అంతా తామై మహిళలే నడిపిస్తున్న దినపత్రిక
గ్రామీణ స్త్రీలే ఎడిటర్లు, రిపోర్టర్లు, కార్టూనిస్టులు. పల్లె సమస్యలు, వ్యవసాయంలో, గ్రామీణాభివృద్ధిలో సాధించిన విజయాలను ఇందులో రాస్తూంటారు.;
చిత్తూరు జిల్లా గతుకుల దారిలో ఎర్రబస్సు భారంగా బయలు దేరింది.
హడావడిగా వచ్చి సీట్‌లో కూర్చొని రేగిన జుత్తును సర్దుకుంటూ ఒకామె ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతోంది.
‘‘ నీకేమి నిద్రలేసి ఊపుకుంటూ పోతావు. పనులన్నీ ఎపుడయ్యేది? మన డాక్రా గ్రూప్‌లోని పదిమందిని పిల్సుకోని రచ్చబండ కాడికి రండి. చాలా సమస్యలు మాట్లాడాలి.’’
ఆమెది చమరకాకి రంగు. మొహం మాత్రం తెల్లగా ఉంది.
మట్టిగాజులు, మాసిన చీర... పొలం పనుల్లో రాటు తేలిన చేతులు.
ఇంతలో బస్ కండక్టర్ వచ్చి ఆమెకు టిక్కెట్ ఇవ్వబోయాడు..
ఆమె బొడ్డు దగ్గర దోపుకున్న గుడ్డ సంచి తీసి ఒక పాస్‌ని చూపింది.
‘‘ నువ్వు విలేకరివా ? మీకు కూడా పాస్‌లు ఇచ్చేస్తున్నారా? అక్రిడేషన్ ఏది?’’ అని ఆమెను హేలనగా , అనుమానంగా చూస్తూ అడిగాడు కండక్టర్.
ఆమె అదికూడా తీసి చూపింది.
ఇలాంటి వెటకారాలు మధ్య ఎవరినీ పట్టించుకోకుండా వార్తా సేకరణ చేస్తున్న విలేకరి ఆమె. గ్రామీణ పేద మహిళలే రాసుకుంటున్న ఒక పత్రికలో పని చేస్తున్నది.
దుస్తులు కుడుతూనో, గ్యాస్ బండలు మోస్తూనో, మట్టిపనులు చేసుకునో బతికే ఆడవాళ్లు ... ఏకంగా ఒక పత్రికను నడుపుతున్నారంటే నమ్మగలరా?
రెండున్నర దశాబ్దాలుగా క్రమం తప్పక ఆంధ్రన్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కేంద్రంగా వెలువడుతున్న,
భారత దేశంలో తొలి మహిళా పత్రిక ‘మహిళా నవోదయం’.
ఎడిటర్‌గా, రచయిత్రిగా వ్యవసాయ కూలీ
‘‘ చిత్తూరు జిల్లాలో 2000 సంవత్సరం నుండి నేటికీ క్రమం తప్పక మా పత్రిక వస్తున్నది. సెర్ఫ్ సంస్ధ ‘వెలుగు’ ప్రోగ్రామ్ కింద ఈ పత్రికను ప్రారంభించారు. గ్రామీణ స్త్రీలే ఎడిటర్లు, రిపోర్టర్లు, కార్టూనిస్టులు గా పనిచేస్తున్నారు. పల్లె సమస్యలు, వ్యవసాయంలో, గ్రామీణాభివృద్ధిలో సాధించిన విజయాలను ఇందులో రాస్తూంటారు. తమ ప్రాంతాల్లోని అవినీతి, ఆరోగ్య సమస్యలను కూడా ప్రచురిస్తాము.’’ అని వివరించింది ఎండపల్లి భారతి. ఈ పత్రికకు ఆమె 3 సంవత్సరాలు ఎడిటర్‌గా పనిచేశారు.
ఎండపల్లి భారతి
ఇపుడు పత్రిక నిర్వహణ టీమ్‌లో ఉన్నారు.
ఎండపల్లి భారతి తెలుగు కథా రచయిత్రి, లఘుచిత్ర దర్శకురాలు. ఆమెది ఆంధ్ర ప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా, నిమ్మనపల్లె మండలంలోని దిగువబురుజు. భారతి ఐదవ తరగతి వరకు చదువు కొనసాగించి, ఆపై కుటుంబ పరిస్థితుల వల్ల వ్యవసాయానికి పరిమితం అయ్యారు.
