేసింది. ఈ సినిమా కథేంటి...సినిమా తెలుగువారు చూడదగినదేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

మంగళూరులో అండర్‌ వరల్డ్‌ డాన్‌ దయానంద్‌ బారే (అనురాజ్‌ కశ్యప్‌). అతను కొడుకును ఓ జంట అనుకోకుండా హత్య చేసి ప్రాణాలు కాపాడుకునేందుకు కేరళ పారిపోతుంది. అక్కడ వయనాడ్‌లో ఉన్న ఓ రైఫిల్‌ క్లబ్‌ను ఆశ్రయిస్తుంది. షూటింగ్‌ నెంబర్ వన్ అయిన ముగ్గురు వ్యక్తులు ఆ క్లబ్‌ను రన్‌ చేస్తూ ఉంటారు. తమ ఆశ్రయం కోరి వచ్చిన వారికి సహాయం చేయాలనుకుంటారు. వారి ప్రాణాలు రక్షించాలనుకుంటారు.

ఇక తన కొడుకును చంపిన జంట రైఫిల్‌ క్లబ్‌ రక్షణలో ఉందని తెలిసిన దయానంద్‌ తన గ్యాంగ్‌తో కలిసి కేరళ వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత అతడు ఏం చేశాడు? క్రూరుడైన దయానంద్‌ను అడ్డుకునే క్రమంలో రైఫిల్‌ క్లబ్‌కు ఎలాంటి సిట్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి, చివరకు ఏమైంది? అన్నది చిత్ర కథ.

ఎలా ఉంది

రైఫిల్ క్లబ్ చిత్రం యొక్క లాస్ట్ లో, మెక్సికన్ స్టాండ్-ఆఫ్‌లు వంటి ఎలిమెంట్స్ తో వైల్డ్ వైల్డ్ వెస్ట్ చిత్రాలను గుర్తు చేస్తుంది. ఆషిక్ అబు, అతని రచయితల ఉద్దేశం కేరళలోని హిల్ స్టేషన్ల అందాలు, ఆనందాల నేపథ్యానికి వ్యతిరేకంగా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించి షాక్ ఇవ్వడం. ఆ బ్యాక్ డ్రాప్ చూస్తే ఇక్కడ ఇలాంటి క్రూరత్వం కామన్ అనిపిస్తుంది. దాదాపు 114 నిమిషాల రన్‌టైమ్‌ లోనూ ఎక్కడా ప్రక్కకు వెళ్లకుండా సినిమాలో ఏమి చెప్పాలనుకుంటుందో దానిపై చాలావరకూ దృష్టి కేంద్రీకరించేలా సీన్స్ రాసుకుని, తీశారు.

స్క్రీన్‌ప్లేలో ఎక్కువ భాగం క్లబ్, అక్కడుండే పాత్రల తప్ప వేరేవి కనపడవు. వినపడవు. రెండు గ్యాంగ్‌ల మధ్య ప్రీ-క్లైమాక్స్ ముఖాముఖీ చాలా స్మూత్ గా డీల్ చేసారు. అలాగే సినిమా కెమెరా ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా అట్రాక్టివ్ గా అనిపించినా, ఎక్కడో ఒక చోట, ఆ వావ్ ఫ్యాక్టర్‌ని కలిగి ఉండాల్సింది. అదే మిస్సైంది. క్లైమాక్స్ లో కేవలం కాల్చుకోవటం కాకుండా అంతకు మించి ఉంటే సినిమా ఇంకాస్త బాగుండేది.

ఈ సినిమాలో పాత్రలు ఎవరు, వారు ఒకరికొకరు ఎలా ఉంటారు. వాళ్లు ఏ విషయంలో అయినా వాళ్లు ఎంతవరకు వెళ్ళగలరు అనేది చూపెట్టడంలోనే ఎక్కువ శాతం సమయం గడిపారు. అలాగే సినిమా మిడిల్ కు వచ్చేసరికి , రైఫిల్ క్లబ్‌లో జరిగే సంఘటనలు,. అసలు వేట మధ్య సమాంతరాలను గీయడానికి స్క్రిప్ట్ ప్రయత్నిస్తున్నట్లు మనం గమనించవచ్చు. సినిమా లాస్ట్ యాక్ట్ లో కొన్ని భాగాలను నిజంగా ఎలివేట్ చేసే అనేక విషయాలను స్క్రిప్ట్ చక్కగా సూచిస్తుంది. అంతాబాగానే ఉంది కానీ యాక్షన్ థ్రిల్లర్ పైన చెప్పుకున్నట్లు ఎక్కడ అబ్బురపరచదు. వావ్ అనిపించదు.

ఎవరెలా చేశారు,టెక్నికల్ గా

ఈ సినిమాలో చాలా వరకు ఆర్టిస్ట్ లు మనకు పెద్దగా పరిచయం లేనివారే. మిగతావాళ్లలో విజయ రాఘవన్‌, దిలీశ్‌ పోతన్‌, వాణీవిశ్వనాథ్‌, అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్రల్లో కనిపించటం ప్లస్ పాయింట్. దర్సకుడు ఆశిక్‌ అబు కొత్త తరహా చిత్రాన్ని తక్కువ బడ్జెట్ ,లొకేషన్ లో చూపించాలనుకున్నాడు. తనదైన టెక్నికల్ వాల్యూస్ తో రెగ్యులర్ యాక్షన్ థ్రిల్లర్‌లకు కాస్త భిన్నంగా ఆశిక్‌ అబు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. వెస్ట్రన్‌ స్టైల్‌లో తీర్చిదిద్దిన నేపథ్యం బాగా కలిసొచ్చింది.

చూడచ్చా

కొత్త తరహా పూర్తి యాక్షన్ చిత్రం చూడాలనుకునేవాళ్లు, గన్‌ఫైరింగ్‌ ఎపిసోడ్స్‌ నచ్చేవాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. మిగతా వాళ్లకు ఇదొక బోర్ క్లబ్ గా అనిపిస్తుంది.

ఎక్కడుంది.

ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమ్ అవుతోంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది.

Tags:    

Similar News