దశరథుడు కోసలరాజు ఎలా అయ్యాడు?

రామాయణంలో నిరుత్తర కాండ. ప్రముఖ సాహిత్య విమర్శకుడు కల్లూరి భాస్కరం ‘రామాయణ వ్యాసాలు’ (1)

Update: 2024-06-08 12:30 GMT


రామాయణంలో నిరుత్తర కాండ. 1


వాల్మీకి రామాయణం, బాలకాండలోని 5, 6 సర్గలు 51 శ్లోకాలలో అయోధ్యానగరాన్ని వర్ణిస్తాయి. దాని ప్రకారం, పద్దెనిమిది ద్వీపాలతో కూడిన ఈ భూమి అంతా మనుచక్రవర్తి మొదలుకొని విజయవంతులైన ఎందరో రాజుల అధీనంలో ఉండేది. ఆ రాజులలో సగర చక్రవర్తి ఒకడు. ఆయన సాగరాన్ని తవ్వించడం వల్లనే అది విశాలమైంది (సాగరమనే పేరు కూడా సగరుని నుంచే వచ్చింది). సగరుడు యుద్ధయాత్రకు బయలుదేరినప్పుడు అతనితోపాటు అతని అరవై వేలమంది కొడుకులూ వెళ్ళేవారు. రామాయణం పేరుతో ప్రసిద్ధమైన ఈ ఆఖ్యానం (పూర్వకథ) ఇటువంటి మహాత్ములైన ఇక్ష్వాకురాజుల వంశంలో పుట్టింది...


ఇంతకీ అయోధ్య ఎక్కడుందంటే, సరయూనదీ తీరంలోని కోసల అనే గొప్ప జనపదంలో ఉంది. ఆ ప్రసిద్ధపట్టణాన్ని సకలమానవులకు ప్రభువైన మనుచక్రవర్తి స్వయంగా నిర్మించి అక్కడినుంచే పరిపాలన చేశాడు. అది తీర్చిదిద్దిన విశాలమైన రహదారులతో శోభాయమానంగా ఉంటుంది. దాని పొడవు పన్నెండు యోజనాలు(యోజనమంటే పది మైళ్లని నిఘంటువు), వెడల్పు మూడు యోజనాలు. ఎంతో సమర్థుడైన దశరథుడనే రాజు, దేవేంద్రుడు స్వర్గంలో నివసించినట్టుగా ఆ పట్టణంలో నివసించేవాడు. అక్కడినుంచే ప్రపంచం మొత్తాన్ని ఏలేవాడు.


ఇక్కడినుంచి 70 వ సర్గకు వెడదాం. రాముడు శివధనుర్భంగం చేసిన తర్వాత అతనికి తన కూతురైన సీతనిచ్చి పెళ్లి చేయడానికి విదేహరాజు జనకుడు సంకల్పించాడు. అందుకు దశరథుని అనుమతితోపాటు ఆయనను మిథిలానగరానికి రమ్మని కోరుతూ దూతను పంపించాడు. దశరథుడు మిథిలానగరానికి వచ్చాడు. పెళ్ళికి ముందు దశరథుని వంశపరంపర గురించి ఆయన పురోహితుడైన వసిష్ఠుడు జనకుడికి చెప్పాడు; జనకుడు తన వంశపరంపర గురించి దశరథుడికి స్వయంగా చెప్పుకున్నాడు. పెళ్లిళ్లలో వధువువైపు వారు, వరునివైపు వారు తమ వంశం గురించి, గోత్రం గురించి ఒకరికొకరు చెప్పుకునే ఆనవాయితీ ఇప్పటికీ కొన్ని కులాల్లో ఉంది.


