ఢిల్లీ రైలు ప్రయాణంలో ఎన్ని సరిగమలో...

తిరుపతి టు ఢిల్లీ రైలు ప్రయాణం యాత్ర-1;

Update: 2025-04-04 05:46 GMT
ఢిల్లీ రైలు ప్రయాణంలో ఎన్ని సరిగమలో...
కిక్కిరిసిన తిరుపతి రైల్వే స్టేషన్
  • whatsapp icon

ఎన్ని భిన్నమైన ప్రాంతాలు..! ఎంత భిన్నమైన జీవితాలు..! వాటిని అవలోకనం చేసుకుంటుంటే ఎంత ఉక్కిరి బిక్కిరి గా ఉంటుందో..! రెండు పగళ్లు, మూడు రాత్రులు..! మానవ హక్కుల జాతీయ సదస్సు కోసం చేసిన ‘మా ఢిల్లీ యాత్ర’ రైలు ప్రయాణంలో ఎన్ని సరిగమలో, ఎన్ని పదనిసలో.. !

ఎన్ని చారిత్రక ప్రాంతాలను సందర్శించామో..! మన పాలకుల ఎన్ని నివాస వైభోగాలను చూశామో..! బతుకు పోరాటంలో అలిసిపోతున్న పౌరులనూ చూశాం..! మన రాజధానిలో, చెత్తలో బతుకును వెతుక్కుంటున్న భావి భారత పౌరులనూ చూశాం..! ఆశల మోసులెత్తుతున్న యువత తుళ్ళింతలనూ, కేరింతలనూ పరికించాం.. ! మా యాత్రలో అవలోకనం చేసుకున్న జీవితాల్ని దృశ్యమానం చేయడానికే ఈ చిరు ప్రయత్నం.

భూతంలా శబ్దం చేస్తూ కేరళ ఎక్స్ ప్రెస్ తిరుపతి రైల్వే స్టేషన్ లో ఒకటో నెంబర్ ప్లాట్ ఫాం పైకొచ్చి ఆగింది. ఆరోజు మార్చి 28వ తేదీ, శుక్రవారం ఉదయం ఇంకా తెల్లారలేదు. యాత్రికులతో తిరుపతి రైల్వేస్టేషన్ కిటకిటలాడుతోంది. రైలు ఎక్కడ వెళ్ళిపోతుందో నని, హడావిడిగా పరుగులు తీస్తున్న ప్రయాణీకులు. ప్లాట్ ఫాం పై నడవడానిక్కూడా చోటులేదు. గుంపులు గుంపులుగా జనం. రిజర్వేషన్ ఉన్న ప్రయాణీకుల్లోనూ హడావిడి. రిజర్వేషన్ లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి!?

‘‘జనరల్ బోగీలు ఎక్కడుంటాయి?’’ అంటూ అడుగుతున్న ప్రయాణీకులు. అవి రైలుకు ఆ కొన ఒకటి, ఈ కొన ఒకటి! ఎక్కడెక్కడి నుంచో కొండకొచ్చిన యాత్రికులు. సామాను నెత్తిన పెట్టుకుని, పిల్లాపాపలను పట్టుకుని, ఈడ్చుకుంటూ, రిజర్వేషన్ బోగీలను వెతుక్కుంటూ, పరుగులు తీస్తున్నారు! వారితో పాటు నేను, వాకా ప్రసాద్, పరమేశ్వరరావు, హరీష్ పరుగులు తీస్తూ, మా సీట్లలో కొచ్చి పడిపోయాం.

అప్పుడే తెలతెలవారుతోంది. రైలు కూత పెట్టింది. దడదడా శబ్దం చేస్తూ నిదానంగా కదులుతోంది. రెక్కలు తెగిన పక్షుల్లా రైలెక్కలేని యాత్రికుల గుండెల్లోనూ దడదడా. రిజర్వేషన్ వల్ల మా సేట్లలో మేం కూర్చోగలిగాం. అంతా సీట్ల కింద సామాను సర్దుకుంటున్నారు. ఒకప్పుడు మేమూ జనరల్ బోగీల్లో ప్రయాణీకులమే. రైలు కంటే చాలా ముందుగా వచ్చేవాళ్ళం. రైల్లో కొన్ని గంటల మనుగడ కోసం సీట్ల కోసం పోరాటం చేసే వాళ్ళం.

