రాజకీయాల్లో ఆయన ఓ ‘సర్ధార్‌’

బడికి పంపితే జైలుకెళ్లారు. లాఠీ దెబ్బలు తిన్నారు. బ్రిటీష్‌ వాళ్ల గుండెళ్లో రైళ్లు పరుగెత్తించారు. రాజకీయాల్లో 35 ఏళ్లు తిరుగులేని వ్యక్తిగా నిలిచారు.

By :  Vanaja
Update: 2024-04-02 11:16 GMT

జి. విజయ కుమార్

కొంత మంది నేతల పేర్లు చదివినా.. విన్నా ఏదో తెలియిన శక్తి ఆవహించినట్లు ఫీలింగ్‌ కలుగుతుంది. తెలియని బలం వచ్చి చేరుతుంది. ఉత్తేజాన్ని రేకెత్తిస్తుంది. ఆ నాయకులు బతికున్నప్పుడు చేసిన పనులు, జీవించిన జీవితం ఇలా అన్నీ కలిపి ఆ పేరుతో మన మనస్సుల్లో ధ్వనిస్తుంది. జీవిస్తుంది. ఇతరులను జీవింప చేస్తుంది. అటువంటి అరుదైన నాయకుల్లో ఒకరు గౌతు లచ్చన్న.

రాజకీయాల్లో తిరుగులేని నేతగా

విద్యార్థి దశ నుంచే స్వాంత్య్ర ఉద్యమాలతో మునిగి తేలిన గౌతు లచ్చన్న ఇండిపెండెన్స్‌ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు. 1948లో ఎమ్మెల్యేగా నాటి మద్రాస్‌ రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టారు. నాటి సిఎంలు ప్రకాశం పంతులు, బెజవాడ గోపాల్‌ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో కూడా ఆయన మంత్రిగా పని చేశారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు ఆంధ్రులకు రావలసిన ఆస్తుల విషయాల్లో కొట్లాడారు. అయితే కాంగ్రెస్‌ నేతలతో ఏర్పడిన విభేదాల కారణంగా 1951లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. శ్రీకాకుళం కేంద్రంగా కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయాలను నడిపించారు. 1950లో శ్రీకాకుళం జిల్లా ఏర్పాటైంది. తిరుగులేని శక్తిగా ఎదిగిన కాంగ్రెస్‌కు ఆల్టర్‌నేట్‌ పొలిటికల్‌ లీడర్‌గా మారారు. కృషికార్‌ లోక్‌పార్టీ, డెమోక్రెటిక్‌ పార్టీ, స్వతంత్ర పార్టీ, భారతీయ క్రాంతిదళ్, జనతాపార్టీ, భారతీయ లోక్‌దళ్, ఏపిలోక్‌దళ్, జనతాదళ్, బహుజన సమాజ్‌ పార్టీల వ్యవస్థాపనల్లోను వాటి మనుగడలోను గౌతు లచ్చన్న కీలక పాత్ర పోషించారు. దాదాపు 1983 వరకు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ విధానాలను ఎండగడుతూ ప్రశంశలు అందుకున్నారు.

లచ్చన్న రాజకీయ వారసులు

సర్థార్‌ గౌతు లచ్చన్నకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కుమారుడు శ్యామ్‌ సుందర్‌ శివాజీ, కుమార్తెలు ఝాన్సీ లక్ష్మీ రావల, సుశీలా దేవి కశింకోట. గౌతు లచ్చన రాజకీయ వారసుడిగా శివాజీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలుత ఆయన ఇండిపెండింట్‌గా వచ్చినా తర్వాత టీడీపీలో చేరారు. 1985 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బిసి సంక్షేమ శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. శివాజీ వారసత్వంతో ఆయన కూతురు గౌతు శిరీష్‌ రాజకీయాల్లోకి ప్రవేశించారు.

మహోన్నత వ్యక్తిత్వం

గౌతు లచ్చన్న అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి. మహోన్నత వ్యక్తిత్వం కలిగిన సర్వోన్నత మహా శక్తి. నాటి మద్రాసు, ఆంధ్ర రాష్ట్రాలో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, దేశ రాజకీయాల్లోను తన ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి. అప్పటి కాలంలో ఆయన పేరు తెలియన వారు ఉండరు. ఆయన గురించి మాట్లాడని వారు లేరు. కానీ ఈ నాటి తరానికి ఆయన గురించి తెలిసింది తక్కువే.

నిజాయతీకి నిలువుటెత్తు నిదర్శనం

గాంధీ పిలుపు మేరకు 21వ ఏట స్వాతంత్య్ర ఉద్యమంలోకి అడుగు పెట్టిన లచ్చన్న రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 35 ఏళ్ల పాటు ఆయన చట్ట సభలకు ఎన్నికయ్యారు. నిరంతరంగా కొనసాగిన ఆయన రాజకీయ ప్రయాణంలో నీతి, నిజాయతీ, నిబద్దతకు నిదర్శనంగా నిలచారు. ఇవే ఆయనను ప్రజలు చిర స్థాయిగా గుర్తుండేట్టు చేశాయి. ప్రజా నాయకుడిగా నిబబెట్టాయి. ప్రజలతో సర్థార్‌ అని ఆప్యాయంగా పిలిపించుకునేలా చేశాయి.

కులాలు, మతాలకు అతీతంగా..

నాడు దేశం కోసం, రాష్ట్రం కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం ఆయన ఉద్యమాలు చేపట్టారు. అన్ని వర్గాల కోసం ఆయన పాటు పడ్డారు. బడుగు, బలహీన వర్గాలకు ఆయన దేవుడు లాంటి వారు. పేద ప్రజలకు ఆరాధ్య దైవం. అంత విశాల «ధృక్పథం కలిగిన గౌతు లచ్చన్నను కేవలం ఒక వర్గానికి, ఒక కులానికి పరిమితం చేయడం దురదృష్ట కరం.