వసిష్ఠుడు చెప్పిన దశరథుని వంశపరంపర ఇలా ఉంటుంది:


అవ్యక్తం నుంచి బ్రహ్మ పుట్టాడు; అతనికి మరీచి; మరీచికి కశ్యపుడు; కశ్యపునికి సూర్యుడు; సూర్యుడికి మనువు; మనువుకు ఇక్ష్వాకువు పుట్టారు. ఈ ఇక్ష్వాకువే అయోధ్యకు మొదటి రాజు. ఈ ఇక్ష్వాకువంశపరంపరలో భాగంగానే పృథువు, త్రిశంకువు, మాంథాత, సగరుడు, దిలీపుడు, భగీరథుడు, కకుత్స్థుడు, రఘువు అనే పురాణప్రసిద్ధమైన రాజుల పేర్లు వస్తాయి. ఈ పరంపరలో 31వ వాడే అజుడి కుమారుడైన దశరథుడు. ఇక్ష్వాకువంశంగానే కాక, కకుత్స్థవంశంగానూ, రఘువంశంగానూ కూడా ఈ పరంపరను రామాయణం చెబుతుంది. దశరథుడి కొడుకుగా దాశరథి అనే కాక, కకుత్స్థుడిగానూ, రాఘవుడిగానూ రాముని సంబోధించడం కనిపిస్తుంది.


ఇక్కడ ఒక వైరుధ్యాన్ని, ఒక పాఠాంతరాన్ని చెప్పుకుని ముందుకు వెడదాం. బాలకాండ, 5వ సర్గలోని 6వ శ్లోకం ప్రకారం అయోధ్యను మనుచక్రవర్తి స్వయంగా నిర్మించాడు. 6వ సర్గలోని 20వ శ్లోకం ప్రకారం, మనుచక్రవర్తి అయోధ్యను ఎలా పాలించాడో దశరథుడు అలాగే చక్కగా పరిరక్షించాడు. కానీ 70వ సర్గలోని 22వ శ్లోకం ఇక్ష్వాకువునే అయోధ్యను ఏలిన మొదటి రాజుగా చెబుతోంది. ఇదొక వైరుధ్యం. ఇక వాల్మీకి రామాయణం ప్రకారం పైన చెప్పిన వంశపరంపరలో దశరథుడు 31వ రాజు అయితే; ‘శ్రీరామాయణభాగవతం’ అనే మరో రామాయణకథనం ప్రకారం 66వ రాజు. ఇదొక పాఠాంతరం.


పోనీ ఇక్ష్వాకువునుంచి దశరథుడివరకూ లెక్కించినా, అప్పటికి 31 తరాలుగా కోసలరాజ్యం ఇక్ష్వాకుల పాలనలో ఉందన్నమాట. ఒక్కోరాజు వయసుకూ, పాలనకూ వేల సంవత్సరాల లెక్కను ఆపాదించడం పౌరాణికశైలి. ఉదాహరణకు, దశరథుడు 60వేల సంవత్సరాలు అయోధ్యను పాలించాడని రామాయణం చెబుతుంది. అలాంటి లెక్కను పక్కనపెట్టి, మనకు అర్థమయ్యే మామూలు లెక్కలో తరానికి 20 ఏళ్ల చొప్పున 31 తరాల కాలాన్ని లెక్కించినా 620 ఏళ్ళు అవుతాయి. మానవప్రమాణంలో ఇది సుదీర్ఘకాలమే.


ఇక్కడ తలెత్తే అసలు ప్రశ్న ఏమిటంటే, మనువు, ఇక్ష్వాకువుల నుంచీ దశరథుడివరకూ ఇంతమందీ కోసలకు రాజులెలా అయ్యారని?!


ఇంతపెద్ద సందేహానికి కారణం, ఒక్క చిన్న పేరు...అది కౌసల్య.


