తెలుగు అనువాదం ‘పరువు’ నిలబెట్టిన ఝాన్సీ పాపుదేశి
కన్నీళ్లను…లిపిలేని భాషలోకి నువ్వెలా తర్జుమా చేయగలుగుతావు?;
By : తాడి ప్రకాష్
Update: 2025-08-01 10:43 GMT
ప్రేమ పారవశ్యంతో నువ్వు నవ్వులై విరబూస్తావు. నీ సుకుమార హృదయాన్ని చీల్చి వాళ్ళు రక్తం కళ్ళజూస్తారు.
కత్తితో నరికినపుడు నువ్వేభాషలో మాట్లాడతావు.? కన్నీళ్లను…లిపిలేని భాషలోకి నువ్వెలా తర్జుమా చేయగలుగుతావు?
పంజాబ్ లో ఒక క్రూరమైన పరువుహత్య గురించి మనం మాట్లాడుకుందాం. ఝాన్సీ పాపుదేశి దోసిళ్లతో తెచ్చియిచ్చిన విషాదాన్ని పంచుకుందాం.
ఇది పాతికేళ్ల కిందటి నిజ జీవిత కథ. మిట్టూ, జెస్సీ అనే ఇద్దరూ ఇష్టపడ్డారు. తొలిచూపుల ఆకర్షణ గాఢమైన ప్రేమగా ఆ యువ హృదయాలను కుదిపేసింది. మిట్టూ అసలు పేరు సుఖ్వీందర్ సింగ్. తక్కువ చదువుకున్నాడు. పేదవాడు. జెస్సీ కోట్లకు పడగలెత్తిన వాళ్ల కూతురు. ఇద్దరూ పంజాబ్ లో ఒక ప్రాంతంలో వాళ్ళే. తల్లిదండ్రులు ఏనాడో కెనడా వెళ్లిపోవడం వల్ల జెస్సీ అక్కడే పుట్టింది. బాగా చదువుకున్న జెస్సీ చూపు తిప్పుకోలేని అందంతో మెరిసిపోయేది.
సెలవు రోజులు గడపడానికి పంజాబ్ వచ్చింది జెస్సీ. ఒకచోట అకస్మాత్తుగా మిట్టూ కనిపించాడు. చూసి చూడగానే ఈ యువకుడే తన జీవితం అనుకుంది. జెస్సీకి 25 ఏళ్లు మిట్టూకి 24 ఏళ్ళు. వాళ్లు కలుసుకున్నారు. మాట్లాడుకున్నారు. ఒక వుద్వేగంతో కన్నీళ్ళతో కావలించుకున్నారు. కలిసి ఉందాం అని గట్టిగా అనుకున్నారు. అది ప్రమాదం అని మిట్టూకి తెలుసు. వాళ్లు బతకనివ్వరు, వాళ్లు చంపేస్తారనీ తెలుసు. అదే చెప్పాడు. జెస్సీ ధైర్యవంతురాలు. ఏది ఏమైనా నువ్వు నాకు కావాలి అనింది. ఆ కళ్ళల్లో నీటి పొర చూసి మిట్టూ కరిగిపోయాడు. ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నారు.
భార్యాభర్తలుగా కలిసి బతికారు. తొలినాళ్ల ప్రేమానుభవంతో పులకించిపోయారు. కూతురు చేసిన పని తెలుసుకున్న జెస్సీ తల్లి కోపంతో, పగతో వూగిపోయింది. ధిక్కారానికి తగిన శిక్ష వేయాలనుకుంది. కిరాయి హంతకులకు డబ్బు ఇచ్చింది.
అది జూన్ 8, 2000 సంవత్సరం. మిట్టూని దూరంగా ఒక చోటికి లాక్కెళ్ళి కత్తులతో పొడిచారు. వొళ్ళు చీరేశారు. తల పగిలి అపస్మారకంగా పడిపోయాడు...నెత్తుటి మడుగులో. చనిపోయాడు అనుకున్నారు. జెస్సీని లాక్కొచ్చారు. ఆమెను ఒక కుర్చీకి కట్టేశారు. నోట్లో గుడ్డలు కుక్కారు. కెనడాలో ఉన్న ఆమె తల్లి మల్కిత్ కౌర్ కి ఫోన్ చేశారు. ఆమె ఫోన్ స్పీకర్ మోడ్ లో పెట్టమని అడిగింది. ‘నీ మొండి తనం చాలిక. వాడు చచ్చిపోయాడు. నువ్వు కెనడా వచ్చేయ్’ అని కూతురితో చెప్పింది.
