ఢిల్లీ లో సొంత ఇంటి కంటే కారు ముఖ్యం..కాలుష్య మే కారణం!
హస్తిన బతుకులు చూడర బాబు, తిరుపతి నుంచి మా ఢిల్లీ యాత్ర-7;
మాడ్చేసే వడగాడ్పులు..ఒణికించే శీత వాయువులు. చాచిన కాలుష్యపు కోరలు.. ఊపిరి సలపని ఉద్యోగాలు, ప్రయాణాలు.. వారాంతంలో ఆడామగా తేడా లేదు, పెగ్గులపైన పెగ్గులతో రిలాక్సేషన్. మాంసాహారులకు అద్దెకు దొరకని ఇళ్ళు. ఢిల్లీనగరం చూడర బాబూ.. !
ఢిల్లీలోని గాలిబ్ ఇన్స్టిట్యూట్ హాల్ నుంచి తిరిగి బహదూర్ ఘడ్ ప్రయాణమయ్యాం. ఆదివారం సాయంత్రం చీకటి పడబోతోంది. కారులోనే నగర వీధులను వీక్షిస్తున్నాం. ఆ రాత్రి భోజనానికి చంద్ర ఓబుల్ రెడ్డి, కెజియా కల్పలత దపంతులు మమ్మల్ని ఆహ్వానించారు. ఆ దంపతుల గురించి, వారితో తన స్నేహం గురించి, ఉత్కంఠ రేపిన వారి ప్రేమ వివాహం గురించి, ఒక సినిమా కథలా వాకా ప్రసాద్ ఇలా చెప్పుకుంటూ వచ్చారు కారులోనే.
‘‘చిత్తూరులో నేను(వాకా ప్రసాద్) ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నా క్లాస్ మేట్ కెజియా కల్పలత పరిచయం అయింది. క్రైస్తవ మతానికి చెందిన కల్పలత ఆధునిక భావాలతో చాలా చురుగ్గు ఉండేది. అందరితో చాలా స్నేహంగా మెలిగేది. ఆమెను సోదరిగా భావించాను. తరచూ వాళ్ళింటికి వెళ్ళి రావడంతో వారి తల్లిదండ్రులతోనూ స్నేహమేర్పడింది.
ఇంటర్ అయిపోయిన తరువాత నేను పులివెందుల పాలిటెక్నిక్ లో చేరాను. కెజియా కల్పలత తిరుపతి పాలిటెక్నిక్ లో చేరింది. తిరుపతి పాలిటెక్నిక్ లోనే చదువుతున్న ఆళ్ళగడ్డకు చెందిన చంద్రఓబుల్ రెడ్డి కల్పలత ప్రేమలో పడ్డాడు. పెళ్ళి చేసుకుంటానని కల్పలత వెంటపడ్డాడు. పెళ్ళికి ఆమెకూడా అంగీకరించింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. మతాంతర వివాహానికి పెద్దలు ఒప్పుకోరని వారిద్దరికీ నచ్చచెప్పాను. కల్పలత అస్సలు వినలేదు. నాకు ఆశ్చర్యమేసింది.
ఢిల్లీ లో మాకు ఆతి థ్యం ఇచ్చిన చంద్ర ఓ బుల్ రెడ్డి (కుడి నుంచి రెండవ వారు), కెజి యా కల్పలత (ఎడమ నుంచి మూడవ వారు) వారి ఇంట్లో మేము నలుగురం.
వారి పెళ్ళి ఒప్పించే బాధ్యతను నేనే భుజాన వేసుకోవలసి వచ్చింది. కల్పలత, చంద్ర ఓబుల్ రెడ్డి పెళ్లికి ఆమె తల్లి తండ్రులకు నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నించాను. వారితో తిట్లు కూడా తిన్నాను. చివరికి చంద్ర ఓబుల్ రెడ్డి క్రైస్తవంలోకి మారేటట్టయితే పెళ్ళికి ఒప్పుకుంటామన్నారు ఆమెతల్లి దండ్రులు నా పట్టుదల చూసి. ఇరువైపులా ఒప్పించి, చంద్ర ఓబుల్ రెడ్డి క్రైస్తవం లోకి మారేలా చేశాను. పీలేరులో వారికి రిజిస్టర్ మ్యారేజ్ జరిగిపోయింది. ఉద్యోగ కారణాల వల్ల ఆ పెళ్ళికి నేను వెళ్ళలేకపోయాను.
