ఆలుమగల మధ్య ఆత్మీయత ఎందుకు అదృశ్యమవుతుంది?

ఆత్మీయత అనుభూతి కాదు, అనుభవం

By :  Admin
Update: 2025-09-29 06:07 GMT

ప్రేమానంద సుధాసారం నిదానం సర్వ జీవనం అమరం రాగ రసాపూర్ణం దేహిమే ప్రణయోన్మదం అనే పాట మిస్టర్ &మిస్సెస్ పోలిశెట్టి సినిమాలో ఉంటుంది గుర్తుందా?. అనేక విలాసాలు, సౌకర్యాలు ఉన్నప్పటికీని ప్రేమించబడకపోవడం మానవులకు అతి పెద్ద దురదృష్టం, ఒకరి ప్రేమను మరొకరు పొందితేనే వారి జీవితం పరిపూర్ణమైంది అని కథానాయకులు భావిస్తారు.

భార్యాభర్తల బంధం అనేది కేవలం సహజీవనం కాదు ప్రతి బంధం.. ఒక పాఠం, ఒక ప్రామాణికత.

ప్రేమతో ఉన్న అనుబంధం ఏదైనా మధురంగా, శాశ్వతంగా అనిపిస్తుంది. భాగస్వాముల మధ్య ప్రేమ మాటల్లో కాదు, ఒకరిపై మరొకరి స్పందనలో కనిపించాలి. ఇక్కడ ప్రేమ అనేది కేవలం ఒక తాత్కాలిక ఆకర్షణ కాదు, ఇది ఒక శాశ్వత అనుభూతి. ఇవి అన్ని కలిసినప్పుడే అది ఆనందమయమైన జీవన ప్రయాణంగా మారుతుంది.

ప్రేమలో నిక్షిప్తమైన గొప్ప బంధం ఎప్పుడూ మాటల్లో కాకుండా, మనసుల్లోనే రూపు దిద్దుకుంటుంది. కొన్నిసార్లు పక్కన ఉంటూ కూడా దూరంగా అనిపించవచ్చు, మరికొన్నిసార్లు మాత్రం, కిలోమీటర్ల దూరం ఉన్నా మనసులు దగ్గరగా ఉంటాయి. ఇదే భావోద్వేగ సామీప్యత( Emotional availability). ఇది చూడలేనిది గాని అనుభవించదగినదే.

మనసు + మనసు..

భావోద్వేగ సామీప్యత అనేది జంటల మధ్య నమ్మకం, అనుబంధం, భద్రత అనే మానసిక అవసరాలను తీర్చే ముఖ్యమైన అంశం. ఇది లేకుండా సంబంధాలు మౌనంగా తేలిపోతాయి. మాట్లాడుతూనే దూరమైపోతారు.

సన్నిహితత నుంచి సాన్నిహిత్యం దాక

భౌతికంగా కలిసి ఉండడమే సరిపోదు, మనసులు కలవాలి. భావోద్వేగ సామీప్యత అంటే ఇద్దరి మధ్య మనసు – మనసు సంబంధం ఏర్పడటం. ఇది ఒకరు మరొకరిని అర్థం చేసుకునే స్థాయిని సూచిస్తుంది. ప్రేమలో నిజమైన బలాన్ని ఈ భావోద్వేగ అనుబంధమే కలిగిస్తుంది. ఒక మొదటి మెట్టు మాత్రమే. ప్రేమను పరిపక్వంగా, నిబద్ధంగా, నిజాయితీగా పెంచుకోవాలంటే భావోద్వేగ సాన్నిహిత్యం తప్పనిసరి. బంధాన్ని లోతుగా మార్చుకోవాలంటే మొదట భాగస్వామి భావాలను నిశ్శబ్దంగా వినగలగాలి. వారి మాటల వెనుక దాగిన భావాలను, అవసరాలను గుర్తించగలగాలి.

ఒకే ఇంట్లో రెండు ఒంటరితనాలు ఉన్నా, మనసుల్లో దూరం పెరగడం అనేది ఈ రోజుల్లో చాలా సాధారణం. ఒకరి ముందు మరొకరు అసురక్షితంగా ఉండగలగడం కూడా ఈ బంధం లోతు పెరిగే ప్రధాన అంశం. వారి మధ్య భావోద్వేగ దూరం పెరిగిపోతూ ఉంటుంది. మాటలు మారిపోతాయి, భావాలు భారంగా, ఒక్కసారి కనిపించిన ఆత్మీయత ఇప్పుడు అదృశ్యమవుతుంది. ఒకే గదిలో ఉన్నా వారి మనసులు వేరే గదుల తలుపులు తట్టుతున్నట్లు అనిపిస్తుంది. వీటికి ప్రధాన కారణాలు అనవసర మౌనం లేదా భావ ప్రకటన లోపం, అనుభూతులు పంచుకోకపోవడం అధిక ఒత్తిడి, పని భారాలు మానసికంగా దూరమవ్వటం (emotionally unavailable) భయాలు, కలలు, గత బాధలు దీనికి కారణం.

పంచుకోవడం ముఖ్యం..

ఆలుమగలు అన్నీ పరస్పరం పంచుకోగలగితే ఇద్దరి మధ్య నిశ్శబ్దమైన నమ్మకం ఏర్పడుతుంది. చిన్న, చిన్న సంభాషణలు, రోజువారీ ఆప్యాయతలు గాఢమైన అనుబంధానికి ప్రధాన భూమికలుగా మారతాయి. ఉదయం ఒక చిన్న కాఫీతో ప్రారంభమై, రాత్రి ఈ రోజు ఎలా గడిచింది?" అనే ప్రశ్నతో ముగిసే రోజులు – ఇవే బంధాన్ని బలపరిచే మాధుర్య ఘడియలు.

