టీచరే అవుతానని ఒట్టుపెట్టి చెెప్పిన అమ్మాయి...

బడి వొడిలో... ఒక టీచరమ్మ ‘యథానికలు' : 4

Update: 2024-10-01 01:08 GMT


ప్రతి పిల్లవాని సహజభివృద్ధి ధర్మానికి, చిత్రాలకి, విచిత్రాలకి, కోరికలకీ కాంక్షలకీ సంబంధించి శ్రద్ధ వహించాలి......యానుష్ కోర్ చక్  (Yanush korchak).

ఐదో తరగతి విద్యార్థులకు గాంధీ పాఠాన్ని చెబుతూ, గాంధీ గారి గురించి మంచి అభిప్రాయాల (మెరిట్స్.... డి మెరిట్స్) తో పాటు 1922 ఫిబ్రవరి 4న ఉత్తరప్రదేశ్ లోని గోరక్ పూర్ లో జరిగిన చౌరీ చౌర సంఘటన గురించి, భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవ్ లను ఉరితీసే రోజు, వారి ఉరిని వ్యతిరేకించకుండా మౌనం పాటించాడని చెప్పేను. గాంధీజీ, బ్రిటిష్ వారితో గట్టిగా మాట్లాడితే ఉరి ఆగిపోయేదని చెప్పాను. కస్తూరిబా పట్ల వ్యవహరించిన తీరు కూడా చెప్పాను.

మరుసటి రోజు స్కూల్ కి వెళ్ళగానే విద్యార్థులందరూ నా చుట్టూ మూగారు. మీరు గాంధీ గారి గురించి తప్పు చెప్పారని మస్తాన్ అంటున్నాడు అండి అన్నారు. మస్తాన్ చివరిగా ఉన్నాడు నచ్చని మొఖం పెట్టి. ఏమి చెప్పాను మస్తాన్ అన్నాను. మౌనంగా ఉన్నాడు. మిగతా పిల్లలు చెప్పేరు.

ఊడ్చటం,ప్రేయర్ కానివ్వండి. మళ్ళి చెప్పుకుందాము అన్నాను.ఏమి చేపుతానా అని పిల్లలు మరికొంత ఉత్సాహంగా నాకేసి చూస్తున్నారు. వస్తున్న నవ్వును ఆపుకుంటూ వారి వారి అభిప్రాయాలను అడిగాను. గాంధీజీ స్వతంత్రం తెచ్చాడు. మంచోడు అని వారి మాటల సారాంశం.

ప్రతి టీచర్ కి పాఠం చెప్పేటప్పుడు రెండు నాలుకలు ఉంటాయి. ఒక నాలిక మంచి అభిప్రాయాలను చెప్తుంది. వెంటనే మరో నాలిక వ్యతిరేకమైన ఇంకొక అభిప్రాయాన్ని చెబుతుంది. మెరిట్స్, డిమేరిట్స్, మంచి చెడు రెండు అబిప్రాయాలను చెప్పటం టీచర్ బాధ్యత అని, దీంట్లో నుంచి మీకు కావలసినది ఏమిటో మీరు ఎన్నుకోండి, నేను చెప్పిందే కరెక్ట్ అనడం లేదు. మీరు ఇంకా చదువుకోండి, ఇతరులను అడిగి తెలుసుకోండి అన్నాను. (డిగ్రీ లో మా హిస్టరీ సర్ రెండు నాలుకలతో అద్భుతంగా చెప్పేవాడు.) మళ్లీ విపులంగా చౌరీ చౌర గురించి, భగత్ సింగ్ ల గురించి, అల్లూరి సీతారామరాజు, మరి కొంతమంది గురించి అనేక విషయాలు చెప్పాను. వారి ప్రాణత్యాగాలు, వారి దీరోధాత్తా పోరాటాల గురించి చెప్పాను. పిల్లల మొహాల్లో ఓ తృప్తిని, ఆనందాన్ని చూసేను. పిల్లలకు రెండు నాలుకలతో పాఠం ఎలా చెప్పాలో కూడా ఆ రోజు తెలుసుకున్నాను. మస్తాన్ డిగ్రీ చదువుతున్నానని చెప్పినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు.

