వాకిలిని ఒంటరిని చేయకు !
ఇల్లు (సీక్వెల్ -13) ఇంటి వాకిలి వెనక ముందు దాగిఉన్న అదృశ్య ప్రపంచాన్ని పరిచయం చేసే ‘గీతాంజలి’ కవిత
By : గీతాంజలి
Update: 2024-06-09 01:00 GMT
వాకిలి చూడు ఎలా ఎదురుచూస్తుందో...
అమ్మ కోసం ఎదురు చూసే పసి పిల్లలా..
పిల్లల కోసం దారికాచే అమ్మలా..
యుగాల నుంచీ ప్రియుడి కోసం నిరీక్షించే ప్రియురాలిలా...
చూడు.. చూడు... వాకిలి దిక్కో సారి..
చివరి శ్వాస విడవబోయే ఇంటి తొలి తాతమ్మలా!
వాకిలి కళ్లెలా ఎండిపోయాయో?
***
ఎక్కడికివెళ్ళిపోయావు?
నీ కోసం ఇంటి వాకిలి దీనంగా ఎదురుచూస్తుంది !
వాకిలి అలానే ఉంది.
నువ్వు విడిచి వెళ్లిన నీ పాదముద్రలని వాకిలి ఇంకా మోస్తూనే ఉంది !
అమ్మ అలికిన పేడ.. వేసిన ముగ్గు కలిసిన దుమ్ము..
నీరెండలో మెరుస్తున్న గాలి లో వింత రంగుని నింపుతూ..
వెళ్లిపోతున్న నీవైపు చూస్తూ ఉందలా.
నువ్వు వస్తావని వాకిలి, నువ్వు కూర్చుంటావని అరుగు ఎదురు చూస్తున్నాయి.
వాకిట్లోని వందేళ్ల వేప చెట్టు నీకోసం వీధి మొగలు దిక్కు...
ఉండి... ఉండి చూస్తున్నది.
ఎండిపోయిన అమ్మ ఎదురుచూపుల కళ్లలా
వాకిలి నీకోసం బెంగటిల్లింది.
వాకిట్లోనే కాదు పెరట్లోనూ నీ కోసం వెతుక్కుంటుంది..
అమ్మ నాయన మీద అన్న దమ్ముల మీద అలిగి
ఎక్కడైనా దా క్కున్నావేమో అని
వాకిలి అమ్మలా నిన్ను వెతుక్కుంటుంది!
వాకిలిని ఎందుకురా అనాధని చేశారు
రండిరా తిరిగి అమ్మనాయనలని చేతులు పట్టుకొని...
నడవ లేకపోతే గుండెల మీద వేస్కొని!
****
పొద్దెక్కిందంటే వాకిట్లో అమ్మ నాయనలు కూర్చోన్న అరుగు..
ముచ్చట్లు లేక మూగ బోతుంది.
అమ్మ అరుపులు ముచ్చట్లు లల్లాయి పల్లె పాటలు వినని గాలి....
పాడడమే మర్చిపోయింది .
***
"తిన్నవా ఆయి.. పానం మంచిగుందా..కొడుకులు గిట్ల ఎట్లున్నరు....
దస్ర పండగకు ఈ పాలి ఊరత్తున్నర లేదా మన్మలు మన్మరాండ్లు" అని పలకరించే నర్సాయి..
గౌండ్ల ఎంకి, చాకలి మంగి...ఖాళీ అరుగు చూసి నిట్టూరుస్తూ
దబ.. దబ అడుగులేస్తూ వాకిలి దాటి వెళ్లి పోతున్నారు.
కొడుకుల నుంచి ఉత్తరమే రాని ఖాళీ సంచితో
పోస్ట్ మాన్ నిర్వేదంగా సైకిల్ ని దాటిస్తున్నాడు.
వాకిటి గూట్లో అఖండ దీపంలా వెలిగిపోయే
అమ్మ కనపడక వాకిలి కూడా చీకటై పోయింది!
అరుగు మాయం అయింది. వాకిలి మాయం అయింది.
