జై భీం! జై భీం! జై భీం!
అతను, ‘ఆరని అగ్ని కణం కురుస్తున్న నల్ల మబ్బు వికసిస్తున్న పుష్ప వనం,’ అంటున్న ప్రఖ్యాత కవి డాక్టర్ కత్తి పద్మరావు;
By : The Federal
Update: 2025-04-15 10:37 GMT
ఆకాశంలో నీలి నక్షత్రాలు పొడుస్తున్నాయి
సముద్రాలు ఒక్కసారి ఊపిరి పీల్చుకుంటున్నాయి
కొండల్లో గడ్డిపూల దరహాసం
పాలపుంతల్లో ఏదో సందడి
చంద్రగోళంలో ఓ పువ్వు పూసింది
ఆ ఊరిలో అవ్వ నవ్వింది
ఆ మహిళలు ఆనందపరవశులయ్యారు
మనుషులు పండుగలు చేసుకుంటున్నారు
ఆ పాలకుడు
ఆ ప్రవక్తవైపు చూడలేకపోతున్నాడు
అతడు తలవంచి ఆయనకు దండవేస్తున్నాడు
ఆ ప్రబోధకుని చూపు అతడి గుండెను ఛేదిస్తుంది
‘‘నేను సత్యానికి ప్రతీక
నీవు అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం
నీ కరములతో నాకు పూలదండ వేయడం
నన్ను బాధిస్తుందని
ఆ చూపుకు అర్థం’’
నిజానికి, ఎందరినో కూల్చి
వారికి విగ్రహాలు నిర్మించి
దండలు వేసే హస్తములవి
నిజమే!
సత్యానికి అసత్యానికి
మధ్య పోరు నడుస్తుంది
వారిని పాలించమన్నందుకు
వారు దేశ సంపదను దోచుకొంటున్నారు
వారు రోజూ నిర్మిస్తున్నామంటున్నారు
కాని ఎక్కడో కూలుతున్న శబ్ధాలు
నిజమే!
ఆ మేధావులు దోసిళ్ళు బట్టి
బతుకుతున్నారు
అభ్యర్థనకు విద్యను, జ్ఞానాన్ని, ధారబోస్తున్నారు
ఆత్మ గౌరవాన్ని అమ్ముకొంటున్నారు
ఆ మహోన్నతుడు
ఎవరికీ తలవంచకుండ బ్రతికాడు
పాలకులను తన జ్ఞానంతో శాసించాడు
వారిలోని మార్మిక గుణాలకు అద్దం పట్టాడు
అతడు నదీ నాగరికులకు ముద్దుబిడ్డ
అతడు సింధునదీ నాగరికతకు వారసుడు
మానవ పరిణామ శాస్త్రజ్ఞుడు
మానవ పుర్రెలను పరిశీలించి
‘‘మూలవాసులే దేశ నిర్మాతలని’’
నిగ్గుదేల్చిన పరిశోధకుడు
ప్రపంచం ఇప్పుడు ఆయనవైపు చూస్తుంది
అతని చూపుడు వేలు ఒక ప్రశ్నకు గుర్తు
అతడు నడచిన నేల ఒక సజీవ స్రవంతి
అతడు రాసిన కలం దేశ మేధస్సుకు గుర్తు
అతడు అశోక ధర్మ చక్రాన్ని
దేశ అవనికపై నిలిపిన వాడు
అతడు ఆయుధాన్ని నిరాకరించాడు
కలాన్ని చేతపట్టాడు
రెండు వేళ్ళతో అక్షర ప్రపంచాన్ని సృష్టించాడు
తత్వశాస్త్రమే జీవన గమనంగా నిర్దేశించాడు
అతడు నిజమైన పాలకుడు
మనో సామ్రాజ్యాలను పాలిస్తున్నవాడు
మచ్చలేని జీవన జ్యోతిగా వెలుగొందాడు
అతడు సామాజిక శాస్త్రజ్ఞుడు
కులం గోడలు కూలగొట్టాడు
మనిషిలోని మానవతను మేలుకొల్పాడు
మనిషిలోని ఔన్నత్యాన్ని దర్శించాడు
‘‘మనిషి ఓ ప్రకృతి జన్యుడు