చంద్ర ఓబుల్ రెడ్డి, కెజియా కల్పలత దంపతులు ఢిల్లీలో స్థిరపడిపోయారు. చంద్ర ఓబుల్ రెడ్డి ఒక ఫ్యాక్టరీకి జనరల్ మేనేజరైతే, కల్పలత ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. నా ఏకైక కూతురు, నా భార్యతో కలిసి ఢిల్లీలో వారింటికి పదిహేడేళ్ళ క్రితం వెళ్ళాను.
ఆ దంపతుల ఏకైక కుమారుడు హానీ ది కూడా ఆసక్తికర విషయం. బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయిని హానీ ప్రేమించాడు. వారి పెళ్ళికి అమ్మాయి తల్లీతండ్రి ఒప్పుకోలేదు. ‘‘నువ్వు 25 కోట్లు సంపాదించిరా, అప్పుడు నా కూతురినిచ్చి పెళ్ళి చేస్తా’’ అన్నాడు ఆ అమ్మాయి తండ్రి; ఎలాగూ అంత సంపాదించలేడనుకుని.
‘అమ్మాయి తల్లిదండ్రులకు తెలియకుండా తిరుపతికి తీసుకొచ్చేసి, ఇక్కడే పెళ్ళి చేసుకుంటా మావా. హెల్ప్ చేస్తావా?’ అని అడిగాడు హానీ. ఒక ప్రయత్నంగా అమ్మాయి తల్లి దండ్రులను ఒప్పించి చూడు అని నచ్చచెప్పాను. మొత్తానికి అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించాడు. ఢిల్లీలో వారి పెళ్ళి చాలా బాగా జరిగింది. ఆ పెళ్ళికోసం, పదిహేడేళ్ళ తరువాత వారింటికి వెళ్ళాను. మళ్ళీ ఇదిగో వాళ్ళింటికి ఇప్పుడే మీతో రావడం.’’
దారి పొడవునా వాకా ప్రసాద్ ఇదంతా చెప్పుకుంటూ వచ్చారు. మా హోటల్ గదిలో రిఫ్రెష్ అయ్యి వాళ్ళింటికి వెళ్ళాం. చంద్రఓబుల్ రెడ్డి, కెజియా కల్పలతలు మమ్మల్ని చాలా సాదరంగా ఆహ్మానించారు. వాకా తప్ప మేమెప్పుడూ చూడకపోయినా, ఎంతో పరిచయం ఉన్నట్టు కెజియా కల్పలత చాలా ఆత్మీయంగా మాట్లాడారు.
రకరకాల నాన్ వెజిటేరియన్ వంటకాలతో పాటు, నాకోసం శాకాహార వంటకాలు చేసి వడ్డించారు. నలుగురం తృప్ప్తిగా భోజనం చేశాం. చంద్రఓబుల్ రెడ్డి కూడా మాతో పాటే భోజనం చేశారు. ఓబుల్ రెడ్డి చివరగా రసం వేసుకుని తిని, కంచంలో రసం వదిలేసి, షింక్ లో చేయికడుక్కున్నారు. ‘‘రెడ్డీ..అంత రసం వదిలేస్తే ఎట్లా?’’ అన్నారు కల్పలత. చంద్రఓబుల్ రెడ్డి తిరిగి వచ్చి కంచంలో వదిలేసిన రసం తాగేసి వెళ్ళారు.
‘‘రెడ్డీ..కల్పలత మాట జవదాట వన్న మాట’’ అన్నారు వాకా. క్లాస్ రూంలో టీచర్ దగ్గరకు స్టూడెంట్ చేతులు కట్టుకుని వచ్చి నిలుచునట్టు, వాకా దగ్గరికి వచ్చిన చంద్ర ఓబుల్ రెడ్డి ‘‘భార్య మాట జవదాటని వాడికే భవిష్యత్తు ఉంటుంది’’ అన్నారు. ఆ మాటలకు ఆశ్చర్య పోయాం. లోలోనే కాసేపు నవ్వుకున్నాం.
