లాస్ ఎంజలీస్ బీచ్ లలో ఒక రోజంతా...

ఆకస్మికంగా సముద్రం కనిపించకుండా పోయింది. ఎగిసి పడుతున్న అలలు.దట్టంగా పొగమంచు.ఇప్పటివరకూ చాలా సముద్రతీరాలను చూసాను. కానీ ఇలాంటి అద్భుతం ఎక్కడా చూడలేదు.

Update: 2024-07-14 04:20 GMT

లాస్ఏంజిలిస్ అమెరికాలో న్యూయార్క్ తరువాత అతి పెద్ద నగరం. లాస్ ఎంజిలిస్ అనేది నిజానికి స్పానిష్ నుంచి వచ్చిన పదం. ఒకపుడు చిన్నగ్రామం. స్పెయిన్ నుంచి వలస వచ్చిన వారితో ఆగ్రామం పట్టణంగా మారింది. వాళ్లు పెట్టిన పేరే స్థిరపడింది. ఈ నగరాన్ని సిటీ ఆఫ్ ఎంజిల్స్ అని ముద్దుగా పిలుచు కుంటారట. వ్యవహారంలో మొదటి అక్షరాలతో సంక్షిప్తంగా LA అని పిలుస్తారు.


ఈ నగర వాతావరణం నివాస యోగ్యంగా ఉంటుంది. ఎక్కువ చలిగా కాకుండా ఎండలతో కాకుండా సమ శీతలంగా ఉంటుంది. కాబట్టి ఇతర దేశాలనుంచి వచ్చిన వారు ముఖ్యంగా భారతీయులు ఇక్కడ సెటిల్ అవడానికి ఇష్టపడతారు. పలు భాషలు మాట్లాడే వాళ్ళు ఇక్కడ కనిపిస్తారు. LA పసిఫిక్ సముద్రంలో ఉన్నందువలన ప్రకృతి పరంగా , సాంస్కృతికంగా , చారిత్రకంగా , ఆర్థికంగా , సాంకేతికంగా ప్రాధాన్యత కలిగిన నగరం. హాలీవుడ్ సినీ పరిశ్రమ అంతా ఇక్కడే ఉన్నది.


ఈ నగరం బీచ్ లకు ప్రసిద్ధి. ప్రకృతి ప్రేమికులుగా మేము సముద్ర తీరాలను చూడడానికే ఇష్ట పడ్డాము. అందుకే సినీ స్టూడియోల వైపు వెళ్లలేదు. మేము అద్దెకు వున్న ఇంట్లో నుంచి కూడా సముద్రతీరం కనిపిస్తూనే వున్నది. ఇంట్లోనే వుండి సముద్రంలోనుంచి ఉదయిస్తూన్న సూర్యుణ్ని చూసేదాన్ని. మేము బస చేసిన ఇంట్లో అన్ని వసతులు ఉన్నాయి. సంగీత ప్రియులకు పియానో ఏర్పాటు కూడా ఉన్నది. LA నగరం కొండల మీద వున్నది. మేము బస చేసిన సాన్ పాడ్రియో ప్రాంతం లో కొండల మీదనే ఇళ్లు ఉన్నాయి. మొదటి రోజు మేము లైట్ హౌస్ చూసుకొని అక్కడనుంచి కొరియన్ గంట చూడడానికి వెళ్లాము.  


నాటి లైట్ హౌస్

ఇది మైత్రికి చిహ్నం. ఉక్కు పైన అద్భుతమైన ఆర్ట్ తో దీనిని తయారు చేశారు. ఇది ఏంజెల్స్ పార్కులో ఉన్నది. కొరియన్ - అమెరికన్ పీస్ పార్కుగా కూడా దీనిని పిలుస్తారు. ఈ రెండు దేశాల మైత్రికి గుర్తుగా ఇక్కడ 1981 జనవరి 21 న చెట్లు నాటారు. అవి చిన్నగా గుబురుగా అందంగా ఉన్నాయి.