నాగస్వాములు డాన్స్ అంటే నాకు టెన్షన్

చదువుతోపాటు డ్రాయింగ్, ఆటలు పాటలు, డాన్సులు పెట్టేవాళ్ళం. విద్యార్థులు అడిగేవాళ్లు. నాగస్వాముల ఎడమ కాలు పోలియో వలన చాలా సన్నగా, మోకాలు నుండి మరీ సన్నగా ఉండేది. ఆ కాలుతో అద్భుతమైన డాన్స్ చేసేవాడు. నాగస్వాములు, జాగ్రత్తమ్మా అంటే ఏమీ కాదులే మేడం అనేవాడు. ఆపకుండా చేసేవాడు క్లాస్ అంతా సైలెంట్ అయిపోయేది. ఆపగానే పిల్లల చప్పట్లు మారుమోగేవి. పడిపోతే ఆ కాలు ఎక్కడ ఫ్యాక్చర్ అవుతుందోనని, ఆపేదాక నాకు టెన్షన్.

నాగస్వాములు ఓసారి రైల్వే స్టేషన్ లో కనపడి నప్పుడు చాలా సంతోషం వేసింది. క్షేమ సమాచారాలు అయిన తర్వాత ఏమి చేస్తున్నావమ్మా అంటే స్వంతగా బ్రాందీ షాపు పెట్టుకున్నాను అండి అన్నాడు. నాకు టెన్షన్ పుట్టించిన డాన్సర్, బ్రాందీ షాపు అనగానే చాలా బాధపడ్డాను. బ్రాందీ షాపు వద్దమ్మా ఏదన్నా పెట్టుకో అని బాధగా చెప్పాను.

పల్లెపాలెం నుండి మొదటి ఆడపిల్లగా (పిల్లలకు చదువు చెప్పుటoలో మాకు బాగా సహకరించిన) వాణి ఒంగోలు పక్కనున్న మైనంపాడు డైట్ కాలేజీలో టీచర్ ట్రైనింగ్ చేస్తున్నానండి అన్నప్పుడు చెప్పలేనంత ఆనందం వేసింది. మీరు చదువు చెప్పడం వల్లనే నేను ట్రైనింగ్ చేస్తున్నాను అన్నప్పుడు గర్వంగా కూడా అనిపించింది. మా ఊరి నుండి మొదట ఉద్యోగస్తురాలని నేనేనని, నీవు కూడా మీ ఊరు నుండి చదువే కాదు,మొదటి ఉద్యోగస్తురాలివి కూడా కావాలి అన్నాను. మేడం, టీచర్ ని అవుతాను. గురుదక్షిణగా మీకు మాట ఇస్తున్నాను అని ప్రామిస్ చేసింది. ఇంతకన్నా గొప్ప ఆనందం సంతోషం ఇంకే వృత్తిలో దొరుకుతుంది? వాణి కచ్చితంగా టీచరు అయ్యే ఉంటుంది.

తికమక జనాభా లెక్కలు:

 మా బ్యాచ్ తోనే జనాభా లెక్కలని, బిపిఎల్ (బిలో పావర్టి లైన్) సర్వేలని, కుటుంబ లెక్కలని తెగ మొదలయ్యాయి. మా సీనియర్లు ఐరన్ లెగ్గలు వేసుకొచ్చారు అని వెక్కిరించే వాళ్ళు. ఒక ఇంట్లో 8 మంది అని చెప్పేది. పేర్లు రాస్తుంటే ఏడుగురే వచ్చేవాళ్ళు. ఇంకోళ్ళు ఉండాలమ్మా అంటే వాళ్ళ ఆయనకి ఆమె కాకుండా ఇంకొక ఆమె తో కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారట.ఆమె పేరు చెప్పేది కాదు. పిల్లలు మాత్రం అక్కడ ఇక్కడ తిరిగే వాళ్ళు. ఆ పిల్లల పేర్లు కనుక్కొని ఆమె పేరు రాసుకున్నాం. ఇంకో ఇంట్లో మనవడి కన్నా కొడుకు వయసు తక్కువగా ఉండేది. మరో ఇంట్లో మా క్లాసులోనే సుజాత అదే క్లాసులో ఉన్న ఓ అబ్బాయిని బాబాయి అని పిలిచేది. ఒకే ఇంటి పేరు వాళ్లు కనుక అలా పిలుస్తున్నారు అనుకునేవాళ్ళం. జనాభా లెక్కలు రాసేటప్పుడు ఆ అబ్బాయి సొంత బాబాయేనని అర్థమైంది. ఒక్కొక్క ఇంట్లో 9 ,10 మంది పిల్లలు కూడా ఉండేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలు. ఎవరి పిల్లలు ఏంటి అని రాసుకునేసరికి మొదట్లో గంటల గంటలు పట్టేది.తరువాత సులభమైనది.