గోడ డెబ్బ చెంపదెబ్బ
ఢిల్లీ జీవితం గురించి చంద్ర ఓబుల్ రెడ్డి, కల్పలతతో మా సంభాషణ చాలా ఆసక్తికరంగా సాగింది. ‘‘ఇక్కడ డ్యూటీలకు ఎన్నింటికి వెళతారు?’’ అని అడిగాను. ‘‘స్కూళ్ళు ఉదయం 7 గంటలకు మొదలై మధ్యాహ్నం రెండు వరకు సాగుతాయి. ఉదయం 6 గంటలకే బయలుదే రాలి ’’ అన్నారు కల్పలత ఆమె టీచర్ కనుక. ‘‘ఫ్యాక్టరీలు, ఆఫీసులు అన్నీ పదిగంటలకు మొదలువుతాయి కనుక తొమ్మదికే బయలు దేరుతాం.’’ అన్నారు రెడ్డి. ‘‘స్కూల్ బస్సులకు, ఉద్యోగాలకు వెళ్ళే వారి వాహనాలకు ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ఇదొకమంచి ఏర్పాటు’’ అన్నారు పరమేశ్వరరావు.
‘‘ఢిల్లీలో ఉద్యోగం వచ్చిన వాళ్ళు ముందర ఇల్లు కొనడం కంటే కారు కొనడానికే ప్రియారిటీ ఇస్తారు’’ అన్నారు రెడ్డి. ఎందుకని అడిగాను ఆశ్చర్యంగా. ‘‘ఇక్కడొక భిన్న మైన వాతావరణం. ఎండలూ ఎక్కువగా ఉంటాయి. చలీ విపరీతంగా ఉంటుంది. ఈ వాతావరణంలో స్కూటర్లలోనో, మోటార్ బైకులలోనో, బస్సులలోనో, మెట్రో రైళ్ళ లోనో డ్యూటీలకు వెళ్ళలేం. దీనికి తోడు ఢిల్లీ నిండా కాలుష్యమే. ఇటు రాజస్థాన్ ఎడారి నుంచి వడగాడ్పులు వీస్తుంటాయి. అటు హిహాచల్ ప్రదేశ్ నుంచి వీచే చలిగాలులు చంపుతుంటాయి. ఎండా కాలం ఎండలు భరించలేం. చలికాలం చలినీ భరిచలేం. ఎండలు యాభై డిగ్రీలకు వెళ్ళిపోతే, చలికాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతుంటాయి. కాబట్టి ఇల్లో, ఆపార్ట్ మెంటో కొనుక్కోవడం కంటే ముందు కారు కొనుక్కోవాలని చూస్తారు ఉద్యోగులు’’ అన్నారు చంద్రఓబుల్ రెడ్డి.
‘‘ఢిల్లీలో శాకాహారులెక్కువ’’ అన్నారు కల్పలత. ‘‘మేం ఇక్కడకు వచ్చిన కొత్తల్లో మాంసం తింటామని ఇల్లు అద్దెకు ఇచ్చేవారు కాదు’’ అన్నారామె. ఆశ్చర్యపోయాను. ‘‘మా అబ్బాయికి కోడు గుడ్డు పెట్టాలన్నా, సిటీలోని హోటల్ కు తీసుకెళ్ళి పెట్టే వాళ్ళం. ఇంట్లో రహస్యంగా తినడానికి కూడా లేదు. కోడిగుడ్డు పెచ్చు ఎక్కడ బయటపడినా ఇల్లు ఖాళీ చేయమనేవారు’’ అంటూ చెప్పుకొచ్చారు.
‘‘ఎంతమంది శాకాహారులు ఉంటారు ?’’ అడిగాను. ఢిల్లీకి ముప్ఫై ఏళ్ళ క్రితం మేం వచ్చిన కొత్తల్లో నూటికి ఎనభై మంది వరకు శకాహారులే. దక్షిణ భారత దేశం నుంచి, బెంగాల్ నుంచి బీహీర్ నుంచి వచ్చి స్థిరపడినవారి వల్ల మాంసాహారుల సంఖ్య కాస్త పెరిగింది.’’ అన్నారు. ‘‘దక్షిణ భారత దేశంలో పరిస్థితి ఇంత దారుణంగా లేదు. సింగిల్ డిజిట్ శాతంలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలు తప్ప, మాంసాహారానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు.’’ అన్నాను.