1998లో, డ్వాక్రా మహిళా సంఘంలో సభ్యురాలిగా చేరి, గ్రామీణ మహిళల సమస్యలను పరిష్కరించడంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ అనుభవం ఆమె రచనా ప్రస్థానానికి ప్రేరణగా నిలిచింది. ఆమె కథల్లో పేద శ్రామిక మహిళల వెతలు, పల్లె సంస్కృతి, సామాజిక చింతన ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఆమె రాసిన కథల పుస్తకాలలో ముఖ్యమైనవి ‘ఎదారి బతుకులు’, ‘బతుకీత’.
భారతి సామాజిక, సాంఘిక సమస్యలపై అనేక షార్ట్‌ఫిల్మ్‌లు కూడా రూపొందించారు. స్వీయ అనుభవాలనే ఇతివృత్తంగా తీసుకుని కథా రచన చేస్తూ, ఉత్తమ శ్రేణి కథా రచయితల సరసన నిలిచారు. కథలు రాస్తూనే నవోదయం పత్రికకు పనిచేస్తున్నారు.మరో వైపు పశుపోషణ, సేద్యం కూడా చేస్తారు.
నవోదయం కవర్ పేజీలు
గ్రామీణ స్త్రీల ఆధ్వర్యంలో మహిళల కోసం మహిళల చేత నడుపుతున్న విలక్షణ పత్రిక ఇది. జాతీయ స్థాయి మహిళా జర్నలిస్ట్ కాన్ఫరెన్స్‌లకు వీరు హాజరువుతుంటారు.
ఆడవాళ్లని బయటకు రానివ్వలేదు
‘‘విధినిర్వహణలో భాగంగా పల్లెల్లో తిరుగుతున్న అధికారులను మహిళల దుర్భర జీవితం కలవరపెట్టింది. దాంతో వాళ్లలో చైతన్యం తేవాలనే ఆలోచన అప్పటి సెర్ఫ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జయేష్ రంజన్ గారికి వచ్చింది. (ఇపుడాయన తెలంగాణ ప్రభుత్వంలో స్పెషల్ ఛీప్ సెక్రటరీగా ఉన్నారు.)
ఆలా 2001 ఆగస్టు 15న ‘మహిళా నవోదయం’ పుట్టింది. ప్రింట్ మీడియాలో పేద మహిళల గొంతుకు ఒక వేదిక ఉండాలని ఆయన పేద గ్రామీణ దళిత మహిళలే పత్రికా నిర్వహణ బాధ్యత తీసుకునేలా చేశారు. అభివృద్ది, పర్యావరణం, ఆరోగ్యం, లింగవివక్ష పై కథనాలకు ప్రాధాన్యత ఇచ్చారు.’’ అన్నారు, నాటి వెలుగు ప్రాజెక్ట్ లో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేసిన కిరణ్ కుమారి.
చదవడం, రాయడం మాత్రమే తెలిసి వ్యవసాయం, కూలిపనులు చేస్తున్న 12 మందిని ఎంపికచేశారు. వాళ్లకి వివిధ పత్రికలకు చెందిన పాత్రికేయులతో శిక్షణ ఇప్పించారు. ఈ పత్రికకు మీరే విలేకర్లు అని చెప్పారు. ఆ ఆలోచనను మగవాళ్ళు వ్యతిరేకించారు. ఇంటినుంచి ఆడవాళ్లని బయటకు రానివ్వమన్నారు.
ఆ వ్యతిరేకతకు మొదట్లో భయపడ్డా తర్వాత ధైర్యాన్ని కూడదీసుకున్నారు. వాళ్ల కథలను వాళ్లే వార్తలుగా రాసుకున్నారు. 2001 ఆగస్టు 15న ‘నవోదయం’ పేరుతో తొలి సంచికను 20 పేజీలతో విడుదలచేశారు. ఈ పత్రికకు డిజైనర్లు, లే అవుట్ ఆర్టిస్టులు, కార్టూనిస్టులు, సర్క్యులేషన్ మేనేజర్లు, ఏజంట్లు అన్నీ వారే. తొలి ఎడిటర్‌గా రత్నమ్మను ఎన్నుకున్నారు. తొలిసంచిక వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మూడేళ్లకోసారి తమలో ఒకరిని ఎడిటర్‌గా ఎన్నుకుంటారు.
రిపోర్టింగ్ నుండి ప్రూఫ్ రీడిరగ్ వరకు వాళ్లే
వీరు ఎక్కడ సమస్యలుంటే అక్కడకు వెళ్లి , ఆ పల్లె ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని, ఫొటోలు, వీడియోలు తీసి రిపోర్ట్ చేస్తారు.
