స్కూల్ టీచర్ గర్వపడేదెపుడు?

బడి వొడిలో... ఒక టీచరమ్మ ‘యథానికలు’: 10

Update: 2024-11-27 06:39 GMT

నన్ను నిటారుగా నిలపెట్టే, నలుగురిలో తలెత్తుకుని గర్వంగా తిరిగేలా చేసిన విద్యార్థులు అంటే ఎప్పటికీ నాకు గర్వకారణం. అలాంటి వాళ్లు నాచుట్టూ ఎంతమండి ఉండేవాళ్లో...

మూడు మండలాల స్థాయిలో 500 మందిపైగా విద్యార్థుల్లో 2018 లో పెట్టిన టాలెంట్ టెస్టులో పద్దు ప్రథమ స్థానంలో నిలబడింది. 2019లో క్లాoప్లెక్స్ స్థాయిలో చిరంజీవి, మూడవస్థానంలో వచ్చాడు. క్విజ్ లో ఐదుగురు విద్యార్థుల బృందం మూడో స్థానం లో వచ్చింది.

 

లైబ్రరీ వారోత్సవాలలో మొదటి బహుమతి, టాలెంట్ టెస్ట్ లో క్లస్టర్ స్థాయిలో మూడో బహుమతి గెలుసుకున్న చిరంజీవి.

2017 లోనే టాలెంట్ టెస్ట్ లో మా భరణికి ప్రథమ లేదా ద్వితీయ స్థానం వస్తదనుకున్నాం. కాని అమ్మవారుపోసినందున పొలిమేర దాటి పంపకూడదన్న మూఢనమ్మకంతో తల్లిదండ్రులు ఆమెను టెస్టుకు పంపించలేదు. కొంతమంది అద్భుతమైన పద్యాలు చెప్తూ ‘భువన విజయం’ నడిపుతారు. పదేళ్ళ వయస్సు లోనే ఇంటి, పొలం పని చేసే పిల్లలు. చిన్న అబద్దమాడని, బూతు మాట్లాడని, అధికారుల ముందు ధైర్యంగా మాట్లాడి పరువు నిలిపే విద్యార్థులు నాచుట్టూ ఉండేవారు. వీరి గురించి చెప్పుకోవాలి.

పక్కనున్న జగ్జీవన్ నగర్ (స్కూల్ 9 ఏరియా) నుండి ప్రదీప్తా, శైలజ (అక్క చెల్లెళ్ళు. వీళ్ళ నాన్న స్కూల్ కి వచ్చి చేర్చుకోమని రిక్వెస్ట్ చేశాడు) భార్గవ్, ఏసోబు ఆరేడు మంది చేరారు. టీచర్ల మధ్య ఇదో చర్చ కాకుండా, హెచ్ఎం గారికి ఫోన్ చేసి, సార్ మీ పిల్లలు వస్తున్నారు. చేర్చుకోను అని మనం అనకూడదు. రాకుండా మీరే ఏదో ఒకటి చేసుకోండి. వస్తే మాత్రం ఖచ్చితంగా చేర్చుకుంటాను అని చెప్పాను. వెంటనే వాళ్లు సొంత డబ్బులతో ఓ వాలంటీర్ ను పెట్టుకున్నారు.

నేను వెళ్లని ఓ రోజు ఓ స్టేట్ ఆఫీసరు స్కూల్ కి వచ్చారు. జిల్లా ఆఫీసర్లు అయితే మా మా కొలీగ్ ని అంతగా అడగరు. మా కొలీగ్ మంచి మాటకారి. ఆ ఆఫీసర్ గారు అన్ని చూస్తుండటంతో పిల్లలు గోల చేస్తున్నారని చెప్పి తన క్లాసులోకి వెళ్లిపోయిందట. భార్గవ్, "y" ని ముందు గా ఎడమవైపు గీత కాకుండా కుడివైపు గీత గీసి తర్వాత ఎడమవైపు గీత గీసి రాశాడు. మీ టీచర్ గారు ఇట్లాగే నేర్పారా? ఏబిసిడిలు కూడారావా? అని కొప్పడుతుంటే, సార్! మేము ఆ స్కూల్ నుండి వచ్చాము. అంతకుముందు మాకు రావు. ఇక్కడకు వచ్చిన తర్వాతనే మాకు వచ్చాయి. మా మేడం గారు బాగా చెప్తారు. వాడు ఎంత చెప్పినా వినడు. మా టీచర్ గారు ఇటువైపు నుంచి నేర్పారని రాసి చూపించినదట. ఎవరెవరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు. అందరిని లేపి అడిగారట. అందరి చేత ఏ బి సి డి లు రాయించారట. ఇంకేం మాట్లాడకుండా రిజిస్టర్ లో సంతకాలు చేసి వెళ్లారట.

