అయ్యో రామా! వాళ్లకు కప్పే శాలువలూ డూప్లికేటేనా?

ప్రోటోకాల్ పేరిట విస్తరిస్తున్న డూప్లికేట్ శాలువల సంస్కృతి;

Update: 2025-08-12 06:07 GMT
ఏఐ రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం
(దొంతి నరసింహారెడ్డి)
ప్రోటోకాల్ అంటే డిక్షనరీ నిర్వచనం ప్రకారం- అధికారిక వేడుకలు, సందర్భాలలో పాటించాల్సిన నియమాలు, ఆమోదయోగ్యమైన ప్రవర్తనా వ్యవస్థ. మొదట్లో ఇది దౌత్య లోకంలో ప్రాచుర్యం పొందింది. తరువాత దేశాధ్యక్షులు, గవర్నర్ లు నిర్వహించే కార్యక్రమాలలో కనిపించేది. ఇప్పుడది అన్ని వ్యవస్థలకు పాకింది. మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఇంకా ఇతర ప్రజా ప్రతినిధులు ప్రోటోకాల్ తమ గుర్తింపు కొరకు, తమ రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి వాడడం మొదలుపెట్టారు. ప్రోటోకాల్ ఆంగ్ల పదమే అయినా గల్లీ నుంచి డిల్లీ వరకు వ్యాపించింది. ఈ ప్రోటోకాల్- పదవులకు, హోదాలకు గౌరవం ఇవ్వడం నుంచి మొదలై వ్యక్తి వరకు దిగజారింది.

