ఏడు కొండలు.. చుట్టూర ఏడు దారులు..
తిరుమల మెట్లోత్సవం సందర్భంగా తిరుమల మెట్ల దారుల మీద ‘రాఘవ’ కథనం
వేల సంవత్సరాల మానవ పదఘట్టనలో ఏర్పడిన గాయాల గుర్తుల్లాగా, శేషాచలం కొండలకు నలుదిక్కులా కాలిబాటలు. ఇవి శతాబ్దాల మానవ ఆవాసాలకు చెరగని చిహ్నాలు. తిరుపతికి పశ్చిమోత్తరాన తలకోన నుంచి, తూర్పున ఏర్పేడు వరకు, దక్షిణాన తిరుపతి నుంచి, ఉత్తరాన కోడూరు వరకు శేషాచలం కొండలు విస్తరిం చాయి. తూర్పుకనుమల్లో భాగమైన ఈ కొండలు దాదాపు 800 చదరపు కిలోమీటర్ల పరిధిలో పరుచుకుని ఉన్నాయి.
తిరుమల ఆలయం నెలకొన్న కొండ ప్రాంతాన్ని ఏడుకొండలుగా వ్యవహరించడం పరిపాటి. నిజానికి ఇవి ఏడు కొండలు కావు, అనేక కొండల సమాహారం. తిరుమల కొండను వేంకటేశ్వరస్వామికున్న ఏడు పేర్లతో పిలవడం వల్ల దీనికి ఏడుకొండలని పేరు వచ్చింది.
సముద్ర మట్టానికి నాలుగు వేల అడుగుల ఎత్తులో తలెత్తి ఏమీ ఎరగనట్టు, ఆకాశం కేసి చూస్తున్న ఈ కొండల్లో ప్రాచీన మానవ నాగరికత అవశేషాలు దాగున్నాయి. క్రీస్తుశకం ఒకటవ శతాబ్దం నుంచి వేంకటేశ్వరుడి విగ్రహం ఉనికిలోకి వచ్చింది. చరిత్రకారులు ఎంత తవ్వితీసినా ఆలయ చరిత్ర రెండు వేల సంవత్సరాలను దాటడం లేదు. తిరుమల ఆలయం కంటే శతాబ్దాల ముందు సంచార జీవనం సాగించే మానవుడు నివసించిన ఆనవాళ్ళు ఈ కొండల్లో బైటపడ్డాయి.
యుద్ధ గళ లో తొలి చరిత్ర యుగ పు మానవులు చెక్కిన చిత్తరువు లో వేటాడే దృశ్యం.
శేషాచలం కొండల్లోని యుద్ధగళలో, పితృగళ తీర్థంలో తొలి చరిత్ర యుగపు మానవుడు నివసించిన ఆనవాళ్ళున్నాయి. యుద్ధగళలో నేలంతా పరుచుకున్న బండ రాయిపైన ఆనాటి మానవుడు చెక్కిన చిత్తరువుల్లో జంతువుల బొమ్మలు, స్త్రీపురుష జననాంగాలు, వేటాడే దృశ్యాలు, ఏదారెంటుపోతుందో తెలిపే చిత్తరువులు ఉన్నాయి. తిరుమల కొండకు నలుదిక్కులా ఉన్న అనేక కాలిబాటలు శతాబ్దాల నాటి ఇక్కడ మానవ సంచారానికి గుర్తులుగా మిగిలాయి.
తిరుమలకు ఉన్న అనేక కాలిబాటల్లో అందరికీ తెలిసిన అలిపిరి దారి, శ్రీవారి మెట్టు దారి ప్రసిద్ధమైనవి. మామండూరు/ కుక్కల దొడ్డి వైపు నుంచి సాగే అన్నమయ్య మార్గం కూడా ప్రసిద్ధి చెందినప్పటికీ, ఆ దారి ఇప్పుడు పెద్దగా వాడుకలో లేదు. ఇవే కాక ఏనుగుల దారి, అనుంకోన దారి, తుంబురు తీర్థం దారి, తలకోన దారి కూడా ప్రస్తుతం వాడుకలో లేవు. తొలి చరిత్ర యుగపు మానవుడు బైటి ప్రపంచంతో సంబంధాల కోసం ఈ దారులన్నిటినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తరువాత ఈ దారులన్నీ తిరుమల ఆలయానికి చేరుకోవడానికి ఉపయోగపడ్డాయి.