అమ్మతో పాటు ఇల్లు మాయం అయిపోయింది .
******
అన్ని రుతువుల పూలను తెచ్చి
వాకిటి వొళ్ళో కుప్పలు పోసే పూలబ్బాయి రఫీ...
వాకిట్లో దుమ్ము రేగేలా పేపరేసే డేవిడ్..
చేపలమ్మే చంద్రి,. ఆకు కూరలమ్మే నాయక్..
నాటుకోళ్ల రజ్ఙాక్.. పి లుపులను గొంతులోనే నొక్కుకుని..
శూన్యపు వాకిలి వైపొక...
దుఃఖపు వీడ్కోలు చూపొకటి విసిరి వాకిలి దాటి వెళ్ళిపోతారు.
అమ్మేదిరా.. అయ్యేడిరా
ఏ ఎడారి మంటల్లో వదిలేశార్రా...
పిచ్చి ఎంకయ్య అరుస్తూ పరిగెడతాడు.
***
వాకిలి అంటే అమ్మే కదా...
పొద్దున్నే నిద్ర కళ్ళేసుకుని వాకిలిలో రాళ్లు రప్పలు పావురాల,
కోళ్ల ఈకలు మేకావులకుక్కల పెంటలు,
పిల్లలు ఆడి వదిలేసిన కాగితపు పడవలు..
ఎండిన పూలరెక్కలు.. గడ్డి పరకలు
ఎవరెవరో నడిచిన పాద ముద్రలతో పాటు
అమ్మ రాత్రి దెబ్బలు, నొప్పుల కన్నీళ్లు అన్నీ ఊడ్చేసుకుంటుంది !
వాకిలి కసువులో పసుపు నీళ్లతో పాటు అమ్మ కన్నీళ్లు కలవడం
వాకిలికి కాపలా కాసే పిల్లి కుక్కా కోడి కాకి పిట్టా
నందివర్ధనం, బిళ్ళగన్నేరు, గోరింట పూల సాక్షిగా ఒక్క వాకిలే చూస్తుంది!
అమ్మ కడుపులో ఏ దుఃఖం ఉందో... బియ్యం నిండుకున్నాయో...
పిల్లాడి బడి ఫీజు కట్టాలో, తిరిగొచ్చిన పెద్ద బిడ్డ కట్నపు కన్నీరో...
ఏముందో.. ఏముందో.. వంగి వాకిలూడుస్తున్న అమ్మ కడుపులో ఏముందో ..
వాకి లందుకే కన్నీళ్ళతో మరింత చెమ్మ బారుతుంది .
***
పొద్దున్నే రోడ్లు ఊడిచే మునిసిపాలిటీ యాదమ్మ..
వాకిలి ఊడిచే అమ్మ చూపులు అన్యోన్యంగా కలుసుకుంటాయి..
నువ్వూ.. నేనూ ఒకటే అన్నట్లు
ఒక మార్మిక మైన నవ్వుని తర్జుమా చేసుకుంటాయి.
యుగాలనుంచి ఒకరికొకరు గుర్తుపట్టిన పురాజ్ఞాపకాలు వాళ్లు!
***
ఈ వాకిలికెన్ని జ్ఞాపకాలనీ...
ఎంతమందిని రానిచ్చిందో ఎంతమందిని పోనిచ్చిందో...
ఎన్ని పాద ముద్రలని మోస్తూ
మనుషుల ఆనవాళ్లు పట్టి హృదయానికి ఆర్తిగా హత్తు కుందో...
ఎన్ని పాడెలను సాగనంపుతూ పొగిలి పొగిలి ఏడ్చిందో...
***
వాకిలికి ఏ పాదాలు ఎవరివో అవసరమే లేదు.
వాకిలికి కులం లేదు మతం లేదు.
రహీంను, మాదిగ ఎల్లయ్యను, హరే క్ మాల్ జేమ్స్ ను,
తండా రూడావత్ ని అందరినీ ప్రేమగా స్పర్సిస్తుంది.
