ఆయన రోడ్డు గాయాలకు చికిత్స చేసే డాక్టర్
నడిరోడ్డు మీద మృత్యువు మాటు వేసి ఉంటుందని , అది గుంటల రూపంలో ఉంటుందని ఆయన భయం. ఎవరూ రోెడ్డును చూసి భయపడకుండా ఉండాలని ఆయన సొంతడబ్బుతో ఈ చికిత్స చేస్తున్నాడు...
By : Shaik Saleem
Update: 2024-07-10 06:05 GMT
‘‘సొంత లాభం కొంత మానుకో, పొరుగు వాడికి తోడుపడవోయి.. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయి’’ అని గురజాడ అప్పారావు రాసిన కవిత కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణానికి చెందిన వడ్లూరి దుర్గయ్యకు సరిగ్గా సరిపోతుంది.
- వడ్లూరి దుర్గయ్య అతి సామాన్య ఆటో ట్రాలీ డ్రైవరు...అయినా సమాజం శ్రేయస్సే పరమావధిగా భావించి అసామాన్య సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. దుర్గయ్య సేవలు చూసిన కరీంనగర్ జిల్లా వాసులు అతనికి హ్యాట్సాప్ చెబుతున్నారు.
- తన కుటుంబ జీవనం కోసం చిన్న ఆటో ట్రాలీ నడుపుతున్న వడ్లూరి దుర్గయ్య గత 15 ఏళ్లుగా నిస్వార్థంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రోడ్లపై గుంతలు పూడ్చడం, కుక్కలు, పిల్లులు, గేదెలు ఇతర జంతు కళేబరాలను ఊరికి దూరంగా తీసుకువెళ్లి పారవేయడం, మృతదేహాలను ఖననం చేసేందుకు శ్మశానవాటికల్లో గుంతలు తవ్వడం, శవాల దహనం కోసం కావాల్సిన కట్టెలను ఆటోలో తీసుకువెళ్లి అందించడం, గుర్తుతెలియని శవాలు కనిపిస్తే పోలీసుల సమక్షంలో వాటిని అంబులెన్సులోకి ఎక్కించి పంపించడం...ఇలా ఒకటేమిటి పలు ప్రజోపయోగ సేవా కార్యక్రమాలు చేస్తూ సాక్షాత్తూ జిల్లా కలెక్టరు, చొప్పదండి ఎమ్మెల్యే, ఇతర గ్రామస్థుల అభినందనలు అందుకుంటున్నారు.
- అతి సామాన్య ఆటో ట్రాలీ డ్రైవరు అయినా సమాజమే తన కుటుంబంగా భావించి పలు సేవలు చేస్తూ నేటి సమాజానికి స్ఫూర్తినిస్తున్న వడ్లూరి దుర్గయ్యను ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి కలిసి మాట్లాడారు. సేవాభావమే పరమావధిగా సామాజిక సేవలు అందిస్తున్న వడ్లూరి దుర్గయ్య సేవా ప్రయాణం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రండి.
సేవా కార్యక్రమాలతో సంతృప్తి
‘‘నా పేరు వడ్లూరి దుర్గయ్య, నేను ఆటోట్రాలీ డ్రైవరుగా నా కుటుంబ జీవనోపాధి కోసం చిన్న ఆటోను నడుపుకుంటున్నాను. నా ఆటో ట్రాలీలో సామాన్లు చేరవేస్తూ రోజుకు 300 రూపాయలు సంపాదిస్తున్నాను. ఒక వైపు ఆటో నడుపుకుంటూనే సమయం దొరికితే చాలు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నా వంతు బాధ్యతగా సమాజానికి మేలు చేకూరే మంచి పనులు చేస్తున్నాను. నాకు సేవా కార్యక్రమాలు చేయడంలోనే సంతృప్తి ఉంటోంది.’’
కరీంనగర్- ధర్మపురి రోడ్డుపై గుంతల పూడ్చివేత
‘‘కరీంనగర్- ధర్మపురి ప్రధాన రహదారిపై ప్రతీ రోజూ వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. ధర్మపురి పుణ్యక్షేత్రంతోపాటు లక్సెట్టిపేట మీదుగా మహారాష్ట్రకు పెద్దఎత్తున ప్రయాణికులు బస్సులు, కార్లు,ఆటోలు, ద్విచక్రవాహనాలపై వెళుతుంటారు. ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల ఈ ప్రధాన రహదారిపై గుంతలు పడుతున్నాయి. రోడ్డు కుంగిపోయి గుంతలు పడి వర్షపునీళ్లు నిలుస్తున్నాయి. రోడ్డుపై గుంతల వల్ల పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే నేను ఆటోలో వెళుతుండగా రోడ్డుపై గుంత కనిపిస్తే చాలు రోడ్డు పక్కన నా ఆటోను ఆపేసి, రోడ్డు పక్కన గడ్డపలుగుతో మట్టి తవ్వి ఆ మట్టిని గుంతల్లో నింపి పూడుస్తూ ముందుకు కదలుతుంటాను.రోడ్డు పై గుంతల వల్ల ప్రమాదాలు జరిగి ఎవరూ చావకూడదనే లక్ష్యంతోనే నేను ఈ గుంతలు పూడ్చే పనిని గత 15 ఏళ్లుగా కొనసాగిస్తున్నాను. ఈ సేవా పనుల్లోనే నా జీవితానికి సంతృప్తి లభిస్తుంది. ఇదీ నా దైనందిన దినచర్య. పొట్ట కూటి కోసం ఆటో ట్రాలీని నడుపుతూనే నా వంతు కర్తవ్యంగా నా సేవలు కొనసాగిస్తున్నాను.’’