ఆ సమాచారాన్ని ఆకట్టుకునే వార్తా కథనాలు గా ఎడిటోరియల్ టీం తీర్చిదిద్దుతారు. ఎడిటింగ్, ప్రూఫ్ రీడిరగ్ చేసి, ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి? కవర్ స్టోరీ ఏది చేయాలి? అనే విషయాలు అందరూ కలిసి నిర్ణయిస్తారు. కవర్ పేజీ డిజైన్ల నుండి కార్టూన్ల వరకు వీరే వేస్తారు.
మహిళలే వేసిన కార్టూన్లు
ఇలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన పత్రిక ప్రెస్‌లో ప్రింట్ అయిన తరువాత మండలాల వారీగా సంఘాలకు పంపిణీ బాధ్యతలన్నీ వీరు దగ్గరుండి చూసుకుంటారు.
మా పత్రికే మాకు బలం!
‘‘ ఒకపుడు కూలీగా, తాపీ మేస్త్రిగా పనిచేశాను. సైకిల్ మీద గ్యాస్ బండలను ఇండ్లకు చేర వేసేదానిని. ఇలాంటి పరిస్ధితుల్లో నాకు విలేకరిగా శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దారు. వాహనాలను రిపేర్లు చేసే ,వడ్రంగి పని చేసే మహిళల గురించి రాశాను. నా లాంటి వారి స్టోరీలు రాయడం ఉధ్వేగంగా ఉంది.
ఊరి సమస్యలను వెలుగులోకి తెచ్చినపుడు అధికారులు స్పందించి పరిష్కరించేవారు దాంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రజల్లో గౌరవం పెరిగింది. నవోదయం పత్రిక బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది.’’ అంటారు విలేకరిగా పనిచేస్తున్న మునెమ్మ.
తమ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ,తమ చుట్టు ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు తోటి మహిళలకు అందించాలన్న తపన తో ఈ పత్రికను 22 ఏండ్లుగా నడుపుతున్నారంటే ఇది మామూలు విజయం కాదు.
పత్రిక వల్ల ఏం సాధించారు?
శ్రీకాళహస్తిలో జరిగే శివరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఏటా వేల సంఖ్యలో బాల్యవివాహాలు జరగడం ఆచారం. ఆ రోజున శివుడి గుడిలో పెళ్ళి చేసుకుంటే సుఖంగా జీవిస్తారని నమ్ముతారు. ఈ ఆచారం మీద 2010లో ప్రత్యేక కథనాలు రాశారు. బాల్యవివాహాలు చేసుకుని ఇబ్బందులు పడుతున్న ఆడవాళ్ల గురించి ప్రచురించింది. దాంతో శివరాత్రి రోజు జరగాల్సిన పెళ్లిళ్లు ఆగిపోయాయి.
‘‘ ఒక కుగ్రామంలో సేకరించిన విజయగాధను జిల్లా మొత్తం విస్తరింప చేయడం వల్ల మహిళల్లో చైతన్యం కలిగిస్తున్నాం. వివిధ ప్రాంతాల సంస్కృతి , సంప్రదాయాలను రికార్డు చేసి భద్రపరుస్తున్నాం.
మైక్రో ఫైనాన్స్ మీద అనేక కథనాలు రాశాం, ఫలితంగా అవి మూతపడ్డాయి.
పొదుపు సంఘాల్లో చేరి ఆర్దికంగా నిలదొక్కుకున్న వారి మీద రాసిన విజయగాధలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. సేంద్రియ వ్యవసాయం పై అవగాహన కల్గించే వార్తలు ఇచ్చాం. ఉమెన్ ట్రాఫికింగ్ మీద చేసిన కేస్ స్టడీల వల్ల ముంబాయి రెడ్ లైట్ ఏరియాలో పోలీసులు రైడ్ చేసి, అక్కడ చిక్కుకున్న 500మంది తెలుగు అమ్మాయిలను ఒకేరోజు కాపాడగలిగారు. వారిని ఆ వృత్తిలోనుంచి బయటకు తెచ్చి పునరావాసం కల్పించడంలో నవోదయం విలేకరులు కీలక పాత్ర పోషించారు. రాష్ట్రాన్ని కుదిపేసిన సూక్ష్మ రుణాల గురించి అనేక మంది మహిళలను కలిసి వాళ్లు ఎదుర్కొన్న సమస్యలను వెలుగులోకి తెచ్చారు. ఆ కథనాలతో వెలుగు ప్రాజెక్టు కింద శ్రీనిధి పథకాన్ని ఏర్పాటు చేసి మహిళలకు రుణాలను ఇవ్వడం ప్రారంభించారు. ఇలాంటి విజయాలు మాకు ఎంతో సంతోషం కలిగిస్తాయి. ’ అంటారు మరో విలేకరి చంద్రకళ
మా రిపోర్టింగ్ మొదలయ్యాక ఇంటా, బయటా మా పై దాడులు జరిగాయి. అయినా మాకు ఈ పత్రిక గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. మేమేంటో మాకు తెలిపింది అంటారు మల్లిక, జయంతి.
