స్త్రీ సంతాన హక్కును తిరస్కరిస్తున్న పుత్రకామేష్టి

రామాయణంలో నిరుత్తరకాండ-11 ప్రముఖ సాహిత్య విమర్శకుడు కల్లూరి భాస్కరం చెబుతున్న రామాయణ అదృశ్య విశేషాలు

Update: 2024-07-17 04:52 GMT

Source: mymahabharatblog.wordpress.com

దశరథుని పుత్రకామేష్టిలో పాయసపాత్ర పుచ్చుకుని ఒక మహాభూతం ఫ్రత్యక్షం కావడంలో అద్భుతత్వంతో కూడిన నాటకీయతా, సినిమా తరహా దృశ్యీకరణ ఉందని అనుకున్నాం. ద్రుపదుని యాగంలో అవి మరింతగా పండడం కనిపిస్తుంది...

వచ్చి హవిస్సును స్వీకరించమని యాజుడు ద్రుపదుని భార్యతో అనడం; నేనిప్పుడు అశుచిగా ఉన్నాను, వెంటనే తీసుకోలేను, కొంతసేపు ఆగమని ఆమె సమాధానం చెప్పడం; నువ్వు వచ్చినా రాకపోయినా మా మంత్రశక్తితోనే స్త్రీ, పురుషుల జంటను సృష్టించగలమంటూ యాజుడు హవిస్సును హోమం చేయడం; ఆ వెంటనే అగ్నిగుండం నుంచి కిరీట, కవచాలతో, ఖడ్గ, ధనుర్బాణాలతో ధృష్టద్యుమ్నుడూ, యజ్ఞవేదిక వద్ద ద్రౌపదీ ప్రత్యక్షమవడం....

ఈ మొత్తం ఘటనాక్రమంలో ఒక తొందరా, ఒకవిధమైన ఉద్రిక్తతా; సంభాషణతో, అభినయంతో కూడిన ఒక నాటకీయతా; అవన్నీ కలసి ఆ యజ్ఞసన్నివేశాన్ని ఒక పతాకస్థాయికి నడిపిస్తూ ఉండడం స్పష్టంగా కనిపిస్తాయి. చివరిగా ఇరువురు స్త్రీపురుషుల అవతరణమనే ఒక అద్భుతం జరిగిపోతుంది!

మెజీషియన్, లేదా గారడీవాడు ఏదైనా అద్భుతాన్ని సృష్టించేముందు ప్రేక్షకులను ఏమార్చడానికి చేసే హడావుడితో దీనిని పోల్చి చూడండి. అతీంద్రియజ్ఞానం దాకా వెళ్లనవసరం లేకుండా, మన సాధారణ ఇంద్రియజ్ఞానంతోనే అర్థం చేసుకోగల వివరణ ఈ మొత్తం తంతు వెనుక ఉంది. క్లుప్తంగా చెప్పుకుంటే, మనమే కాకుండా ఆదిమ సమాజాలన్నీ అనుసరిస్తూవచ్చిన మాంత్రికప్రక్రియే ఇది. నృత్యం, గానం, సంభాషణ, అభినయంతో కూడిన సామూహికక్రియారూపాన్ని అది తీసుకుంటుంది. మన దగ్గర యజ్ఞంలో కూడా హెచ్చు తగ్గుల తేడాతో ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. భ్రాంతి వాస్తవికతను సృష్టించడంద్వారా భౌతికవాస్తవికతను ప్రభావితం చేసి కోరుకున్న ఫలితాలను సాధించగలమన్న ఊహే దీనికి ప్రాతిపదిక.