అలిపిరి మెట్ల మార్గం
అలిపిరి దారి
నిద్రిస్తున్న అతి పెద్ద సరీ సృపంలా కనిపించే తిరుమల కొండకు చిహ్నంగా ఎత్తైన గాలిగోపురం నిలిచింది. ఆ గాలిగోపురం కనిపించే దిశగా తిరుమల చేరుకోవడానికి వెళ్ళే ప్రధానమైన దారి అలిపిరి మెట్ల మార్గం. దీని అసలు పేరు ‘ఆదిపడి’. అంటే మొదటి మెట్టు అని అర్థం. ఈ దారి వెంట తిరుమల వెళ్ళాలంటే పన్నెండు కిలోమీటర్లు నడవాలి. ఈ ప్రాంతాన్ని పాలించిన మట్ల అనంతరాయలు అలిపిరి వరకు మెట్లను నిర్మింప చేశాడు. అంతకు ముందు కపిల తీర్థం నుంచి గాలిగోపురం వరకు నడకదారి ఉండేది. ఈ మెట్లు నిర్మించాక కూడా కపిల తీర్థం వైపు నుంచి కొంత కాలం వరకు తిరుమలకు వెళ్ళే వారు.
అలిపిరి దారిలో గాలిగోపురం వరకు నడక మెట్లు కాస్త నిటారుగా ఉంటాయి. గాలిగోపురం చేరేసరికి ప్రయాస పడతాం. ఇక్కడి నుంచి చూస్తే తిరుపతి నగరమంతా కనిపిస్తుంది. అక్కడక్కడా నీటి తటాకాలు, గోవిందరాజస్వామి ఆలయ గోపురం, దూరంగా తిరుచానూరు ఆలయ గోపురం కూడా కనిపిస్తాయి. ఈ దారిలో అనేక మండపాలున్నాయి.
గాలిగోపురం దాటి మరికాస్త దూరం నడిచాక ఏడవ మైలుగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం వస్తుంది. ఇక్కడ నుంచి మరికాస్త ముందుకు సాగితే కుడివైపున అవ్వాచారి కోన, ఎడమ వైపున తిరుమలకు వెళ్ళే పాత దారి వస్తాయి. తిరుమలకు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు రోడ్డుకోసం ఇక్కడ ఉండే లోయలో ఒక మేరకు పూడ్చేశారు. అప్పటి నుంచి పాత నడకదారి మూతపడి, ఈ రోడ్డు మార్గాన్నే మోకాళ్ళ మిట్ట వైపు నుంచి తిరుమలకు వెళ్ళడం మొదలైంది. ఈ పాత నడక మార్గానికి అన్నమయ్య మార్గం అని పేరు పెట్టి, మెట్లు కట్టినప్పటికీ, ఈ దారిలో ఎవరూ వెళ్ళడం లేదు. కుడివైపున ఉన్న అవ్వాచారి కోన లోయలోకి దిగి కొందరు ప్రాణాలను పోగొట్టుకోవడం వల్ల ఇనుప చువ్వలతో ఎత్తైన ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
గాలిగోపురం నుంచి నడక పెద్ద కష్టంగా ఉండదు. ఇక్కడి నుంచి మోకాళ్ళ మిట్ట వద్ద రామానుజాచార్యుల గుడి ఉంది. దీన్ని భాష్యకారుల సన్నిధి అని కూడా అంటారు.
ఇక్కడ నుంచి ఎక్కడం కాస్త కష్టం. మోకాళ్ళు పట్టేస్తాయి. కనుక దీనికి మోకాళ్ళ పర్వతం అని, మోకాళ్ళ మిట్ట అని పేరొచ్చింది. ఈ అలిపిరి మెట్ల మార్గంలోనే వేలాదిమంది భక్తులు ప్రతిరోజూ తిరుమలకు చేరుకుంటుంటారు.
శ్రీవారి మెట్టు మార్గం
శ్రీవారి మెట్టు దారి
కాలినడకన తిరుమల చేరుకోవాలంటే అతి దగ్గర దారి శ్రీవారి మెట్టు దారి. ఇది కూడా చాలా పురాతనమైనది. విజయనగర చక్రవర్తుల కాలంలో శ్రీవారి మెట్ల దారిలో మెట్లు కట్టి, మండపాలను కట్టి పునరుద్ధరించారు. శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు వరకు అయిదున్నర కిలోమీర్ల వరకు రోడ్డు ఉంది. ఇక్కడ నుంచి కేవలం రెండున్నర కిలోమీటర్లు మెట్ల ద్వారా నడిస్తే తిరుమల చేరుకోవచ్చు.
