బడుగులను ఇంగ్లీషు విద్య నుండి తప్పించడానికి అగ్రకులాల కుట్ర

"తెలుగు, బిఏ, ఎంఏ, కోర్సుల మీద, తెలుగు పరిశోధన మీద గొడ్డలి వేటు వేసి తెలుగు భాషోద్ధరణ అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.";

By :  Admin
Update: 2025-01-06 11:50 GMT

-కత్తి పద్మారావు


తెలుగు నేలలో ఈ నాలుగు దశాబ్ధాల్లో అనేక, సామాజిక, సాంస్కృతిక, విద్యా, భాషా పరిణామాలు చోటు చేసుకొన్నాయి. కొన్ని సామాజిక వర్గాలు హరిత విప్లవం తరువాత సంపన్న వర్గాలుగా మారాయి. ఒకనాడు బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఈ సామాజిక వర్గాలు, ఒకనాడు జమిందారీ విధానం మీద పోరాడిన ఈ వర్గాలు ఆ తరువాత అవకాశవాదంగా బ్రాహ్మణ వాద కులాధిపత్యాన్ని స్వీకరించాయి. భూమి పంపకాన్ని నిరాకరిస్తూ భూస్వామ్య గుత్తాధిపత్యంతో వారు రాజ్యాధికారాన్ని చేపట్టగలిగారు. అంతకుముందు తెలుగు భాషకు, సంతాన ఉత్పత్తికి పట్టం గట్టిన వీరు. వెంటనే తమ సంపదతో పెట్టుబడిదారులుగా మారి సంపాదనే ధ్యేయంగా జీవితాన్ని వ్యాపారమయం చేసుకున్నారు. వెంటనే తమ పిల్లలకు తెలుగు విద్య వల్ల ఉద్యోగ వసతి రాదని, అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు సంపాదించాలంటే ఇంగ్లీషు విద్య అవసరమని ప్రయివేటు పాఠశాలలు కాలేజీలు, నిర్మించుకొని తమ పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలో చదివించుకొని ఇతర దేశాలకు విరివిగా వలస వెళ్ళి విద్యా వ్యాపారాన్ని పెంచి జ్ఞాన శూన్యులుగా తయారయ్యారు. మరొపక్క ప్రభుత్వాధికారం సాధించి ప్రభుత్వ విద్యను దెబ్బతీస్తు, డ్రాపౌట్స్‌ను పెంచుతూ దళిత, బహుజనులకు ఇంగ్లీషు విద్య రాకూడదనే పెద్ద వ్యూహాన్ని జరిపారు.


ఇకపోతే ఈ నేపథ్యంలో ప్రపంచ తెలుగు మహాసభల పేరుతో ఎవరైతే తమ పిల్లలకు, తమ మనవళ్ళకు బుద్ధిపూర్వకంగా తెలుగు రాకుండా వారి దేశీయత మీద గొడ్డలివేటు వేశారో, వారే తెలుగును అన్నిప్రాథమిక పాఠశాలలలోను ప్రధాన మాధ్యమంగా ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. ఈ మాట్లాడిన వారికి తెలుగు మీద ప్రేమ లేదు. కారణం ఆంధ్ర రాష్ట్రంలో 50% మంది ప్రజలు నిరక్షరాస్యులుగా ఉన్నారు. వారికి తెలుగు నేర్పే బృహత్తర కార్యమే వయోజన విద్యలో తెలుగు ప్రభంజనం. తెలుగు ప్రజలకు తెలుగు రాయడం రానివారి సంఖ్య 50% ఉన్నట్టే, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లో వున్న తెలుగు వారికి కూడా రాయడం చాలామందికి రాదు. ఈ పరిస్థితుల్లో వీరు మొదట వయోజనులకు తెలుగు రాయడం చదవడం నేర్పడం అనే కార్యక్రమం దీనికి నిధులు కేటాయించలేదు. నిజానికి మహాత్మాగాంధీ, జవహర్‌ లాల్‌ నెహ్రు, అంబేడ్కర్‌లు భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో ప్రధాన భూమిక వహించడానికి ఇంగ్లీషు విద్యే కారణం. అంతేకాదు డా॥బి.ఆర్‌.అంబేడ్కర్‌. భారత రాజ్యాంగాన్ని రాయడమే గాక లక్ష పేజీలు ఇంగ్లీషు భాషలోనే వివిధ అంశాలపై రాయగలగడం ఇంగ్లీషు భాషా అధ్యయనం వల్లే జరిగింది.