ఎన్ని బతుకమ్మల్ని పేర్చిందో ఈ వాకిలి..
ఎన్ని పీర్లను దాటించిందో ఈ వాకిలి.
పుట్టింటికొచ్చిన ఆడపిల్లల కోడళ్ళ మువ్వల పాదాల నాట్యాల్ని
గుండెల్లోకి వంపు కుందో ఈ వాకిలి.
అత్తారింటికి సాగనంపే బిడ్డల అమ్మల వీడ్కోలు కన్నీళ్ళని..
తానూ కౌగిలించుకుందో.
అమ్మగా మారిన వాకిలిని ఎప్పుడైనా చూసావా ?
***
వాకిటి దీపం సరే కానీ ఇంటి చీకట్లో...
పలకరించేవాళ్ళు లేక ముడుక్కున్నదెవరో చూసావా?
ఇంట్లోపలి విషాదానికి భయపడి వాకిలి మౌనమై పోతుంది.
దిగులు మొఖమేసుకున్న రాత్రి..
కనిపించని ఆకాశపు మెట్ల మీద నుంచి
వాకిట్లోకి మబ్బు జారినట్లు ఎలా దిగుతుందో చూసావా
వాకిలి దుఃఖాన్ని మింగినట్లు చీకటిని మింగుతుంది.
***
వాకిలి శూన్యం అనుకోకు..
వాకిలి మీది ఆకాశాన్ని చూడలేదా?
సూర్యచంద్రులు, నక్షత్రాలు, మేఘాలు, పాలపుంతలు
రాత్రంతా వాకిలితో ముచ్చట్లాడుతాయ్ !
వాకిలి నుంచి..
ఇంట్లోంచి మాయమైపోయిన మనుషుల గురుంచి ఆరా తీస్తాయి.
ఇంట్లో ఎవరూ లేని వాకిలి అనాధనా ?
వాకిలిని ఎండా వానా వెన్నెలా గాలి పలకరిస్తూనే ఉంటాయి నిత్యం .
అయినా వాకిలికి మనుషులు కావాలి
ఇంట్లోంచి వెళ్లిపోయిన మనుషులు
ఇంట్లోంచి బలవంతంగా తరలించబడ్డ మనుషులు..
పల్లె వదిలి పట్టణాలకి విమానాల్లో అమెరికాలకి ..
వలసెళ్లిన కొడుకులు బిడ్డలు కావాలి.
వాకిలికి మనుషుల కళ కావాలి.
కొమ్మ మీది పక్షి,.. అటక మీది పిల్లి, బుట్టకింది కోడి..
కొట్టంలో ఆవు.. వచ్చిపోయే మేక..
వసంతంలో కోయిల ముంగిల్లోకి వచ్చి పలకరించినా....
వాకిలికి అమ్మా నాన్నల పిలుపులు కావాలి పసిపిల్లల కేరింతలు...
కొడుకు కోడళ్ల, బిడ్డ అల్లుళ్ల ముచ్చట్లు కావాలి
అరుగుల మీద అమ్మ లక్కల ముచ్చట్ల కొలుపులు కావాలి .
వాకిలికి అమ్మ ఎత్తే బోనం కావాలి వాకిలికి పండగలు కావాలి.
వాకిట్లో చందమామని చూపిస్తూ
పసి పాపలకి తల్లులు తినిపించే గోరుముద్దలు కావాలి.
వాకిలి అనాధలా.. వృధ్ధాశ్రమంలా ఉండదలుచుకోలేదు.
***
వాకిలి కిటికీని చూడండి !
ప్రియుడి కోసం ఇంట్లోంచి వాకిట్లోకి వెతికే
ప్రియురాలి చంచలమైన కళ్ళల్లా లేవూ కిటికీలు?
ఏ క్షణమో తెరుచుకోబోయే పగలూ రాత్రుళ్లలా లేవూ తలుపులు ?
***
వాకిలి ఎన్నెన్ని బహిరంగ దుఖాలని..ఓదార్పులని..
కబుర్లని రహస్యాలని మోస్తుందో..