తెల్లవారి స్కూల్ కి వెళ్ళగానే ఈ రిపోర్ట్ అంతా పిల్లలు గోలగోల గా చెప్పారు. ఈ ప్రదీప్త స్కూల్ కి వచ్చిన నెల రోజుల వరకు ఉదయం అంతా ఏడుస్తూనే ఉండేది ఇంటికి వెళ్లి పోతానని. వాళ్ళ నాన్నకి చెప్తే పర్లేదులే మేడం అలవాటు పడుతుందిలే అనేవాళ్ళు. ప్రదీప్తా కు ఫిఫ్త్ క్లాస్ లోనే ఆదర్శ పాఠశాలలో సీటు వచ్చింది. ఆ సంతోషంతో వాళ్ళనాన్న స్కూలుకు షీలింగ్ ఫ్యాన్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్రదీప్త అస్సలు అబద్ధం ఆడదు. ఎందుకు అంటే చర్చికి వెళ్తాం మేడం అనేది. కామ్ గా ఉండేది. చెల్లెలు ఉషారుగా ఉండేది. చెల్లెలే అక్కకు అన్ని చూసేది. అక్క ఏడవకుండా చూడమ్మా అని వాళ్ళ నాన్న చెప్పి వెళ్ళేవాడు స్కూల్ దగ్గర దిగబెట్టి.

ఓ రోజు హై స్కూల్ హెచ్ఎం గారు విజిట్ కు కొచ్చారు. పిల్లలు వేసిన డ్రాయింగ్ చూస్తున్నారు. వివేకానందుడి డ్రాయింగ్ కింద నరేంద్రనాథ్ పేరు చూపించి ఇదేంటి మేడం వివేకానంద కాకుండా నరేంద్రనాథ్ అని రాసారు అన్నాడు. వివేకానందుని చిన్నప్పటి పేరు నరేంద్రనాథ్ సార్ అన్నాను. అవునా! నాకు తెలియదు అన్నారు.

ఆ పిల్లవాడిని పిలిచి చెప్పమన్నాను. నీకు ఎవరు చెప్పారు అన్నారు. మా టీచర్ గారు చెప్పారు అన్నాడు. హెచ్ఎం గారు ఆ విద్యార్థిని భుజం తట్టి బాగా మెచ్చుకున్నారు. వాస్తవానికి పాఠం చెప్పినప్పుడు ఆ పేరు చెప్పి, మరిచిపోయి, అది వేసినప్పుడు ఆ పిల్లవాడిని నేను కూడా అలాగే అడిగాను.

ఎంఈఓ గారు విజిట్ కి వచ్చిన రోజు బోర్డు మీద ఐదో తరగతి వాళ్లకి నాలుగు (కూడిక, తీసివేత, హెచ్చవేత, బాగాహారం) లెక్కలు ఇవ్వమన్నాడు. వాళ్లు ఏడు లెక్కలు చేసి, కరెక్షనకు

