తెలుగునాట తొలి మహిళా కళాశాల రూపశిల్పి రాజేశ్వరిమూర్తికి 104 యేళ్లు
ఆమె కాలంలోనే తిరుపతి పద్మావతి మహిళా కళాశాలకు జాతీయ గుర్తింపు వచ్చింది;
ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా కళాశాల రూపశిల్పి రాజేశ్వరి మూర్తి కి ఇప్పడు 104వ సంవత్సరం. డిసెంబర్ 10వ తేదీ మంగళవారం నాటికి 103ఏళ్ళు పూర్తి చేసుకుని, 104వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. మూడేళ్ళ క్రితమే ఈ విద్యాప్రదాత శత వసంతాలు పూర్తి చేసుకోవడం ఒక అపురూపమైతే, ఇంత వయసులో కూడా ఈనాటికి ఆమె మహిళల విద్య గురించే మాట్లాడడం, కలవరించడం అబ్బురపరుస్తోంది. రాజేశ్వరి మూర్తి ప్రస్తుతం న్యూయార్క్ లో ఒంటరిగానే జీవిస్తున్నారు. తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా కళాశాలను 1952లో స్థాపిస్తే, రాజేశ్వరి మూర్తి 1954లో ఆ కళాశాలకు ప్రిన్సిపాల్ గా వచ్చి, ఇరవై రెండేళ్ళపాటు సేవలందించి, దేశంలోనే అత్యుత్తమ్మ మహిళా కళాశాలగా దాన్ని తీర్చిదిద్దిన రూపశిల్పి ఆమె.
స్త్రీలకు చదువులు సరిగా లేని రోజులవి. ఆమె జీవితం కూడా అందుకు భిన్నంగా లేదు. కాకినాడకు చెందిన రాజేశ్వరి పీయూసీ వరకు మాత్రమే చదువుకున్నారు. కాలేజీ చదువులకు తండ్రి అంగీకరించినా, తల్లి అభ్యంతరం చెప్పింది. ఆ రోజుల్లో కాలేజీకి వెళ్ళి ఆడపిల్లలు పైచదువులు చదవడం చాలా అరుదు. మద్రాసులోని మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్ గా చేస్తున్న కాకినాడకు చెందిన మూర్తితో రాజేశ్వరికి వివాహం జరిగింది. ఆయన ప్రోద్భలంతోనే రాజేశ్వరి మూర్తి బిఎస్పీ ఆనర్స్ చేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో గణిత అధ్యాపకురాలుగా చేరారు. ఒక పెళ్ళికి హాజరవడానికి 1954లో ఆ దంపతులు తిరుపతి వచ్చారు. టీటీడీ చైర్మన్ అన్నారావు ప్రొఫెసర్ మూర్తితో మాట్లాడుతూ, తిరుపతిలో పద్మావతి మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్ గా రాజేశ్వరి మూర్తిని దరఖాస్తు చేయమని కోరారు. ఆ రోజుల్లో తిరుపతి రావడానికి ఆమె వెనకాడినప్పటికీ, అన్నారావు నచ్చచెప్పి, ఆమె చేత దరఖాస్తు చేయించి ప్రిన్సిపాల్ గా ఆమెను నియమించారు. తిరుపతిలోని ఎస్పీడబ్ల్యు కాలేజి ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పిన తొలి మహిళా కళాశాలగా గుర్తింపు పొందింది. దీనికంటే ముందు హైదరాబాదు కోటీలో నెలకొల్పిన ఉమన్స్ కాలేజి పేరు ఆ రాష్ట్రంలో నెలకొల్పిన తొలి మహిళా కళాశాలగా నమోదైంది.
