'వరవిక్రయం'లోని ఈ సన్నివేశం చదివితే కడుపుచెక్కలు కావాల్సిందే!

ఎవరినైనా కడుపు చెక్కలయ్యేలా నవ్వించే రచన ‘వర విక్రయం’. ఈ పుస్తకం ప్రముఖ హాస్య, వ్యంగ్య రయచిత నారాయణ గారు రాశారు. మచ్చుక్కి ఈ సన్నివేశం చదవండి.

Update: 2024-04-23 06:12 GMT

"బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి సింగరాజు లింగరాజు వ్రాసియిచ్చిన రశీదు. మీకొమార్తె చి॥ సౌ॥ కాళిందిని, నాకొమారుడు చి॥ బసవరాజునకు చేసికొనుటకు, అందులకై మీరు మాకు కట్నం క్రింద ఐదువేలు యైదువందల రూపాయల రొక్కము, రవ్వల ఉంగరము, వెండిచెంబులు, వెండికంచము, వెండిపావుకోళ్ళు, పట్టుతాబితాలు, వియ్యపురాలు వియ్యంకుల లాంఛనములు యధావిధిగా ఇచ్చుటకున్నూ, ప్రతిపూఁటఁ పెండ్లివారిని బ్యాండుతో పిలుచుటకున్నూ, రాకపోకలకు బండ్లు, రాత్రులు దివిటీలు నేర్పాటు చేయుటకున్నూ, రెండుసారులు పిండివంటలతో భోజనములు, మూడుసారులు కాఫీ, సోడా, ఉప్మా, యిడ్డెన, దోసె, రవ్వలడ్డు, కాజా, మైసూరు .... మైసూరు పాకాలతో ఫలహారములు చొప్పున మా యిష్టానుసారము ఐదు దినములు మమ్ము గౌరవించుటకున్నూ, అంపకాలనాడు మాకు పట్టుబట్టలు, మాతో వచ్చువారికి ఉప్పాడ బట్టలు ఇచ్చుటకున్నూ నిర్ణయించుకొని బజానా క్రింద పదిరూపాయలు ఇచ్చినారు గాన ముట్టినవి .... అయ్యా .... ఇట్లు .... సింగరాజు లింగరాజు వ్రాలు" .... చాలునా?

పేర:- చాలు బాబూ! చాలు! మచ్చుక్కోసం దాచిపెట్టుకోవలసిన మతలబు!

పెండ్లి సమయంలో వియ్యపురాలికి చేయవలసిన మర్యాదల గురించి కాళ్ళకూరి నారాయణ రావు గారి చమత్కారం చూద్దాం:

"వియ్యపురాలు గారికి తెలివిరాగానే కళ్ళు తుడవాలి, కాళ్ళు మడవాలి, కోక సర్దాలి, కిందకు దింపాలి, పెరట్లోకి పంపాలి, నీళ్ళచెంబందివ్వాలి, రాగానే కాళ్ళు కడగాలి, పండ్లు తోమాలి, మొహం తొలవాలి,నీళ్ళు పోయాలి,వళ్ళు తుడవాలి,

తల దువ్వాలి, కొత్తచీర కట్టాలి, కుర్చీ వెయ్యాలి, కూర్చోబెట్టాలి, పారాణి రాయాలి, గంధం పుయ్యాలి, అత్తర్లివ్వాలి, పన్నీరు చల్లాలి, మొహాన్ని మొహరీలద్దాలి! కళ్ళకు కాసులద్దాలి! వంటిని వరహాలద్దాలి,

వెండి పలుపు వెనకను కట్టాలి, బంగారుపలుపు పక్కను చుట్టాలి, దిష్టి తియ్యాలి, హార తివ్వాలి, అధ్వాన్నమివ్వాలి,నాపిండాకూడివ్వాలి ....యిల్లాంటివింకా నా తలవెంట్రుక లన్ని వున్నాయి. ఆలస్యమైతే అలక కట్నం చెల్లించ వలసి వస్తుంది".

మగ పెళ్లి వారికి చేయవలసిన మర్యాదల్లో లోపం వస్తే ఎలా ఉంటుందో చూడండి ....

"నిన్నటి వుప్మాలో నిమ్మపళ్లరసమే లేదట. ఇడ్డెన్లలో అల్లం ముక్కలు లేవట. కాఫీలో పంచదార లేదట.

ఈ పూటయినా కాస్త యింపుగా వుండకపోతే పట్టుకు వచ్చిన వాళ్ళ మొహాన్ని పెట్టికొట్టాలని పదిమందీ ఆలోచిస్తూన్నారు. ఖారాఖిల్లీలు కాస్త యెక్కువగా పంపండి. చుట్టలూ, సిగరెట్లూ, బీడీలూ కూడా కాస్త శుభ్రమైనవి చూడండి. నిన్న పంపిన చీట్లపేకలు నిన్ననే చిరిగిపోయాయి. ఈపూటింకో నాలు గెక్కువ పంపండి. మదరాసు నశ్యం మాట మరిచిపోకండి. శలవు. మఱి ఆలస్యమైతే మాటదక్కదు".

పెళ్ళైన తరువాత పదహారు రోజుల పండుగ అంటే ఏమిటో చూద్దాం.

"తొలినాడు హడావడి, మలినాడు ఆయాసం,

మూడు మంగళాష్టకాలు, నాలుగు సిగపట్ల గోత్రాలు, అయిదు అప్పగింతలు, ఆరు అంపకాలు, ఏడు వంట బ్రాహ్మల తగువు‌, ఎనిమిది ఋణదాత నోటీసు, తొమ్మిది జవాబు, పది దావా,

పదకొండు స్టేటుమెంటు, పన్నెండు విచారణ, పదమూడు డిక్రీ, పద్నాలుగు టమటమా, పదిహేను వేలం, పదహారు చిప్ప. ఈ రోజుల్లో యిదే పదహారు రోజుల పండుగ".

ఇక నారాయణ రావు గారి గురించి....

రచయితకు అజరామరమైన కీర్తిని సంపాదించిపెట్టిన 'చింతామణి' నాటక రచయిత కాళ్ళకూరి నారాయణ రావు 1871 ఏప్రిల్ 28 న బంగారురాజు,అన్నపూర్ణమ్మ దంపతులకు, పశ్చిమగోదావరి జిల్లా మత్స్యపురి గ్రామంలో జన్మించారు. చిన్నతనంలో తండ్రి వద్దనే విద్య అభ్యసించి, రామాయణ,భాగవతములు కంఠస్థం చేశారు. తరువాత కాకినాడలోపాడి వెంకటనారాయణగారి వద్ద కావ్యనాటకాలంకార గ్రంథాలను పఠించారు. బుధ్ధిరాజు వీరభద్రరావుగారు ఆయన్నుపెంచి,పోషించి ఆంగ్లసాహిత్యం నేర్పారు. కాకినాడ నుంచివెలువడిన 'మనోరంజని' సాహిత్య మాసపత్రికకు సంపాదకులుగా కొన్నాళ్లు పనిచేశారు.

ఆయన అధ్యాపక వృత్తిలో ఉన్నా కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని, సంఘ సంస్కరణాభిలాషియై 'వర విక్రయం', 'చింతామణి', 'పద్మవ్యూహం' వగైరా నాటకాలు నవలలు రాశారు. చింతామణి నాటకంలో కల క్రమేణా అనేక మార్పులు చోటు చేసుకుని వెర్రి తలలు వేసినా అసలు నాటకంలో చింతామణి వేశ్యా వృత్తిలో ఉన్నా 'కన్యాశుల్కం' నాటకంలో మధురవాణి లాగా సంఘ సంస్కరణ పై అభిలాష కలిగినది. 'మధు సేవ'(సారాయి వలన కలిగే దుష్పరిణామాలపై రచన) అనే నాటకం,'చిత్రాభ్యుదయం' అనే నవలలు కూడా రాశారు. వీటిలో సినిమా రూపంలో వచ్చినవి వర విక్రయం, చింతామణి .... రెండు కూడా సూపర్ హిట్టే .... వీరి రచనలు చూద్దాం:

నాటక రచనలు:

చిత్రాభ్యుదయం (1908)పద్మవ్యూహం (1919)

చింతామణి (1920)వరవిక్రయం(1922)

మధుసేవ(1926)సంసార నటన (1927)

ప్రహసనములు:

లుబ్దాగ్రేసర చక్రవర్తి (1906)ధూమశకట ప్రహసనం (1909)రూపాయిగమ్మత్తు(1920)దసరాతమాషాలు(1920)కారణంలేని కంగారు (1920)మునిసిపల్ ముచ్చట్లు (1921)సంసార నటన ఘోరకలి(1921) విదూషకకపటము(1921)మొదలగు ప్రహసనములు.అంతేగాక1919 లో రచించిన 'ప్రతాపరుద్రమదేవి' చారిత్రకనవలతోపాటు,చరిత్ర గ్రంథాలు, విమర్శనా వ్యాసాలు,కథలు రచించారు. నటుడుగా, దర్శకుడుగా,నాటకరచయితగా, కథారచయితగా, నవలారచయితగా‌, సంఘసంస్కర్తగా, పాత్రికేయుడుగా, విశేషఖ్యాతిని బడసినకాళ్ళకూరి నారాయణ రావు గారు 27 -06 -1927 న రాజమండ్రి దగ్గర 'సిద్ధాంతం' అనే గ్రామం లో కాలం చేశారు.

సేకరణ.. గొర్రెపాటి రమేశ్ చంద్రబాబు

Tags:    

Similar News