ఎంఈఓ గారి దగ్గరికి వెళ్లారు. ఇదేంటి మేడం ఇన్ని లెక్కలు ఇచ్చారు. నేను ఇవ్వమంది నాలుగే కదా అన్నారు. బోర్డు చూపించి నాలుగే సార్ అన్నాను. రెండు పేజీలు ఉన్నాయి, చూపించి అన్నారు. సార్! వాళ్లు లెక్కలను సరిచేసుకున్నారు అన్నాను. ఎలా సరి చేసుకున్నది ఓ విద్యార్థి చెప్పాడు. కూడిక సరి చేసుకోవడం పెద్దగా వస్తది. హోం వర్క్ కూడా ఒక్క లెక్కనే (+-÷× గణిత భాష ఇచ్చి) ఇచ్చేవాళ్ళం. అందరం కలసి ఒక్కరి లెక్కలను చూసేవాళ్ళం. దానిని బట్టి మిగతావాళ్ళు ఎక్కడతప్పు చేసింది ఎవరంతట వాళ్ళే చూసి తెలుసుకునేవాళ్ళు. మెచ్చుకోలేక మెచ్చుకోలేక ఆ విద్యార్థులను మెచ్చుకున్నారు.

ఈ లోపల ఒకటి రెండు తరగతుల వాళ్ళకి దీర్ఘ, ద్విత్వ, సంయుక్త అక్షరాలతో డిక్టేషన్ చెప్పమన్నారు.చెప్పేను. సరిదిద్దాను. సరిదిద్దనవి సార్ చూశారు. మెచ్చుకుంటారన్న ఉద్దేశంతో అల్ప, మహా ప్రాణ అక్షరాలను పలికి చూపించమన్నాను. విద్యార్థులు ఇంకా హుషారుగా, ఉత్సాహంగా నోటికి దగ్గరగా కుడి అరిచేయి పెట్టుకొని (స్పష్టంగా పలికితే ఆరిచేతికి గాలి తగులుతుంది. అక్షరాలు గొంతులో నుంచి వస్తాయి) ఖ, ఘ, ఛ, ఝ, థ,ధ,ఫ,భ పలికి చూపించారు. మెచ్చుకోకపోగా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నానని అన్నారు. పర్లేదు సార్! కష్టపడ్డా తేడా తెలుస్తుంది అన్నాను. ఈ ఎంఈఓ గారికి నేనంటే అసలు ఇష్టం ఉండేది కాదు. మా కొలీగ్, ఆయన సేమ్ క్యాస్ట్. ఆమెను మెచ్చుకునేవాడు. ఏమీ చేయకపోయినా పట్టించుకునేవాడు కాదు.

టాలెంట్ టెస్ట్ లో ప్రథమ స్థానం వచ్చినందుకు స్కూల్ -11 హెచ్ఎం నీ మెచ్చుకుంటుండగా మా విద్యార్థి కాదండి కాంతి మేడం వాళ్ళ విద్యార్థి అనగానే మొహం నల్లగా పోయింది. క్విజ్ లో రూపా, అడవులు ఉండాల్సిన శాతం 33/, ఉన్న శాతం 22/, మన మొదటి ప్రధానమంత్రిపేరు చెప్పినప్పుడు మెచ్చుకొని ఏ స్కూల్ అని అడిగారు. నంబర్ 10, కాంతి మేడం వాళ్ళ స్కూలు అనగానే ఆగిపోయాడు. (మెచ్చుకోవచ్చు కదా! పిల్లలు ఏం చేశారు? కుళ్లుబోతు తనం తప్పితే అని మనసులోనే తిట్టుకున్న) మండల ప్రధాన కేంద్రం మూడు పాఠశాలలుండేవి. ఎక్కడా లేదు, మా మూడు పాఠశాలకు 9(జగ్జీవన్ రావునగర్)10 (కొరిసపాడు) 11 (అంబేద్కర్ నగర్) ఇచ్చారు. అన్ని దగ్గర దగ్గరగానే ఉన్నాయి. మండలంలోని టీచర్లకు ఈ నంబర్లు గుర్తుండక హెచ్ఎంల పేర్లతో పిలిచేవాళ్ళు. ఏదో ఒక వంకతో ఏదో ఒకటి అనాలని చూస్తూ ఉంటాడు నన్ను. పాపం ఆయనకు ఆ అవకాశం పెద్దగా వచ్చేది కాదు. అందుకే, ట్రాన్స్ఫర్ మీద వెళుతూ అప్పటికి బడ్జెట్ రానందున, బిల్లులన్నీ అప్పజెప్పి వెళ్లినా, బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఇవ్వాల్సిన 7800 పైగా మా కొలీగ్ ఎగ్గొట్టినా నాకు తెలియదని తప్పుకున్నాడు. కాంతి మేడం గారికి ఇవ్వాలి అని మండల రిసోర్స్ పర్సన్ చెప్పినా కూడా.