ప్రభుత్వంలో సాధారణ పరిపాలన శాఖకు అధికారిక సమావేశాలలో పాటించాల్సిన ప్రోటోకాల్ బాధ్యత ఉంటుంది. ఇంకా ఇతర శాఖలేవీ దీని మీద ఆలోచన చేసినట్లు కనపడదు. ప్రతి ప్రభుత్వ సమావేశంలో దీని గురించిన స్పృహ ఉండాల్సిన అగత్యం ఏర్పడింది. ఇది పాటించని చోట నిరసనలు, చీవాట్లు తప్పటం లేదు.
ఈ జులుం తగ్గించేది ఎలా?
నియోజకవర్గంలో ఎమ్మెల్యే ‘రాజుగా’ వ్యవహరిస్తున్న కాలంలో ప్రోటోకాల్ అస్త్రం ప్రైవేట్ కార్యక్రమాలను కూడా శాసిస్తున్నది. తమకు అలవి కాని సమావేశాలలో కూడా ప్రోటోకాల్ డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టుల అనుమతి కొరకు నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో కూడా దర్జాగా వచ్చి కూర్చుంటున్నారు. ప్రతి అధికారిక సమావేశానికి ఎజెండా, లక్ష్యం, ఒక అవసరం, పద్దతి ఉంటుంది. ఆ మేరకే వేదిక మీద కూర్చోవడానికి ఆహ్వానం ఉంటుంది. అన్నింటిలో ప్రజా ప్రతినిధులకు ‘స్థానం’ ఇవ్వాలని లేదు. అయినా ప్రోటోకాల్ పేరిట ప్రజా ప్రతినిధులు ‘జులుం’ చెలాయిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఏ సమావేశంలో ప్రోటోకాల్ ఎలా పాటించాలి అని ఎక్కడా స్పష్టత ఇవ్వడం లేదు.
ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలకు బాధ్యత ఉన్నది. వారి హక్కులు, వాటి పరిధుల మీద శాసనసభ స్పీకర్ మార్గదర్శకాలు రూపొందించి, ప్రజలందరికి తెలియజేస్తే అనవసర రాద్ధాంతం తగ్గుతుంది. పౌర సమాజానికి లోబడి రాజకీయ పార్టీలు పని జేయాల్సిన అవసరం ఈ ప్రోటోకాల్ ఉదంతాలు గుర్తు చేస్తున్నాయి.
రాజకీయ పార్టీల్లోనూ ప్రోటోకాల్!
రాజకీయ పార్టీలు కూడా తమ సమావేశాలలో ప్రోటోకాల్ పాటించే పరిస్థితి వచ్చింది. కుటుంబ పార్టీలలో పాటించాల్సిన నిబంధనలు కొంత స్పష్టంగా ఉన్నా అవి రాసుకున్నవి కావు. జాతీయ పార్టీలలో సమావేశాలలో ఎవరు వేదిక మీద ఉండాలి, ఎవరు ముందటి వరుసలో కూర్చోవాలి వగైరా అంశాల మీద కొంత గందరగోళం ఉన్నది. ముందు వచ్చినవారు ముందు వరుసలో కూర్చోవడం ఇక్కడ అలవాటు. మనసులు గాయపడిన సందర్భాలు అనేకం. స్వయం ప్రకటిత ప్రోటోకాల్ పద్దతిలో ఒక్కోసారి వేదిక మీద ఆశీనులు అయినవారి సంఖ్య వేదిక ముందున్న వారి కంటే ఎక్కువగా ఉంటున్నది.
స్వయం ప్రకటిత ప్రోటోకాల్!
క్రమంగా ప్రోటోకాల్ అనేది స్వయం ప్రకటిత పద్దతిగా మారింది. రాజకీయ పక్షులకు, అధికారులకు ప్రోటోకాల్ అంటే తమకు గౌరవం ఇవ్వడం. అంతే. బహుశా ఈ పరిమిత అర్థానికి విరుగుడిగా పుట్టిందే శాలువలు కప్పే సంస్కృతి. పుష్ప గుచ్చాలు, జ్ఞాపికలు కూడా ఇందులో ఉన్నా, శాలువలు చాలా వేగంగా విస్తరించాయి. ఇదివరకు సాహిత్య సమావేశాలలో ప్రముఖులను సన్మానించే కార్యక్రమాలలో మాత్రమే ఉపయోగించే ఈ పద్ధతి ఇప్పుడు అన్ని రకాల సమావేశాలలో శాలువలు కప్పుతున్నారు. వేదిక మీద కూర్చోబెట్టిన అందరికీ కప్పి తమకు అంతరాలు లేవు అని చాటిస్తున్నారు.
రోడ్ల మీద కూడా సన్మానాలా?
ఇది అక్కడితో ఆగలేదు. రోడ్ల మీద, కార్ల దగ్గర ఎక్కడ వడితే అక్కడ కప్పుతున్నారు. శాలువలు కప్పడం, ఫోటోలు తీసుకోవడం ఒక ఆనవాయితీగా మారింది. ఇదివరకు లాగ కండువాలు వేసినా, వేయకపోయినా శాలువలు మాత్రం కప్పుతున్నారు. కలిసిన ప్రతి సందర్భంలో శాలువలు కప్పుతున్నారు. అంతకు ముందు రోజే కలిసినా, తెలిసిన వ్యక్తి అయినా శాలువలు కప్పడం ఒక వ్యసనంగా మారింది కొందరికి. అయితే శాలువలు కప్పకుంటే బాధపడేవారు ఉన్నారు. వారిని ఎందుకు బాధపెట్టడం అని ఒక శాలువా కొనుక్కురావడం, కప్పడం, ఆనక శాలువా తెచ్చిన ప్లాస్టిక్ కవర్ అక్కడే పారవేయడం. శాలువలు కృత్రిమ నూలుతో చేసినవే కాబట్టి మొత్తంగా ప్లాస్టిక్ కవరు, ప్లాస్టిక్ శాలువా రాజకీయ, అధికార సమావేశాలలో, బయటా, లోపటా నిత్యకృత్యం అయినాయి.
శాలువాలు వ్యసనంగా మారాయా?
ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రముఖులను పోచంపల్లి శాలువలతో సత్కరిస్తున్నారు. రాష్ట్ర ప్రతినిధులు డిల్లీలో ప్రముఖులను కలిసినా కూడా శాలువలు కప్పుతున్నారు. వారు ఖరీదైన శాలువలు కప్పడం చూసి అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా వారిని అనుసరిస్తున్నారు. వ్యాపారులను, పెట్టుబడిదారులను కూడా ఈ విధంగా ‘గౌరవిస్తున్నారు’. ఇంటికి వచ్చిన వారిని, ఆఫీసుకు వచ్చిన వారిని, సమావేశానికి పిలిచిన ముఖ్య అతిధులను శాలువలతో సత్కరించడం అలవాటుగా మారింది. ఇదొక వ్యసనంగా మారింది.
నాసి రకం శాలువాలు కప్పడం ఎందుకు?
రాజకీయులు, వందిమాగధులు వాడే శాలువలు చాలా తక్కువ ఖరీదు, నాసి రకం ఫైబర్ ఉపయోగించి యంత్రాలతో నేసినవి. తెలంగాణ ప్రభుత్వానికి, శాలువలు కప్పేవారికి చిత్తశుద్ధి ఉంటే చేనేత వస్త్రాలను, శాలువలను కప్పడం అలవాటు చేసుకోవాలి. వాటిని కప్పితే ఆ వ్యక్తికి తగిన గౌరవం ఇచ్చినట్లు. ఏదో మార్కెట్లో దొరికింది కొనుక్కువచ్చి కప్పడం ఒక దురలవాటు. ఈ అలవాటును ప్రోటోకాల్ పేరిట విస్తృతం చేస్తున్నారు. ఈ అలవాటు మంచిది కాదు. అట్లా చేయడం ఆ వ్యక్తిని అగౌరవపరిచినట్లే. తెలంగాణలో శాలువల మీద పెడుతున్న కోట్ల రూపాయల ఖర్చు చేనేత రంగానికి పెట్టుబడిగా మార్చితే వచ్చే ఫలితాలు బహుళార్ధకం. ఈ దిశగా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.

గౌరవం అనేది తమ నడవడిక ద్వార, పని తీరు ద్వార వస్తుందని రాజకీయ నాయకులకు, పార్టి కార్యకర్తలకు ఆయా పార్టీలు హితబోధ చేయ్యాలి. గౌరవం డిమాండ్ చేస్తే వచ్చే వస్తువు కారాదు. నిత్య సన్మానాలకు వ్యతిరేకంగా పౌర సమాజం ప్రజలను కదిలించాల్సిన అవసరం వచ్చింది. ప్రోటోకాల్ ఒక భూతంలా తయారు అయ్యింది. ఈ భూతం రాజకీయ కారపణ్యాలకు దారి తీస్తున్నది. రాజకీయుల మీద ఆవహించిన ఈ ప్రోటోకాల్ భూతాన్ని ప్రజలు, ప్రభుత్వం వదిలించాలి.


రచయిత-ప్రముఖ సామాజిక విశ్లేషకులు, చేనేత రంగ నిపుణులు
Tags:    

Similar News