కౌసల్య దశరథుడి పెద్ద భార్య, రాముడికి తల్లి. అదలా ఉంచి, ‘కోసల-కౌసల్య’ అనే పేర్లకు ఉన్న సంబంధాన్ని గమనించండి. సంస్కృతవ్యాకరణం ప్రకారం ఆ సంబంధం ‘అపత్యా’ర్థాన్ని చెబుతుంది. ‘అపత్య’ అంటే బిడ్డ లేదా సంతానమని అర్థం. ఉదాహరణకు, దశరథుని కొడుకు కనుక దాశరథి; జనకుడి కూతురు కనుక జానకి. ఫలానా వంశానికి లేదా ప్రాంతానికి చెందడాన్ని కూడా ఇలాంటి అపత్యార్థంలో చెబుతారు. ఆవిధంగా దశరథుని పెద్దభార్య కోసలకు చెందినదిగా కౌసల్య అయింది. అంటే ‘కోసలపుత్రి’ అన్నమాట. ఇంకా చెప్పాలంటే, ‘కోసలరాణి’ కూడా అయుండవచ్చు. కోసలకు చెందినది కనుక కౌసల్య అయినప్పుడు, ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన వేరే పేరు కూడా ఉండాలి కదా; ఉందా? మనకు తెలియదు.


కోసల-కౌసల్య నామసంబంధం లాంటిదే మరొకటి చెప్పుకోవడానికి ఎంతో దూరం వెళ్లనవసరం లేదు. కౌసల్య సవితి అయిన కైక పేరే చూడండి; కేకయరాజ్యానికి చెందినది కనుక ఆమె కైక అయింది. అంటే, ఆమె ‘కేకయపుత్రే’ కాక ‘కేకయరాణి’ కూడా అయుండవచ్చు. ఆమెకు కూడా వేరే పేరు ఉండాలి కదా; ఉందా? మనకు తెలియదు.


దశరథుడి నడిమి భార్య పేరు సుమిత్ర. కౌసల్య, కైక పేర్లకు భిన్నంగా ఈ పేరు చటుక్కున ఏదైనా రాజ్యాన్నో, ప్రాంతాన్నో సూచించదు. వెతికితే దొరుకుతుందేమో తెలియదు. కథాగమనం రీత్యా చూస్తే, పట్టపురాణిగా కౌసల్యకు, ముద్దుల భార్యగా కైకకు ఉన్నంత ప్రాధాన్యం సుమిత్రకు లేదు. ఏదైనా రాజ్యంతోనూ, ప్రాంతంతోనూ ఆ పేరు ముడిపడి ఉండకపోవడం అందుకు ఒక కారణమవుతుందేమో తెలియదు. సుమిత్ర సాధారణక్షత్రియస్త్రీ అయుండాలి తప్ప, మిగతా ఇద్దరిలా రాణి లేదా రాకుమారి కాదనుకోవాలి.


ఒక రామాయణపాఠం ప్రకారం(అధ్యాత్మరామాయణం)దశరథుడు పుత్రకామేష్టి దరిమిలా తనకు అందిన పాయసాన్ని భార్యలకు పంచడంలోనూ సుమిత్రపట్ల చిన్నచూపు కనిపిస్తుంది. దశరథుడు ఆ పాయసాన్ని రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని కౌసల్యకు, ఇంకో భాగాన్ని కైకకు ఇవ్వగా; ఆ ఇద్దరూ తమ భాగంనుంచి చెరో సగాన్ని సుమిత్రకు ఇచ్చారు. వాల్మీకి రామాయణం ప్రకారమే చూస్తే, సుమిత్రపట్ల ఇలాంటి వివక్ష కనిపించదు. దశరథుడే పాయసంలో అర్ధభాగాన్ని కౌసల్యకిచ్చి, మిగితా అర్ధభాగాన్ని సుమిత్ర, కైకలకు పంచాడు. ఆ పంపకంలో కైక కన్నా సుమిత్రకే ఎక్కువభాగం దక్కింది.