ఎంఈఓ గారు మరొక సీనియర్ టీచర్ ఇన్స్పెక్షన్ కి వచ్చిన రోజు, పిల్లలు రాసిన లైబ్రరీ పుస్తకాల రివ్యూ చూసి మెచ్చుకున్నా, బుక్ విష్ యు రిజిస్టర్ లోనే కాకుండా వేరే రికార్డులో రాయించవచ్చు అన్నారు. సార్ వాళ్లు ఫిఫ్త్ క్లాసు లోపల పిల్లలు. ఆ రివ్యూ రాయడమే చాలా గ్రేట్ అన్నాను. మరొక రిజిస్టర్ అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇది కదా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం. ఏదైతేనేం ఇలా అనేకసార్లు అధికారులకు చెబుతూ పరువు నిలబెడుతూ నన్ను, నా వెన్నుముకను నిటారుగా నిలబెట్టే నా విద్యార్థులను చూస్తే నాకు ఏప్పటికీ గర్వకారణమే.

మా వేదిశ్వర్ గేదల పేడతీయటం, వాటిని కట్టేయటం విప్పడం, పొలానికి ఆటో తీసుకెళ్ళి, చేలో ఉన్న జొన్న, గడ్డి కోసుకొని ఆటోలో వేసుకుని (కొంత దూరం నేషనల్ హైవే లో)ఒక్కడే వచ్చేవాడు. నేను భయపడుతూ ఉండేదాన్ని. ఒక్కడినే ఆటోతో పంపవద్దండని వాళ్ళ నాన్నతో ఎన్నోసార్లు అంటే, వేదేశ్వర్ చేయగలడండి, రాగలడoడి అనేవాడు.

 

పాఠశాలలో మొక్కలు నాటుతున్న శ్రమజీవులు. బ్లూ టీ షర్ట్ లో వేదేశ్వర్,రాయిమీద చెల్లెలు శ్రావణి.

వేదేశ్వర్ అంత కష్టపడుతుంటే చెల్లెలు శ్రావణి పాఠశాలకు రాకుండా ఇళ్ళ చుట్టూ తిరిగేది. ఎలాగో ఒకలాగా స్కూల్ దగ్గర వదిలిపెట్టండి. నేను చూసుకుంటాను అనేదాన్ని. ఇంట్లో వాళ్లకు కూడా దొరికేది కాదు. ఈ అమ్మాయి స్కూలుకు రాకపోవడానికి బలమైన కారణం ఉంది. కాన్వెంట్లకి పంపించి, చదువు రావట్లేదని ఏజ్ లేకుండానే సెకెండ్ క్లాస్ లో ఇయర్ ఎండింగ్ అప్పుడు చేర్చారు. చదువురాని భయం, లేజినెస్, గారాబం అన్ని ఉండేవి. పిల్లల్ని పంపించేదాన్ని. ఒక్కొక్క రోజు నే వెళ్ళి పిలుసుకొచ్చుకునేదాన్ని. దోసెలు కొనుక్కొని గోతం లో వేసుకుని తిరుగుతూ స్కూల్ ఎదురుగానే ఉన్న ఇంట్లోకి వెళ్ళింది ఓ రోజు. పిల్లలను పంపించి లాక్కురమ్మన్నాను. నీకు వచ్చినంత వరకే చెప్తాను. బడికి రమ్మని చెప్తున్నాను కదా, ఎందుకు రావని కొద్దిగా గట్టిగానే కొట్టాను. వాళ్ళ నాయనమ్మని పిలిపించి అప్పుడoతా (అప్పుడేంటి ఇప్పుడు కూడా) పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. (మా జిల్లాలోనే హాస్పిటల్ కు తీసుకొచ్చిన ఆరేళ్ల కూతురిని నేను చూస్తుంటానని చెప్పి, తాగుదామని మందు తీసుకు రమ్మని తండ్రికి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు ఓ వెధవ. తండ్రి వెళ్లగానే అరకిలో మీటరు దూరంలో కంపల్లో అత్యాచారం చేసి హత్య చేసి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి 6 నెలలకు దొరికేడు). ఆ విషయాలన్నీ చెప్పి ఇలా ఇళ్ళవేంట తిరిగితే ఏ ఎదవ ఏం చేస్తాడో ఆలోచిస్తున్నారా? స్కూలు సేఫ్ జోన్. చదువు కన్నా, జాగ్రత్తగా చూస్తాను కదా. మీకు ఎన్ని సార్లు చెప్తున్నాను బడికి పంపించమని అని ఆమెను కోప్పడ్డాను. కొట్టేనన్న భాధ, భయం ఉందిగా. కొట్టిన విషయాన్ని కూడా చెప్పాను.