(ఈ వ్యాసకర్త రచించిన ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మనచరిత్రే’ అనే రచనలో దాదాపు యాభై పుటలలో దీని గురించిన వివరణ ఉంది. ఆసక్తి కలవారు దానిని పరిశీలించవచ్చు)

భ్రాంతి వాస్తవికత ద్వారా భౌతికవాస్తవికతను ప్రభావితం చేయగలమన్న విశ్వాసం క్రమంగా మతంగా ఘనీభవిస్తే; ఆ విశ్వాసం నుంచి పుట్టిన ఆదిమమాంత్రికరూపం మన దగ్గర యజ్ఞంగా వ్యవస్థీకృతమైంది. ఈ పరిణామక్రమంలో, ఇతిహాస, పురాణకథకుల దగ్గరకు వచ్చేసరికి ఆదిమమాంత్రికరూపానికీ, అది ఆశించిన పరిమిత ప్రయోజనానికీ, దాని వెనుకనున్న అమాయకపు ఊహకూ వారు దూరమయ్యారు కానీ; కనీసమైన హేతుబద్ధతకు దగ్గర కాలేకపోయారు. అందుకే యజ్ఞం గురించిన చిత్రణలు అమాయకత్వమనే భూమికీ, అసంబద్ధత అనే ఆకాశానికీ మధ్య త్రిశంకుస్థితిలో ఉండిపోయాయి. ఇంకో విధంగా చెప్పాలంటే, తగిన శిక్షణ లేనివాడు చేసే గారడీలా పరిణమించాయి.

ఉదాహరణకు, యాజునికీ, ద్రుపదుని భార్యకూ జరిగిన సంభాషణనే గమనించండి: “త్వరగా వచ్చి హవిస్సును స్వీకరించు, నీకు కొడుకూ, కూతురూ కూడా జన్మిస్తా”రని యాజుడు అంటాడు. “అశుచిగా ఉన్నాను కనుక, వెంటనే హవిస్సును తీసుకోలేను. కొంతసేపు ఆగ”మని ద్రుపదుని భార్య అంటుంది. నిజానికి ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది అవతరించిన విధానాన్ని బట్టి చూస్తే, అందులో ద్రుపదునికే కాదు సరికదా, ద్రుపదుని భార్యకు కూడా ఎలాంటి పాత్రా లేదు. ఆమె నవమాసాలు మోసి కనాల్సిన అవసరమే లేకుండా ఆ ఇద్దరూ కౌమార, లేదా యవ్వనదశలో ఉన్నట్టు వారిని వర్ణించిన తీరే చెబుతోంది. ధృష్టద్యుమ్నుడు వీరోచితవేషంతో అవతరించడమే కాకుండా, పదే పదే సింహనాదం చేస్తూ అప్పటికప్పుడే శ్రేష్ఠమైన రథమెక్కి యుద్ధయాత్రకు బయలుదేరినట్టు ఉన్నాడనీ, పంచాలదేశీయులు ఆనందంతో భళి, భళీ అంటూ నినాదాలు చేశారనీ మహాభారతం చెబుతోంది(సో zధ్యారోహత్ రథవరం తేన చ ప్రయయౌ తదా/తతః ప్రణేదుః పంచాలాః ప్రహృష్టాః సాధు సాధ్వితి -ఆదిపర్వం, 166వ అధ్యాయం, 41వ శ్లోకం).

ద్రౌపది అవతరించినప్పుడు ఎలా ఉందో మహాభారతం ఇలా చెబుతుంది: “తర్వాత ఆ యజ్ఞవేది మధ్యనుంచి ఒక కన్య పైకి వచ్చింది. ఆమె సౌందర్య, సౌభాగ్యాలతో కూడినది. ఆమె నేత్రాలు నల్లగా, విశాలంగా ఉన్నాయి(కుమారీ చాపి పాంచాలీ వేదిమధ్యాత్ సముత్థితా/సుభగా దర్శనీయాంగీ స్వసితాయుతలోచనా- శ్లో.44). ఆమె నల్లగా ఉంది. తామరరేకుల వంటి కన్నులు, ఉంగరాలు తిరిగిన నల్లని జుట్టు, ఎత్తైన ఎర్రటి గోళ్ళు, చక్కని కనుబొమలు, అందమైన ఉన్నతమైన వక్షోజాలు కలిగి ఉంది” (శ్యామా పద్మపలాశాక్షీ నీలకుంచిత మూర్ధజా/తామ్రతుంగనఖీ సుభ్రూః చారుపీనపయోధరా- శ్లో.45).

ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది అవతరించిన తీరుపై ఎన్నో ఏళ్ల క్రితమే ఇద్దరు పండితుల మధ్య జరిగిన వాదోపవాదాల గురించి ఈ సందర్భంలో తెలుసుకోవడం ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఒకరు, పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి గారు; ఇంకొకరు, ఇంతకుముందు ప్రస్తావించిన వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి గారు. మహాభారతాన్ని సాంప్రదాయికపండితదృష్టినుంచి కాకుండా, చారిత్రకదృక్కోణం నుంచి, హేతుబద్ధతనుంచి పరిశీలిస్తూ పెండ్యాలవారు రచించిన ‘మహాభారతచరిత్రము’ అనే గ్రంథం 1928లో ప్రచురితమైంది. అంతకు చాలాముందునుంచే ఆయన సాంప్రదాయిక భిన్నమైన చూపుతో మహాభారతాన్ని పరిశీలిస్తూ పత్రికలలో వ్యాసాలు రాశారు, ఉపన్యాసాలు ఇచ్చారు.

పెండ్యాలవారి గ్రంథంతోపాటు మరికొన్ని రచనలను కూడా ఖండిస్తూ, పూర్తిగా సాంప్రదాయికభాష్యానికి బద్ధులై వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు రచించిన ‘మహాభారతతత్త్వకథనము’ అనే గ్రంథం 1952లో తొలిసారి ప్రచురితమైంది. పెండ్యాలవారిని ఖండించడంలో వారణాసివారు అనుసరించిన బాణీ సాంప్రదాయిక విమర్శాపద్ధతినే కాకుండా, కొత్తచూపు పట్ల తీవ్ర అసహనాన్ని చాటుతుంది. అందులో వ్యక్తిగతనింద కూడా ఉంటుంది. చివరికాయన అనర్హులు, భక్తివిశ్వాసాలు లేని వాళ్ళు పురాణ, ఇతిహాసాలు, శాస్త్రాల జోలికి వెళ్లనే వెళ్లకూడదంటూ వాటి చుట్టూ పటిష్ఠమైన కోటగోడలు లేపుతారు. “విషసర్పము గ్రహించిన క్షీరము విషమగు విధమున అర్హతను సంపాదించుకొనక, భక్తివిశ్వాసములు లేక వర్తించువారికి సచ్ఛాస్త్రము విరుద్ధముగానే గోచరించును. అది గ్రాహకదోషము కానీ, శాస్త్రదోషము కాదు” అంటూ పెండ్యాలవారిని ఆయన విషసర్పంతో పోలుస్తారు. అర్హత, భక్తివిశ్వాసాలు ఉన్నవారు మాత్రమే పురాణ, ఇతిహాసాలను, శాస్త్రాలను చదివి అందులో ఉన్నది ఉన్నట్టు తీసుకోవాలనీ, సొంత బుద్ధితో ఆలోచించేవారు వాటికి దూరంగా ఉండాలనీ ఆయన చెప్పకనే చెబుతారు.

ఇటువంటి ఆయన గ్రంథాన్ని ప్రశంసించినవారిలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకరు. ఆయన ఇలా అంటారు: “సంప్రదాయసిద్ధమైన మహావిషయములు సప్రతిపత్తికముగ నిరూపింపబడిన యీ గ్రంథము దుర్విమర్శఖండనమే కాదు, విద్యార్థులకు కొంగుబంగరు...మీరెవరిని విమర్శించిరో వారి వ్రాతలలోని అసంగతత్వమును, స్వవచోవ్యాఘాతత్వమును నిరూపింపబడినవి. మన పూర్వగ్రంథములలో దోషము లెవ్వరికి భాసించుచున్నవో వారి బుద్ధులకు తర్కపటుత్వము, నిశ్చితత్వము లేమి మీ గ్రంథము ఋజువు చేయుచున్నది.”

