బెంగళూరు వాసులకు చౌకగా కూరగాయలందిస్తున్న ‘హాప్‌కామ్స్’ కథేమిటంటే!
రైతు సమాజానికి, వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే పండ్లు, కూరగాయల మార్కెటింగ్ కోసం ఏర్పాటైన సంస్థ హాప్‌కామ్స్.;
(కృష్ణ కానూరి)
"ఉద్యాన పంటలు.. ఎప్పుడూ జూదమే.. ఆరుగాలం కష్టపడి పడించిన రైతు కిలో టమాటా రూపాయికి అమ్ముకుంటాడు, సరిగ్గా అదే టైంలో వినియోగదారుడు కిలో టమాటా 15రూపాయలకు కొనుక్కుంటాడు. ధరలో ఉండే ఇంత తేడా ఎవరి జేబుల్లోకి పోతున్నట్టు? రైతు చాకిరీకి ఫలితం దక్కక, వినియోగదారునికీ మేలు చేయక.. మధ్యలో ఉండే దళారులు బాగుపడేలా మన వ్యవసాయ విధానం ఉంది. తరతరాలుగా సాగుతున్నదే ఈ ఆధునిక యుగంలోనూ సాగిపోతోంది. పాలకులు సహా అందరికీ తెలిసిందే. పరిష్కార మార్గం చూపాల్సిన విధాన నిర్ణేతలు- రైతే రాజు, రైతులే దేశానికి వెన్నెముక వంటి అందమైన నినాదాల మాటున- కాలం గడిపేస్తున్నారు. తన శ్రమశక్తిని దళారులు దోచుకుంటున్నారని తెలిసినా అమాయక రైతులు పంట పండించక మానరు.
పట్టుమని 12 కోట్ల మంది లేని రైతులు 135 కోట్ల మంది కడుపు నింపకామానరు. ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని యథేచ్ఛగా సాగిపోతున్న దోపిడీని అరికట్టేందుకు ఇప్పుడో సహకార సంఘం తెర పైకి వచ్చింది. దాని పేరే హాప్ కామ్స్. కర్నాటక రాష్ట్ర ఉద్యానవన శాఖే హాఫ్ కామ్స్ కి ఊపిరి పోసింది. వేలాది మంది రైతుల పాలిట కామధేను గా నిలిచింది. దళారుల దోపిడీని అరికట్టేలా వినూత్న మార్కెటింగ్ కి శ్రీకారం చుట్టింది. రైతుకీ వినియోగదారునికి మధ్య వారధిగా నిలిచింది. రైతుకు రొక్కం, వినియోగదారునికి లాభం చేకూర్చేలా వినూత్న మార్కెటింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఆ వ్యవస్థ ఏమిటో, రైతుకది ఎలా మేలు చేస్తుందో, వినియోగదారులను ఎలా ఆకట్టుకుంటుందో ఈ వ్యాసం చదవండి."
హార్టికల్చరల్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ మార్కెటింగ్ అండ్ ప్రాసెసింగ్ సొసైటీ (హాప్‌కామ్స్). దేశంలోనే అతిపెద్ద కూరగాయలు, పండ్ల ఉత్పత్తి రైతుల సహకార సంఘమిది. దళారుల కబంధ హస్తాల్లో చిక్కుకుని నిలువుదోపిడీకి గురవుతున్న కూరగాయలు, పండ్ల రైతులకు విముక్తి కల్పించడమే కాకుండా వినియోగదారులకు సరసమైన ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది హాప్‌కామ్స్. రైతులు తమ ఉత్పత్తులకు లాభసాటి ధరలను పొందేందుకు, వినియోగదారులకు నాణ్యమైన వ్యవసాయ తాజా ఉత్పత్తులను సరసమైన ధరలకు అందించడానికి 1965లో హాప్‌కామ్స్ ప్రారంభమైంది.
కర్ణాటక ప్రభుత్వ ఉద్యానవన శాఖ స్వయానా ఈ కోఆపరేటివ్ సొసైటీని స్థాపించింది. 507 మంది రైతు సభ్యులతో ఇది ప్రారంభమైంది. నేడు 19వేల మంది సభ్యులకు విస్తరించింది. రైతు సమాజానికి, వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే పండ్లు, కూరగాయల మార్కెటింగ్ కోసం సరైన వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రధాన లక్ష్యంతో దీన్ని స్థాపించారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించడం ద్వారా రైతులు, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే హాప్‌కామ్స్ సంకల్పం.