నిజానికి డా॥బి.ఆర్‌.అంబేడ్కర్‌ 1905 లోనే ఎలిఫినిస్టిన్‌ స్కూల్‌లో ఇంగ్లీషు మీడియంలో చదవగలిగాడు. అందువల్ల ఆయన లండన్‌ మ్యూజియం లైబ్రరీలోని జ్ఞానాన్ని ఆర్జించగలిగాడు. ఇంగ్లీషు భాషాద్యయనం వల్లే రాజరామ్‌మోహన్‌రాయ్‌లు సతీసహగమన దురాచారానికి ఎదరుదిరగ గలిగారు. రాజరామ్‌మోహన్‌ రాయ్‌ల సతీసహగమనం వ్యతిరేక ఉద్యమం వెనక ఎంతో ఇంగ్లీషు పునర్జీవన ఉద్యమ అధ్యయనం ఉంది. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ శాంతినికేతనం స్థాపించి నోబుల్‌ బహుమతి గ్రహీత కాగలిగారు. ఇంగ్లీషు విద్య వల్లనే, ఇంగ్లీషు విద్యగా చాలా గొప్పదనే విషయం తెలుసుకోగలగాలి. కాకపోతే తెలుగు భాషోద్ధరణ పేరుతో దళిత బహుజనులు విద్య నేర్చుకుంటే ‘భూస్వామ్య ఆధిపత్యానికి కూలీలు ఎవరు దొరుకుతారనే భావనతో ఇంగ్లీషు మాధ్యమం మీద ఈ రోజున తెలివిగా నిరాకరణ జరుగుతుంది.

నిజానికి పోయిన ఐదేళ్ళలో ఆంధ్రరాష్ట్రంలోని స్కూళ్ళల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టిన విధానం ఎంతోమంది దళిత బడుగువర్గాల విద్యార్థుల్లో ఎంతో విద్యాసక్తిని పెంచింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడుతుంటే, చదువుతుంటే, ఎంతో ఆనందానికి గురైయ్యారు. ఒక సబ్జెక్టుగా తెలుగు అన్ని స్కూళ్ళల్లో ఉంది. తెలుగు భాషాభివృద్ధిని ఆ సబ్జెక్టు నుండి అభివృద్ధి చేయవచ్చును. ప్రతి విద్యార్థికి 100 పద్యాలు కంఠత వస్తేనే ఆ విద్యార్థికి 10వ తరగతి సర్టిఫికెట్‌ ఇవ్వండి అని కూడా దళిత మహాసభ సలహా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు భాషోద్ధరణకు సభలు పెట్టిన వాళ్ళే ప్రవేటు స్కూళ్ళను, కార్పోరేట్‌ స్కూళ్ళను, సృష్టించి అందులో రెండవ భాషగా సంస్కృతాన్ని పెట్టి అసలు తెలుగే రాకుండా చేసి, తెలుగు, బి.ఏ, ఎం.ఏ, కోర్సుల మీద తెలుగు పరిశోధన మీద గొడ్డలి వేటు వేసిన, ఈ పాలకులే తెలుగు భాషోద్ధరణకు పూనుకుంటున్నామనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి ముఖ్యంగా వీరి ద్వేషం దళిత బహుజన వర్గాలు ఇంగ్లీషు విద్య నేర్చుకుని వారు కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళే విద్యార్హతను సంపాదిస్తారేమో? అనే భయం వీరిని వెంటాడుతుంది. అంతేకాదు వీరి ప్రభుత్వాల్లో మంత్రిత్వం చేస్తున్న నారాయణ, వీరికి ఆర్థికంగా సపోర్ట్‌ చేస్తున్న చైతన్య సంస్థలే! ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ కాలేజీల్ని దెబ్బతీసి, కృత్రిమ విద్యను ప్రవేశపెట్టి బడుగు వర్గాల విద్యాభివృద్ధి వెన్నువిరిచిందనేది చారిత్రక సత్యం. 