ఇంతకీ పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ఏమంటారంటే, ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది యజ్ఞగుండంనుంచి ఉద్భవించినవారు కారనీ, ద్రుపదుడు దత్తు తీసుకున్నవాళ్లు కావచ్చనీ! ద్రోణుని చంపగల కొడుకుకోసమే ద్రుపదుడు యజ్ఞం చేసి ధృష్టద్యుమ్నుని పుట్టించినప్పుడు, అతడు ద్రోణుని వీరోచితంగా చంపి ఉండాలి కదా అన్నది ఆయన ప్రశ్న. కొడుకు అశ్వత్థామ మరణించాడన్న అబద్ధపు వార్త విని అస్త్రసన్యాసం చేసిన ద్రోణుని శిరసును ధృష్టద్యుమ్నుడు ఖండించాడు తప్ప ముఖాముఖీ యుద్ధం చేసి ఓడించి చంపలేదు. “ఇంతమాత్రమున అతడు అగ్నియందయోనిజుడై యేల జన్మించెనో తెలియకున్నది” అని పెండ్యాలవారు అంటూ, ధృష్టద్యుమ్నుడు ద్రుపదుని దత్తపుత్రుడు కావచ్చునని ఊహిస్తారు. అలాగే, ద్రౌపది గతజన్మకు సంబంధించిన ఉపాఖ్యానాలను బట్టి ఆమె ఒక ఋషికన్య అనీ; యాజ, ఉపయాజులతో ఆమెకు ముందే పరిచయముందనీ ఆయన ససాక్ష్యంగా చెబుతూ, ఆమెను కూడా ద్రుపదుడు దత్తు తీసుకుని ఉండచ్చని అంటారు.

ఇక్కడ ఇంకొక విశేషాన్ని కూడా చెప్పుకోవాలి. పెండ్యాలవారు అనుసరించిన సంస్కృతమూలం ప్రకారం(గోరఖ్ పూర్ వారు, కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు అనుసరించిన మూలం ప్రకారం కూడా), ద్రుపదుడు మొదటినుంచీ కోరుకున్నది ద్రోణుని చంపగల కొడుకును మాత్రమే, కూతురిని కోరుకోలేదు. నన్నయ అనువదించిన భాగంలో మాత్రం, అర్జునుని వరించగల కూతురిని కూడా కోరుకున్నట్టు ఉంది. ద్రుపద, ద్రోణుల పరస్పరశత్రుత్వాన్ని, ద్రోణుడిపై ద్రుపదుడు పగబట్టడానికి గల తక్షణ కారణాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రతీకారం తీర్చగల కొడుకునే ద్రుపదుడు కోరుకోవడం ఎంతైనా అర్థవంతంగా ఉంటుంది.

అయితే, గమ్మత్తు ఏమిటంటే, అతను కోరుకుని యజ్ఞం చేసి పుట్టించిన కొడుకు మహాభారతంలో ప్రముఖపాత్ర కాలేదు; తను కోరుకున్నది కాకపోయినా చివరి నిమిషంలో యజ్ఞవేదిక వద్ద ప్రత్యక్షమైన కూతురు కీలకపాత్ర అయింది!

దాదాపు వందేళ్ల క్రితమే పెండ్యాలవారు ఇతిహాస, పురాణాల రూపా(form)న్ని సరికొత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. “ఇతని(ధృష్టద్యుమ్నుని)యుత్పత్తికి సంబంధించిన దివ్యగాథ యాధిదైవికతత్వానుకూలంగా వ్రాయబడు గ్రంథస్వభావమనియు తలంచుచున్నాను” అని ఆయన అంటారు. ఇక్కడ గ్రంథస్వభావం అనడంలో ఆయన ఉద్దేశించినది రూపాన్నే. ఈవిధంగా రూపపరమైన ఆలోచన చేయడంలో ఆయన తన కాలపు పండితులకంటె చాలా ముందున్నారని చెప్పవచ్చు. సంప్రదాయవాఙ్మయంలో దివ్యత్వం, లేదా అద్భుతత్వ ఆరోపాల వెనుక; లేదా మాంత్రికత వెనుక దృశ్యాదృశ్యంగా ఉన్న వాస్తవికతను గుర్తించడానికి ఈ రూపసంబంధమైన అవగాహన కీలకమైన తాళంచెవి.