వెయ్యేళ్ళకు పూర్వం ఇమ్మడి నరసింహరాయలు చంద్రగిరి దుర్గాన్ని నిర్మించినప్పటి నుంచి ఈ దారి బాగా వాడుకలోకి వచ్చింది. దీని అసలు పేరు శ్రీపతి మెట్టుదారి. అది కాస్తా శ్రీవారి మెట్టుదారి అయ్యింది. శ్రీకృష్ణ దేవరాయలు ఏడు సార్లు తిరుమల వెళ్ళింది ఈ దారినే. తిరుమలకు రెండవ ఘాట్ రోడ్డు వేయకముందు ఈ దారి నుంచి తిరుమలకు కూరగాయలు, పాలు, పెరుగు వంటి వన్నీ ఎక్కువగా చేరవేసేవారు.
ఎంతో సహజ సిద్ధంగా ఉన్న ఒక నాటి శ్రీ వారి మెట్టు మార్గం
శ్రీవారి మెట్టుదారిలో ఒకప్పుడు నడక చాలా ఆహ్లాదంగా ఉండేది. చుట్టూ ఎత్తైన వృక్షాలతో, పక్షుల పలకరింపులతో, సెలఏటి శబ్దాలతో ఎంతో మనోల్లాసంగా సాగేది. పాత మెట్ల స్థానంలో కొత్తగా మెట్లు కట్టి, ఆధునీకరించడంతో ప్రకృతి అందాలు కాస్తా కనుమరుగయ్యాయి.
తిరుపతికి పడమటి వైపు నుంచి తిరుమలకు వెళ్ళే వారికి ఈ దారి చాలా అనుకూలంగా ఉంది. తిరుపతి నుంచి శ్రీవారి మెట్టువరకు టీటీడీ ఉచితంగా బస్సు నడపడంతో ఇప్పుడు ఈ మార్గం కూడా రద్దీగా తయారైంది.
అన్నమయ్య మార్గంలో నడుస్తూ..
అన్నమయ్య మార్గం
ఉమ్మడి కడప జిల్లా/ ప్రస్తుత అన్నమయ్య జిల్లా వైపునుంచి తిరుమల వెళ్ళడానికి చాలా పురాతన నడక దారి అన్నమయ్య మార్గం. తిరుపతి నుంచి కోడూరు వెళ్ళే దారిలో మామండూరు దాటాక ఎడమ వైపున అన్నమయ్య మార్గం వస్తుంది. ఇది మొత్తం అడవి బాట. అలాగే మామండూరు దాటాక వచ్చే కుక్కల దొడ్డి నుంచి కూడా అన్నమయ్య మార్గంలో కలవ వచ్చు. ఈరెండు దారులూ అన్నమయ్య పాదాల వద్ద కలుస్తాయి.
అన్నమయ్య మార్గంలో నిర్మించిన పురాతన (ఈతకాయల) మండపం
అన్నమయ్య మార్గంలో నడిచి వెళ్ళే యాత్రికుల కోసం అనేక మండపాలను నిర్మించారు. మధ్య లో విజయనగర చక్రవర్తుల కాలంలో నిర్మించిన సత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడా మండపాలు శిథిలమై మొండిగోడలకు పరిమితమయ్యాయి. అక్కడే పాడుపడిన పురాతన కోనేరు కూడా ఉంది. ఇక్కడ నుంచి తిరుమల వెళుతుంటే ఈతకాయల మండపం వస్తుంది. ఇప్పటికీ ఈ దారి వెంట తిరుమలకు కొందరు నడిచి వెళుతుంటారు.
ఈతకాయల మండపం భక్తులు వదిలేసి న చెప్పులు.
నడిచి వెళ్ళే వారంతా ఈతకాయల మండపం వద్ద చెప్పులు విడిచి వెళతారు. మళ్ళీ తిరిగి వాటిని వేసుకు వెళ్ళరు. తిరుమల పవిత్రమైనదని, ఇక్కడ చెప్పులతో నడవకూడదని కొందరు భక్తుల్లో ఒక నమ్మకం. రామానుజాచార్యులు తిరుమలకు మోకాళ్ళతో నడిచి వెళ్ళాడని ఉన్న ఐతిహ్యం వల్ల వారిలో ఈ నమ్మకం ఏర్పడింది. ఆ విశ్వాసంతోనే చాలా మంది భక్తులు చెప్పులు లేకుండా తిరుమలకు నడిచి వెళుతుంటారు.