సాయంత్రం అయిందంటే వాకిలొక రచ్చబండ అయిపోతుంది !
పంట నష్ట మై ఉరిబోసుకున్న పెనిమిటి..
కట్నంకోసం కూతురుని చంపిన అల్లుడు..
అప్పు చుక్త చేయడానికి దేశం వలసెళ్లిన భర్త జ్ఞాపకాలు..
అన్నీ వాకిలి వొళ్ళోనే
అమ్మలక్కల దుఃఖపు ముచ్చట్లను వాకిలి అమ్మై వోదారుస్తుంది.
అమ్మ కూర్చున్న అరుగు...
అమ్మ తిరుగాడే వాకిలిని మించిన సంపద ఎక్కడుంది?
వాకిలి కాదు అది అక్షరాలా అమ్మే!
ఎప్పుడూ మూసుకోని ఒక అనురాగపు ద్వారబంధం.
వాకిలి..పసుపు రాసి ఎర్ర బొట్టేసిన గడప... అమ్మ నుదురు .
అన్నం కుండ.
పారే ఊరి వాగు .. పొంగే ప్రేమ సముద్రం!
ఆరుకాలాల పంట నేరుగా వచ్చి వాకిట్లోనే కదా కొలువైయ్యేది?
వాకిలొక పంట చేను!
ఎంతమంది ఆడపిల్లలకు పురుడు పోసి నిండు వొడితో సాగ నంపిందో
ఎన్ని పెళ్లిళ్ళకి పచ్చటి పందిరి అయిందో...
అందుకే వాకిలిని జాగ్రత్తగా చూసుకో
వాకిలిని గాయపడ్డ పక్షిని చేయకు.
***
వాకిలి చలికాలం పొగలుగక్కే చాయ్ తాపుతుంది
మండే ఎండాకాలం చల్లని షర్భత్ అయిపోయి నీ గొంతు నిండు తుంది.
తెల్లవారిందంటే
నాన్న చదివే అక్బ్కార్ వార్తల కోసం
వీధంతా వాకిలి ముందు చేరుతుంది.
అప్పుడు వాకిలి రేడియోగా మారిపోతుంది.
****
వాకిలి ఎన్నటికి ఆరని దీపం.
వాకిలి ఎందరికో ఆశ్రయం ఇచ్చే ఒక ఆరుబయటి ఇల్లు !
వాకిలి నీకు చందమామని ఇచ్చే ఆకాశం!
వాకిలి నీ ఇంట్లోకి సూర్యోదయాన్ని ఒంపే ఆకాశం!
వాకిట్లో అరుగుంది చూశావూ..
అది మీ తాతని నిద్ర పుచ్చిన హంస తూలికా తల్పం!
వాకిలిని మాయం చేయకోయి..
వాకిలిని దొంగలించిండానికొచ్చిన పట్నాన్ని ఎల్లగొట్టు !
వాకిట్లోకి కొన్ని విత్తనాలు నాటు.. కొన్ని పూలని పూయించు వసంతాల్ని ఒంపు!
వాకిలిని... అమ్మని అనాథని చేయకు!
***
వాకిలి ఎంత అందమైన చిత్రపటమని??
అమ్మలు ఊరగాయలు చేయడం, పిండి పాయసపు సేవలు చేయడం,
కాళ్ళు జాపుకొని అల్లమెల్లిపాయలు వొలవడం..
లయగా ధాన్యం చెరగడం
ఆడపిల్లలకి పూలజడలు వేయడం
మల్లెవిరజాజిదవనాల మాలలు అల్లడం..
సాయంత్రాలు వాకిలి గూట్లో దీపం .. ధూపం పెట్టటం
పసిపిల్లల.. అమ్మల గోరుముద్దల పరుగు పందాల సవ్వడి తో వాకిలి సంగీతం అవ్వడం ..
.తల్లి కనపడని దుడ్డే అంబా అంటూ తల్లిని వెతుక్కోవడం..
పడుచుపిల్లలు వాకిట్లో యద్దన పూడి నవల చదువుతూ పగటి కలల్లోకి వెళ్లిపోవడం...