‘అలా ఎప్పటికీ జరగదు. మిట్టుతోనే ఉంటాను’ అని తెగేసి చెప్పింది. “దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి” అని తల్లి హంతకులకు చెప్పింది. యవ్వన సౌందర్యంతో వెలిగిపోతున్న జెస్సీని క్రూరంగా నరికేశారు. అత్యాచారం చేశారని అనుమానం. అయితే చివరిదాకా తల్లికి గాని, మాకు గాని జెస్సీ లొంగ లేదు అని హంతకులు చెప్పారు. నెత్తురోడుతున్న జెస్సీని ఒక చెరువులో విసిరేసారు.
కొన ఊపిరితో ఉన్న మిట్టూ కొందరి సాయంతో ఒక క్రిస్టియన్ ఆస్పత్రిలో చేరాడు. కొన్ని వారాల తర్వాత కోలుకున్నాడు. డబ్బు పలుకుబడీ పుష్కలంగా ఉన్న ఆమె తల్లీ, సోదరుడు మిట్టూమీద కేసు పెట్టారు. మా అమ్మాయిని కిడ్నాప్ చేసి లాక్కెళ్ళి పెళ్లి చేసుకున్నాడని అన్నారు. పోలీసులకు లంచాలు అందాయి. మిట్టూని అరెస్టు చేశారు. ఆపరేషన్లతో, విరిగిన ఎముకలతో ఉన్న మిట్టూకి పోలీసులు మళ్లీ నరకం చూపించారు. గత 25 ఏళ్లలో అప్పుడప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చి ఏదో ఒక తప్పుడు కేసుతో అరెస్టవుతూనే ఉన్నాడు మిట్టూ. ఈనాటికీ అతను జైల్లోనే ఉన్నాడు.
జుపిందర్ జిత్ సింగ్ సాహసం
సీనియర్ జర్నలిస్టు, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ జుపిందర్ జిత్ సింగ్ ఇన్నేళ్లుగా ఈ పరువు హత్య గురించి రాస్తూనే ఉన్నాడు. అతన్ని జెజె అంటారు అంతా. శక్తిమంతుడైన జర్నలిస్టు మాత్రమే కాదు. గొప్ప హృదయంవున్న మనిషి. కేసు డీల్ చేస్తున్నప్పుడు మిట్టుతో స్నేహం కుదిరింది. మిట్టూకు ధైర్యం చెప్పి, మంచి భోజనం పెట్టించి, మందులకీ, అవసరాలకీ డబ్బు ఇస్తున్నవాడు.
చండీగఢ్ లోని ‘ట్రిబ్యూన్’ డైలీ కి డిప్యూటీ ఎడిటర్ జెజె. ఒక కెనడియన్ జర్నలిస్టుతో కలిసి ‘జస్టిస్ ఫర్ జెస్సీ’ అనే పుస్తకం రాశారు. దాన్నే ‘డియర్ జెస్సీ’ పేరుతో సినిమా తీశారు. భగత్ సింగ్ పిస్టల్ కనుక్కోవడం కోసం జెజె కృషి అందరి దృష్టినీ ఆకర్షించింది. తన పరిశోధనని ‘డిస్కవరీ ఆఫ్ భగత్ సింగ్ పిస్టల్ అండ్ హిజ్ అహింస’ అనే పుస్తకం రాశారు. అది హిందీ, పంజాబీ భాషల్లోకి అనువాదం అయింది. క్రైమ్ రిపోర్టింగ్ లో ఆరితేరిన జెజె… మిట్టూ కేసు మలుపు తిరగడంలో ప్రధాన పాత్ర వహించారు.
మిట్టూ తల్లి, జెజె కలిసి పడ్డ పాట్లు అన్నీ యిన్నీ కావు. 17-18 సంవత్సరాల తర్వాత వాళ్ల కల నెరవేరింది. మిట్టూపై పెట్టినవన్నీ దొంగ కేసులేనని కోర్టు తేల్చి చెప్పింది. జెస్సీ కిరాతక హత్యకు ఆమె తల్లి మల్కీత్ కౌర్, ఆమె అన్నయ్య కారకులని కోర్టు నిర్ధారించింది. చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాక 2019 జనవరి 24న కెనడా వెళ్లిన పంజాబ్ పోలీస్ టీం ఎలాంటి హడావుడి చెయ్యకుండా 66 ఏళ్ల మల్కీత్ కౌర్, ఆమె అన్న 72 ఏళ్ల బదేషానీని పంజాబ్ తీసుకువచ్చి జైల్లో పడేశారు.