రైల్లో చోటు లేక కొందరు టాయిలెట్ల దగ్గర కూర్చునేవారు. భరించరాని కంపుకొట్టినా ప్రయాణం చేయాలి కదా! స్లీపర్ లో రిజర్వేషన్ చేయించుకోవడం మొదలు పెట్టాం. స్లీపర్ టాయిలెట్లు కూడా కంపు కొట్టడం మొదలు పెట్టాయి. థర్డ్ ఏసీకి ఎగబాకాం. సీట్ల పోరాటం తగ్గింది. కంపూ కాస్త తగ్గింది. పది పన్నెండు గంటలు ప్రయాణం చేస్తే, థర్డ్ ఏసీ టాయిలెట్లలో కూడా అదే సువాసన!

మా బెర్త్ లలో కాసేపు పడకేశాం. బాగా తెల్లారింది. చపాతీలు తినేసి మాటల్లో పడిపోయాం. ఎడమ చేతిని ముడిచి, కుడి చేతి వేళ్ళతో చిటికెలు వేస్తూ, ‘నమో వెంకటేశా..ఆ..నమో తిరుమలేశా..’ అని పాడుతూ, కళ్ళు మూస్తూ తెరుస్తూ, ఒకప్పుడు రైళ్ళలో కనిపించే వాళ్ళు. ‘కళ్ళు లేని కబోదిని బాబూ.. ధర్మం చేయండి బాబూ..’ అంటూ అడుక్కునే వాళ్ళు రైళ్ళలో ఇప్పుడు కనిపించడం లేదు. ఒకప్పుడు ‘గరీబీ హటావో’ నినాదం. పేదరికాన్ని తిరమేశారా? పేద వాళ్ళనే తరిమేశారా! ?

గతాన్ని గుర్తు చేసుకుంటూ, వర్తమానాన్ని దర్శిస్తున్నాం. కేరళ ఎక్స్ ప్రెస్ ఎక్కాలని తెల్లవారు జామున ఎప్పడో మూడుగంటలకు లేచాం. నిద్ర చాల్లేదు. రైల్లో కను రెప్పలు మూస్తే దృశ్యాలు అదృశ్యమవుతాయని, కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ కూర్చున్నాం. పరిసరాలను పరికిస్తున్నాం. చుట్టూ ఉన్న మనుషులతో మాటా మంతి జరుపుతున్నాం.

రైల్ లో రాఘవ, వాకా ప్రసాద్ , హరీష్, పరమేశ్వర రావు

రైల్ లో రాఘవ, వాకా ప్రసాద్ , హరీష్, పరమేశ్వర రావు

‘కాఫీ..కాఫీ’ అంటూ ఓ వ్యక్తి వచ్చాడు. ఒక చేతిలో పెద్ద క్యాన్ లాంటి ఫ్లాస్క్, మరో చేతిలో పెద్ద గంప. ప్రతి ప్రయాణీకుణ్ణి ‘కాఫీ’ అడుగుతున్నాడు. ఏదో కవర్ నుంచి పొడి తీసి, ఒక కాగితపు కప్పులో వేసి, వేడి నీళ్ళు పోశాడు. అది కాస్తా కాఫీ అయిపోయింది. అతని చేతిలో ఏదో ఇంద్రజాలం ఉన్నట్టనిపించింది. ‘‘కాఫీ ఫ్రీ దేతా క్యా’’ అన్నారు వాకా ప్రసాద్. ‘‘ఫ్రీ నైసాబ్. దస్ రూపియా’’ అన్నాడతను. ‘‘ప్రతి మనిషిని కాఫీ’’ అని అడుగుతున్నావే?’’ అన్నారు వాకా. ‘‘అడగడం నా ధర్మం సార్’’ అన్నాడతను. ‘‘తాగితే డబ్బులివ్వడం కూడా మా ధర్మం’’ అంటూ పరమేశ్వరరావు డబ్బులిచ్చారు. ‘‘తోడా చుప్ కే..చుప్ కే’’ అన్నాడు వాకా ప్రసాద్ అతని భుజం తడుతూ. అతను కూడా ఒక నవ్వు విసిరేసి వెళ్ళిపోయాడు.

మా ఎదురుగా ఒక తండ్రి కూతుళ్ళు కూర్చున్నారు. మధ్యలో ఎక్కడో ఎక్కారు. విశాఖకు చెందిన అతను ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ గా చేస్తూ రిటైరయ్యానన్నాడు. ముప్ఫై ఏళ్ళు సైన్యంలో సేవ చేసినట్టు చెప్పాడు. కార్గిల్ యుద్దంలో కూడా పాల్గొన్నాడట. సైన్యం ముందుకు కదులు తుంటే, దారి ఏర్పాటు చేయడం అతను పనిచేసిన ఇంజనీర్ రెజిమెంట్ బాధ్యత. ఆర్మీ కాన్వాయ్ సాగడానికి అవసరమైన తాత్కాలిక వంతెనలు నిర్మించడం, తరువాత తీసేయడం, శత్రువు వచ్చే ప్రాంతాల్లో లాండ్ మైన్స్ పెట్టడం వారి కర్తవ్యం.