వారణాసివారు పెండ్యాలవారి వాదాన్ని ఖండిస్తూ, “ఈ ద్రౌపదీ, ధృష్టద్యుమ్నాద్యుత్పత్తులు దివ్యకృత్యములు. ఆ దివ్యకృత్యములను బోధించు భాష, దివ్యభాష. అట్టి మహాభారతమును తలకిందులు చేసినవారు ఈ విమర్శకులు” అంటారు. ఈ ఖండన ఎంత పేలవంగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతిహాస, పురాణాల్లో ఏది చెప్పినా, ఏది జరిగినట్టు చూపినా, అవి మన అవగాహనకు అతీతమైన దివ్యత్వానికి చెందినవి కనుక, వాటిని ప్రశ్నించడానికి వీలులేదని చెప్పి నోరుమూసే చండశాసనం తప్ప, ఇది మన ఆలోచనకు అందిస్తున్న కొత్త వెలుగు ఏదీ లేదు.

శుక్ర(శుక్ల), శోణితాలపై ఈ ఇద్దరు పండితుల మధ్య జరిగిన వాదోపవాదాలు కూడా వారి దృష్టిభేదాన్ని తెలుపుతూ మరింత ఆసక్తికరంగా ఉంటాయి. “స్త్రీపురుషుల శుక్రశోణితసమ్మేళనము లేకుండగా జన్మమొక్క శుక్లము చేతనే కలుగునని పూర్వపాశ్చాత్యశాస్త్రము లేవియు నంగీకరింపవు” అని పెండ్యాలవారు అంటారు. శుక్ర, శోణిత సంబంధం లేకుండానే మనుషులతో సహా ప్రాణులనేకం పుట్టడం సాధ్యమేనని వారణాసివారు అంటూ వైశేషిక, వేదాంతదర్శనాలను, ఛాందోగ్యోపనిషత్తును ఉదహరిస్తారు. వాటి ప్రకారం, ఈ లోకంలో జన్మించడానికి అయిదు మార్గాలున్నాయి. 1. ద్యులోకం, అంటే ఆకాశం 2. పర్జన్యం, అంటే మేఘం 3. భూమి 4. పురుషుడు 5. స్త్రీ. వారి వారి అర్హతలను బట్టి అవరోహణక్రమంలో ఈ మార్గాలలో జన్మిస్తారు. స్త్రీ, పురుషుల కలయిక వల్ల సంతానం కలుగుతుందని చెప్పారే కానీ, మిగిలిన స్థానాలలో కలగదని చెప్పలేదన్నది వారణాసి వారి తర్కం. కనుక ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది స్త్రీ, పురుష సంబంధం లేకుండానే జన్మించారని ఆయన తీర్మానం.

అంతిమంగా పై అయిదు మార్గాల లెక్క ఏం చెబుతోందో చూశారా! సంతానోత్పత్తిలో స్త్రీ స్థానం అట్టడుగుకు జారిపోయింది. పురుషుడు ఆమెకు పై మెట్టు మీద ఉన్నాడు. ఈవిధంగా పురుషుడు సృష్టినే తలకిందులు చేస్తున్నాడన్నమాట. దీనికీ దాని లెక్క దానికుంది. ఈ వ్యాసపరంపర కొనసాగే క్రమంలో అది మరింతగా చర్చకు వస్తుంది. కాకపోతే సృష్టిని తలకిందులు చేసే ఈ ప్రయత్నం మన ఒక్కళ్ళ దగ్గరే జరిగింది కాదు, అది సర్వవ్యాప్తం. యొహోవా మొదట మట్టినుంచి పురుషుణ్ణి సృష్టించాడనీ, ఆ తర్వాత ఆ పురుషుడి పక్కటెముక నుంచి స్త్రీని సృష్టించాడనీ బైబిల్ కథ. స్త్రీ సంబంధం లేకుండా పురుషుడే సంతానోత్పత్తి చేయగలడని చెప్పడమే ఇది!