ఇక మా ఆనంద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆనంద్ ఎస్టీ కాలనీ నుంచి వచ్చేవాడు. కాలనీ నుంచి వచ్చే విద్యార్థులు బాగా బూతులు మాట్లాడేవాళ్ళు. అవి బూతులని కూడా వాళ్లకి తెలియదు. పాఠశాలకు వచ్చిన తర్వాత అర్థం చేయించే కొద్ది మానేసేవాళ్ళు. కాని ఆనందు ఒక చిన్న బూతు కూడా మాట్లాడేవాడు కాదు. యానివర్సరీ కి ప్రిపేర్ చేస్తు "ఎందే నీకు చెప్పేది". అనే డైలాగు ఉంటుంది."ఏందే" అనటానికి కూడా ఇష్టపడలేదు. ఆ పదం లేకుండానే ప్లే చేసారు. చాలా బాగా చదివేవాడు. చామన ఛాయ రంగులో, పలసటి ముఖంతో, బక్కగా భలే అందంగా ఉండేవాడు. చిన్నగా మాట్లాడేవాడు. పౌష్టికాహార లోపంతో వెంట వెంటనే జ్వరాలు వస్తుంటాయి. ఎన్ని చెప్పినా, హాస్పిటల్ కి బదులు ఎక్కడో? ఎక్కడో ఉన్న దేవతల దేవుళ్ల దగ్గరికి వెళ్లేవాళ్లు. ఓ వారం స్కూల్ పోయిద్ది. కష్టపడి అందుకునేవాడు. వలసలు వెళ్లేవాళ్లు. నేను వచ్చిన తర్వాత ఆనంద్ స్కూలు రెండవ తరగతి చివర్లోనే ఆగిపోయింది. ఆనంద్ రావడం లేదని నా ఫోన్ కి మెసేజ్లు వస్తుండేవి.

ఆనంద్ లెక్క:- రెండవ తరగతి మొదట్లో రెండు అంకెల తీసివేతలు ఇచ్చి, పద్దు చెల్లెలు సాహితీకి ఆనంద్ ని అప్పజెప్పాను. ఆనంద్ కింద వరసలో ఉన్న పెద్ద అంకె నుంచి (83-26=63) పై వరసలో ఉన్న చిన్న అంకెను తీసివేశాడు. సాహితీ ఇలా చేయకూడదు అంది. ఆనంద్ ఇంతే, ఇంకెలా చేస్తారమ్మా అన్నాడు. మేడం ఆనంద్ తప్పు చేసి, చెప్పినా వినటం లేదు మేడం. చిన్న సంఖ్యలో నుంచి పెద్ద సంఖ్యను తీసేసాడు అంది. చూస్తే నా తప్పు నాకు అర్థం అయింది. వాళ్ళకి అప్పు తీసివేతలు ఉండవు. నేను ఇచ్చింది అప్పు తీసివేత. బోర్డు మీద ఆ లెక్క వేసి, ఆనంద్ చేసింది కరెక్టే అన్నాను. ఐదు వాళ్ళందరూ కాదు కాదు అని వాదనకు దిగారు. ఎందుకు కాదు అన్నాను. మీరే చెప్పారు పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యను తీసేయాలి అని. మాకోరూలు, ఆనంద్ కు మరొకరూలా? ఆనంద్ అంటే మీకు ఇష్టం. అందుకే రైట్ అంటున్నారు. ఒప్పుకోమన్నారు.