గత 50 ఏళ్లలో కూరగాయల, పండ్ల వ్యాపారంలో ప్రధాన సహకార రిటైల్ సంస్థగా ఎదిగిన హాప్‌కామ్స్ భారీ మార్పులతో హోల్‌సేల్ వ్యాపారంలోకి దూసుకుపోతోంది. హాప్‌కామ్స్ కూరగాయల విక్రయ కేంద్రాలు బెంగళూరులో ప్రసిద్ధి చెందాయి. అపార్ట్‌మెంట్లు, ఆస్పత్రులు, స్టార్ హోటళ్లు, ఫుడ్ జంక్షన్ లకు కూరగాయలు, పండ్లు హోల్‌సేల్ ధరలకు అందిస్తోంది. హాప్‌కామ్స్ రైతుల నుంచి సేకరించే కూరగాయలకు మార్కెట్ హామీ ఇస్తుంది. మొత్తం లాభంలో 80 శాతం రైతులకు, 20 శాతం అవుట్‌లెట్ల నిర్వహణ కోసం హాప్‌కామ్స్ కి వెళ్తుంది. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో వుంది.
బెంగళూరు రూరల్, బెంగళూరు అర్బన్, మైసూరు, మాండ్య, చిక్కబళ్లాపుర, కర్ణాటకలోని రామనగర్ జిల్లాల్లో హాప్‌కామ్స్ విస్తరించింది. సేకరణ, నిల్వ, పంపిణీ అనే మూడు ప్రధాన కార్యకలాపాలను ఇది నిర్వహిస్తోంది. బెంగళూరు నగరంలో మొబైల్ వ్యాన్‌లతో సహా 200 దుకాణాలు వున్నాయి. భారీ రిటైల్ పోటీ నేపథ్యంలో అనేక సమస్యలు వున్నప్పటికీ, హాప్‌కామ్స్ విజయం ప్రైవేట్ రంగంలో నడిచే రిటైల్ విప్లవానికి సమాంతరంగా ‘సహకార’ విప్లవాన్ని ప్రత్యామ్నాయంగా ముందుకు తెచ్చింది. కర్ణాటకలో హాప్‌కామ్‌కు 26 శాఖలు ఉన్నాయి. బెంగళూరు, బెలగావి, బీదర్, బళ్లారి, చిక్కమగళూరు, శివమొగ్గ, గడగ్, ధార్వాడ్, దావణగెరె ఇతర ప్రాంతాల్లో దాదాపు 600 అవుట్‌లెట్లు నడుస్తున్నాయి.
వినియోగదారుల చెంతకు ఇలా...
▪ సొసైటీకి అందుబాటులో వున్న భూముల్లో కొనుగోలు కేంద్రాలు, రిటైల్ అవుట్‌లెట్లను ఏర్పాటు చేయడం
▪ హాప్‌కామ్‌ల ద్వారా అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లు /ప్రభుత్వ ఆసుపత్రులు /ఫుడ్ జంక్షన్లు/ హోటళ్లు/ సంస్థలు/ పరిశ్రమలు/ ఫంక్షన్‌లకు అవసరమైన పండ్లు, కూరగాయలను సరసమైన ధరలకు పెద్ద మొత్తంలో సరఫరా చేయడం
▪ ప్రధాన కర్మాగారాలు, క్లబ్‌లు మొదలైన వాటికి కూరగాయలు, పండ్లను సరఫరా చేయడం. వివాహాలు, ఇతర సామాజిక కార్యక్రమాల కోసం అక్కడికక్కడే ఉచిత రవాణాతో పండ్లు, కూరగాయలను సరఫరా చేయడం
▪ కాలానుగుణ పండ్ల మేళాలు, జాతరలు, ద్రాక్ష, మామిడి, ఇతర పండ్ల పండుగలను నిర్వహించడం
▪ దీపావళి, రాజ్యోత్సవాల సందర్భంగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 11 వరకు ఎంపిక చేసిన అవుట్‌లెట్లలో దానిమ్మ, జామ, సీతాఫలాలతో కూడిన ప్రత్యేక పండ్ల ప్రదర్శనను నిర్వహించడం
▪ మార్కెటింగ్ వ్యూహంలో భాగంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఇతర ముఖ్య ప్రదేశాల్లో రిటైల్ అవుట్‌లెట్లు ఏర్పాటు చేయడం. రిటైల్ అవుట్‌లెట్లు ఉదయం 10.30 నుంచి రాత్రి 8గంటల మధ్య మధ్యాహ్నం విరామంతో పనిచేస్తాయి. వీటిలో ఇద్దరు సిబ్బంది వుంటారు. వీరిలో ఒకరు హాప్‌కామ్స్ శాశ్వత ఉద్యోగి, మరొకరు తాత్కాలిక వేతనంతో సహాయకుడు. రిటైల్ ధర స్థిరంగా వుంటుంది.