అమెరికా కొరియా దేశాల మైత్రికి గుర్తుగా నాటిన చెట్లు


ఫాల్ సీజన్ వలన చాలా ప్రాంతాలలో చెట్లు ఆకులు రాలి పోయి మోడుబారి ఉంటే లాస్ ఏంజిల్స్ మాత్రం పచ్చదనంతో కళ కళలాడుతుంది. మిగతా చోట్లకన్నా ఇక్కడ చెట్లు చాలా భిన్నంగా కనిపించాయి. చాలా పురాతనమైన చెట్లు పెద్ద కాండంతో వంపులు తిరిగి ఉన్నాయి. ఖర్జూరపు , ఈత , తాటి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ వృక్ష సముదాయాలను పరిశీలిస్తూ మేము బీచ్ కు చేరుకున్నాము. మధ్యాహ్న సమయంలో అక్కడ సేద తీరుతున్న సమయంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కరణ జరిగింది. నేనైతే చాలా భావోద్వేగానికి లోనయ్యా ను. ఆకస్మికంగా సముద్రం కనిపించకుండా పోయింది. ఎగిసి పడుతున్న అలలు మాత్రమే కనిపించాయి. పొగమంచు దట్టంగా కమ్మేసింది. నేను ఇప్పటివరకూ చాలా సముద్రతీరాలను చూసాను. కానీ ఇలాంటి అద్భుతం ఎక్కడా చూడలేదు. అదే ఈ బీచ్ ప్రత్యేకత అట. ఈ దృశ్యాన్ని తమ కెమెరాలతో ఒడిసి పట్టుకోవాలని చాలా ప్రయత్నం చేశారు శివ మాధురి. కానీ సాధ్యం కాలేదు. ప్రకృతి సర్వదా మానవులకు లొంగదని స్పష్టమైంది. శివ మా పెద్దబ్బాయి. మాధురి తన సహచరి. వృత్తి రీత్యా ఇద్దరూ వైద్యులు. ఫోటోగ్రఫీ వాళ్ళ హాబీ.


వెనిస్ బీచ్


 సముద్రపు ఒడ్డున కూడా ఎడారి మొక్కలు కనిపించాయి. అక్కడనుంచి మేము బోటులో డాల్ఫిన్ , వేల్ చూడడానికి వెళ్లాము. రెండున్నర గంటలు సముద్రం మీద ప్రయాణం.. తిమింగలాలను చూడబోతున్నా అనే ఉద్వేగం ముందు ఎముకలు కొరికే చలి అంతగా బాధించలేదు. మా బోటును పైనుంచి పక్షులు వెంబడిచాయి. డాల్ఫిన్ లు చాలానే కనివిందు చేశాయి. అందరి దృష్టి తిమింగలం వైపే... అది మొత్తంగా నీటి పైకి రావడం లేదు.... ఒకసారి రెక్కలు , మరోసారి తోక , ఇంకోసారి శరీర భాగాన్ని చూపించింది. శివ తన కెమెరాలో దానిని మాత్రం బంధించ గలిగాడు. పిల్లల , పెద్దల కేరింతలతో సమయం ఇట్టే గడిచిపోయింది.

తెల్లవారి ఉదయమే వెనిస్ బీచ్ కు బయలు దేరాము. సమీపం లోనే ఉన్న వెనిస్ కెనాల్ కాలనీ చూసాము. కొంతమంది సంపన్నులు వెనిస్ నగరంలో మాదిరి ప్రణాళికా బద్దంగా ఇళ్ల మధ్యలో కెనాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. వాటిలో చిన్న చిన్న పడవలు ఉన్నాయి. ప్రతి కెనాల్ పైనా వంతెనలు కూడా నిర్మించారు. చూడడానికి ఎంతో అందంగా చిన్నపాటి పర్యాటక ప్రదేశం లాగా ఉన్నది. 




 వెనిస్ నగరం ఎప్పుడు చూడాలా.... అనే కోరిక ప్రస్తుతానికి ఇలా తీరింది. ఎప్పటికైనా వెనిస్ నగరం తప్పకుండా చూడాలి.... అనుకొని అక్కడనుంచి వెనిస్ బీచ్ కు వెళ్లాము. నిన్న చూసిన బీచ్ రాళ్లతో ఉంటే ఇక్కడ ఇసుకతో ఉన్నది. నీళ్లలో ఆడుకొని , ఇసుకలో నడిచి ఇక చాలు అని ఇంటికి చేరాము. కాసేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రం కాబ్రియో బీచ్ కు వెళ్లాము. హార్బర్లో సముద్రపు అలల తీవ్రతను ఆపడానికి నిర్మించిన వంతెనకు సమాంతరంగా ఉన్న వంతెన మీద చివరిదాకా నడుస్తూ పరిసరాలను గమనించాను.


కాబ్రియో బీచిలో సూర్యాస్తయం


 సూర్యాస్తమయం వరకు అక్కడే గడిపి ఇంటికి వచ్చాము. 22 తేదీ రాత్రి మునుపెన్నడూ లేని విధంగా డెన్వర్ లో -20 డిగ్రీల చలి నమోదు అయి , మంచు తుఫాను వచ్చిందట కానీ మా తిరుగు ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది కాలేదు. మేము డెన్వర్ లో ఫైట్ దిగి , కారులో మరో ఆరు గంటలు ప్రయాణం చేసి రాత్రి పది గంటలకు క్షేమంగా ఇంటికి చేరుకున్నాము.


Tags:    

Similar News