నిరుపేదల మృతదేహాలకు దహన సంస్కారాలు
‘‘నిరుపేదలు ఎవరైనా మరణిస్తే వారి దహన సంస్కారాలకు కావాల్సిన కట్టెలు, ఇతర సామాగ్రిని శ్మశాన వాటికకు ఉచితంగా నా ఆటోట్రాలీలో తరలిస్తుంటాను. శ్మశానవాటికల్లో శవాలను ఖననం చేయడానికి నేనే బొందలు తవ్వుతుంటాను. శవాల అంతిమ యాత్రలోనూ ప్రజలకు ఆటో ట్రాలీతో నా వంతు సహాయం చేస్తుంటాను’’
శవాలను తరలిస్తూ...పోలీసులకు సాయం
‘‘బావులు, కాలువల్లో పడిపోయి చనిపోయిన వారి శవాలు కుళ్లిపోయే దశకు చేరుకుని దుర్గంధాన్ని వెదజల్లుతుంటాయి.ఆ శవాలను అక్కడి నుంచి తరలించేందుకు ఎవరూ ముందుకు రారు. కానీ నేను మాత్రం శవాలను తరలించేందుకు నా వంతు సహాయం పోలీసులకు చేస్తుంటాను.తోటి వారికి సహాయం చేస్తేనే ఫుణ్యం వస్తుందని నాకు నమ్మకం. మురుగునీటి కాల్వల్లో చెత్త పేరుకుపోతే ఆటో నిలిపి దాన్ని శుభ్రం చేసి ముందుకు సాగుతుంటాను.’’
జంతువుల కళేబరాల తరలింపు
‘‘కుక్కలు,పందులు, గేదెలు ఇతరత్రా జంతువులు చనిపోయి ఆ ప్రాంతంలో దుర్గంధాన్ని వెదజల్లుతున్నా జనం ఎవరికీ పట్టనట్టుగా వ్యవహరిస్తుంటారు.మరీ ఇబ్బందిగా ఉంటే పంచాయితీ లేదా మున్సిపాలిటీకి సమాచారం ఇచ్చి కళేబరాలను తొలగించాలని కోరుతుంటారు.కానీ జంతువుల కళేబరాలను సైతం నేను నా ఆటో ట్రాలీలో వేసుకొని ఊరికి దూరంగా తరలిస్తుంటాను.మృతదేహాలు కావచ్చు, జంతువుల కళేబరాలు కావచ్చు వాటి గురించి సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకుని వాటిని నా ఆటోలో తరలిస్తుంటాను.’’
బోటాబోటి ఆదాయంతో దుర్గయ్య జీవనం
‘‘నేను ఆటో ట్రాలీ ద్వారా ఇసుక, బండలు, ఇతర సామాగ్రిని కిరాయికి తోలుతూ బోటాబోటి ఆదాయంతో జీవనాన్ని వెళ్లదీసున్నాను. నా ఆటో ట్రాలీ దెబ్బతిని తరచూ రిపేర్లు చేయించాల్సి వస్తోంది. నా ఆటో ట్రాలీ చెడిపోతే నేను చేసే సేవా కార్యక్రమాలు ఎక్కడ ఆగి పోతాయోనని ఆందోళనగా ఉంది. ప్రభుత్వం దళిత బంధు లేదా ఇతర ప్రభుత్వ పథకం కింద ఆటో ట్రాలీ అందిస్తే తాను మరిన్ని సేవలు అందిస్తాను’’
మద్యం ముట్టను...ముక్క తినను...
‘‘నేను మద్యమే కాదు కల్లు కూడా ముట్టను. నాకు చిన్నతనం నుంచి తాగుడు అలవాటు లేదు. అదే కాదు కనీసం మటన్, చికెన్, కోడిగుడ్డు కూడా తినను. నేను శాకాహారిని. నాకు సమాజ సేవల్లో సంతృప్తి లభిస్తుంది’’ అని దుర్గయ్య తన సేవా యాత్ర గురించి ముగించారు. మంచి అలవాట్లతోపాటు వినూత్న సేవలు అందిస్తున్న సేవా తరంగం వడ్లూరి దుర్గయ్యకు మనమూ హ్యాట్సాప్ చెబుదాం.
ఇదీ దుర్గయ్య కుటుంబం
చొప్పదండి పట్టణానికి చెందిన వడ్లూరి దుర్గయ్యకు భార్య లక్ష్మి, ఐదుగురు సంతానం.ఒక కుమారుడు, నలుగురు ఆడపిల్లలు. ఆడపిల్లలందరికీ పెళ్లిళ్లు చేసినా, ఒక కుమార్తె అల్లుడి వివాదంతో పుట్టింటికి వచ్చింది.దీంతో కోర్టులో కేసు వేశారు. గతంలో దుర్గయ్య లారీ నడిపినా, ఆ తర్వాత ఆటోట్రాలీతోనే జీవనం సాగిస్తున్నాడు.
సేవాతరంగం దుర్గయ్యకు ప్రశంసల వెల్లువ
పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సేవా తరంగం వడ్లూరి దుర్గయ్యకు పలువురి ప్రశంసలు లభించాయి. కరీంనగర్ జిల్లా కలెక్టరు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు పలువురు రాజకీయ నేతలు, గ్రామస్థులు అభినందించారు. దుర్గయ్య సేవల గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టరు దుర్గయ్యను కలెక్టరేటుకు పిలిపించి శాలువా కప్పి, మెమోంటోను ఇచ్చి సత్కరించారు.