▪ 2007 నాటికే రాష్ట్రంలో 17 హాప్‌కామ్స్ కేంద్రాలు వున్నాయి. ప్రతిఒక్కటి జిల్లాల్లో స్వతంత్రంగా పని చేస్తాయి.
హాప్‌కామ్స్ ఇతర కార్యకలాపాలు:
▪ సొసైటీ బెంగళూరు బ్లూ ద్రాక్ష, మామిడి, నారింజ మొదలైన పండ్ల నుంచి తాజా పండ్ల పానీయాలను సహేతుక ధరలకు విక్రయిస్తోంది
▪ తాజా పండ్లరసాలను బాటిల్ చేసే జ్యూసింగ్ ప్లాంట్లు కూడా వున్నాయి
▪ కోల్డ్ స్టోరేజీలు, ఒక ప్రాసెసింగ్ యూనిట్ కూడా వున్నాయి
▪ సొసైటీ రైతులకు ఎరువులు, హైబ్రిడ్ విత్తనాలు, శిలీంధ్రనాశకాలు మొదలైన ఇన్‌పుట్ల సరఫరా కోసం కూడా అవుట్‌లెట్లు నడుపుతోంది
▪ 1997 నాటికి కర్ణాటకలోని 8 జిల్లాల్లో సేకరణ కేంద్రాలు, గోడౌన్లు, రిటైల్ అవుట్‌లెట్లు, ఇన్‌పుట్ సరఫరా కేంద్రాల నెట్‌వర్క్‌ను సంఘం అభివృద్ధి చేసింది
నగరమంతా విస్తరించడానికి పటిష్ట చర్యలు
హాప్‌కామ్స్ ఇపుడు రైతులు, వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లలో తాజా ఉత్పత్తులను విక్రయిస్తోంది. హాప్‌కామ్స్ ఇటీవలే బెంగళూరు అపార్ట్‌మెంట్ ఫెడరేషన్ (బి.ఎ.ఎఫ్)తో భాగస్వామ్యమై వినియోగదారుల ఇంటి వద్దనే పండ్లు, కూరగాయలను విక్రయిస్తోంది. హాప్‌కామ్స్ తన మొబైల్ స్టాల్స్ ద్వారా తాజా ఉత్పత్తులను 'సంచారి మలిగే' అనే పేరు మీద అందజేస్తోంది. డిమాండ్ ఆధారంగా వారానికి ఒకటి లేదా రెండుసార్లు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లకు పంపిణీ చేస్తోంది. మొబైల్ స్టాల్స్ ద్వారా దాదాపు 100 అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లను సందర్శిస్తున్నారు. దీన్ని ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్‌గా నిర్వహిస్తున్నారు. ఇది నగరమంతటా విస్తరించడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. హాప్‌కామ్స్ జనరల్ మేనేజర్ వినాయక్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మేం అపార్ట్‌మెంట్ స్థలంలో సీజనల్ పండ్లు, కూరగాయలను విక్రయిస్తున్నాం. ఈ సొసైటీలలో సమన్వయకర్తలు మేం సందర్శించవలసిన రోజుల గురించి మాకు తెలియజేస్తారు.