పూల సజ్జ తో గుడి ప్రసాదం తీసుకొచ్చిన నానమ్మను
పిల్లలంతా అరచేతులు చాస్తూ కమ్ముకోడం.....
ఎక్కడి నుంచో రేడియోలో "ఆకాశవాణి వార్తలు చదువుతున్నది" అని..
"నల్లని వాడా నే గొల్ల కన్నెనోయ్.. పిల్లన గ్రోవి ఊదుమా..
నా యుల్లము రంజిల్లగా..
పిల్లన గ్రో ఊదుమా "బాలసరస్వతి పాట గాలిలో వినిపిస్తూ....
మస్జీద్ నుంచి గాల్లో "అల్లాహు అక్బర్" మధురంగా వినిపించడం...
"రారండోయ్.. రారండోయ్.. పిల్లల్లారా రారండోయ్ " అంటూ బాలనందం పాటతో
పిల్లలు రేడియో చుట్టూ మూగడం ఓహ్హ్...
వాకిలి ఒక వడ్డాది పాపయ్య చిత్రమే కదా!
రాత్రయితే వాకిలాకాశం చీకట్లో నక్షత్రాలను వెలిగించుకుని
విన్సంట్ వాంగో పెయింటింగ్ అయిపోయేది!
***
ఊరికి వచ్చి యుగాలైందా...ఫరవాలేదు!
రా...వచ్చి నీ వాకిటి అరుగు మీద మౌనంగా కూర్చో!
నిశ్శబ్దంగా నీ జ్ఞాపకాలు నెమరేసుకో.
నీకోసం తలుపు తీయమని వాకిలి ఇంటికి ఎందుకు చెప్పదు చెప్పు?
కన్నీళ్లతో నిన్ను కౌగలించుకుని లోపలికి రమ్మనదూ ?
కళ్ళు మూసుకుని నీ బాల్య యవ్వన కాలాల్లోకి... అమ్మ వొడిలోకి వెళ్ళిపో..
వాకిలి అప్పుడు నీతో మంద్రం గా... రహస్యంగా చెప్పే జ్ఞాపకాలను విను.
ఏ వాగు లోనో ఈత కొట్టి అలిసి తడిసి పరిగెత్తు కు వచ్చి వాకిట్లో అమ్మఒళ్ళో దూరి పోవడం...
మోకాలి దెబ్బకి వాకిట్లో పడి ఏడవడం...
ఐసు ఫ్రూటు కోసం అమ్మ ఇవ్వని పదిపైసల కోసం వాకిట్లో పొర్లుకుంటూ ఏడవడం...
వాన చినుకుల కింద తడిసి ముద్దవ్వడం..
కాగితప్పడవలు వదలడం..
అన్నీ చూడు మళ్ళీ ! ఎక్కడినుంచో వినిపిస్తున్న ఒక సన్నాయి...
ముని మాపు వేళ తప్పిపోయిన గొర్రె కోసం ఒక ఎలమంద పెట్టే కేక విను !
నీ దైన చెవులతో...అమ్మమ్మ చెప్పిన వెన్నెల కథల్ని విను !
డాబా ఎక్కి ఎదురింటి అలివేణిని దొంగ చాటుగా చూడ్డం ..కనిపించిందా..
నీ పెరట్లో పూచిన తొలి గులాబీ ఆమెకే కదా నువ్విచ్చింది ?
వాకిట్లో అలా నిలబడే ఉండు. యుగాలైతేనేం...
నీ చర్మం ముసలిదైపోతేనేం...నీ కళ్ళు మసకబారితేనేం ?
వెళ్ళు మళ్ళీ నీ వాకిట్లోకి...నీ బాల్య యవ్వన కాలాల్లోకి..
నీ చిన్న పాదాలతో.. పసి కన్నులతో.. పరమాద్భుతాన్ని చూస్తున్నట్లుగా చూస్తూ వెళ్లు.
