కనుమరుగవుతన్న పల్లెటూరి గుర్తులు

పొంతలు, కడవలు, కుండలు,కాగులు ,రోలు,రోకలి,ఇసురాయి ,నులక మంచం, ఈత చాపలు బండ, చాట , శేరు,ముంత,పావు, లీటరు డబ్బా , గిన్నెల తక్కిడి, కట్టెతక్కిడి గుర్తున్నాయా

Update: 2024-09-29 08:31 GMT

  సిరిసంపదలు, పక్షుల కిలకిల రావాలు, పచ్చని పంట పొలాలు, వృక్షాలు, గడ్డివాములు, గంజువాసన, కోడి కూతలు, కల్లాపి చల్లి ముగ్గులు వేసిన లోగిళ్లు కనిపించేవి .కుల మతాలు లేకుండా వావివరసలతో పిలుచుకునే బంధాలు, అనుబంధాల బాంధవ్యాలతో అరమరికలు లేకుండా జీవించేవారు. పచ్చిక బయళ్లతో, పంటపొలాలతో ఒకనాడు కళకళలాడిన పల్లెలు ఎన్నో ఎన్నెన్నో . ఆ జీవన విధానం నెమరు వేసుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది.


ప్రజలు ఒళ్లు వంచి కష్టపడి ఉన్నదానితో సంతృప్తికరంగా జీవించిన కాలమది.నేడు ఈ పరిస్థితి మారిపోయింది.కష్టపడేవారు తగ్గిపోయి, ఖర్చులు పెరిగిపోయి గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయంపై ఆసక్తి తగ్గిపోయింది .


చాలా గ్రామాలలో నేడు బీడు భూములు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. బాగా బతికిన చాలా కుటుంబాలు పల్లె నుంచి పట్నానికి వలస వెళ్లి చిన్న చిన్న వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుని జీవన పోరాటాన్ని సాగిస్తున్నారు. పల్లెల్లో జనాభా నానాటికీ తగ్గి పోతోంది.మారుతున్న కాలానుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మార్పులు వచ్చాయి. నవీకరణ లో భాగంగా జీవనవిధానం మారింది. గ్లోబులైజేషన్ తర్వాత విస్తృతమైన మార్పులు ఆరంభమై య్యాయి. అధిక ఇన్‌పుట్ ఖర్చులు, నీటి మట్టం తగ్గడం, నేల సారం క్షీణించడం మరియు ప్రతిఫలించని ధరల విధానాల కారణంగా వ్యవసాయ సంక్షోభం తీవ్రమైంది.


సాంప్రదాయ వ్యవసాయం రాను రాను యాంత్రీకరణం వైపు పరుగిడుతున్నది. కరువు ప్రాంతాల్లో వ్యవసాయం గిట్టుబాటు కాని వ్యవహారంగా తయారైంది. వ్యవసాయం తో పాటు అన్ని రంగాల్లో శరవేగంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడుతున్న నేటి పరిస్థితులలో మార్పు సహజం. మార్పును ప్రతి ఒక్కరూ ఆహ్వానించి తీరాలి. గతం తాలూకు ఆనవాళ్లును, జ్ఞాపకాలను భవిష్యత్తు తరాలకు చూపడానికి భద్రపరచాలి. 




మా చిన్నప్పుడు ఏ పల్లెలో చూసిన గూడ మిద్దెలు, పూరి గుడిసెలు, పాకలు, బోదకొట్టాలు, చవుడు మిద్దెలు , కనిపించేవి. ఇళ్ల ముందు కల్లాపిచల్లి ముగ్గులు పెట్టిన లోగిళ్ళు కనిపించేవి.నేడు వాటి జాడలేదు. కాంక్రీట్ బిల్డింగ్ లు కనిపిస్తున్నాయి. కళ్ళాపి చల్లిన లోగిళ్ళు పండుగులకు మాత్రమే కన్పిస్తున్నాయి. ఎనుములు, ఎద్దులు, ఆవులు, గొర్రెలు, మేకలు ఏదోఒకటి ప్రతి ఇంట్లో కనపడేవి. పాలు, పెరుగు, మజ్జిగ కొనేవారు కాదు.నేడు చాలా గ్రామాలలో పశుసంపద క్షీణించింది .


పల్లెలో పాకెట్ పాలు, పెరుగు కొనే పరిస్థితి దాపురించింది. కిరోసిన్ బుడ్డీలు,లాంతర్లు,దీపాలు,పెట్రమాక్స్ లైటు ఉండేవి. కరెంట్ వచ్చాక కూడా ఎక్కువ పవర్ కట్ ఉండటం వల్ల చాలా కాలం బుడ్డీలు, లాంతర్లు ఉన్నాయి. ఇప్పుడు వాటి ఆనవాళ్లు కూడా కన్పించడంలేదు. ప్రతి ఇంట్లో కట్టెల పొయ్యి ఉండేది. పొయ్యి కు ఒకపక్క పొంత (మట్టి పాత్ర) ఉండేది. అందులో నీళ్ళు పోసి మూత పెట్టి ఉంచే వారు. వంటలు చేసినప్పుడు పొంతలో నీళ్లు వేడి అవుతాయి. వాటిని స్నానం కోసం వాడేవారు. సంగటి, కూరలు అన్ని మట్టి కుండల్లో వండేవారు. కొద్దిరోజులకు సిల్వర్ బోకులు వచ్చాయి.దీంతో మట్టి పాత్రలకు పాతరేశారు. ప్రస్తుతం కుక్కర్, ప్యాన్,తవ్వా , ఓవెన్ కాలం నడుస్తోంది.