పిల్లల్లో ఆ ఫీలింగ్ రాకూడదని, మీరందరూ ఇష్టమే. ఎప్పుడన్నా అలా చూసానా? అన్నాను. ఇప్పుడు చూస్తున్నారుగా అన్నారు. నిజంగా చెప్పండి చూస్తున్నానా? అన్నాను. ఆ!!! నిజమే అన్నారు. నవ్వి, నేను చేసిన తప్పు ఏంటో చెప్పాను. వాళ్లకి అప్పు తీసివేతలు ఇంకా నేర్పలేదు. నేర్పనప్పుడు ఇవ్వడం నా తప్పు కదా? ఆనంద్ చేయడం కరెక్ట్ కదా అన్నా. అప్పుడు పిల్లలు నవ్వులు చూడాల్సిందే. ఈ నవ్వులు మాకే సొంతం. (ఇప్పుడు కూడా నవ్వుకుంటూనే) రాయటం నావల్ల కావడం లేదు. ఇదే ఆనంద్ (ఇలా చేస్తే) లెక్కగా పేరు వచ్చింది.

తండ్రులు లేని చందన శివమణి (అక్కా తమ్ముళ్లు) శివ పార్వతి ప్రసన్న(అక్కాచేల్లెళ్ళు,తండ్రి ఉన్నాడు. తాగి మా స్కూల్ దగ్గరలోనే పడిపోతూ ఉండేవాడు. ఈ పిల్లలిద్దరు కళ్ళల్లో జలపాతాలను ఆపుకుంటూ, అవమానంగా ఫీలయ్యే వాళ్ళు. మీ నాన్న తాగిన దానికి, మీరు ఫీల్ అవ్వద్దు. అసలు పట్టించుకోవద్దు. మీ చదువులు పోతాయి అని నచ్చ చెప్పేదాన్ని) నందిని వెంకటేష్ (అక్కా తమ్ముళ్ళు) అందరూ అందమైన పిల్లలు. బాగా చదివే వాళ్ళు. ఇలాంటి పిల్లలందరికీ ఏదో ఒక మూల దిగులు ఉండేది.

చందనకు ఆధార్ లేకపోవడంతో మధ్యాహ్నం భోజనంలో గుడ్డు వచ్చేది కాదు. చందన ఆధార్ కోసం నేను, మా ఎంఈఓ గారు కూడా ప్రయత్నించారు. ఆధార్ లేని మరో ఇద్దరు ఉన్నారు. చందన తమ్ముడు అంగన్వాడికి వెళ్లకుండా మా దగ్గరే ఉండేవాడు. వీళ్ళందరికీ మధ్యాహ్నం భోజనం లో గుడ్డు సమస్య అయ్యేది. అంగన్వాడి నుంచి కొన్నిగుడ్లు తీసుకునేదాన్ని. కొన్ని వేస్ట్ కింద తిట్టుకుంటూ దొంగ లెక్క రాసేదాన్ని. తనకు వచ్చే కోటబియ్యానికి నేను డబ్బులు ఇస్తాను అన్నా తీసుకోకుండా తనకొచ్చిన బియ్యాన్ని కూడా స్కూల్ కి వాడేది ఉమామహేశ్వరి. మన పాఠశాలల పరిస్థితి ఇది. పిల్లలకే ఆధార సమస్య వచ్చింది. పిల్లల ఆధార్ కార్డును సులభతరం చేయవచ్చు కదా? ఎన్ని దొంగ ఆధార్ కార్డులు ఉన్నాయో ?

