కడప జిల్లా పుష్పగిరిలో 10వ శతాబ్దం నాటి జైన పాదుకలు(pādukā-śilas) వెలుగు చూశాయి. జిల్లాకు చెందిన రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి తాజాగా ఈ జైన పాదుకలను గుర్తించారు. పుష్పగిరి లో వైష్ణవ, శైవ, వీరశైవ, శాక్తేయ,అఘోర,కాపాళిక మత శాఖలకు సంబంధించిన ఆలయాలకు, చారిత్రక ఆనవాళ్ళకు నిలయంగా పెర్కొనబడుతోంది.
తాజాగా జైన పాదుకల ఆవిష్కరణతో పుష్పగిరి మత సాంస్కృతిక చరిత్రకు జైనమత ఆనవాళ్లు కూడా తోడైనట్లుంది. క్రీ.శ. 10-13 శతాబ్దాల్లో కర్నాటకలోని గుల్బర్గా సమీపంలోని ‘ 'మాన్యఖేత' రాజధానిగా కడప, అనంతపురం ప్రాంతంలోని రేనాడు, ములికినాడు ప్రాంతాలను పాలించిన రాష్ట్రకూటులు జైన, హిందూ మతాల్ని పోషించారు. జిల్లాలోని దానవులపాడు లో లభించిన జైనమత ఆనవాళ్ళు రాష్ట్రకూట రాజైన మూడవ ఇంద్రుని కాలంనాటివిగా గుర్తించారు.
అలాగే రాష్ట్ర కూటరాజు మూడవ కృష్ణుని దానశాసనం గతంలో పుష్పగిరిలో వెలుగు చూసింది. అయితే ఆ శాసనం పుష్పగిరిలోని నాగేశ్వర, పుష్పేశ్వర హిందూ ఆలయాలకు సంబంధించినది కావడంతో రాష్ట్రకూటులు హిందూమతాన్ని కూడా అవలంభించారని చెప్పవచ్చు.
ప్రముఖ చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్ ఈ విషయమై స్పందిస్తూ పద్మపత్రాల మధ్య ఉన్న పాదుకలను ఆరాధించడం జైన సాంప్రదాయంలో ఒక ఆచారమని పేర్కొన్నట్లు తవ్వా ఓబుల్ రెడ్డి వివరించారు. పుష్పగిరి లోని నాగనాధేశుని అలయంవద్ద ఇటీవల తనతోపాటు కళాకారుడు ఎ. వీరాస్వామి, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేశ్ ఆధ్వర్యంలో వెలుగు చూసిన తమిళ శాసనాలు తక్షకేశ్వరుని కీర్తించే అంశాలున్నట్లు వివరించారు.
ఈ ఆలయం ప్రయాగలోని తక్షకేశ్వర ఆలయానికి ప్రతీకగా, నాగదేవుడు తక్షకుడి ప్రతిష్టగా నిర్మించినట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఈ తమిళ శాసనాలను క్రీ.శ. 1910 సంవత్సరం లోనే ఎత్తి రాయించారని కీ.శే. నేలటూరి వెంకట రమణయ్య తన ‘కడప శిలాశాసనాలు వగైరా’ పుస్తకంలో ప్రచురించారని పేర్కొన్నారు. ఈ తమిళ శాసనాల పూర్తి వివరాలను కేంద్ర పురావస్తు అధికారి మునిరత్నంరెడ్డి ఆధ్వర్యంలో వెల్లడించనున్నారని ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు.