రంగనాయకమ్మతో ఇంటర్వ్యూ-2

భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీల భవిష్యత్తు ఏమిటి? (‘ఫెడరల్ తెలంగాణ’కు ప్రత్యేకం);

Update: 2025-03-18 07:58 GMT

'నేర్పవలిసిన వాడే, నేర్చుకుని తీరాలి!’

కార్ల్ మార్క్స్ (Karl Marx) రాసిన ‘క్యాపిటల్’ (Capital) ను ఎంత మంది చదివి అర్థం చేసుకున్నారన్నది ఒక ప్రశ్న. ‘క్యాపిటల్’ను అర్థం చేసుకోవడం ఎంత కష్టమో, దాన్ని సరళమైన భాషలో పరిచయం చేయడం అంత కంటే కష్టం. ఆ పనిని రంగనాయకమ్మ సాధించారు. ‘క్యాపిటల్’ పూర్వ పరాల తో పాటు, కమ్యూనిస్టు పార్టీలు, విప్లవ గ్రూపుల మధ్య ఉన్న పంథాల తేడాలను కూడా జర్నలిస్ట్ రాఘవ చేసిన ఇంటర్వ్యూలో రంగనాయకమ్మ చర్చించారు.

(నిన్నటి తరువాయి)

ప్రశ్న 6. మార్క్స్ 'క్యాపిటల్' గ్రంథం మానవ చరిత్రను (మానవ నాగరికతా పరిణామ క్రమాన్ని) ఒక మలుపు తిప్పింది. ఇలాంటి 'క్యాపిటల్' చదవాలన్న ఆలోచన మీకు కలగడానికి ఏవి ప్రేరణ కలిగించాయి?

రంగనాయకమ్మ: మార్క్సిజం నేర్చుకోవాలనుకోవాలన్నదే ప్రేరణ. మార్క్సిజానికి సంబంధించిన పుస్తకాలు చదువుతున్నప్పుడు, ‘కాపిటల్’ అనేది, మార్క్సు రచనలలో చాలా ముఖ్యమైనదని చదివాను. మార్క్సు తన జీవితకాలంలో, ఎన్నో సంవత్సరాల పాటు, తనకి పూర్వం వున్న ఆర్థిక శాస్త్రవేత్తలు రాసిన కొన్ని వందల పుస్తకాలు చదివి, రాసిన , చాలా పెద్ద రచన ‘కేపిటల్’ అని తెలిసింది. మరి, మార్క్సిజం అన్నప్పుడు, అంత ముఖ్యమైన రచన చదవకపోతే ఎలా-అని, అది తెలుగులో వుందేమోనని చూస్తే, లేదని తెలిసింది. హైదరాబాదులో, విశాలాంధ్ర బుక్ హౌస్ లో, ఇంగ్లీషు అనువాదం దొరికింది, మాస్కో వాళ్ళు వేసిన అన్ని సంపుటాలూ. ఆ తర్వాత ‘పెంగ్విన్’ వాళ్ళు వేసిన అనువాదం కూడా దొరికింది. అదీ జర్మన్ భాషనించి ఇంగ్లీషులోకి అనువాదమే గానీ, మాస్కోవాళ్ళు వేసిన అనువాదాల తర్వాత వచ్చింది. ‘కాపిటల్’ కి పరిచయం చేసేటప్పుడు నేను, గాంధీ సహాయంతో, ప్రధానంగా మాస్కోవాళ్ళ అనువాదాన్నే ఆధారం చేసుకున్నాను. కొన్ని చోట్ల, ముఖ్యంగా మొదటి సంపుటంలో, పెంగ్విన్ వాళ్ళు, అంతకు ముందు ఇంగ్లీషులోకి అనువాదం అవ్వని, మార్క్స్ రాతప్రతుల్ని అనువదించి, మొదటి సంపుటంలో చేర్చారు. దాన్ని కూడా ఉపయోగించుకున్నాము.

ప్రశ్న 7 : నేను 'క్యాపిటల్' చదవడానికి ప్రయత్నం చేస్తే నాకు అర్థం కాలేదు. చాలా గొట్టుగా ఉన్న ఆ పుస్తకాన్ని మీరు ఎలా అర్థం చేసుకోగలిగారు? మళ్ళీ అంత తేలిగ్గా ఎలా చెప్పగలిగారు?

రంగనాయకమ్మ: కాలేజీల్లో, యూనివర్శిటీల్లో నేర్చుకునేది ప్రధానంగా బూర్జువా ఆర్థిక శాస్త్రాన్ని! ‘కాపిటల్’ అనేది, ఆ బూర్జువా ఆర్థిక శాస్త్రాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించిన పుస్తకం! ఆ రకంగా అది, కొత్త శాస్త్రం. పైగా, ‘కాపిటల్’ ని ఒకటికి రెండు సార్లు, తిరిగి చూసుకుని ఇంకా తేలిగ్గా రాయడానికి, మార్క్స్ కి సమయం చాలలేదు. పని వత్తిడి వల్లా, అనారోగ్యం వల్లా, 64 ఏళ్ళ వయసులోనే, చనిపోయాడు. అలాంటి రచనల్ని, పదే పదే చదివి, కష్టమైనప్పటికీ, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనకి ఎంత ఎక్కువ అర్థం అయితే, అంత ఎక్కువ తేలిగ్గా పాఠకులకు చెప్పగలం.

ప్రశ్న 8 : మార్క్స్ 'క్యాపిటల్' చదివి అర్థం చేసుకోవడానికి మీకు ఎంత కాలం పట్టింది? తెలుగులో అర్థమయ్యేలా, చాలా సరళంగా రాయడానికి ఎంత కాలం పట్టింది? దీనికి ఎవరి సహాయం అయినా తీసుకున్నారా?

జవాబు: ఈ విషయాలన్నీ, గతంలో, ‘పరిచయం’ మొదటి సంపుటంలోనే చెప్పాను.ఈ పరిచయం పని నేనెలా చెయ్యగలిగానంటే, మార్క్స్ ఒరిజినల్కి నేనూ, గాంధీ కలిసి మొదట తెలుగులోకి చాలా క్లుప్తంగా అనువాదం చేసుకున్నాం. అది, పేజీకి ఒక వేపున, 200 పేజీల నోట్ బుక్సులో, 60 నోట్ బుక్స్లోకి వచ్చింది. ఆ అనువాదాన్ని నేను మళ్ళీ మళ్ళీ చదువుతూ పరిచయం పని మొదలు పెట్టాను. అనువాదంలో ఎక్కడైనా స్పష్టత లేదనిపించినప్పుడల్లా, మళ్ళీ ఒరిజినల్ని చూస్తూ, అనువాదాన్ని సరిచేస్తూ! అనువాదం పనే అనేక సంవత్సరాలు పట్టింది.


'పరిచయం'లో, 'సరుకులూ-డబ్బూ' అనే మొట్ట మొదటి భాగం, 1978లో వచ్చింది. తర్వాత, 2వ, 3వ, 4వ భాగాలు, 1987లో ఒకే సారి వచ్చాయి. తర్వాత, 1993లో 5వ భాగం వచ్చింది. దానితో, 'కాపిటల్ పరిచయం' పని, అప్పటికి ముగిసింది! ‘పరిచయం’ రాయడానికి మొత్తం మీద 15 ఏళ్ళు పట్టింది.

కానీ, నిజానికి ఈ పని ఇంకా ఇంకా సాగుతూనే వుంది. ప్రతీ భాగాన్నీ, ప్రతీ రీప్రింటు సమయంలోనూ, మళ్ళీ మళ్ళీ మారుస్తూనే, అక్కడక్కడా సవరిస్తూనే ఉన్నాము ఇప్పటి దాకా.

ప్రారంభంలో 5 పుస్తకాలుగా వున్న ఈ పరిచయం, తర్వాత 2 సంపుటాలుగా అయింది (1వ, 2వ, 3వ పుస్తకాలు, మొదటి సంపుటంగానూ; 4వ, 5వ పుస్తకాలు, 2వ సంపుటంగానూ). మొదటి సంపుటం, 2004 మార్చిలోనూ; 2వ సంపుటం 2006 డిసెంబరులోనూ వచ్చాయి.

ప్రశ్న9 : కమ్యూనిస్టు పార్టీల అగ్ర నాయకులు సహా, విప్లవ కమ్యూనిస్టు అగ్రనాయకుల్లో ఎంత మంది మార్క్స్ 'క్యాపిటల్' చదివి అర్థం చేసుకున్నారని మీరు అనుకుంటున్నారు?

రంగనాయకమ్మ: ఈ సంగతి తెలుసుకుందామని, పరిచయం రాయడానికి ముందు, ఎమర్జన్సీ కాలంలో, మేము ఒక పేద్ద విప్లవ కమ్యూనిస్టు నాయకుణ్ణి అడిగితే, ఆయన సరిగా సమాధానం చెప్పకుండా, “ ‘కాపిటల్’ చదివితీరాలి, లేకపోతే వ్యర్థం’ అనే ధోరణి, పెటీ బూర్జువా మేధావుల వైఖరి. ఇది, చారూ మజుందార్ కాలంలో వుండేది’ అంటూ, కొంచెం చిరాకు పడ్డాడు. ఆయన్ని మళ్ళీ, ‘మీరు గానీ, నాగిరెడ్డి గారు గానీ, సుందరయ్య గారు గానీ, ఇంకెవరైనా చదివారా?’ అని, తరచి అడిగితే, తను చదవలేదనీ, నాగిరెడ్డి కొంత చదివాడనీ, ఇతరుల సంగతి తెలీదనీ అన్నాడాయన! అలాంటప్పుడు, “ఎంతమంది చదివి, అర్థం చేసుకున్నారు?” అని, మీరడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడం కష్టం. కమ్యూనిస్టు పార్టీల వారు, ప్రచురించిన పుస్తకాలలో, ‘కాపిటల్’ దాదాపు లేదనిపించింది. రష్యా, చైనాల్లో కూడా అతి తక్కువ మంది మాత్రమే, తమ రచనల్లో, ‘కాపిటల్’ పుస్తకానికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు అనిపిస్తుంది. ‘రష్యాలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి’ అనే పుస్తకంలో, లెనిన్, చాలా తరచుగా, “కాపిటల్ రచయిత చెప్పినట్టు...” అని ప్రస్తావిస్తూ వుండడం వుంది. చైనాలో, మావో రచనల్లో కూడా, ‘కాపిటల్’ మాట పెద్దగా కనిపించదు. లిన్ పియావో అయితే, ‘కాపిటల్’ పెట్టుబడిదారీ దేశాలకే వర్తిస్తుంది. గతంలో వలసలుగా వున్న దేశాలకు వర్తించదన్నట్టు ఒక ఉపన్యాసంలో చెప్పినట్టు విన్నాను. నాయకుల రచనల్లోనూ, పార్టీ పత్రికల్లోనూ, ‘కాపిటల్’ కి సంబంధించిన ప్రస్తావనలు, నేనైతే పెద్దగా చూడలేదు.

ప్రశ్న 10 : ఒక పక్క మతోన్మాద శక్తులు ముంచుకొస్తున్నాయి. మరొక పక్క కమ్యూనిస్టు పార్టీలు చీలికలు పేలికలై ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీలనూ, గ్రూపులనూ, దాయాది వైరం దహించి వేస్తోంది. దీని నుంచి బైటపడే మార్గం ఏమైనా ఉందా?

జవాబు: నాకు అర్థమైనంత వరకూ, కమ్యూనిస్టు పార్టీలలో, మూడు రకాలు కనిపిస్తాయి. (1) కేవలం ‘పార్లమెంటరీ పంథా ద్వారానే సోషలిజాన్ని సాధిస్తాం’ అని భావించే పార్టీలు ఒక రకం. (2) ‘అన్ని రకాల లీగల్ అవకాశాలనూ ఉపయోగించుకుంటూ కూడా, కేవలం ఎన్నికల ద్వారా కాకుండా, చివరికి పాలకవర్గాల సాయుధ దళాలను ఎదుర్కోవడం ద్వారానే రాజ్యాధికారాన్ని సాధించగలం’ అని భావించే వాళ్ళు రెండో రకం. (3) ‘ఎన్నికల భ్రమల ద్వారా కాకుండా, ప్రజల్లో సాయుధ పోరాట చైతన్యాన్ని పెంచడం ద్వారానే, సాయుధంగా మాత్రమే పాలకవర్గాల్ని ఓడించి, చిట్టచివరికి రాజ్యాధికారాన్ని సాధించగలం’ అని భావించే పార్టీలు మూడో రకం.

రకాలు మూడే అయినా, మళ్ళీ ప్రతీ ఒక్క రకం లోనూ, చీలికలూ పీలికలూ కనిపిస్తాయి. కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్యత సాధించడం ఎలా?-అనేది ప్రశ్న!

మొదటి రకం పార్టీల మధ్యనైనా ఐక్యత సాధ్యమేనేమో, ఒక రకంగా! వాటి మధ్య, మొదట్లో చీలినప్పుడు, సిద్ధాంతపరమైన తేడాలు వున్నాయేమో గానీ, ఇప్పుడు అలాంటి తేడాలేమీ కనపడడం లేదు. కేవలం, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చెయ్యాలి? రెండు పార్టీలూ కలిస్తే, ఎవరికి ఏ పదవులుండాలి? పార్టీలకు భవనాల రూపంలో, పత్రికల రూపంలో, ఇంకా ఇతర రూపాల్లో వున్న ఆస్తుల వాడకం ఎలా వుండాలి? ఇటువంటి విషయాలే తప్ప, సిద్ధాంత విషయాలేమీ వుండవనుకోవాలా? చిన్న చిన్నవి వుంటే, చర్చించుకుని ఒక అంగీకారానికి రావచ్చు. రాలేరా?

ఇక 2వ రకం పార్టీలు, కనీసం అరడజను బృందాలుగా (గ్రూపులుగా) వున్నట్టు తెలుస్తోంది. గతంలో కలిసి వుండి, తర్వాత విడిపోయిన వాళ్ళే ఎక్కువ, ఈ 2వ రకం పార్టీలలో. ‘విమర్శా-ఆత్మ విమర్శా’ అనే మావో సూక్తి గురించి వీళ్ళకీ తెలుసు గదా? అందరూ కూచుని, ఎవరు ఏ తప్పులు చేశారో, విమర్శా-ఆత్మవిమర్శా చేసుకుని, కొన్ని సూత్రాల ప్రకారం ఏకం కావచ్చును.

చివరిగా, 3వ రకం వాళ్ళు కూడా, ఆత్మ విమర్శ అనేది, నిజంగానే చేసుకోవాలి! తాము మాత్రమే విప్లవ మార్గం అనుసరించేవాళ్ళం అనే భ్రమల్ని వదులుకోవాలి. పాలకవర్గాల సాయుధ బలగాలను, సాయుధంగా ఎదుర్కోవడానికి ముందు, జరగవలిసిన కార్యక్రమాలు ఎన్నో వున్నాయనే విషయాన్ని గ్రహించి ఆ పనులు చేయాలి. ముఖ్యంగా, ఈ విషయమై, ఒకప్పుడు ఎంగెల్సు చెప్పిన సలహాని పాటించాలి.

'ఫ్రాన్స్లో వర్గ పోరాటాలు' అనే మార్క్సు రచనకి, 1894లో ఒక ముందుమాట రాస్తూ, ఎంగెల్సు అన్న మాటల్ని ఇక్కడ గుర్తు చేసుకుంటే, సాయుధ పోరాటం గురించి వున్న పొరపాటు అవగాహన తొలగిపోతుంది.

''వర్గ చైతన్యం లేని శ్రామిక జనాలకు, అతి కొద్ది మంది చైతన్య వంతులైన వారు మాత్రమే నాయకత్వం వహించి చేసే ఆకస్మిక దాడులూ (సర్ప్రైజ్ ఎటాక్స్), విప్లవ పోరాటాలూ, చేసే కాలం గతించింది. సామాజిక వ్యవస్తను సంపూర్ణంగా పరివర్తన చెందించడం - అనేదే ప్రశ్న అయినప్పుడు, శ్రామిక జనాలు తమంతట తాము దానిలో (వర్గ పోరాటంలో) వుండి తీరాలి! సమస్య ఏదో (‘వాట్ ఈజ్ ఎట్ స్టేక్’), అప్పటికే గ్రహించి వుండి తీరాలి(‘మస్ట్ దెంసెల్వ్జ్ హావ్ ఆల్రెడీ గ్రాస్ప్డ్’)! ఏమి చెయ్యాలో, జనాలు అర్థం చేసుకోవాలీ అంటే, సుదీర్ఘమైన నిరంతరమైన కృషి (‘లాంగ్, పెర్సిస్టెంట్ వర్క్’) అవసరం.''

అసలు, మొత్తంగా, జనరల్ గా, ‘కమ్యూనిస్టు పార్టీ’ అని చెప్పుకునే ఏ పార్టీ అయినా, మార్క్స్ ఎంగెల్సులు చెప్పిన రెండు మూడు సూత్రాల్ని అనుసరించాలి. అవి:

''పాలక వర్గాల రాజకీయ అధికారానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం సంస్తాపరంగా పురోగమించి వుండక పోతే, ఆ పాలకవర్గ అధికారానికి వ్యతిరేకంగా, నిరంతర ప్రచారం ద్వారానూ, పాలక వర్గాల విధానాల పట్ల శతృపూరిత వైఖరిని ప్రదర్శించడం ద్వారానూ, మనం కార్మిక వర్గానికి శిక్షణ ఇచ్చి తీరాలి. లేకపోతే, అది పాలక వర్గాల చేతిలో ఆట వస్తువుగా వుండిపోతుంది.'' (మార్క్స్, 1871 )

''మన రాజకీయాలు కార్మిక వర్గ రాజకీయాలై వుండి తీరాలి. కార్మికుల పార్టీ ఎన్నడూ ఏ బూర్జువా పార్టీకీ తోకపట్టుకు పోయేది కారాదు.'' (ఎంగెల్స్, 1871)

''ప్రత్యేకంగా, నాయకుల కర్తవ్యం ఏమిటంటే, సిద్ధాంత సమస్యలన్నిటిని గురించీ అంతకంతకూ స్పష్టమైన అవగాహన సంపాయించడమూ; ‘సోషలిజం’ ఒక సైన్స్ అయింది గనుక, దానిని సైన్స్గా అధ్యయనం చేయడమూ, దానిని కార్మిక జనాలలో వ్యాప్తి చేయడమూనూ.''( ఎంగెల్సు, 1874)

పార్టీలో కొన్ని నిబంధనలు పెట్టుకుంటారు గదా? వాటిల్లో తప్పని సరిగా వుండవలిసిన ఒక నిబంధన ఏమిటంటే: చైర్మనూ, జనరల్ సెక్రటరీ, పోలిట్ బ్యూరోలో సభ్యత్వం, ఇలా అనేక స్తాయిల్లో, వుండే వాటిని ‘పదవులు’ కావనీ, ‘బాధ్యతలనీ’ స్పష్టత వుండాలి! ఆ బాధ్యతలు కూడా, సంవత్సరాల తరబడి, మరణం వరకో, వృద్ధాప్యం వరకో, బబ్బుపడి ‘ఇక పనిచేయడం కుదరదు’ అనుకునే వరకో, కాకుండా, దానికొక కాల పరిమితి పెట్టుకు తీరాలి. అలాగే, పని విభజన కూడా. కొన్నాళ్ళు కార్యదర్శి బాధ్యత వహించిన వ్యక్తి కూడా, కరపత్రాలు పంచే పనిలో, పోస్టర్లు అతుకుపెట్టే పనిలో, సమిష్టిగా వంటపనులు జరిగే చోట, ఆ పనుల్లో...ఇలా రకరకాల పనుల్లో, వంతులవారీగానో, కొంత కాలానికి ఒక సారో, పాల్గొనాలి. ఆడపనులూ, మొగపనులూ అంటూ వుండకూడదు.

ప్రశ్న11 : భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీల భవిష్యత్తు ఏమిటి?

రంగనాయకమ్మ: భారత దేశంలో, కమ్యూనిస్టు పార్టీ అంటూ మొదలై ఇప్పటికి 100-105 ఏళ్ళయిందంటున్నారు. చైనాలో కూడా పార్టీ పెట్టి, దాదాపు అంతకాలమూ అయింది. కాకపోతే, అక్కడ 30 ఏళ్ళకల్లా, చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. దాన్ని ఎన్ని పరిమితులతో అయినా, ఒక పాతికేళ్ళన్నా నిలుపుకున్నారు. ఆ తర్వాత అది పేరుకి అలా వుంటూ, ఆచరణలో మాత్రం, ఒకరకమైన పెట్టుబడిదారీ పార్టీగా తయారైంది. దానికి కారణం, కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టు సిద్ధాంతం తెలియక, కమ్యూనిస్టు పార్టీగా లేకపోవడమే! జనానికే కాదు, వారిని నడపవలిసిన పార్టీకే శ్రామిక వర్గ చైతన్యం లేకుండా పోయింది! దాన్ని పూర్తిగా బూర్జువా చైతన్యం ఆవరించింది. శ్రామిక జనాలకు నేర్పవలిసిన, కమ్యూనిస్టు పార్టీకే వర్గ చైతన్యం లేనప్పుడు, ఆ చైతన్యాన్ని అది పొందేవరకూ, పరిస్తితి ఇలాగే వుంటుంది. మార్క్సు ఒక చోట అన్నట్టు, ‘నేర్పవలిసిన వాడే, నేర్చుకుని తీరాలి!’

Tags:    

Similar News