డాక్టర్ కత్తి పద్మారావు

ఆనాటి చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే 56 సంస్కృత కళాశాలలను రద్దుచేసి ఆ కళాశాలలోని తెలుగు పండితుల పొట్ట కొట్టాడు. తెలుగు భాషను సంస్కృత భాష పునాదితో చదువుకునే బి.ఎ, ఒ.యల్‌.ను రద్దు చేసేశారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో తెలుగు డిపార్ట్‌మెంట్‌ను నిర్వీర్యం చేసి తెలుగు భాషా సాహితీ కవితా పరిశోధనల వెన్ను విరిచారు. తమ సామాజిక వర్గాలు ఏ సబ్జెక్టును చదవడం లేదో గుర్తించి వాటన్నింటిని నిర్వీర్యం చేశారు. ఒక్క తెలుగునే కాకుండా వృక్షశాస్త్రాన్ని, జంతుశాస్త్రాన్ని, భౌగోళిక శాస్త్రాన్ని, భౌతికశాస్త్రాన్ని, రసాయన శాస్త్రాలను దెబ్బతీసి ఐ.టి.సెక్టారుకు ఉపయోగపడే బి.టెక్‌, ఎం.టెక్‌,లకే ప్రాధాన్యం ఇచ్చి మానవ వ్యక్తిత్వంలోని జీవశక్తిని దెబ్బతీశారు. ఇప్పుడేమో వ్యక్తిత్వ నిర్మాణ శూన్యులై మా పిల్లలు వాట్సప్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను కూరుకుపోయారు. కుటుంబ సంబంధాలన్ని నాశనం అయినాయి. వారి బుర్రలన్ని అభూత కల్పనలతో నిండిపోయినాయి అని, పిల్లల చేత నిరాకరించబడి వృద్ధాశ్రమాల్లో మగ్గుతూ నశించిపోయిన తమ సామాజిక వ్యవస్థలను గుర్తించకుండా దేశం అంతా నాశనం అయిపోయిందని గగ్గొలుపెడుతున్నారు.


నిజానికి ఇది స్వీయ వ్యక్తిత్వ దహనం నుండి వస్తున్న ఆక్రోశం. దళిత బహుజనుల వికాసంపైన ద్వేషానలం. ఈ హిపోక్రసిని అర్థం చేసుకోలేనంత అవిద్యలో దళిత బహుజనులు లేరు. అంబేడ్కర్‌, మహత్మఫూలే, పెరియార్‌ బాటలో వీళ్ళు అన్ని విశ్వవిద్యాలయాల్లో సామాజిక శాస్త్రాల్లో మేధావులుగా ఎదిగివున్న విషయం వీరు గుర్తించలేకపోతున్నారు. ఈనాడు తెలుగు కవులుగా, సాహితీవేత్తలుగా, కళాకారులుగా సామాజిక ఆర్థిక, అర్థశాస్త్ర చరిత్రల పరిశోధనల్లో భారతదేశ వ్యాప్తంగా దళిత బహుజనులే ఎందుకు ముందున్నారు. ఈ విషయాన్ని కూడా వీరు గుర్తించలేకపోతున్నారు. నిజానికి లైబ్రరీ వ్యవస్థ మీద కూడా వీరు పెనుదాడి చేశారు. దళిత బహుజనుల గ్రంథాలు కొనకుండా పైరవీకారుల గ్రంథాలే కొంటూ గ్రంథాలయా వ్యవస్థలో కూడా కుల వివక్షతను స్పష్టంగా చూపించిన వర్గాలివి. ఏ పోరాటానికైనా నిజాయితీ ఉండాలి. అన్నీ వర్గాల అభివృద్ధిని, సామాజిక న్యాయాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని కలిగి ఉండాలి. తమ కులాలే పైకి రావాలి అనే వారు సామాజిక సంస్కర్తలు కాలేరు. ఎంత అత్యున్నతమైన స్థాయికి వెళ్ళినా ఆలోచనల్లో విస్తృతి, విజ్ఞానం, విద్వత్తు, సామాజిక విప్లవ భావన లేకపోతే వేదికలు పెద్దవిగా ఉండి ఆలోచనలు సంకుచితంగా వుంటే తీర్మానాల్లో సామాజిక న్యాయం ఉండదు.