అసలు పూర్తిగా పసి వాడవై పోయి
ఇంటి వైపు అమ్మ దగ్గరకు పాల కోసం వెళుతున్నట్లు పాక్కుంటూ పో!
నీ వాకిలి వినిపించే గానం విను.
మామయ్య అత్తయ్య అమ్మ నాన్న చెల్లి అక్క తాతయ్య నాన్నమ్మ
అమ్మమ్మ పిలుపులలోకి వెళ్ళు.
మెల్లిగా ఆ పిలుపుల తీగలు పట్టుకుని వెళ్ళిపో అలా...
అనుభూతి చెందు వాకిలి నిండిన ఆ బంధాలని !
కన్నీరొస్తే రానీ.. ఏడువు.. వెక్కి వెక్కి ఏడువు..
నీ వాకిట్లో కూర్చుని భోరు..భోరున ఏడువు.
వెళ్ళు వెతుకుతూ..వెతుకుతూ.. వెక్కుతూ..
ఏడుస్తూ వెళుతూనే ఉండు. వెళ్ళు...
వాకిలిని చేర్చే ఆ అపురూపమైన వీధిని పట్టుకో... పోవోయి.
వెడుతూ.. నీతో కొన్ని పక్షుల్ని తీసుకెళ్ళు!
పాడుతున్న పక్షుల్ని వాకిట్లోకి వదులు.
ఉదయపు వెన్నెల లాంటి ఎండని తీసుకొచ్చి
వాకిట్లోకి ఒంపే పక్షులకి కాసిన్ని ధాన్యపు గింజలు వెయ్యు .
వాకిట్లో జొన్న కంకలనో..మక్ఖలనో పెంచి పక్షుల్ని..
కోతుల్ని పిలువు.
పక్షులకి నిత్యం ధాన్యం దొరికే వాకిలి తయారు చెయ్యు పో!
వేప చెట్టు కింద నులక మంచం వేసి తాతకో...
నాయనకో కమ్మటి మధ్యాహ్నపు నిద్రని కానుకగా ఇవ్వు.
వాకిలిని కోల్పోకు !
ప్రపంచాన్ని నీ వాకిలిలోకి రావడాన్ని...
నీ వాకిలిలో ప్రపంచం తయారవ్వడాన్ని ఆపకు!
ఆశతో వాకిట్లోకి వాలిన పక్షిని అస్తవ్యస్త దిక్కుల్లోకి తరమకు.
వాటికో చెట్టునివ్వు గూడు కట్టుకోనివ్వు పాడనివ్వు....
నీ వాకిట్లో అవి సంగీత కచేరి చేయనివ్వు!
మనుషుల్ని పక్షుల్ని వెళ్లగొట్టి వాకిలిని ఖాళీ చేసుకోకు.
చూడు వాకిలి మాట్లాడుతుంది ! కళ్ళు ముసుకొని ధ్యానంగా విను !
శూన్యమైన ఇంటితో.. మూసుకున్న తలుపులతో..కిటికీలతో
భోరు మంటున్న వాకిలితో
తనని విడిచి వెళ్లిపోయిన మనుషులతో ఇల్లు మాట్లాడుతుంది.
జ్ఞాపకాలై కన్నీరిస్తుంది.
అందుకే వాకిట పందిరి చంద్రుణ్ణి, నక్షత్రాల్ని ఆర్పేయకోయి.
వాకిలి దర్జా దర్పం మాయం చేయకు .
వాకిలిని ఒంటరి చేయకు.
వాకిలిని ఆడపిల్లకి ఒడి బియ్యం నింపినట్లు పక్షులతో...పసి పిల్లలతో
అక్కాచెల్లెళ్ళతో అమ్మానాన్నలతో అవ్వతాతలతో నింపు పో !
ముందు నువ్వు వెళ్లి వాకిలి జాడ కనుక్కో !
అప్పుడు కదా ఎక్కడో తప్పిపోయిన..
నువ్వు తప్పించిన అమ్మానాన్న కూడా వాకిలి లోకి వస్తారు.. పో !
వాకిలిని వెతికి పట్టుకో