ఒక కులానికే పరిమితం చేశారు

ఆయన గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయనను ఆ కులానికే పరిమితం చేశారు. నాడు కాంగ్రెస్‌లో నాటి నాయకులు కూడా అదే చేశారు. ఆయనకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్చు కోలేక ఆయనకు అనేక అడ్డంకులు సృష్టించారు. దానిని ఆయన సహించలేకే ఆ పార్టీని వీడారు. గౌతు లచ్చన్న గౌడ కులానికి చెందిన వారు కావడం వల్ల ఆ కులం వాళ్లు ఆయనను ఓన్‌ చేసుకోవడం, గౌరవించడం జరుగుతోంది. విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఆయన సమజానికి చేసిన సేవను ఎప్పటికీ మరువ కూడాదు.

జననం

గౌతు లచ్చన్నది శ్రీకాకుళం జిల్లా. సోంపేట మండలం బారువాలో 1909, ఆగస్టు 16న ఆయన జన్మించారు. తండ్రి చిట్టయ్య, తల్లి రాజమ్మ. ఈ దంపతులకు లచ్చన్న ఎనిమిదో సంతానం. ఆయనది నిరుపేద కల్లుగీత కుంటుంబం.

విద్యార్థి దశ నుంచే..

గౌతు లచ్చన్న పుట్టి పెద్దయ్యే నాటికి స్వాతంత్య్ర ఉద్యమ సంగ్రామం తీవ్రంగానే జరుగుతోంది. నాటి జాతీయ వాది కోడిగంటి నరసింహమూర్తి దగ్గర విద్యా బుద్దులు నేర్చుకున్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడే స్వాతంత్యోద్యమం పట్ల ఆకర్షితుడయ్యారు. అనిబీసెంట్‌ మొదలు పెట్టిన స్వదేశీ ఉద్యమంతో ఆయన ఉద్యమ జీవితం ప్రారంభమైంది. క్విట్‌ ఇండియా ఉద్యమంతో పాటు అన్ని ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అనేక మార్లు బ్రిటీష్‌ వారి లాఠీలతో దెబ్బలు తిన్నారు. జైళ్లకు వెళ్లారు. ఇలా ఉద్యమాలతో విద్య నాశనం చేసుకుంటున్నాడని లచ్చన్న తండ్రి చిట్టయ్య ఎంతో ఆవేదన చెందే వారు. ఎలాగైనా లచ్చన్నను చదించాలనే లక్ష్యంతో 1931లో శ్రీకాకుళం మునిసిపల్‌ హైస్కూల్‌లో చేర్పించారు. అయితే అప్పటికే బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా సాగుతోన్న స్వాతంత్య్ర ఉద్యమంలో శ్రీకాకుళం జిల్లా సోంపేట తాలూకాలో విదేశీ వస్త్రాలయాలు, కల్లు దుకాణాలను మూయించే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. స్వాంత్య్రం పట్ల అంత అంకిత భావంతో ఉండేవారు. ఎంతగా అంటే స్వాంత్య్రం వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని ప్రతిన బూనారు. దానికే కట్టుబడి స్వాంతంత్య్రం అనంతరం 1948లో యశోదమ్మను వివాహం చేసుకున్నారు.

సర్థార్‌ బిరుదు ఇలా వచ్చింది

గౌతు లచ్చన్న చేసిన పోరాటాలు అన్నీ ఇన్నీ కావు. జమిందారీలకు వ్యతిరేకంగా కూడా ఆయన ఉద్యమాలు చేపట్టారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన తుది శ్వాస వరకు పోరాటాలు సాగించారు. అయితే స్వాంతంత్య్ర ఉద్యమ కాలంలో బాలగంగాధర తిలక్‌ «ఆధ్వర్యంలో సాగిన స్వరాజ్యం నా జన్మ హక్కు ఉద్యమంలో పాల్గొన్నందుకు లచ్చన్నను టెక్కిలి సబ్‌ జైలుకు తరలించారు. నాడు బ్రిటీష్‌ వాళ్ల ఆంక్షలను లెక్క చేయకుండా ఆచార్య రంగా అధ్యక్షతన పలాసా కాశీబుగ్గలో అఖిల భారత రైతు సదస్సును నిర్వహించారు. ఈ సభలో గౌతు లచ్చన ధైర్య సాహసాలు, చేసిన పోరాటాలు మెచ్చి లచ్చనకు ‘సర్థార్‌ గౌతు లచ్చన్న’ అని రంగా సభాముఖంగా అభినందించారు. దీంతో నాటి నుంచి సర్థార్‌ గౌతు లచ్చన్నగా ఆయన ప్రఖ్యాతి గాంచారు. ఆయన పేరుకు తగ్గట్టుగానే చివరి వరకు దళిత, గిరిజన, కార్మిక, బలహీన వర్గాల కోసం పాడుపడ్డారు. 19ఏప్రిల్‌ 2006లో ఆయన మరణించారు.

రాజకీయాల్లో ఆయన ఓ ‘సర్ధార్‌’

ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన రాష్ట్ర, జాతీయ పాలిటిక్స్‌ను గడగడలాడించే స్థాయికి వెళ్లారు. వర్గాలు, కులాలు, మతాలకు అతీతంగా ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు జనం. ఆయన నిజాయితీ, నిరాడంబరం, ఆత్మ స్థైర్యం, ధైర్య సాహసాలు నేటి తరానికి ఆదర్శం.

Tags:    

Similar News