వాస్తవానికి ఉత్తర్ ప్రదేశ్ నుంచి గొడ్డు మాంసం ఎగుమతి చేసేవారిలో హిందుత్వ వాద సంస్థల నాయకులే ఎక్కవగా ఉన్నట్టు వార్తలు, కథనాలు వచ్చాయి. ‘‘సరే రెడ్డి గారు, ఇక్కడ మందు మాటేమిటి?’’ అని అడిగా.
‘‘ఇక్కడ మందు తాగడం సర్వసాధారణం. దాదాపు అంతా తాగుతారు.’’ అన్నారు రెడ్డి. ‘‘స్త్రీలు కూడానా’’ అడిగాను. ‘‘యాభై శాతం మంది స్త్రీలు కూడా మందు తాగుతారు. ఉద్యోగాల్లో, రద్దీ రోడ్లలో ప్రయాణించడంలో, ఇంటి పనుల్లో వారం అంతా కష్టపడతారు కదా. వీకెండ్లో పార్టీలు చేసుకుంటారు. పార్టీల్లో మందు మామూలే. కాస్త రిలాక్స్ కోసం. లేక పోతే వీక్ డేస్ లో ఉద్యోగాలు చేయలేరు.’’ అన్నారు చంద్ర ఓబుల్ రెడ్డి.
నిజమే, ఢిల్లీ జీవితం చాలా భిన్నమైంది. అక్కడి వాతావరణమూ భిన్నమైందే. హైదరాబాదు జీవితం కంటే కూడా భిన్నమైంది. చంద్రఓబుల్ రెడ్డి నివసించే గేటెడ్ కమ్యూనిటీ దానికదే ఒక ప్రత్యేక సామ్రాజ్యంలా ఉంది. అన్ని సదుపాయాలూ లోపలే ఉంటాయి. భిన్న జుతులు, భిన్న మతాలు, కులాలు, భిన్న ఆహార అలవాట్ల వారి సంగమం ఈ దేశ రాజధాని ఢిల్లీ.
ఒక విషయం చెప్పడం మర్చిపోయా. దాబా హోటల్ ముస్లింలు పెట్టినా, బోర్డ మాత్రం ముస్లిం పేరు లేకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే ముస్లింల పేరు పెడితే హిందూ కస్టమర్లు పెద్దగా రారు. అందుకని ముస్లింలు కూడా హిందూ దేవుళ్ళ పేరుతోనే దాబాకు బోర్డులు రాయిస్తారు. ఈ విషయం మా డ్రైవర్ కిషన్ చెప్పాడు.
భోజనం చేస్తూ, కబుర్లు చెప్పుకుంటూ ఆ రాత్రి బాగా పొద్దుపోయే వారకూ అలా గడిచిపోయింది. ఆ దంపతులిద్దరూ మాకు తమ గేటెడ్ కమ్యూనిటీ చూపించి వీడ్కోలు పలికారు. వాళ్ళింటికి సమీపంలోనే ఉన్న మా హోటల్ గదికొచ్చి పడిపోయాం. ఢిల్లీలో అది చివరి రాత్రి. సోమవారం ఢిల్లీ అంతా చుట్టు ముట్టేసి ఆ రాత్రికి మళ్ళీ కేరళ ఎక్స్ ప్రెస్ ఎక్కాలి.
రేపు ఎక్కడెక్కడ తిరగాలి? ఏమేం చూడాలి? ఇండియా గేట్, రెడ్ ఫోర్ట్, కుతుబ్ మినార్, రాష్ట్రపతి భవన్, కొత్త పాత పార్లమెంట్ భవనాలు; ఇలా మేం చూడాల్సిన జాబితా చాలానే ఉంది. ఫతేపూర్ సిక్రి చూడలేకపోయినట్టు, ఇందులో ఏమేం చూడలేమొ? రేపటి కథనంలో చూద్దాం.
(ఇంకా ఉంది)