అతడు సమూహం నుండి
ఆవిర్భవించాడు’’ అని చెప్పాడు
ఆయనను తలెత్తి చూసే సాహసం లేక
ఆయన పాదాలకు మొక్కుతున్నారు
అతడు మలినం లేని మహా మనిషి
పరిపూర్ణుడు
హిమవన్నాగమంత తెల్లనివాడు
అతడు నదీ తరంగాల్లోని
ఒడుపును అందుకున్నాడు
ఓడల్లో ప్రయాణించి
ఖండాంతారాలల్లోని
తాత్విక జ్ఞానాన్ని స్వీకరించాడు
అతడు అంబేడ్కరుడు
మన తండ్రి
శతాబ్ధాలు దాటినా
వన్నె తరగనివాడు
భారతదేశానికి చిత్రపటం గీసిన వాడు
దేశానికి హద్దులు నిర్మించిన వాడు
సమాజంలో అంతరాలు తెంచిన వాడు
ఆధిపత్యంపై పోరుచేసినవాడు
అగ్రవర్ణం లేదని చాటినవాడు
‘‘మనుషులకు మనుషులే పుడతారని’’ చెప్పినవాడు
‘‘తల్లి తనమే ప్రపంచానికి ఆయువు’’అని
ప్రకటించినవాడు
అతడు జీవధాతువు, జ్ఞాన సింధువు
ప్రపంచానికి పాఠాలు చెప్పిన గురువు
అతడు నిత్య ప్రబోధకుడు
అతడు నక్షత్ర మండలాన్ని భూమికి దించిన వాడు
ఖగోళ శాస్త్రానికి భాష్యం చెప్పిన వాడు
పార్లమెంటులో ప్రభంజనమై రగిలిన వాడు
రౌండ్ టేబుల్‌లో ప్రశ్నగా వెలిగినవాడు
అతడు ఒక ప్రశ్నోపనిషత్తు
అతడు ఒక సాంఖ్య దర్శనం
వేదాలు అబద్దపు వాక్కులని చాటిన వాడు
‘‘దేవుణ్ణి, దేవతలను మనుష్యులే
సృష్టించారని’’ చెప్పిన వాడు
‘‘దేవుళ్ళకు ఆయుధాలు ఎందుకని’’
ప్రశ్నించినవాడు
నిజమే! అతడు ఈ యుగం సూర్యుడు
అతని ప్రబోధం పునరుజ్జీవన ఉద్యమం
పునర్నిర్మాణ భారతం
అతడు బౌద్ధ భారత నిర్మాత
ప్రబోధం, ప్రజ్వలనం,
ఆచరణ, నిర్మాణం
ఆ ప్రవక్త సూత్రాలు, ధర్మాలు
చీకటి బ్రతుకుల్లో వెలుగును నింపే ప్రజ్వలనుడు
నిత్య సుప్రభాతం అతనిది
నిరంతర గమన సందేశం
స్త్రీల సంకెళ్ళు తెంచే కుఠారం అతడు
అతడొక వీరుడు, ధీరుడు,
శూరుడు, విప్లవకారుడు
సమాజాన్ని పునర్నిర్మించే శాస్త్రవేత్త
ఆరని అగ్ని కణం
కురుస్తున్న నల్ల మబ్బు
వికసిస్తున్న పుష్ప వనం
అతడు ఒక పరిమళం
అతడు ఒక వెన్నెల వాన
అతడు మృదువైన వాడు
మృత్యువు లేనివాడు
కత్తి కంటె పదునైన వాడు
కరుణ శీలి!
ప్రజ్ఞా శీలి!
ప్రబోధకుడు!
ఈ యుగం ఆయనది!
ఈ దేశం ఆయన నిర్మాణం!
ఆయన బాటలో నడుద్దాం!
ఆయన మాటల్ని ఆచరిద్దాం!
బౌద్ధ భారతాన్ని నిర్మిద్దాం!
జై భీమ్... జై భీమ్....
(డాక్టర్ కత్తి పద్మారావు, లుంబిని వనం,అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్,
అంబేద్కర్ కాలనీ, పొన్నూరు పోస్ట్, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్)