ఆంధ్రా స్కూళ్లలో టీచర్లకు ఎన్ని రకాల వేధింపులో!

ఉపాధ్యాయుడా, నిన్ను నువ్వే కాపాడుకో...;

Update: 2025-08-04 03:27 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ కార్యాలయం  పాఠశాలలకు చేరిన మూల్యాంకన పుస్తకాలను చూసిన వాళ్లకి ఉపాధ్యాయ ఉద్యోగం ఎంత దారుణంగా మారిందో అర్థం అవుతుంది.


పై అధికారులు ‘ఉపాధ్యాయులను మేము నమ్మం,’ అన్నట్లుగా ప్రతిదానికి స్కాన్లు అప్లోడ్ చేయడానికి పెట్టి మానసికంగా హింసించటమే పనిగా పెట్టుకున్నట్టున్నారు.

ఒక్కొక్క విద్యార్థికి మామూలు పరిస్థితులలో వారి నోట్స్ లో ప్రాజెక్టు వర్క్ లు మిగిలిన టూల్స్ దిద్ది పరీక్ష పేపర్లు ఉపాధ్యాయులు వీలును బట్టి ఇంటికైనా గాని వెళ్లి చక్కగా దిద్దుకొని వచ్చేవారు. ఇప్పుడు ఇన్ని పుస్తకాలు ఇంటికి మోసుకొని పోయే పని కాదు. బడిలో చేయడానికి సమయం లేకుండా విద్యా శాఖే చేస్తూ ఉన్నది. అంతేకాకుండా వీరు ఈ పథకాన్ని ఎక్కడి నుంచైతే స్వీకరించారో అక్కడ ఈ పనులు చేయడానికి అనగా ఓఎంఆర్ షీట్ స్కానింగ్ ఇత్యాదులు చేయడానికి కచ్చితంగా ఒక జూనియర్ అసిస్టెంట్ ఉంటాడు. లేదా రికార్డు అసిస్టెంట్ ఉంటారు.

ఎక్కువ శాతం ప్రాథమిక పాఠశాలలో, ముఖ్యంగా ఇద్దరు టీచర్లే పనిచేస్తున్న పాఠశాలల్లో 15 మందివి స్కాన్ చేయాలన్న కనీసము 30 నుండి 45 స్కాన్లు చేయాలి.

దీనికి తోడు అది ఎంతవరకు స్వీకరిస్తుంది అనేది తెలియదు. అనవసరమైన మానసిక హింస. అంతేకాక గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చినట్టు ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్ గురించి దిద్దటము మరలా ఓఎంఆర్ (OMR) లలో నమోదు చేయటం ఒక్కొక్క ప్రశ్నకు ఎన్ని మార్కులు వేసాము ఎందుకు వేసాము ఇవన్నీ రాయటం అనేది అసలు పని కంటే కొసరు పని ఎక్కువైంది అన్నట్లైంది .

వీటన్నిటికీ కాలహరణం తప్ప వీటివల్ల వనగూడే ప్రయోజనము ముఖ్యంగా విద్యార్థికి సున్న. ఇవన్నీ కూడాను ఎవరికోసమో చేస్తున్నట్లుంది తప్ప నిజంగా విద్యార్థి అభివృద్ధికి మాత్రం కాదు అని కచ్చితంగా తెలుస్తుంది.

ఎందుకంటే పాఠశాలలో ఉండే సమయంలో ఉపాధ్యాయులని మరమనుషులుగా మార్చటానికి కంకణం కట్టుకొని మరి ప్రభుత్వాలు పని చేస్తున్నట్లుగా ఉంది.

అలవి గాని పనులన్నీ మీరు చెయ్యాలి అని చెప్తూ మరల పిల్లలలో అభివృద్ధి ఎందుకు రావట్లేదు అని ప్రశ్నించడం.

నిజం చెప్పాలి అంటే ఈ సంవత్సరం, ముఖ్యంగా ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నరకం అంటే ఏమిటో చూస్తున్నారు. ప్రతిరోజు దాదాపుగా కనీసము ఒకటి లేక రెండు వెబెక్సులు జరుగుతాయి. ఒకటి రాష్ట్రస్థాయి అధికారులు ఇంకొకటి జోనల్ స్థాయి అధికారులు ఇంకా చెప్పాలంటే జిల్లా స్థాయి అధికారులు.

దీనివల్ల వారు చెప్పిన సూచనలని అమలు చేయడానికి కనీస సమయం కూడా లేకుండానే వాటి ఫలితాల గురించి అడుగుతుంటే ఏం చేయాలో తెలియక ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తలలు పట్టుకు కూర్చుంటున్నారు.