నందిని వెంకటేశ్ ల తండ్రి ఆక్సిడెంట్ లో పోయారు. అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నారు. వెంకటేష్ తో సమస్య వచ్చింది. ఆడపిల్లలకి మగపిల్లలకి పక్క పక్కనే వేరువేరు బాత్రూములు ఉండేవి. ఆడపిల్లలందరు వెళ్ళివచ్చిన తర్వాత మగ పిల్లలు వెళ్లాలి. వెంకటేశు బాత్రూం తలుపుల కింద నుంచి చూస్తున్నాడని ఆడపిల్లలు గోల పెట్టడం మొదలుపెట్టారు. వెంకటేష్ ఒకటవ తరగతి చదివే చిన్నపిల్లోడు. తప్పు అని ఎన్ని రకాలుగా చెప్పిన అర్థం కాలేదు. మకరెంకో గుర్తొచ్చాడు. ఓ రోజు అక్క అంటే నీకు ఇష్టమేకదా అన్నాను. తల ఊపాడు. (చాలా ఇష్టం కూడా). నందిని బాత్రూం కు వెళ్ళినప్పుడు నీలాగే అబ్బాయిలందరూ వేళ్లి చూస్తారు. అబ్బాయిలు అందరు వెళ్లండి అన్నాను. వద్దు వద్దు. నేను ఇంక వెళ్ళను అన్నాడు. వెళ్లలేదు కూడా.

నందిని వెంకటేష్ జిలేఖ, జిలేఖ తమ్ముడు, యమునా అలేఖ్య తిరుపతమ్మ చంద్రిక పదిమంది విద్యార్థులు దాకా కిలోమీటర్ దూరం నుండి స్కూల్ కి వచ్చేవాళ్ళు. ఉదయం వాళ్ళు వస్తే సాయంత్రం అందర్నీ నాతోపాటు ఆటోలో తీసుకొచ్చేదాన్ని.

బంతిపూల అందాలతో పోటీ పడుతూ మా విద్యార్దులు.

 

పిల్లలందరికీ ఉత్సాహాన్ని నింపడానికి, స్కూల్ పట్ల ఆసక్తి కలిగించడానికి, దిగుళ్లను పోగొట్టడానికి, సమిష్టి తత్వానికి ఆట,పాట మాటలతో పాటు పండుగలు, పుట్టినరోజులు బాగా చేసేవాళ్లం. పుట్టినరోజులను ఇంటి దగ్గర కన్నా పాఠశాలలోనే జరుపుకోవడానికి ఇష్టపడేవాళ్లు. (తల్లిదండ్రులు కూడా) చాక్లెట్లు తేలేని పిల్లలకు బడిలో ఉన్న చాక్లెట్లు బిస్కెట్లతో బ్రహ్మాండంగా జరిపేవాళ్ళం. చప్పట్లు కొడుతూ, అభినందనలు తెలుపుతూ ఓ పెద్ద పాట (గాడ్ బ్లెస్స్ యు బదులు....bless you teacher, బ్లెస్స్ యు స్టూడెంట్ దగ్గర నుంచి కుటుంబం సభ్యులందరి పేర్లతో బ్లెస్స్ యు మదర్, బ్లెస్స్ యు ఫాదర్, బ్లెస్స్ యు సిస్టర్, బ్లెస్స్ యు గ్రాండ్ మా, బ్లెస్స్ యు గ్రాండ్ ఫాదర్, బ్లెస్స్ యు ఎర్త్, బ్లెస్స్ యు స్కై, బ్లెస్స్ యు నేచర్) పాడే వాళ్ళు. షేక్ హ్యాండ్లూ కృతజ్ఞతలు ఉండేవి. అక్షింతలు, గురువుగారికి కాళ్లు మొక్కాడాలు ఉండేవి కావు. దీవెనలు మాత్రం ఉండేవి. ఒక్కొక్క నెలలో రెండు మూ డు పుట్టినరోజులు జరిగేవి. ఈ ఆనందం, ఉత్సాహం, సంతోషం ఒక్క పిల్లల మధ్య మాత్రమే ఉంటాయి.. ఇంతకన్నా ఇంకేం కావాలి ఈ జీవితానికి అనుకునేదాన్ని.

పెద్దల్లారా! పదండి పిల్లల మధ్యకు. పిల్లలు దేశ భవిష్యత్తు సంపద.రోగాలు, బాధలు, దిగుళ్ళు లేకుండా వాళ్లని స్వేచ్ఛగా పెరగనిద్దాము. ఆ సమాజాన్ని, ఆ విద్యా విధానాన్ని కోరుకుందాం.

పిల్లల విభిన్న ప్రతిభలతో 11 లో కలుద్దాం.

Tags:    

Similar News