కొంత కాలానికి రాజేశ్వరి భర్త మూర్తి కూడా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేరారు. వీరికి పిల్లలు లేరు. ఎస్పీ డబ్ల్యు కాలేజీ విద్యార్థినులే తన పిల్లలుగా రాజేశ్వరి మూర్తి భావించి వారి అభ్యున్నతికి రాత్రింబవళ్ళు కృషి చేశారు. కాలేజీ తప్ప ఆమెకు మరో ధ్యాస లేదు. రాత్రి బాగా పొద్దుపోయాక ఎప్పుడో పదకొండు గంటలకు ఇంటికి చేరే వారు. మూర్తికి ఆరోగ్యం దెబ్బతిని (1965-70) తిరుపతి రూయా ఆస్పత్రిలో చేరారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. భర్త ఆస్పత్రిలో చేరిన సమయంలో కూడా రాజేశ్వరి మూర్తి కాలేజీ పనుల్లోనే నిమగ్నమై ఉన్నారు. ఆయన పోయారన్న విషయం తెలిసి ఎక్కడ కుప్పకూలిపోతారోనని చెప్పడానికి తోటి అధ్యాపకులు చాలా వెనకాడారు. కానీ చెప్పక తప్పలేదు. భర్త పోయినా, పిల్లలు లేకపోయినా, కాలేజే తన సర్వస్వంగా 1976 వరకు అక్కడే పనిచేశారు.
తిరుపతిలో టీటీడీ నెలకొల్పిన శ్రీ పద్మావతి మహిళా (ఎస్పీడబ్ల్యు) కాలేజీలో రెండేళ్ళ ఇంటర్మీడియట్ లో మాత్రమే విద్యార్థులు ఉండేవారు. డిగ్రీ కోర్సులకు అనుమతి ఉన్నా, 1954 వరకు విద్యార్థినులు లేరు. పక్కా భవనాలు లేవు. ముప్పై మంది విద్యార్థులు, ఎనిమిదిమంది అధ్యాపకులున్న ఈ కళాశాలకు లైబ్రరీ లేదు, లేబెరేటరీలు లేవు. పరీక్షలకు, ప్రాక్టికల్స్ కు ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకే వెళ్ళాల్సి వచ్చేది. ఈ కాలేజీ ఆంధ్రా యూనివర్సిటీకి అనుబంధంగా సాగేది. ఆ రోజుల్లో ఎస్వీ ఆర్ట్స్ కాలేజీని డబ్బారేకుల కాలేజి అనేవారు. ఒక వంట మనిషి వచ్చి హాస్టల్ లో వంట ఒండిపెట్టి పోతే, విద్యార్థులంతా నేలపైనే కూర్చుని తమకు తామే వడ్డించుకుని భోజనం చేసేవారు. చాలా ఇబ్బందిగా ఉండేది. నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి పిల్లలు కూడా ఈ కళాశాలలో చదువకుంటుండేవారు. ఈకాలేజీకి నీలం సంజీవరెడ్డి వచ్చినప్పుడు ‘‘మన పిల్లలు కింద కూర్చుని భోజనం చేస్తే మనకే అవమానం కదండి’’ అని రాజేశ్వరి మూర్తి అంటే, వెంటనే ఆయన అన్నారావును పిలిచి బెంచీలు ఏర్పాటు చేయమని ఆదేశించారు. ఇలా ఒక్కొక్కటీ ఆ కాలేజీకి సమకూరుస్తూ వచ్చారు.