తోడు నీడగా..

భావోద్వేగ సామీప్యత అనేది ఇద్దరి మధ్య గల లోతైన భావపూర్వక అనుబంధం. ఇది శారీరక సమీపత కంటే ఎక్కువ . ఇది ఆప్యాయత, నమ్మకం, భావాల అర్థం చేసుకునే శక్తి మీద ఆధారపడి ఉంటుంది. బంధంలో సంఘర్షణలు రాకుండా చూసుకోవడం కాదు, వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకునే తీరు ముఖ్యం. వాదనలు జరుగుతాయి, అవి గౌరవం కోల్పోకుండా, ప్రేమ తగ్గకుండా ఉంటే బంధం మరింత పటిష్టమవుతుంది. చివరికి, ప్రేమ అనేది ఎప్పటికీ ఒక వైపు నుంచి మాత్రమే రావాల్సినది కాదు. పరస్పర ప్రేమ, అవగాహన, మద్దతు ఇవే బంధాన్ని సమంగా నిలుపుతాయి.

ఓ చూపులో.. ఓ స్పర్శలో

భావాలను పంచుకుంటే బంధం పరిపక్వమవుతుంది. ప్రతి బంధం ఆరోగ్యంగా, స్థిరంగా ఉండాలంటే, భావోద్వేగ పరస్పరత ఎంతో అవసరం. మనసులో ఏదైనా కలవలసినప్పుడు, అది అద్భుతంగా బయటపడినప్పుడు, బంధంలో విశ్వాసం, సాన్నిహిత్యం పెరుగుతాయి. భావాలను గుండెల్లో దాచుకొని మౌనంగా ఉండటం వల్ల, మరొకరికి అర్థం కావడం కష్టమవుతుంది. నెమ్మదిగా దూరం పెరుగుతుంది. కానీ ఎప్పటికైనా ఒకరి భావాలను మరొకరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే, మాటల వెనుక ఉన్న మమకారాన్ని, బాధను, ఆనందాన్ని అర్థం చేసుకుంటే ఆ సంబంధం అంతరంగికతను పొందుతుంది. ప్రేమలో, దాంపత్యంలో, స్నేహంలో, కుటుంబంలో భావాలను బహిర్గతం చేయడం ద్వారా విశ్వసనీయత ఏర్పడుతుంది. ఈ పారదర్శకతే బంధాన్ని పరిపక్వంగా, గాఢంగా, స్థిరంగా మార్చే బలమైన అస్త్రం. భావాలను పంచుకోవడం అంటే కేవలం మాట్లాడటం మాత్రమే కాదు. వినగలగటం, అర్థం చేసుకోవడం, స్పందించడం కూడా. ఈ మార్గంలో సాగిన ప్రతి బంధం కాలక్రమంలో మరింత లోతుగా మారుతుంది.

మౌన బంధాన్ని మాటలతో మళ్లీ మెరిపిద్దాం.

అత్యంత సున్నితమైన ప్రేమ కూడా అప్పుడప్పుడూ మాటల రూపంలో వ్యక్తం కాకపోవచ్చు. కానీ మాటలు లేని ప్రేమ కూడా గట్టిగా వినిపిస్తుంది. అది ఒక చూపులో, ఒక చేతి తాకడంలో, ఒక మౌనంలో ఉన్న అర్థంతో, ఒకే గదిలో ఎదురెదురుగా కూర్చున్నా ఒకరిపై మరొకరి ఉనికి గుర్తించిన సమయంలో ప్రత్యక్షమవుతుంది. మాటలు కొన్నిసార్లు పక్కకు తప్పినా, ప్రేమ నిజంగా ఉందంటే అది స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే నిజమైన ప్రేమకు భాష అవసరం ఉండకపోవచ్చు. కానీ అది ఉండే ప్రతి చోట, మనసు దాన్ని వినగలదు, అనుభవించగలదు, గుర్తించగలదు.

మనసు మూగది.. మాటలు రానిది..

ప్రేమ అనేది వినిపించేదే కాదు, మనసును తాకేదీ, బంధాన్ని దృఢం చేసేదీ కావాలి. ఎందుకంటే భాష లేకపోయినా ప్రేమ ఉన్నదంటే అది మౌనంగా వెలుగుతుంది, గట్టిగా మాట్లాడుతుంది.

ప్రతి రోజు హృదయాన్ని విప్పి మాట్లాడుకోవాలి , ఒకరి బాధలో మరొకరు మౌనంగా తోడుగా ఉండాలి, పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవడం ఈ చిన్న ప్రయత్నాలే బంధాన్ని బలపరచి, ప్రేమను లోతుగా మార్చతాయి. ప్రేమకి అవసరం మాటలు కావొచ్చు, కానీ మౌనం కూడా ఒక భాషే. భావోద్వేగ సమీపత అనేది దృశ్యంగా కనిపించకపోయినా, అది అనుభూతిగా ప్రతి హృదయంలో నిలిచిపోతుంది. ఇది ప్రేమకి లోతుని ఇచ్చే అసలైన మూలం. మనసులు కలిసిన చోటే జీవితం పరిపూర్ణంగా వికసిస్తుంది.

ప్రేమ మాటలతో కాదు, భావాలతో పుడుతుంది. మౌనపు లోతుల్లోనూ మనసు పలుకుతుంది.సాహచర్యమేసంగీతమైతే, సాన్నిహిత్యం సుందర గీతమవుతుంది.

-మానస తిరుమల , సైకాలజిస్ట్, హైదరాబాద్

Tags:    

Similar News