గురజాడ లేఖలలో సాహిత్య పాఠాలు

గురజాడ తన కాలంలో ప్రముఖులెందరితోనో సాహిత్య, సామాజిక విషయాలకు సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. వాటిలో చర్చించిన అంశాలు నేటికీ ఎంతో విలువైనవి.

By :  Admin
Update: 2024-11-30 03:00 GMT

-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి

 ఈ లేఖలలోగురజాడ పరోక్ష శిష్యుడు ఒంగోలు మునిసుబ్రహ్మణ్యంకు గురజాడ రాసిన లేఖలు, నాడు ముని సుబ్రహ్మణ్యంకే కాదు, నేటి యువతకు కూడా ఎంతో ఉపయోగపడేవి.

ఒంగోలు మునిసుబ్రహ్మణ్యం 1886 లో నాయుడుపేట లో జన్మించారు.1906లో విజయనగరం సంస్థానం ఆఫీస్ లో నెలకు 10రూపాయల జీతానికి గుమస్తాగా పని చేస్తూ, ఎఫ్. ఏ. ప్రైవేట్ గా చదువుతున్నప్పుడు, గురజాడ తో పరిచయం కలిగింది. గురజాడ ఆయనను ఆ పని నుంచి మాన్పించి, ప్రతి రోజూ ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు, తన ఇంట్లో ఉన్న తెలుగు, సంస్కృత గ్రంధాలు, విజయనగర సంస్థానానికి చెందిన శాసనాలను, ఆ రాజుల బంధువుల వంశ వివరాలను తెలిపే గ్రంధాలను చదివి సంస్థాన చరిత్ర కు అవసరమైన ఆధారాలను సేకరించే పని అప్పజెప్పారు. ఇంకా ఆంధ్ర కవులు రాసిన ప్రబంధాలలో కృతి పతి, కృతి కర్తల వంశావళులు తెలిపే పద్యాలను చదివి, అందులో చారిత్రక విషయాలను విడదీసి,శిలా శాసనాలలోని రాజుల, మంత్రుల జీవిత కాలాల ఆధారంతో ఆంధ్ర కవుల కాలనిర్ణయంచేసే పని అప్పజెప్పారు.ఈ పని చేయటం ఆయనకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. అప్పటి నుంచి ముని సుబ్రహ్మణ్యం గురజాడ అభిమాని అయిపోయారు.

      తర్వాత ముని సుబ్రహ్మణ్యం బి. ఏ. కూడా పూర్తి చేసారు. ఆరు నెలల పాటు నెల్లూరు వి. ఆర్. హై స్కూల్ లో పని చేసారు. తర్వాత కాకినాడ లో పి, ఆర్. కాలేజీలో ఇంగ్లీష్ ట్యూటర్ గా పని చేసారు. కాకినాడ లో ప్లీడర్ పరీక్ష రాసి పాసయ్యారు. ఒంగోలు లో న్యాయవాది గా కొన్నాళ్ళు చేసారు. జాతీయోద్యమకాలంలో న్యాయవాద వృత్తి విడిచి, జాతీయ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. తర్వాత మళ్ళీ న్యాయవాదిగానే పని చేసారు.

        గురజాడ కన్యాశుల్కం ప్రచురణ జరుగుతున్న కాలంలో ఆ రచనా విశేషాలను గురజాడ నుంచి లేఖలుగా అందుకున్న గొప్ప వ్యక్తి ఒంగోలు మునిసుబ్రహ్మణ్యం.

వీరు 1936 లో హిందూ లో ఒక వ్యాసం రాసారు. అందులో 'మనకు పోస్టు ద్వారా పాఠాలను చెప్పే సంస్థలు కొన్ని వున్నవి. అలా పాఠాలు నేర్చుకున్న వారిలో నేను ఒకడిని. విజయనగరం, మద్రాసు, ఉదకమండలం ల నుంచి అప్పారావు పంతులు గారు తమ లేఖల ద్వారా అనేక విషయాలను నాకు బోధ పరుస్తూ ఉండేవారు "అని రాసారు.

నిజంగానే గురజాడ,ముని సుబ్రహ్మణ్యం కు రాసిన ఒక్కో లేఖ ఒక్కో సాహిత్య పాఠం లా, కొత్త కొత్త విషయాలను తెల్పేదిలా ఉంటుంది.

   వీరు గురజాడ ఇంట్లో వారి పిల్లలతో సమానం గా మెలిగేవారు. గురజాడ గుఱ్ఱబ్బండి మీద ఎక్కడికి వెళ్లినా ఒంగోలు వారు వెంటే ఉండేవారు.తాను చేసే సాహిత్య కృషిలో ముని సుబ్రహ్మణ్యం చేదోడు వాదోడు గా ఉండాలని గురజాడ కోరుకున్నారు. తన సారస్వత కృషి లో సహచరునిగా ఆయనను తీసుకుంటానన్నారు. విజయనగరం లో మునిసుబ్రహ్మణ్యం ఉంటే తను చేయలేని పని అంటూ ఉండదని గురజాడ అన్నారు. అంత అభిమానం, నమ్మకం ముని సుబ్రహ్మణ్యం పై గురజాడ కు.

       గిడుగు రామమూర్తి రిప్పన్ హై స్కూల్ ను తమ మానేజ్మెంట్ లోకి తీసుకోవాలనుకున్నారు. అది జరిగితే ఆధునిక బోధనా పద్ధతులతో నిర్వహించే ఆ స్కూలు లో మునిసుబ్రహ్మణ్యంని పెట్టాలని, అది ఆయనకు బాగా సరిపోతుందని గురజాడ భావించారు. కానీ, అది తర్వాత జరగలేదు.