పల్లెల్లో ప్రతి ఇంట్లో రాగి సంగటి, జొన్నసంగటి, కొర్రసంగటి , సద్దరొట్టెలు చేసేవారు. అన్నం కొంతమంది ఇళ్లలో చేసేవారు. పట్టణాలకు పనిమీద వెళ్ళినప్పుడు హోటల్ లో ఆనందంగా అన్నం తిని వచ్చేవాళ్ళు. పట్టణాల్లో అన్నం చేసుకొనేవారు. ఇప్పుడు మొత్తం తిరగబడింది. బీపీలు షుగర్లు పెరిగిపోవడంతో పట్టణాలలో ఇప్పుడు చిరుధాన్యాలతోనే ఎక్కువ వంటలు చేసుకుని తింటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఎక్కువ భాగం అన్నం వండుకొని తింటున్నారు.


పొంతలు, కడవలు, కుండలు,కాగులు కూజలు, పొగ గొట్టాలు,రోలు,రోకలి,ఇసురాయి ,నులక మంచం, ఈత చాపలు, రుబ్బురోలు,బండ, వెదురు చాట , శేరు,ముంత,పావు, లీటరు డబ్బా ,తూకాలు వేయడానికి చింతాలి, గిన్నెల తక్కిడి, కట్టెతక్కిడి వాడేవారు.అవి నేడు మచ్చుకైనా కనిపించవు. కూరలు, పాలు, పెరుగు కుండలో పోసి ఉట్టి పైన పెట్టేవారు. ఇప్పుడు పిల్లలకు ఉట్టెలు అంటే తెలీదు. 


లాంపులు, కవ్వం


రైతులు పంటలు పండించడానికి మడకలు, కాడి మాను,చెక్కల దిండు,గుంటక,జడ్డిగం, బొదెలు దిండు ,ఇనుప దంతులు, చెక్క దంతులు, పార, పలుగు, కొడవలి ,లిక్కి, గొడ్డలి , పికాసి, గడారు, మోకు, పగ్గాలు,చాలకోలు, మళ్లుబర్ర ఇలా అనేక వ్యవసాయ పనిముట్లు వాడేవారు. ప్రతి ఇంట్లో ఇవన్నీ కనిపించేవి. ఎద్దుల బండ్లు కొంతమందికే ఉండేవి. మొదట్లో కట్టి బండ్లు ఉండేవి . తర్వాత టైర్ బండ్లు వచ్చాయి. నేడు పల్లెలో చాలా ఇళ్ళలో వ్యవసాయ పనిముట్లు కన్పించడం లేదు. బండ్లు కనిపించవు. కొన్ని గ్రామాల్లో కొన్ని పనిముట్లు పూర్తిగా కనుమరుగై పోయాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు వచ్చాయి పాత వాటికి కాలం చెల్లింది. రైతులు ధాన్యం దాచుకోవడానికి కాగులు, గాదెలు వాడేవారు. వ్యవసాయ పంటలు పండించడానికి బావులు నుంచి నీళ్లు తోడడానికి గూడ,యాతం,కపిల మొదట్లో వాడేవారు. వాటిని మూలాన పడేసి తర్వాత ఆయిల్ ఇంజిన్లు, కరెంట్ మోటార్లు వచ్చాయి. బావుల సేద్యం కనుమరుగై బోర్లు, సబ్ మెర్సిబుల్ పంపులు వచ్చాయి. డ్రిప్ , స్రింక్లర్లు, రైయిన్ గన్స్ వచ్చాయి .

మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడుతున్న సమయంలో వ్యవసాయ పద్ధతుల్లో కూడా మార్పులు రావడం మంచిదె. గతం తాలూకు పద్దతులు, విధానాలు, వస్తువులు భవిష్యత్తు తరాలకు చూపడానికి పాత వాటిని భద్రపరచాలి. కొత్త కొత్త ఆవిష్కరణలు రావాల్సిందే మంచి పరిణామమే కావచ్చు పాత వాటిని పదిలపర్చాలి. పూర్వపు పద్దతులు,నూతన పద్దతులు చూసిన జనరేషన్ కు రెండు విధానాలపైన అవగాహన ఉంటుంది. నేటి యువతరం కు గతం తాలూకు పద్దతులు విధానాలు తెలియవు.గతం తాలూకు పద్దతులు , వస్తువులు వాటిని వినియోగం చేసిన విధానం తెలియడానికి తగిన అవకాశాలు కలిపించి అవగాహన కల్పించాలి.

Tags:    

Similar News