మేం రూట్ మ్యాప్‌ను రూపొందించి ఒకరోజులో కొన్ని అపార్ట్‌మెంట్లను కవర్ చేయడానికి మా వాహనాలను పంపుతాం’ అని తెలిపారు. ‘అపార్ట్‌మెంట్లలో మొబైల్ స్టాల్స్ కోసం రెండు టైమ్ స్లాట్‌లు వున్నాయి - ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు. ఇప్పటివరకు మాకు మంచి స్పందన వచ్చింది. ఆ కాంప్లెక్స్‌లలోని 10 శాతం కుటుంబాలు మా నుంచి కొనుగోలు చేసినప్పటికీ, మేము కనీసం సగటున రూ.8 వేల నుండి రూ.10వేల వరకు వ్యాపారం చేస్తున్నాం’ అని ఆయన చెప్పారు. కార్యక్రమాన్ని సమీక్షించడానికి, విస్తరణలను ప్లాన్ చేయడానికి హాప్‌కామ్స్, బిఎఎఫ్ నెలవారీ సమావేశాలు నిర్వహిస్తాయి. అంతిమంగా మేం మా నమోదిత రైతులు, వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చాలి. ఈ రెండు అవసరాలను తీర్చినప్పుడే హాప్‌కామ్స్ విజయవంతమైన సమాజంగా మారుతుంది’ అని వినాయక్ రెడ్డి పేర్కొన్నారు.
కాలానుగుణ పండ్ల విక్రయాలు
బిఎఎఫ్ ప్రధాన కార్యదర్శి విక్రమ్ రాయ్ మాట్లాడుతూ.. మామిడి మేళాలు, ఇతర అన్నిరకాల కాలానుగుణ పండ్ల విక్రయాలను ప్రారంభించామని చెప్పారు. కూరగాయలను విక్రయించడానికి ఈ మొబైల్ స్టాల్స్‌ను మా కాంప్లెక్స్‌లకు క్రమంతప్పకుండా తీసుకురావాలనేది మా ఆలోచన. మేము హాప్‌కామ్స్ ని ‘ఫార్మ్ టు హౌస్’ మోడల్‌గా ఎంచుకున్నాం. కొన్ని సమస్యలు వున్నప్పటికీ, ప్రతిస్పందన చాలా బాగుందన్నారు. హాప్‌కామ్స్ దుకాణాలు ఆధునీకరించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వం చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
దుకాణాల్లో రిఫ్రిజిరేటర్లు
బెంగళూరులోని హాప్‌కామ్స్ తాజా కూరగాయల కోసం అన్ని దుకాణాల్లో రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు చేసింది. ఈ దుకాణాల్లో విక్రయించే కూరగాయల తాజాదనం గురించి కొంతమంది వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కూరగాయలు, పండ్ల తాజాదనాన్ని కాపాడేందుకు ఇప్పటికే 25 స్టోర్లలో ఒక్కొక్కటి రూ. 1.5 లక్షలతో 100-లీటర్ల సామర్థ్యం కలిగిన రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు చేశామని, స్పందన సానుకూలంగా వుందని హాప్‌కామ్ అధికారి ఒకరు తెలిపారు. ఈ సౌకర్యాన్ని అన్ని దుకాణాలకు విస్తరించాలనుకుంటున్నారు. ఇది స్టోర్ యజమానులకు గొప్ప సహాయంగా వుంటుంది. వేసవిలో కూరగాయలు త్వరగా పాడైపోయే ప్రమాదం ఎక్కువగా వుంటుందని, ఇది ప్రధానంగా చిన్న దుకాణాలకు నిరంతర సమస్య అని ఓ అధికారి అన్నారు.