ఈతకాయల మండపం నుంచి శ్రీగంధం వనం గుండా వెళితే పార్వేటి మండపం వస్తుంది. ఈ మండపం నుంచి కుడి వైపునకు వెళితే పాపనాశనం, ఎడమ వైపునకు వెళితే తిరుమల ఆలయం వస్తుంది. తిరుమలకు మూడు ఘాట్ రోడ్ల నిర్మాణానికి ప్రముఖ ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పథక రచన చేశారు. తిరుపతి వైపునుంచి రెండు ఘాట్ రోడ్ల నిర్మాణం జరిగింది. మూడవ ఘాట్ రోడ్డు నిర్మాణం అన్నమయ్య మార్గం గుండా సాగవలసి ఉంది. ఈ ఘాట్ రోడ్డు వేస్తే తిరుపతి ప్రాధాన్యత తగ్గిపోతుందని ఇది కార్యరూపం దాల్చలేదు.
తల కోన జలపాతం కొండ ఎక్కి తే తిరుమల నడక దారి
తుంబురు తీర్థం దారి
కడప జిల్లా వైపు నుంచి తుంబురు తీర్థం మీదుగా తిరుమలకు వెళ్ళే మరొక నడక మార్గం ఉంది. ఎప్పుడో తప్ప ఈ దారిలో పెద్దగా రాకపోకలు జరగడం లేదు. కుక్కల దొడ్డి వద్ద నుంచి తుంబురు తీర్థం వెళ్ళే దారి ఉంది. ఒకప్పుడు కడప జిల్లా వైపు నుంచి ఎద్దుల బండ్లు కట్టుకుని తుంబురు వరకు ఈ దారిలోనే వెళ్ళే వారు. మధ్యలో ఒక ఏరు వద్దకు వచ్చేసరికి బండి ఇరుసులు విరిగి పోయేవి. దాంతో ఆ ఏరుకు 'బండిరుసు' అన్న పేరు వచ్చింది. తుంబురు తీర్థ ఉత్సవం నాడు తీర్థ దర్శనానంతరం కొందరు అటు నుంచి అటే తిరుమలకు నడుచుకుంటూ వెళతారు. ఇప్పటికీ అన్నమయ్య జిల్లా వైపు నుంచి చాలా మంది ఈ దారినే తుంబురు వెళ్ళి, తిరుమల ఆలయంలో దర్శనం చేసుకుని వచ్చే ఆనవాయితీ ఉంది. ఇదంతా అడవి మార్గం.
అవ్వాచారి కోన దారి
తిరుపతి నుంచి కోడూరు వెళ్ళే దారిలో ఆంజనేయ పురం వద్ద నుంచి అవ్వాచారి కోన వైపు వెళ్ళే దారి ఉండేది. ఇక్కడ నుంచి అటవీ మార్గంలో నడక మొదలు పెడితే, మోకాలి మిట్ట వద్దకు వెళ్ళే భాష్యకారుల సన్నిధి/రామానుజా చార్యుల గుడి వద్దకు చేరుకుంటారు. ఈ కోనలో వర్షాకాలం నడక సాధ్యం కాదు. ఎండా కాలంలో మాత్రమే ఈ దారిలో వెళ్ళే వారు. ఇప్పుడు ఈ దారిలో తిరుమలకు వెళ్ళడానికి ఎవరూ సాహసించడం లేదు. అవ్వాచారి కోన దారి ఇప్పుడు పూర్తిగా మూతపడిపోయింది.
ఏనుగుల దారి
శ్రీవారి మెట్టు నుంచి అవ్వాచారి కోన వరకు మరొక దారి ఉండేది. దీన్ని ఏనుగుల దారి అంటారు. ఇప్పుడిది కూడా పూర్తిగా మూతపడిపోయింది. తిరుమలలో ఆలయం, సుందరమైన వెయ్యికాళ్ళ మండపం వంటి నిర్మాణాలకు చెక్కిన రాళ్ళను ఈ దారి గుండానే ఏనుగుల ద్వారా తిరుమలకు చేరవేశారు. అందు వల్లనే దీనికా పేరు వచ్చింది.