***

రామాయణంలోని దశరథుడి పుత్రకామేష్టి గురించి మాట్లాడుకుంటూ, మహాభారతంలోని ధృష్టద్యుమ్న, ద్రౌపదుల జన్మవృత్తాంతాన్ని, అందుకు సంబంధించిన ఇద్దరు పండితుల వాదోపవాదాలను ఇంత సుదీర్ఘంగా ఎందుకు ప్రస్తావించవలసివచ్చిందో పాఠకులు ఈపాటికి పోల్చుకునే ఉంటారు. మహాభారతంలో ద్రుపదుని భార్యను యజ్ఞంలోకి లాగి  సంతానోత్పత్తిలో ఆమె పాత్రను చిన్నబుచ్చి మరీ తిరస్కరిస్తే; రామాయణంలో దశరథుని భార్యలను యాగానికే దూరంగా ఉంచారు. మహాభారతంలో లానే ఇందులో కూడా శుక్ల, శోణితాల కలయిక లేకుండానే, పాయసంతోనే దశరథుని భార్యలకు పుత్రులు పుట్టబోతున్నారు.

ఇంకొక ఆసక్తికరమైన పోలిక ఏమిటంటే, మహాభారతంలో అంత ప్రయత్నంతో, అంత భారీ దక్షిణతో యజ్ఞం చేసి పుట్టించిన ధృష్టద్యుమ్నుడు, ద్రుపదుడు ఆశించిన ప్రయోజనాన్ని సమర్థంగా నిర్వర్తించలేదు; మహాభారతంలో ద్రౌపదిలా ప్రముఖపాత్ర కాలేదు. రామాయణంలో విష్ణువు తనను నాలుగు భాగాలుగా విభజించుకుని రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా అవతరించినా అందులో రాముడు ఒక్కడే ప్రధానపాత్ర అయ్యాడు తప్ప మిగతా ముగ్గురూ కాలేదు; పోనీ లక్ష్మణుని మినహాయించినా, భరతశత్రుఘ్నులు విష్ణ్వాంశగా చెప్పడానికి అర్హమైన ఘనకార్యాలు ఏమీ చేయలేదు. విచిత్రమేమిటంటే, పుల్లెలవారితో సహా రామాయణ వ్యాఖ్యాతలందరూ పాయసంలో దశరథుని భార్యలలో ఎవరెవరికి ఎంత వాటా లభించిందన్న లెక్కపై దీర్ఘంగా చర్చించారు కానీ; ఈ అంశంపై దృష్టి సారించనేలేదు.

విష్ణువు దశరథుని తండ్రిగా చేసుకోవాలనుకున్నాడు కానీ, కౌసల్యను తల్లిగా చేసుకోవాలని ఎందుకు అనుకోలేదని- ఇంతకుముందు వేసుకున్న ప్రశ్నను ఒకసారి గుర్తుచేసుకోండి. సంతానోత్పత్తిలో స్త్రీపాత్రను తక్కువ చేసి, పురుషుడిని ఆమె కన్నా పై మెట్టు మీద నిలబెట్టి, సృష్టినే తలకిందులు చేసే ఈ మానవదుస్సాహసానికి సాక్షాత్తు దేవుడు కూడా తలవంచాడు; అందులో స్వయంగా భాగస్వామి అయ్యాడు!

మిగతా విశేషాలు తర్వాత...


Tags:    

Similar News