ఈ సాయంత్రం ఇంటికి వెళ్లడం కష్టమే
ప్రతిపూట జీవితాన్ని వెంటాడే అనిశ్చితి మీద కాంతి నల్లూరి కవిత;
దూరాలు నడిచీ అలసీ -పగలంతా కత్తుల వంతెన పై ప్రయాణించి
బతుకులో గుచ్చుకున్న కరుకు ముళ్ళని ఏరుకుంటూ, తడుముకుంటూ
ఈ సాయంత్రానికి ఇంటికి వెళ్లడం కష్టమే!
ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం కురిసి ఇల్లు నాని పోవచ్చు
ఏనాడో ఆశలపై నిలిపిన గోడలు నిలువునా విరిగిపడిపోవచ్చు
ఇల్లుండాల్సిన చోట వట్టి మట్టి దిబ్బే మిగలొచ్చు
పొద్దుననగా వెళ్ళిన మనిషి
తిరిగి ఇక ఎప్పటికీ ఇల్లు చేరుకోకపోవచ్చు
దారిలో నాగులు కాటేయోచ్చు
అనుకోకుండా పొంగిన ఏరు మింగేయొచ్చు
దారి కాసిన శత్రువు అమాంతం మాయo చేసేయొచ్చు
అందుకేనేమో ఆ సాయంత్రం వివేక్
ఆ పసి ముఖం కుర్రోడు- ఇంటికి వెళ్లలేకపోయాడు.
పొద్దున రెండు రొట్టెలు తిని వెళ్లిన
చిట్టితల్లి ఆసీఫా ఆరోజు ఇంటికెళ్లలేకపోయింది.
బాయినెట్ చివర బిక్కుబిక్కుమంటున్న
ఇల్లేదో అక్కడ ఉంది
కానీ మనుషులే అక్కడికి వెళ్లలేకపోతున్నారు.
అందుకే అసీఫా అక్కడే ఆపేయబడింది.
అందుకే వివేక్ ఎప్పటికీ చేరలేకపోయాడు
ఎందుకంటే అక్కడ రాజ్యం మకాం వేసింది.
చూడం రాకుండానే కళ్ళు పెరికి వేయబడ్డట్టు
స్వప్నించడం తెలియకుండానే కలలు ముక్కలై పోయినట్టు
పుట్టకుండానే పదే పదే సచ్చిపోతున్నట్టు
కట్టకుండానే ఇల్లు కూలిపోవడం
పదేపదే అదే తిరిగి తిరిగి
అనుభవంలోకి రావడం- చాలా కష్టం
కాలం కాలం కదా
ఇంటికి వెళ్లడం అంత సులభం కాదు
తుప్పలు నరుక్కుంటూ దారి చేసుకుంటూ
ఒళ్లంతా చీరుకుపోతూ కళ్ళు తిరిగి పోతూ
సాయంత్రానికి ఇంటికి చేరుకోవడం చాలా కష్టమే.
ఏదో విధంగా చేరుకున్నా-
అక్కడ అసలు ఇల్లే ఉండకపోవచ్చు
పోలీస్ పోస్ట్ ఉండొచ్చు
ఇంటిముందు దీనంగా రోధిస్తూ నీ వాళ్ళుoడొచ్చు
లేదా బాంబు దాడితో ఏకంగా
అక్కడో పెద్ద గొయ్యే ఉండొచ్చు
అక్కడ యిల్లు ఉన్నప్పటికీ
నీకూ యింటికి మధ్య కొన్ని జీవితకాలాలంతా
దూరం వుండొచ్చు
ఆ సాయంత్రం బయటికి వెళ్లిన నిర్భయ
ఆ రాత్రి ఇంటికెళ్ల లేకపోయింది
ఇక ఇంటికి రాలేనంత దూరం గా శృతి నెట్టేయబడింది.