‘‘ఎంత పొడువున్నావమ్మా’’ అని అడిగారు వాకా ప్రసాద్ ఆర్మీ వ్యక్తి కూతుర్ని. ‘‘ఆరడుగులుంటావా’’ అని రెట్టించాడు. ‘‘ఆరడుగులు లేను. 5 అడుగుల 8 అంగుళాలు’’ అని చెప్పింది నవ్వుతూ. ఆడ పిల్లలు తోటకూర కాడల్లా ఇట్టే ఎదిగిపొతారు అనుకునే వాళ్ళు ఒకప్పుడు. కాస్త పొడవున్నా, చాలా పొడవుగా ఉన్నట్టు కనిపిస్తారు. తరతరాలుగా వస్తున్న మన చూపు అలా ఉంటుంది. పొడవున్న ఆడవాళ్ళ పక్కన నిలుచోడానికి వెనకాడతారు మగవాళ్ళు, తాము పొట్టిగా కనిపిస్తామని. ఆడ వాళ్ళు తమ కంటే కొంచెమైనా పొట్టిగా ఉండాలని భావిస్తారు.

భార్యా భర్తలు ఇద్దరూ ఒకే ఎత్తున్నా ‘‘మీ ఆవిడ నీకంటే పొడుగనుకుంటా !’ అంటారు ఎగతాళిగా. దాంతో ఆ మగ మహారాజు ఆత్మన్యూనతలో పడిపోతాడు. భార్య తన కన్నా పొడవున్నా మగ వాడు తట్టుకోలేడు, సమానమున్నా తట్టుకోలేడు, వయసు సమానమైనా తట్టుకోలేడు, తన కన్నా ఎక్కువ చదువుకున్నా తట్టుకోలేడు, తనకంటే ఎక్కువ సంపాదిస్తున్నా తట్టుకోలేడు. మహిళలు తమకు దరిదాపుల్లో ఉండకూడదనేది తరతరాలుగా పాతుకుపోయిన భావన. ఈ భావన మగవాళ్ళలోనే కాదు, మహిళల్లోనూ ఉంది. మనకు తెలియకుండానే పురుషాధిక్యత మన నరాల్లో జీర్ణించుకుపోయింది. అతనికున్న ఇద్దరు కూతుళ్ళలో ఈ అమ్మాయి పెద్దది. రెండవ అమ్మాయి ఇంటర్ చదువుతోంది.

‘‘ఏం చదువుతున్నావు?’’ అడిగారు వాకా. ‘‘బిటెక్ సెంకండియర్ ’’ అంది. ‘‘ ఏం చేయదలుచుకున్నావ్ ’’ అన్నాన్నేను. ‘‘ఎన్ డి.ఏ పరీక్ష రాయదలుచుకున్నా’' నంది. ‘‘ఎన్ డి.ఏ పరీక్ష పాసైతే, మీ నాన్న లాగా ఆర్మీనా, లేక నేవీనా, ఎయిర్ ఫోర్సా?’’ అడిగాను. ‘‘ఎయిర్ ఫోర్స్ లో పైలట్ కావాలనుకుంటున్నా’’ అంది. ఒక మహిళ సైన్యంలో చేరాలనుకోవడం, అందులో యుద్ధ పైలట్ కావలనుకోవడం ముందడుగే ! నిజంగా సాహసమే!

ఆర్మీ అతనికి మాకు మధ్య చర్చ కాస్త మతం వైపు మళ్ళింది. ‘‘ఆర్మీలో హిందు, ముస్లిం తేడాలేమైనా ఉన్నాయా?’’ అడిగాను. ‘‘అలాంటివేమీ అక్కడుండవు’’ అన్నాడు. ‘‘కార్గిల్ యుద్దంలో ఎంత మంది ముస్లింలు ప్రాణాలివ్వలేదు?’’ అని గుర్తు చేశాడతను. ‘‘అలాంటప్పుడు బైట హిందు, ముస్లిం తగాదాలెందుకు?’’ అన్నాను. నేను చెపుతున్న విషయాలు ఆసక్తిగా విన్నాడు.

స్నేహ పూరిత వాతావరణంలో మా సంభాషణ సాగింది. ఆ తండ్రీ కూతుళ్ళది విశాఖ పట్నం. రైలు మారడానికి విజయవాడ స్టేషన్ రాగానే దిగిపోయారు. రైలుతోపాటు మా ఆలోచనలూ సాగుతున్నాయి.

(ఇంకా ఉంది)

Tags:    

Similar News