విజయవాడలో పుస్తకాల పండగ

జనవరి 2 నుంచి 12 దాకా పుస్తక ప్రియులను అలరించనున్న బుక్ ఫెయిర్;

By :  Admin
Update: 2025-01-04 11:13 GMT

-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి

విజయవాడ కు కొత్త సంవత్సరంలో పెద్ద పండగ సంక్రాంతి కి ముందే పుస్తకాల పెద్ద పండగ వస్తుంది. పది రోజుల పాటు పుస్తక ప్రియులను అలరిస్తూ సందడి చేస్తుంది. చుట్టు పక్కల ఊళ్ళ నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా తమ ఇంటి పండగకి వచ్చినట్లు జనం ఈ పుస్తకాల పండగకి వస్తారు. అన్ని వయసుల వారికి, అన్ని అభిరుచుల వారికి తగిన అన్ని రకాల పుస్తకాలు దొరికే చోటు ఇది. జ్ఞాన సముపార్జనకు చక్కని లోగిలి ఇది.

శ్రవణ, భాషణ, పఠన, లిఖిత నైపుణ్యాలు నాల్గింటిలో మనిషి మానసిక వికాసానికి,జ్ఞాన సంపదకు ఎక్కువ దోహదం చేసేది పఠన నైపుణ్యం. పుస్తక పఠనం ఒక గొప్ప కళ. పుస్తకంలోని పాత్రల సంభాషణ వింటూ వారితో సంభాషించటం, వారి భావోద్వేగాలను పంచుకుంటూ,మనవాటి తో పోల్చుకోవటం చేయవచ్చు.ఎటువంటి పరిస్థితులలో మనం ఎలా ప్రవర్తించవచ్చో, కూడదో గ్రహించవచ్చు.

అనుసరణీయమైతే స్వీకరించి, కానిదాన్ని పరిహరించవచ్చు .ఇలా మన వ్యక్తిత్వాన్ని వన్నెలు దిద్దుకోవటంలో పుస్తకాలు గొప్ప గురువులు. ఏ పుస్తకాలు చదవాలి, ఏవి చదివితే వ్యక్తిత్వం వికసిస్తుంది, విషయ పరిజ్ఞానం పెరుగుతుంది అనేది తెలుసుకోవటమే అసలు నైపుణ్యం.

పుస్తక పఠనం తో మేధావులుగా ప్రసిద్ధికేక్కినవారెందరో ఉన్నారు. సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత ఆలివర్ గోల్డ్ స్మిత్ 'ఒక గొప్ప పుస్తకం చదివినప్పుడుమంచి స్నేహితుడు దొరికినంత అనుభూతి కలుగుతుంది. అదే పుస్తకాన్ని మళ్ళీ చదివినప్పుడు చిరకాల మిత్రుని కలిసినంత ఆనందం కలుగుతుంది 'అన్నారు. పుస్తకం మంచి మిత్రుని వంటిదని ఆయన భావం. పుస్తకం చదువుతున్నప్పుడు ఇతర ఆలోచనలు వేధించవు. అందులోనే లీనమైపోతాం. ఒంటరి తనంలో మంచి తోడు పుస్తక పఠనం. మనసు కలత చెందినపుడు పుస్తకాలు మనను సేద తీరుస్తాయి.

పుస్తకాన్ని చదివే పద్ధతిని పుస్తక ప్రియుల నుంచి నేటి తరం నేర్చుకుని అనుసరించాలి.

మహాకవి గురజాడ అప్పారావు తన జీవిత కాలంలో ప్రాచ్య పాశ్చాత్య నాటకాలు, నవలలు, అలంకార శాస్త్ర గ్రంధాలు, శైలి, అనువాదానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు అధ్యయనం చేసారు. బాల్యంలో వాళ్ళ నాన్నగారు అప్పుడప్పుడు ఇచ్చే డబ్బులు పెట్టి విజయనగరం క్లాక్ టవర్ దగ్గర సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొని చదివేవారుట. ఈ పుస్తక పఠనం అలవాటు వారిలో పెద్దయ్యే కొద్దీ పెరిగిందే కానీ ఏ మాత్రం తగ్గలేదు. మద్రాసు లోని అడిసన్ అండ్ కో వారు తమకే గ్రంధం వచ్చినా ముందు గురజాడ కు పంపేవారు. ఈ ఒప్పందం వారి మధ్య ఉండేది. గురజాడ పుస్తకాలు చాలా వేగంగా చదివేవారు. చదువుతున్నప్పుడు నచ్చిన అంశాల కింద గీత గీసి పక్కన అభిప్రాయాలు రాసుకునేవారు. ఆయన చదివిన పుస్తకాలను పరిశీలిస్తే మనం దీన్ని గ్రహించవచ్చు.మనకు కూడా పుస్తకం

చదివేటప్పుడు పెన్నో, పెన్సిలో చేతిలో తప్పకుండా ఉండాలి .