మరో స్కూల్ మాస్టర్ తండ్రి పేరు రాసుకోకుండా, అరేయ్ తండ్రి పేరు రాయలేదే అంటే, శ్రీను మాస్టర్ పేరు రాసేయండి అని ఇంకో మాస్టర్ జోక్ చేసేవాడు. మరో ఊరిలో ఒక కుటుంబంలో పెద్దోడుకో ఇంటి పేరు, చిన్న పిల్లలిద్దరికీ ఇంకొక ఇంటి పేరు ఉండేది. మొదటి పిల్లోడు మొదటి సంబంధం కొడుకున్న మాట. రైల్వే స్టేషన్ లో స్కూల్ కాంప్లెక్స్ లో అబ్ స్ట్రాక్ట్ వేయటానికి కూర్చుని ఇవన్నీ చెప్పుకుని గలగల కరువుతీరా నవ్వు కొనేవాళ్ళం.ఈ నవ్వులు ఎ ఉద్యోగం లో దొరుకుతాయి. ఓ రోజు నల్లబల్ల పై ద్విత్వక్షారాలు రాసి విద్యార్థులను అడుగుతున్నాను. "క్ట" కాకు ట వత్తు అని విద్యార్థి కరెక్ట్ గానే చెప్పాడు. అది ట వత్తు కాదు ల కు కొమ్ము ఇస్తే "లు" అన్నాను తమాషాగా. కాదు ట వత్తే అన్నారు. లు నే అన్నాను. అడిగిన పిల్లోడికి ఉక్రోషం వచ్చింది. నీకు వత్తులు తెలియదు పో! అన్నాడు గట్టిగా. ఇదంతా మా మండల రెవెన్యూ అధికారి గారు అలికిడి లేకుండా గుమ్మంలో ఉండి వింటున్నారు. వచ్చింది మేము ఎవరo గమనించలేదు. ఆ విద్యార్థి అన్నదానికి గట్టిగా చప్పట్లు కొట్టి నవ్వాడు. ట వత్తు ఎట్లా అయింది చెప్పమన్నాడు. క కింద ఉన్నది. ట కి తలకట్టు లేదు అన్నారు. మేడo లు అంటున్నారుగా అన్నాడు. మౌనంగా ఉండిపోయారు. అలాంటి ఒత్తులు చూపించడి అనటంతో ఉత్సాహంగా,గ ,జ,డ మొదలైనవి చూపించారు. పిల్లలను,నన్ను బాగా మెచ్చుకున్నారు. అతను ఎప్పుడొచ్చినా పిల్లల తో పాటు కింద కూర్చొని ఉండేదాన్ని. టేబుల్ కుర్చీ వేసుకునే స్టలం చాలక. ఆఫీస్ కి వెళ్ళిన ఎక్కడన్నా కనిపించినా గొప్పగా గౌరవించేవారు.

ఊర్లో వాళ్లు చాలా గౌరవంగా మాట్లాడేవాళ్లు. చూసేవాళ్ళు. వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు కొంచెం ఎండగా ఉంటే బాగ అగ్గి అయిందమ్మ అనేవాళ్ళు. సముద్రం దగ్గరగా ఉండటంతో తుఫాను హొరు వినిపించేది. సముద్రo "కసర" మీద ఉందమ్మా ఎందుకు వచ్చారు అనేవాళ్లు.

ఇలాంటి అనుభవాలను అందించిన స్కూల్ని,మహిళాప్రధానోపాధ్యాయురాలి (ప్రధానోపాధ్యాయురాలుగా రాకముందు నుంచే ఈమెను ఆంటీ అని పిలిచేదాన్ని ఉద్యమ పరిచయంతో) హింసను భరించలేక, గొడవ పడటం ఇష్టం లేక కౌన్సిలింగ్ లో పక్క ఊరు మారాను.



Tags:    

Similar News