అసలు చేయాల్సిన పని ఏంటో చేస్తున్న పని ఏంటో అర్థం కాకుండా పోయింది. అన్ని మూల్యాంకనాలకి ఒకటే పుస్తకం అన్నారు. దానికి మరల భద్రం చేయటం అనేది సంబంధిత ఉపాధ్యాయుల బాధ్యత అన్నారు. మరి ఎవరైనా విద్యార్థి ఇంటికి తీసుకెళ్లి రాసుకోస్తాను అంటే ఉపాధ్యాయులు ఇచ్చే అవకాశం లేదు.

సరైన సమయానికి వారు సమర్పించకపోయినా ఇచ్చిన పని చేయకపోయినా మరలా అది కూడాను ఉపాధ్యాయులకే తలనొప్పి.

ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే ఉపాధ్యాయులుగా ఉండేవారు సన్యసించి ఉద్యోగం చేయాలి. ఏలిన వారి ఉద్దేశ్యం ప్రకారం వారికి వ్యక్తిగత జీవితం ఉండకూడదు లాగుంది.

ఎందుకంటే ఎప్పుడు ఏది అత్యవసరమని చెప్తారో అర్థం కాని పరిస్థితి. పోనీ చెప్పిన దానికి కనీస సమయం ఇస్తారా అంటే అది లేదు.

శనివారం సాయంత్రం లేదా శుక్రవారం సాయంత్రం ఒక పని చెప్పి సోమవారానికల్లా పూర్తయిపోవాలి అంటారు. అంటే ఆదివారం నాడు కూడా మీరు పని చేయాలి అని చెప్పకనే చెబుతూ ఒత్తిడి తెస్తున్నారు.

ఏ ప్రభుత్వం వచ్చినా ఇందులో మార్పులు లేవు.

ఇకపోతే ఇటీవల కాలంలో ఏ శాఖలోనూ లేని విధంగా విద్యా రంగంలో మాత్రమే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేయాలని సాయంత్రం బడి తర్వాత ఒక గంట విద్యా శక్తి కార్యక్రమం కోసం కచ్చితంగా పనిచేయాలని ఉన్నత పాఠశాలలు ఉపాధ్యాయులను నిర్బంధిస్తున్నారు.

సంఘాలు అడిగినప్పుడు నిర్బంధం కాదు అని చెప్తారు. కానీ జిల్లా మండలాధికారులు మేము వస్తున్నాము మీరు జరపాలి... కచ్చితంగా మేము చూస్తాము.. రిపోర్టులు ఇస్తాము... లాంటి మాటలతోటి ఉపాధ్యాయ లోకంలో భయాందోళనలు సృష్టిస్తున్నారు.

ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఎవరి కోసమని మీరు ఇవన్నీ చేస్తున్నారో వారికి అసలు విద్య మీద ఆసక్తి పోతోంది.

దీనికి ముఖ్య కారణం ఆంగ్లమాధ్యం. ఆ విషయం చెబితే చెప్పిన ఉపాధ్యాయులని లేదా ఇతరులని ఏదో ఒక విధంగా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతోంది. ఈరోజు పాఠశాలలో

వారికి చక్కగా చదువుకోగలిగిన మాధ్యమాన్ని తీసేసి ఆంగ్ల మాధ్యమం మాత్రమే పెడతాము అనటం వల్ల దాదాపు 40 శాతం మంది పిల్లలు బడికి రావాలంటేనే భయపడుతున్నారు.

ఇటీవల ఉన్నతాధికారులు ఈసారి పదవ తరగతి పరీక్షలు ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే రాయాలి అంటున్నారు. ఎంతోమంది విద్యార్థులకు ఇది చాలా బాధను కలిగించే నిర్ణయం. ప్రపంచంలో ఎక్కడా కూడాను వారి మాతృభాషను దూరం చేస్తున్న ప్రదేశం బహుశా మన ఆంధ్రప్రదేశ్ ఏమో...

ఇలాంటివన్నీ కూడాను ఉపాధ్యాయ లోకంలో భయాందోళనలను సృష్టిస్తూ ప్రశాంతంగా సాగవలసిన విద్యారంగ కార్యక్రమాలను హడావిడిగా మార్చేసి... ఎవరికోసం మేము ఇన్ని చేస్తున్నాము అని చెప్తున్నారో.....వారికి బాధ్యత లేకుండా చేసి ప్రతిదీ ఉపాధ్యాయుడే అనటం వల్ల ఇటీవల కాలంలో ఎంతోమంది ఉపాధ్యాయులు అనారోగ్యం పాలు కావటం లేక మరణించడం జరుగుతుంది. 
 
-ఒక ప్రభత్వ పాఠశాల ఉపాధ్యాయుడు


Tags:    

Similar News