    కన్యాశుల్కం లోని కొన్ని పాత్రల చిత్రణ విషయం లో ముని సుబ్రహ్మణ్యం గురజాడ తో విబేధించారు. ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ఇద్దరి మధ్య చాలా చర్చ జరిగింది. ముని సుబ్రహ్మణ్యం విమర్శనా, విశ్లేషణా శక్తి ని మెచ్చుకుంటూనే, గురజాడ మీనాక్షి, మధుర వాణి పాత్రలను ఆ విధంగా ఎందుకు చిత్రించారో వివరించారు. నాటి స్త్రీ పురుష సంబంధాలలోని అసమానతను, వివాహ వ్యవస్థ లోని లోపాలను గురజాడ, మునిసుబ్రహ్మణ్యం తో లోతుగా చర్చించారు.

   సమాజం నిర్ణయించిన నీతి సూత్రాలు మనకు కొన్ని ఉన్నాయి. వాటిని గౌరవించటం మన విధి. అయితే ఈ సాంఘిక శాసనాలు, ధర్మాలు లోప భూయిష్టంగా వున్నప్పుడు వాటిని బాహాటంగా ఎదుర్కోవాలని గురజాడ తన లేఖలలో చెప్పారు. తన చుట్టూ ఉండే వైవాహిక జీవితాన్ని నిశితంగా పరిశీలించమని ముని సుబ్రహ్మణ్యంకి చెప్పారు. సమాజ పరిశీలన, హేతు బద్ధమైన ఆలోచన, సాహిత్య విమర్శ ఏ విధంగా చేయాలో గురజాడ తన లేఖల ద్వారా మార్గ నిర్దేశం చేసారు.

   ముని సుబ్రహ్మణ్యంని, కన్యాశుల్క నాటకం పై విమర్శ రాయమంటూ గురజాడ మొగమాటం లేకుండా విమర్శ నిష్కర్షగా ఉండాలని, అభిప్రాయ బేధాలొస్తాయని భయ పడద్దని, స్వంత నిర్ధారణ మీద ఆధారపడి అభిప్రాయం రాయమని చెప్పారు. సమకాలిక నాటకాలలో భాష, పాత్ర చిత్రణ లను లోతుగా విమర్శించి, ముని సుబ్రహ్మణ్యంకు విమర్శపద్ధతి ని తెలియజేసారు. ఒక తెలుగు పుస్తకాన్ని ఎలా రివ్యూ చేయాలో తెలిసున్న వ్యక్తి తన ఎరుక లో లేరన్నారు. ఒక కావ్యాన్ని చదివి సునిశితంగా పరిశీలించి, తూచినట్టు విలువలు కట్టే విమర్శకులు మనకు అరుదుగా ఉన్నారని చెప్పి, తెలుగు లో సద్విమర్శకుల కొరత ను చెప్పారు.

 గురజాడ పరిశోధకులు తమ వ్యాసాలలో, ప్రసంగాలలో ఎక్కువగా ఉటంకించే, "మగవాళ్ల అధికారం కింద, పెత్తనం కింద బానిసలుగా ఆడవాళ్లు ఎలా పడివుంటున్నారో నేను ఊ హించుకోగలను",   వివాహబంధం తెంచుకోరాదనే నియమం చెప్పనలవిగాని కన్నీటి గాధలకు కారణం" వంటి ఆలోచనాత్మక వాక్యాలు ముని సుబ్రహ్మణ్యంకు గురజాడ రాసిన లేఖల లోనివే!

     లేఖా రచన ఒక కళ. ఒకప్పుడు చాలామందికి ఈ అలవాటుండేది. క్షేమ సమాచారాలు, కుటుంబ విశేషాలు తెలుపుకునేందుకు వీటిని రాస్తుండేవారు.

ఈ పరిధిని దాటిన లేఖలు కుటుంబ సభ్యుల, బంధువుల, స్నేహితుల మధ్య సాగినా, మామూలు విషయాలు కాకుండా లోకాజ్ఞానానికి, సాహిత్యానికిసంబంధించి ఉండేవి. ఆ లేఖలు అందుకున్నవారు జ్ఞానాన్ని, లోకరీతిని అర్ధం చేసుకునేందుకు ఎంత గానో తోడ్పడేవి. అలా చూసినపుడు మనదేశంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రు తన కూతురు  ఇందిరకు రాసిన లేఖలు వైయుక్తిక పరిధిని దాటి విశ్వజనీనతను సంతరించుకున్నాయి.పాశ్చాత్య దేశాలలో  అనేక మందికి ఈ లేఖారచన ఎంతో అభిమాన విషయం.లార్డ్ చెస్టర్ ఫీల్డ్ తన  కొడుకుకు రాసిన ఉత్తరాలు విశేష ఆదరణ పొందాయి.అవి అతని సత్ప్రవర్తనకు, సంస్కారానికి ఎంతగానో ఉపకరించి, తండ్రి అంత గొప్పవాణ్ని చేసాయి. అయితే ఈ లేఖారచన నేటి  తరంలో మృగ్యమై పోయింది.అందుకనే పాశ్చాత్య దేశాలలో ఈ లేఖా రచనను ఎం. ఏ. సాహిత్యం లో ఒక అంశంగా పెట్టారు.

గురజాడ లేఖలు పాఠకునితో మాట్లాడుతున్నట్లుంటాయి.పుస్తకాలు చదవటం, లోక పరిశీలన గురజాడ నుంచి ఎలా నేర్చుకోవాలని అనుకుంటామో ఆయన లేఖా రచనా పధ్ధతి కూడా అలాంటిదే!

Tags:    

Similar News