సంఘ సంస్కర్త, బహుగ్రంధ కర్త కందుకూరి వీరేశలింగం చిన్న వయసులోనే వాళ్ళింట్లో ఉండే తాటాకు గ్రంధాలన్నీ పండితుల సహాయంతో చదివేసారు. వసుచరిత్ర ప్రబంధం చదవాలని ఆయన కోరిక. వాళ్ళమ్మ నెలఖర్చుకు బాల వీరేశలింగానికి అర్థరూపాయి ఇచ్చేది. కందుకూరి, పుస్తకాల షాపు యజమానితో నెలకు అర్థ రూపాయి ఇస్తానని, షాపులో కూర్చుని చదువుకోవటానికి అనుమతి ఇమ్మని అడిగారు. అతను ఒప్పుకోగా, కందుకూరి,స్కూల్ కి వెళ్ళటం మానేసి షాపులో కూర్చుని వసుచరిత్ర చదివేసారు. కొన్నాళ్ళకు కందుకూరి స్కూలుకి వెళ్ళటం లేదని తెలిసి, తల్లి అడిగితే నిజం చెప్పేసారు. అప్పుడామె వసుచరిత్ర, కందుకూరికి కొనిపెట్టారు. చిన్నతనంనుంచి ఆయన పుస్తక పఠనాభిలాష అటువంటిది.

పుస్తకాలతో స్నేహం చాల గొప్పగా వుంటుంది. గొప్ప అనుభూతిని, అనుభవాన్ని ఇస్తాయి. వాటితో అనుబంధం రక్త సంబంధం కన్నా మిన్నగా కొందరు భావిస్తారు. వాటివియోగం తనవారిని కోల్పోయినంత గా మానసిక వేదన చెందుతారు.

దీనికో పెద్ద ఉదాహరణ పండితుడు,కావ్యకర్త, అవధాని, అద్భుత కథకుడు, బహుభాషా కోవిదుడు శ్రీ వేలూరి శివరామశాస్త్రి గారి జీవితంలో జరిగిన పెద్ద సంఘటన. వారు సిరివాడ లోని తమ తోటలో ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు దానికి జరిగిన అగ్నిప్రమాదంలో తన కళ్ళ ముందే వారి వేలాది పుస్తకాలన్ని అగ్నికి అహుతై బూడిద గా మారటం చూసి వలవలా ఏడ్చేసారు. ఆ మనోవేదన వారిని కృంగి కృశింప చేసి, చివరికు ఆయన ప్రాణాలను హరించింది.

పుస్తకం చదవటం అలవాటైతే ఒక్కరోజైనా, చదవకుండా ఉండలేరు. నేటి యువతలో భావ వ్యక్తీకరణ, భాషాపాటవం లోపిస్తున్నాయి. వీటిని పెంపొందించుకోవటానికి పుస్తకపఠనం దోహదం చేస్తుంది. సాహిత్య గ్రంధాలు చదవటం వల్ల గత కాలం నాటి సామాజిక జీవితం, వర్తమాన పరిస్థితులు, భాషలో పదాలు, పదబంధాలు తెలుస్తాయి. సాహిత్యం సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తుంది.

ఇంట్లో తల్లిదండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు బాల్యం నుంచే పుస్తకాలను చదివే అలవాటు ను ప్రోత్సహించాలి. వాళ్ళను గ్రంధాలయాలకు తీసుకువెళ్ళాలి. పుస్తకాలను పరిచయం చెయ్యాలి. పుస్తక ప్రదర్శనలు చూపించాలి. ప్రారంభంలో చిన్న చిన్న కథల పుస్తకాలు చదివించి వాళ్ళేం అర్థం చేసుకున్నారో వాళ్ళ చేతే చెప్పించాలి. ఇది వారి భావ వ్యక్తీకరణ కు తోడ్పడుతుంది. పిల్లలు తమ ఇంట్లో సొంత గ్రంధాలయం ఏర్పాటు చేసుకునేటట్లు ప్రోత్సహించాలి. ఇది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే చేయగలరు.

పుస్తకాలు లేని ఇల్లు ఆత్మ లేని శరీరం లాంటిదని అంటారు గొప్ప రోమన్ తత్వ వేత్త, వేదాంతి, విద్యావేత్త, రాజనీతిజ్ఞుడు, న్యాయవాది , రచయిత, వక్త అయిన సిసిరో.

ఇంట్లో కూర్చుని కాలు కదపనక్కరలేకుండా పుస్తకం మనని కొత్త ప్రదేశాలకు తీసుకువెళుతుంది. ఎందరో వ్యక్తులను పరిచయం చేస్తుంది. ఇతర ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేస్తుంది. పుస్తక పఠనంతో విశ్వ పర్యటనం చేస్తాము.

ప్రసిద్ధ ఆంగ్ల రచయిత బేకన్ 'కొన్ని పుస్తకాలను స్పృశించి వదిలేయాలి. కొన్ని జీర్ణించుకోవాలి. కొన్ని నెమరు వేసుకోవాలి 'అన్నారు. ఏ పుస్తకాలు చదవాలి, వేటి వలన ప్రయోజనం పొందుతాం అనేది ఆలోచించుకుని మరీ పుస్తకాలను ఎంచుకుని చదవాలి.

పుస్తకం చదవటం ప్రారంభించి కొన్ని పేజీలు చదివాక అది ఉపయోగపడేదా, కాలక్షేపానికా అనేది అభ్యాసం మీద గ్రహించగలుగుతాము. ప్రపంచపు గొప్ప సాహిత్యం చదవటం వల్ల విజ్ఞానం వికసిస్తుంది. పద సంపద పెరుగుతుంది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక అరగంటైనా పుస్తకం చదవటం మంచి అలవాటు.

ఈ సంవత్సరం పుస్తక ప్రదర్శన ను పుస్తకాభిమానులందరు ముఖ్యంగా యువత సద్వినియోగం చేసుకుంటారని ఆశిద్దాం.

Tags:    

Similar News