ఇకపోతే మన్మోహన్‌సింగ్‌ గారి మృతికి అందరు సంతాపం తెలపడమే కాక ఆయన తీసుకొచ్చిన ‘సరళీకరణ’ దేశాభివృద్ధిని పొగిడారు. ఈ సరళీకరణలో దేశ ప్రజలు భాగస్వాములు కావాలంటే ‘ఇంగ్లీషు విద్య అందరికీ రావాలి’ అనే భావన అందులో దాగివున్న విషయం మరచిపోయారా! ఈ ప్రబోధన చేస్తున్న వారిలో పెక్కురు ఎంతోకొంత ఈ ఇంగ్లీషు విద్య వల్లనే ముందుకొచ్చారు. విద్య ఒక మాధ్యమంగా రావాలంటే అన్ని సబ్జెక్టుల్లోను పదజాలం నోటికి రావాలి. కొన్ని సామాజిక వర్గాల్లో సంస్కర్తలు సామాజిక విప్లవకారులు తగ్గుతున్నారు. కారణం అట్టడుగు వర్గాల జీవన వ్యవస్థల అభివృద్ధే దేశాభివృద్ధి అని తెలుసుకోలేకపోతున్నారు. తెలుగు భాషా సంస్కృతులకు నిరంతరం కృషి చేస్తున్న వారెవరు? ఒకసారి ఆలోచించండి.

తెలుగు మన జీవితం, మన భాష, అది తల్లి నుండే మనకు వస్తుంది. ఆ తల్లినే వాళ్ళు ఇంగ్లీషులోకి ఎప్పుడో తీసుకెళ్ళారు. ఏ భాషైనా స్వీయ జీవనం నుండే వస్తుంది. తల్లిని వృద్ధాశ్రమాలకు నెట్టె సంస్కృతి ఎవరిది. ఆడపిల్ల పుడితే కట్నం ఇవ్వాల్సి వస్తుందని భ్రూణ హత్యలు ఎవరు చేశారు. ఇప్పుడు పెళ్ళికి వధువులు దొరక్క బాధపడుతున్నారు. మూడు దశాబ్ధాలు ఒకరు లేక ఇద్దరే! అని నినాదాలు ఇచ్చారు. తత్‌ఫలితంగా కొన్ని సామాజిక వర్గాలకు పిల్లలు పుట్టడం తగ్గిపోయాయి. అయితే ఆనాటి నుండి ఈనాటి వరకు దళిత బహుజన వర్గాలు పిల్లలను కని పెంచుకున్నారు. అందుకు వారు ఎన్నో కష్టాలు పడ్డారు. పిల్లలే ఒక సంపద అని బడుగు ప్రజలు గుర్తించారు. పిల్లల్ని కనడమే కాదు వారికి విద్యా బుద్ధులు చెప్పించాలని వారు గుర్తించారు. అయితే కొందరు ఒకనాడు పిల్లలు వద్దనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పిల్లల్ని కనండి అని పిలుపునిస్తున్నారు. ఈ వైరుధ్యాన్ని వాళ్ళే గుర్తించాలి.

ఇకపోతే మొత్తం మానవ పరిణామశాస్త్రం అన్ని జీవుల్లో మానవజాతే గొప్పదని నిగ్గుతేల్చింది. మౌఖిక జీవన వ్యవస్థలన్ని లిఖిత జీవన వ్యవస్థలుగా పరిణామం చెందుతున్న దశ ఇది. ప్రపంచమంతా ఒక గ్రామంగా మారిపోతుంది. విద్యా అనేది జ్ఞానము, సంస్కృతి, నాగరికత, చరిత్ర, ఉత్పత్తి, ఉత్పిత్తి పరికరాలను సృష్టించుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు వస్తువే మనకు భాష నేర్పుతుంది. ఇప్పుడు చైనా వస్తువులు మనం ఎక్కువ కొనుక్కుంటున్నాం. అమెరికా నుండి ఆయుధాలు కొనుక్కుంటున్నాం. ఇప్పుడు మనుషులు ప్రపంచమంతా తిరగాలని ఆసక్తితో వున్నారు. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లమంది తెలుగువారు విస్తరించివున్నారు. ఆయా వృత్తుల్లో ఆయా జీవన వ్యవస్థల్లో, ఆయా దేశ పాలనలో, వీరు భాగస్వాములౌతున్నారు. దానికి ఇంగ్లీషు విద్య ఎంతో తోడ్పడిరదనేది చారిత్రక సత్యం.