కాలేజీకి పక్కా భవనం కావాలంటే ఏ ఇంజినీరో ప్లాన్ చేస్తారు. కానీ, ఎస్పీ డబ్ల్యు కాలేజీకి ఏ క్లాస్ రూము ఎంత పొడవు, వెడల్పు ఉండాలి, లేబొరేరటరీలు ఎక్కడ ఉండాలి, టాయిలెట్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి, షింకులు ఎక్కడ పెట్టాలి వంటి వన్నీ రాజేశ్వరి మూర్తి స్వయంగా చెప్పి చేయించారు. వీటన్నిటినీ ఆమె దూరదృష్టితో చేయించినవే. తొలిరోజుల్లో కేవలం గణితం, జువాలజీ, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాలు మాత్రమే ఉండేవి. ఆర్ట్స్, కామర్స్ విభాగాలు లేవు. క్రమంగా ఆమె అన్ని విభాగాలను పెట్టించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని హోంసైన్స్ విభాగాన్ని డిగ్రీ స్థాయిలో ఎస్పీడబ్ల్యు కాలేజీలో తొలిసారిగా పెట్టించారు. హోం సైన్స్ లో డిగ్రీ చేసిన వారి కోసం ఎస్వీ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పెట్టమంటే తొలి వైస్ చాన్స్ లర్ గోవిందరాజులు నాయుడు డబ్బులు లేవన్నారు. ముఖ్యమంత్రి సంజీవరెడ్డి వచ్చినప్పుడు రాజేశ్వరి మూర్తి అడిగితే, పీజీ పెట్టడానికి డబ్బులు ఇమ్మని టీటీడీ చైర్మన్ అన్నారావును సంజీవరెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన పియర్న్ అనే అధ్యాపకురాలిని కెనడా నుంచి రాజేశ్వరి మూర్తే పిలిపించారు. మొదటి రెండేళ్ళ వరకు ఎస్పీడబ్ల్యు కాలేజీ సహకారంతోనే యూనివర్సిటీలో ఆ పీజీ కోర్సు నడిచింది. కాలేజీలో పాపులేషన్ ఎడ్యుకేషన్ ను కూడా ప్రారంభించారు.
టీటీడీ నిర్వహించే ఎస్పీడబ్ల్యు కాలేజీ హాస్టల్ లో అప్పటి వరకు మాంసాహారం లేదు. మాంసాహారం పైన టీటీడీ నిషేధం లేకపోయినప్పటికీ, అధ్యాపకులంతా శాఖాహారులవడం వల్ల మాంసాహారం పట్ల అభ్యంతరాలుండేవి. రాజేశ్వరి మూర్తి శాఖాహారి. మాంసాహార విద్యార్థుల కోసం విడిగా మాంసాహారం చేయించి వడ్డింప చేశారు. హాస్టల్ లో ఫీజులు కట్టలేని విద్యార్థులకు టీటీడీ నుంచి నిధులు విడుదల చేయించారు.
హార్వర్డ్, కొలంబియా వంటి విదేశీ విశ్వవిద్యాలయాలతో విద్యాపరమైన సంబంధాలు పెట్టుకున్నారు. అమెరికా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వారు, ఫోర్డ్ ఫౌండేషన్ వారి దగ్గరకు ఇక్కడి అధ్యాపకులను శిక్షణ నిమిత్తం పంపారు. మహిళలు అన్ని రంగాల్లో జ్ఞాన సముపార్జనకు కేవలం సైన్స్ మాత్రమే సరిపోదని, అన్ని విభాగాలూ కావాలని ఆకాంక్షించారు. ఈ కళాశాలలో సంగీత విభాగాన్ని కూడా పెట్టించారు. తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాక అందులో సంగీత విభాగం ఉందని, ఎస్పీడబ్ల్యు కాలేజిలో ఆ విభాగాన్ని ఎత్తేయించడం పట్ల రాజేశ్వరి మూర్తి తొమ్మిదేళ్ళ క్రితం నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.
నార్త్ కెరొలినా విశ్వవిద్యాలయం ఆహ్వానంపై రాజేశ్వరి మూర్తి మూడు నెలలు సెలవు పెట్టి 1976లో అమెరికా వెళ్ళారు. అక్కడ భారతీయ సంస్కృతి పైన ప్రసంగించారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టొరల్ చేశారు. ‘కమ్యూనిటీ కాలేజెస్ ఆఫ్ ఇండియా’ అన్న అంశంపైన పరిశోధన చేశారు. మరొక నెల సెలవు పొడిగించడానికి టీటీడీ అంగీకరించలేదు. దాంతో ‘‘ఎస్పీడబ్ల్యు కాలేజీ ప్రిన్సిపాల్ పదవినుంచి ముందుగా రిటైర్ అవుతున్నా’’ నని టీటీడీకి లేఖ పంపించారు. అమెరికాలోని యునైటెడ్ నేషన్స్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ లో చేరి, రిజిస్ట్రార్ గా ఉద్యోగ విరమణ చేశారు. ఆ పదవిని అక్కడ వైస్ ప్రసిడెంట్ అంటారు. అమెరికాలో మూడు అవార్డులు తీసుకున్నారు. అమెరికా పౌరులకు మాత్రమే ఇచ్చే ఉత్తమ పాలనా దక్షురాలి అవార్డును అక్కడి ప్రభుత్వం రాజేశ్వరి మూర్తికిచ్చి గౌరవించింది.
రాజేశ్వరి మూర్తి అమెరికాలోనే స్థిరపడిపోయారు. మహిళల విద్య ఆలోచన తోనే ఆమె ఒంటరి జీవితాన్ని జయించారు. ఆమె దగ్గర చదువుకున్న విద్యర్థుల్లో చాలా మంది న్యాయమూర్తులు గా, పాలనా దక్షులుగా, వైద్యులుగా, విద్యావేత్తలుగా అనేక రంగాల్లో రాణించారు. రాజేశ్వరి మూర్తి దగ్గర చదువుకున్న విద్యార్థినులు ఎవరూ ఆమెను మర్చిపోరు. అమెరికా వెళితే, ఆమెను పలకరించకుండా రారు. తరచూ భారత దేశం రావడం తిరుపతిలో తన విద్యార్థినులను చూడడం కోసమే వస్తుంటారు. ఎస్పీడబ్ల్యు కాలేజీ విద్యార్థినులనే కాదు, అధ్యాపకులను కూడా తన పిల్లలుగా భావిస్తుంటారు. ఆమె దగ్గర చదువుకున్న తొలి తరం విద్యార్థినుల్లో డాక్టర్ ప్రేమావతి వయసు ఇప్పుడు ఎనభై మూడేళ్ళు. ఇటీవల ఎస్పీడబ్ల్యు కళాశాల మాజీ అధ్యాపకురాలు మీనా అమెరికా వెళ్ళినప్పుడు, న్యూయార్క్ లో పరిశోధన చేస్తున్న శృతి అనే విద్యార్థిని తో కలిసి రాజేశ్వరి మూర్తి చేత కేక్ కట్ చేయించి ముందుగానే ఆమె 103వ పుట్టిన రోజును జరిపించడం చాలా అబ్బురపరిచే విషయం. ఆమె తిరుపతికి చివరికి సారిగా 2016లో వచ్చినప్పుడు ఆలిండియా రేడియో కోసం నేను ఇంటర్వ్యూ చేశాను. అంతకు ముందు ఒక సారి వచ్చినప్పుడు కూడా నేను చేసిన ఇంటర్వ్యూ ‘సాక్షి’ లో వచ్చింది. తన తదనంతరం తన ఆస్తిలో సింహ భాగం ఎస్పీడబ్ల్యు కాలేజీకి రాశారు. మిగతాది ఎస్వీ యూనివర్సిటీకి, టీటీడీకి చెందేలా వీలునామా రాసేశారు.
నూటా మూడేళ్ళు నిండిన వయసులో రాజేశ్వరి మూర్తి కి వినికిడి సమస్య తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలూ కూడా వచ్చాయి. ఆమెకు తొంభై అయిదేళ్ళు ఉన్నప్పుడు, 2016లో చివరి సారిగా తిరుపతి వచ్చినప్పుడు, ఆమె శిష్యురాలు ప్రేమావతి ‘‘తిరుపతికి వచ్చేయండి మేడం’’ అని అడిగారు. ‘‘లేదు ప్రేమా..నాకు అక్కడ బాగుంది. నమ్మకమైన కేర్ టేకర్లు ఉన్నారు. ఇండియాలో నాకు ఎవరు చేస్తారు చెప్పు? మీరంతా పెద్దవాళ్ళయ్యారు’’ అని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ‘‘ఇండియా వచ్చేయాలి’’ అన్నది విద్యావేత్త రాజేశ్వరి మూర్తి తీరని కోర్కె.