జెస్సీ లేదన్న వేదనతో కుంగిపోయిన మిట్టూ తాగుడికి అలవాటు పడ్డాడు. డ్రగ్స్ వాడి నిర్వేదంతో ఒంటరితనంలో మగ్గిపోయాడు. మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తున్నాడని, డ్రగ్స్ కు బానిస అయ్యాడనీ పోలీసులు మిట్టూని మళ్లీ అరెస్టు చేసి కక్ష సాధించారు. జైల్లో ఉన్న జెస్సీ తల్లి ఒకణ్ణి మిట్టూ దగ్గరకు పంపించింది. కోరినన్ని కోట్లు ఇస్తాం, అడిగినంత భూమి ఇస్తాం కేసు వెనక్కి తీసుకోమని అతను అడిగాడు. కొట్టుమిట్టాడే ప్రాణం తప్ప ఏమీ మిగలని మిట్టూ ‘నా జెస్సీకి ద్రోహం చేయలేను’ అని చెప్పాడు. జెస్సి నా ఆత్మ. ఆత్మ ద్రోహానికి పాల్పడలేనని అన్నాడు. కోట్ల డబ్బూ, సుఖవంతమైన జీవితం అక్కర్లేదని అనుకున్నాడు.
2025, జూలై 31– ఈరోజుకీ మిట్టు జైల్లోనే ఉన్నాడు. న్యాయం కోసం ఎదురుచూస్తున్నాడు జెజె. ఈ ట్రాజడీని ‘BUCHERED FOR LOVE’ అనే నవల రాశాడు. ఒక భయానకమైన క్రైమ్ ని, మనుషుల కిరాతక స్వభావాన్ని, పరిమళించిన ప్రేమ సుగంధాన్నీ కలిపి మరిచిపోలేని ఒక కన్నీటి కావ్యం రాశాడు జెజె. వందల పరువు హత్యల్లో ఇదొకటి అయినా అద్భుతమైన జర్నలిస్టిక్ ప్రజెంటేషన్ తో గుండెలవిసి పోయేలా రాశాడు.
ఝాన్సీ పాపుదేశి జిందాబాద్
ఈ వంద పేజీల నవలని హృదయాన్ని తాకేలా అందమైన తెలుగులోకి అనువదించారు రచయిత్రి ఝాన్సీ పాపుదేశి. చిత్తూరు జిల్లా పేదల, బడుగు రైతుల, దిక్కుమాలిన బ్రతుకుల్ని హృదయం ద్రవించేలా ఆమె రాసిన కథా సంపుటి ‘దేవుడమ్మ’ చదివి తీరాలి.
ఈ పుస్తకం ‘పరువు’ అనువాదం పవర్ ఫుల్ గా ఉంది. బాధల ముళ్ళు గుచ్చుకొని, బతుకు పచ్చి గాయమైనప్పుడు దాన్ని అక్షరాల్లోకి అనువదించడం అంత తేలికేమీ కాదు. తర్జుమా చేస్తున్నపుడు మూల రచనలోని పరిపూర్ణత సాధించడం కష్టం. స్వేచ్ఛనువాదం, యథాతథ అనువాదాల మధ్య కొట్టుమిట్టాడుతూ మూలానికి అతి చేరువుగా వుండి ఒరిజినల్ లోని సహజత్వాన్ని పాఠకుడికి–అందించడం ఒక పెద్ద ఫీట్.
అనువాదం చేసే వాళ్ళకి మూల భాష, మాతృభాషలో సమాన ప్రావీణ్యం ఉండాలి. మూల భాష సంప్రదాయం, నుడికారం, స్వభావం బాగా తెలిసి వుండాలి. మాతృభాషలో సృజనాత్మక రచనలు చేసే సామర్థ్యం వుంటేనే అనువాదం ఆకట్టుకునేలా చేయగలరు. అసలు అనువాదం చదువుతున్నామనే భావనే రానీయలేదు ఝాన్సీ. జీవితంలో నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం అన్నారు. అందుకేనేమో “అడ్డుగోడలు లేని ప్రేమలోకాన్ని కలలుకనే అందరికీ” అంకితం ఇచ్చారు ‘పరువు’ని. మాటల్లో చెప్పలేని ఒక వేదనాభరితమైన అనుభవాన్ని ఈ ‘డాక్యు డ్రామా’లో జెజె సమర్థంగా ఆవిష్కరిస్తే అంతే ఎఫెక్టివ్ గా తెలుగులోకి తెచ్చారు ఝాన్సీ పాపుదేశి.
‘పరువు’ ప్రత్యేకత ఏమిటంటే దీన్ని జెజె అనే జర్నలిస్టు రాస్తే, ఒకనాడు జర్నలిస్ట్ అయిన ఝాన్సీ అనువదిస్తే, జర్నలిస్ట్ ప్రసేన్ ముందుమాట రాయడం.
సమాజం పట్ల కన్ సర్న్ వున్న సెన్సిబుల్ రచయిత్రి ఝాన్సీ అని చెప్పడానికి ఒకే ఒక్క కారణం…అనువాదం చేయడానికి ఈ పుస్తకాన్ని ఎంచుకోవడమే.