అయితే మన దేశం నుంచి జ్ఞానోత్పత్తి తగ్గుతుంది. లిఖిత విద్యా విస్తృతి తగ్గుతుంది. ప్రపంచ దేశాలన్ని మన దేశంలోని మానవ వనరులనే కాకుండా మానవ మేధస్సును కూడా ఆశిస్తున్నాయి. ఈ దశలో భారతదేశంలో 85% వున్నా దళిత బడుగు వర్గాలకు ఇంగ్లీషు విద్యా మాద్యమాన్ని అన్ని భాషల్లో చెప్పడం అవసరం. అది పాలక వర్గాలకే మేలు గలుగుతుంది. ఎందుకంటే దేశ రాష్ట్రాల జిడిపి పెరుగుతోంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెరుగుతాయి. వ్యక్తిత్వనిర్మాణం పెరుగుతోంది. వస్తు వినియోగంలో శిల్పం పెరుగుతంది. దేశీయ ఎగుమతులు పెరుగుతాయి. ఇప్పుడు అన్ని భాషలు మాతృభాషతో సమానమే అని తెలుసుకోగలగాలి.

ఏ ప్రభుత్వానికైనా పోయిన ప్రభుత్వాల విధానాలనన్నింటిని రద్దు చేయాలనే భావన మంచిదికాదు. ఎందుకంటే, పాలకులు మారుతూ వుంటారు. కనుక విధానాలను పూర్వపు విధానాలను కూడా మనం తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఇంగ్లీషు మాధ్యమంలోనే విద్యను వుంచి పరిపాలనా, న్యాయ విధానాల్లో తెలుగును తీసుకువచ్చే ప్రయత్నం మంచిదే. కానీ ప్రభుత్వానికి ఇంతవరకు తెలుగు అకాడమీ పటిష్టంగా లేదు. సరైన ప్రెస్‌లేదు. తెలుగు కవులకు, కళాకారులకు, రచయితలకు ప్రత్యేక పెన్షన్‌ లేదు. ఇవన్ని మన పక్కనే ఉన్న కర్ణాటక, తమిళరాష్ట్రాల్లో ఉన్నాయి. వామపక్షాలు కూడా గుడ్డిగా ప్రభుత్వ భాషా సాంస్కృతిక విధానాలను అనుసరించడం వల్ల వాళ్ళ ఆశయాలకు వాళ్ళే దెబ్బగొట్టుకుంటున్నారు. పాలకవర్గాలతో చేతులు కలిపి వుద్యమాలు నడపలేరు. ప్రజలు గుడ్డివారు కాదు. ప్రజల్లో ఎంతో చైతన్యం ఉన్న కాలం ఇది. అందుకే ఇంగ్లీషు మీడియంపై ప్రభుత్వం చర్య తీసుకొనే క్రమంలో ప్రయివేటు, కార్పోరేటు అన్ని స్కూళ్ళను ఒక విధానంలోకి తేగలరా! ఒకసారి సామాజిక న్యాయ దృష్టితో దళిత, బహుజనుల మేలును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ఆలోచించాల్సిన బాధ్యత వుంది.

తెలుగుజాతి, తెలుగు నేల సుసంపన్నం కావడానికి విద్య నిజమైన సోపానం. వారికి సరైన మధ్యాహ్న భోజనం లేదు, హాస్టల్స్‌ నరకకూపాలు. తెలుగు భాషా సంఘాలు ఎక్కడ తెలుగు విద్యార్థులను రక్షించడానికి ఒక వెయ్యి దుప్పట్లు పంచిన దాఖలలేదు. వేమన, సుమతి వంటి శతకాలు ఒక లక్ష కాపీలు పంచే కార్యక్రమం చేయలేదు. ఇంగ్లీషు భాషా మాధ్యమం ఒక ఉపాధి విప్లవం. తెలుగు భాషాభివృద్ధి ఒక జీవన సంస్కృతీ, వికాసం రెండిరటిని కలిపి తీసుకెళ్ళడమే దళిత బహుజన సామాజిక తాత్విక ఆలోచన క్రమం. ఇది ఫూలే, అంబేడ్కర్‌ బాట, ఆ బాటలో నడుద్దాం.


( డాక్టర్‌ కత్తి పద్మారావు, అంబేద్కర్‌ రీసెర్చ్‌ సెంటర్‌, సీనియర్ ఫెలో ఐసిసిఎస్ ఆర్ (న్యూఢిల్లీ), ఆంధ్రప్రదేశ్ )



Tags:    

Similar News