వాల్మీకి రామాయణమే ప్రమాణం కదా, దాని ప్రకారం సుమిత్రకు కైక కన్నా పెద్ద వాటా లభించింది కదా, ఆమె పట్ల చిన్నచూపు ఉందని ఎలా అంటామన్న ప్రశ్న తలెత్తే మాట నిజమే. అయితే, సాంప్రదాయికపండిత భాష్యాలు, వ్యాఖ్యానాల దృష్ట్యా చూసినప్పుడు ఒక రామాయణం ప్రామాణికమనీ, ఇంకొకటి కాదనీ అనడానికి వీలులేదు. వారి దృష్టిలో అన్ని రామాయణాలూ ప్రామాణికాలే; వాల్మీకి రామాయణం వాటిలో ఒకటి మాత్రమే. వేర్వేరు రామాయణాలను పరస్పరపూరకాలుగా మాత్రమే చూడాలి. కథనంలో ఎక్కడైనా పైన చెప్పిన వైరుధ్యాలు ఎదురైతే వాటిని తగువిధంగా సమన్వయపరచుకోవాలి తప్ప వాటి ప్రామాణికతను సందేహించకూడదు.


సాంప్రదాయిక వివరణ ప్రకారం, అసలు అన్ని రామాయణాలకూ మూలమైన వంద కోట్ల శ్లోకాల రామాయణం వేరే ఉంది. అదే అన్ని లోకాలలోనూ, అన్ని కల్పాలలోనూ, అన్ని యుగాలలోనూ ఇన్నిన్ని శ్లోకాల వంతున వ్యాప్తి చెందింది. ఒక రామాయణంలో ఉన్నట్టు ఇంకో రామాయణంలో లేకపోయినా; కొన్ని వివరాలు లోపించినా; విరుద్ధంగా ఉన్నా సరే, వాటి ప్రామాణికతను శంకించకూడదు. ఎందుకంటే, రామాయణం ప్రతి కల్పంలోనూ, ప్రతి యుగంలోనూ మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. పాఠభేదాలకు అదీ కారణం. వాటిని కల్పభేదంగానూ, యుగభేదంగానూ తీసుకోవాలి. ములుకుట్ల నరసింహావధానిగారు రచించి, 9 సంపుటాలుగా వెలువరించిన శ్రీ రామాయణ సారోద్ధారము అనే గ్రంథం రామాయణం గురించిన ఇలాంటి సాంప్రదాయికదృష్టిభేదాన్ని వ్యక్తీకరిస్తుంది.


పోనీ వాల్మీకి రామాయణాన్నే ప్రమాణంగా తీసుకుని, పాయసవిభాగం సుమిత్రపట్ల చిన్నచూపునకు తగిన సాక్ష్యం కాదనుకున్నా ఇతరత్రా కథాగమనం తప్పనిసరిగా ఆమె ప్రాధాన్యతను తగ్గించే చూపిస్తుంది. ఉదాహరణకు, కోసలరాజ్యవారసత్వం గురించిన వివాదం కౌసల్య కొడుకైన రాముడికి, కైక కొడుకైన భరతుడికి మధ్యనే ఏర్పడుతుంది; అందులో వారిని ప్రత్యక్షభాగస్వాములుగా రామాయణం చూపకపోవడం వేరే విషయం. పద్నాలుగేళ్లపాటు భరతుడూ, ఆ తర్వాత రాముడే రాజ్యపాలన చేస్తారు. సుమిత్ర సంతానమైన లక్ష్మణ, శతృఘ్నులు రామ, భరతుల వెనుక ఛాయామాత్రులుగానే ఉండిపోతారు.


ఏతావతా ఏం తేలుతోందన్నమాట? రాజ్యాధికారం గురించిన వివాదం కోసలపుత్రి లేదా కోసలరాణి అయిన కౌసల్య సంతానానికీ; కేకయపుత్రి లేదా కేకయరాణి అయిన కైక సంతానానికీ మధ్యనే తలెత్తింది. సుమిత్ర ఆటలో అరటిపండు అయింది. ఆమె కొడుకులిద్దరూ అన్నలిద్దరికీ నీడల్లా మిగిలిపోయారు.


అసలు ప్రశ్నకు మళ్ళీ వెడితే...


కౌసల్య పుట్టుకతోనే కోసలరాణి అయినప్పుడు దశరథుడు కోసలరాజు ఎలా అయ్యాడు?!


(సశేషం)


Tags:    

Similar News