అనుంకోన దారి
తిరుపతికి పశ్చిమాన నివసించే గ్రామీణులు అనుంకోన దారిలో తిరుమలకు వెళ్ళేవారు. తిరుపతికి సమీపంలోని కల్యాణి డ్యాంను ఆనుకుని తూర్పున ఉన్న పులిబోనుకు వెళ్ళే మార్గం ఉంది. జనావాసాల పైన పడే పులిని పట్టడానికి ఈ ప్రాంతంలో బోను ఏర్పాటు చేయడం వల్ల దీనికా పేరు వచ్చింది. కల్యాణి డ్యాం నుంచి పులిబోను వరకు తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. ఇక్కడే రెండవ ప్రపంచయుద్ధ సమయంలో సైనికులు విడిది చేసిన ఆనవాళ్ళుగా పాటుపడిన చిమ్నీలు కనిపిస్తాయి.
పులిబోను దారిలో మూడు కిలోమీటర్లు వెళ్ళాక కుడివైపున తిరుమల వెళ్ళే అనుంకోన దారి వస్తుంది. ఈ దారిలో తొలివంక, తరువాత మలివంక వస్తాయి. అది దాటితే ఉడ్డల చింతల మాను, అది దాటితే పెద్ద వెడల్పాటి బండ వస్తుంది. దీన్నే గెడ్డల బండ అంటారు. అక్కడి నుంచి బిడ్డకోన వంపు వస్తుంది. అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు నడిస్తి తిరుమలలోని నారాయణగిరి చేరుకుంటారు.
ఈ దారిలో తిరుమల వెళ్ళాలంటే దాదాపు పదిహేను కిలోమీటర్లు నడవాలి. రంగం పేట ప్రాంత వాసులు మొక్కుబళ్ళ కోసం ఈ దారినే తిరుమలకు వెళ్ళేవారు. ఈ దారిని చామల కోన దారి అని కూడా అంటారు. అయితే ఇప్పుడెవరూ ఈ దారిలో తిరుమల వెళుతున్న దాఖలాలు లేవు.
తలకోన దారి
శేషాచలం కొండల ఫశ్చిమ అంచున ఉన్న తలకోన నుంచి తిరుమలకు పురాతనమైన దారి ఉంది. తిరుపతికి పశ్చిమాన నెరబైలు ప్రాంత వాసులు తలకోన జలపాతం పక్కనున్న కొండ ఎక్కి తిరుమల వెళ్ళే వారు. కొండ ఎక్కాక తూర్పువైపుగా నిర్మానుష్యంగా ఉండే అటవీ ప్రాంతంలో నడక సాగించేవారు. మధ్యలో ఉత్తరం వైపునుంచి దక్షిణం వైపునకు ప్రవహించే ‘ఎగువ దరిశెల’ ఏరు వస్తుంది. మరి కొంత దూరం వెళితే రెక్కమాను అనే మూడు దారుల కూడలి వస్తుంది.
ముందుకు వెళితే మరో కూడలి తిరువేలి గుండు వస్తుంది. ఈ తిరువేలి గుండు నుంచి ఉత్తర దిశగా సాగితే యుద్ధగళ వస్తుంది. దక్షిణ దిశగా పజ్జెనిమిది కిలోమీటర్లు నడిస్తే తిరుమలలోని పాపనాశనం వస్తుంది.
శేషాచలం కొండలకు నలుదిక్కుల నుంచి తిరుమలకు అనేక నడక దారులు ఉన్నాయి. ఎనిమిది దశాబ్దాల క్రితం తిరుమలకు ఘాట్ రోడ్డు పడినప్పటినుంచి తిరుమలకు రెండు మూడు మార్గాలు తప్ప మిగతా నడక మార్గాలన్నీ మూతపడ్డాయి. శేషాచలం కొండలన్నీ ఒక నాటి మానవ ఆవాసాలే.
శతాబ్దాలుగా అడవులపైనే ఆధారపడి ఎన్నో గిరిజన జాతులు ఇక్కడ నివసించాయి. నాగరికత పెరిగాక ఉపాధి కోసం గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు వలస వెళ్ళిపోవడంతో అడవులు, కొండలు ఇక ఏమాత్రం మానవ ఆవాసాలుగా మిగల లేదు. కానీ, ఈ నడక దారులు మాత్రం నాటి మానవ ఆవాసాలకు మౌన సాక్షిగా మనకు మిగిలిపోయాయి.