ఉత్తేజం నింపిన ‘నవోదయం’
వీరికిచ్చిన శిక్షణలో ఏది వార్త ఏది వార్తకాదో అవగాహన చేసుకున్నారు. కుటుంబంలో, గ్రామాల్లో సమస్యలు తెలుసుకొని పత్రిక ద్వారా విలేకరులు పరిష్కరిస్తున్నారు.15 ఏళ్ల క్రితం సారాయి బట్టీలను ధ్వంసం చేసి వార్త రాశారు. అపుడు వీరికి కెమేరాలు లేవు. బొమ్మ గీసి పత్రికలో వేశారు. దాని వల్ల వార్త ఎక్కువ మందిని ఆకట్టుకుంది.
ఇంటి పని పొలం పనికే అంకితమైన మాకు జీవితం మీద విరక్తిగా ఉండేది. నవోదయంలో విజయగాధలు చదివాక ఏమై నా చేయగలమన్న ధైర్యం వచ్చింది. మాలో ఆలోచన శక్తి పెంచింది. లోన్ తీసుకొని వ్యాపారం చేస్తూ ఎలా ఎదగ వచ్చో తెలిసింది. అని సంతోషంగా చెబుతున్నారు కొందరు సంఘం మహిళలు.
పత్రికను కొనేందుకు మొదట ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. ‘ఇది మన పత్రిక మనమే దీనిని కాపాడుకోవాల’ని బతిమాలాడారు. వాళ్ల వార్తలతోనే వాళ్ళకి దగ్గరయ్యారు.
పత్రికను మారు మూల ప్రాంతాలకు చేరవేయడంలో విలేకరులదే కీలక పాత్ర. మండలాల వారీగా అన్ని మహిళా సంఘాలకు అందచేస్తారు. మహిళా సమాఖ్యల సమావేశాలలో గ్రామ సంఘం లీడర్లు పత్రికలోని కథనాలు, విజయ గాధల మీద చర్చిస్తారు. చదువు రాని వారికి కూడా ఈ పత్రికను చదివి వినిపించి, ప్రచురించిన పలు అంశాల పై అవగాహన కలిగిస్తారు. మారుతున్న కాలంతో పాటు డిజిటల్ రిపోర్టింగ్ చేస్తున్నారు.
జయంతి, భారతి, మల్లిక, చంద్రకళ కెమారా పట్టుకొని ప్రజల కష్టసుఖాలను షార్ట్ ఫిల్మ్‌లుగా చిత్రిస్తున్నారు.
వీరికి నెల జీతం ఏంతంటే?
‘గత 25 సంవత్సరాలుగా స్వయం సహాయక సంఘాల మహిళలతో ‘నవోదయం’ పత్రికను నిర్వహిస్తున్నాం. స్ఫూర్తి వంతమైన మహిళలు, రైతుల విజయగాధలకు, జీవనోపాధుల మెరుగుదల, ఆరోగ్య సూత్రాలు, మహిళల పై జరిగే అన్యాయాలు, గ్రామీణ వికాసం కథనాలకు ప్రాధాన్యత ఇస్తాం. ఇవన్నీ మహిళలే రాసి ,ఎడిట్ చేస్తారు. ఎడిటోరియల్ టీమ్‌లో 12 మహిళలు పనిచేస్తున్నారు వారికి నెలకు రూ.15వేల నుండి 20 వేల వరకు గౌరవ వేతనం ఇస్తున్నాం.దానితో పాటు బస్ పాస్‌లు కూడా ఏర్పాటు చేశాం.’ అన్నారు, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్న సుబ్బారెడ్డి,
ఈ మహిళల కృషికి గుర్తింపుగా ‘డేటా న్యూస్ ఫీచర్స్’ అవార్డు, ‘ లాడ్లీమీడియా’ స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. నాలుగు పేజీలతో మొదలైన పత్రిక నేడు నలభై పేజీలకు పెరిగింది.
ప్రారంభంలో 750 కాపీల నుండి నేడు 45 వేల కాపీలకు సర్క్యులేషన్ చేరింది. సంఘాల లోని 5 లక్షలకు పైగా సభ్యులు చదువుతున్నారు.
వర్తమాన తెలుగు మీడియా చరిత్రలో ఇదొక నవోదయం !