ఆన్‌లైన్‌లో విక్రయాలు
కొన్నిచోట్ల సిబ్బంది ఉద్యోగ విరమణ చేయడం, కొత్త నియామకాలు జరగకపోవడం, ప్రైవేట్ సంస్థల పోటీ, ఇతర రవాణా కారణాల వల్ల హాప్‌కామ్స్ బెంగళూరులోని అనేక స్టాల్స్‌ను మూసివేయవలసి వచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా, ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఒ.ఎన్.డి.సి) ద్వారా ఆన్‌లైన్‌లో పండ్లు, కూరగాయల విక్రయంతో సహా వివిధ కార్యక్రమాలను హాప్‌కామ్స్ చేపట్టింది. పేటీఎం, శ్నాప్ డీల్, పిన్ కోడ్ వంటి వివిధ యాప్‌ల ద్వారా సభ్యులు ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. దాని డిజిటల్ సేవలను మెరుగుపరచడానికి, పరిధిని విస్తృతం చేయడానికి, హాప్‌కామ్స్ జక్కూర్ టెక్నోపార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సిబ్బంది కొరత వల్ల అవుట్‌లెట్లలో కొన్నిటిని ముందుగా మూసివేశారు. కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా, ఆన్‌లైన్ ఛానెల్స్ పై దృష్టి పెడుతున్నారు. జక్కూర్ టెక్నోపార్క్స్ డైరెక్టర్ రిషబ్ జైన్ మాట్లాడుతూ.. ‘ఓఎన్‌డిసి ప్లాట్‌ఫారమ్ అనేది భారత ప్రభుత్వ చొరవతో ఏర్పాటయింది.
ఇది విక్రేతలను ప్రతినిధుల ద్వారా చేరడానికి వ్యాపారులను అనుమతిస్తుంది. ప్రస్తుతం నగరంలో దాదాపు 100 హాప్‌కామ్ ఔట్‌లెట్లు నమోదయ్యాయి. బెంగళూరు ప్రజలు ఇపుడు హాప్‌కామ్స్ నుంచి ఆన్‌లైన్‌లో తాజా పండ్లు, కూరగాయలను కొనుగోలు చేయవచ్చు. వాటిని తమ ఇంటి వద్దనే డెలివరీ తీసుకోవచ్చు. డెలివరీ ఛార్జీలు సాధారణంగా ఉత్పత్తి ధరలోనే వుంటాయి. ఇది కాకుండా రెస్టారెంట్లు, వివాహాలు, చిన్న ఫంక్షన్ల కోసం బల్క్ ఆర్డర్లు 10 శాతం తగ్గింపుతో ఇస్తున్నారు. బుక్ చేసిన 45 నిమిషాల్లో చేరుకుంటాయి. తాజా పండ్లు, కూరగాయలను సబ్సిడీ ధరలకు పొందాలనే ఆలోచన ప్రజాదరణ పొందడంతో గత ఏడాది జూన్‌లో సంఘం రూ.1,02,914 లాభాలను ఆర్జించింది. ఒ.ఎన్.డి.సికి పండ్లు, కూరగాయల సరఫరాను ప్రారంభించిన మొదటి జాబితాలో కర్ణాటక వుంది. ఢిల్లీలో పాల ఉత్పత్తుల కోసం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఆర్థికాభివృద్ధిలో హార్టికల్చర్ కీలకం!
దేశ ఆర్థికాభివృద్ధిలో హార్టికల్చర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పండ్ల ఉత్పత్తిదారు. కూరగాయల ఉత్పత్తిలో రెండో స్థానం ఆక్రమించింది. వ్యవసాయ జి.డి.పిలో 29.5 శాతం, మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో 10 శాతం వాటా కలిగి వుంది. పండ్లు, కూరగాయలు ఆహారంలో ముఖ్యమైన భాగం. అవి వినియోగించే వారికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఇతర సూక్ష్మ పోషకాలను అందిస్తాయి. ప్రజలకు ఆహారాన్ని, అనేక పరిశ్రమలకు ముడిసరుకులను అందిస్తాయి. మన ఎగుమతుల ప్రధాన వనరు అయిన భారతీయ పరిశ్రమలకు ఉపాధి వనరుగా, వాటాగా మద్దతు ఇస్తున్నాయి. జాతీయ ఆదాయంలో ఉద్యానవన పంటలు అన్నిటికీ మించి ప్రజలకు పోషకాహార భద్రత కల్పిస్తున్నాయి. భారత్ చిన్న తరహా రైతుల దేశం. ఈ నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులను దృఢంగా నిలిపి వుంచాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇందుకు సహకార నమూనా అద్భుతమైన పరిష్కారం. బెంగళూరులో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాప్‌కామ్స్ దీనికి సరైన సమాధానం.