US లో బర్త్ రైట్ పౌరసత్వం లేదంటే ఇక్కడ కన్నీరు గోదారై ప్రవహిస్తున్నది
ఇక్కడ పుట్టి ఇక్కడే జీవిస్తున్న స్వదేశీయుల్నివిదేశీయులను చేస్తున్న దేశభక్తి ఈ దేశంలో ఉంది...;
-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
ఇక్కడే పుట్టి ఇక్కడి మట్టినే నమ్ముకొని, ఇక్కడే శ్రమిస్తూ, ఇక్కడి ప్రభుత్వాలకే పన్నులు చెల్లిస్తూ, ఇక్కడే తనువు చాలించి, అంతిమంగా ఈ మట్టిలో కల్సిపోయే నిజమైన స్వదేశీ ప్రజలకు ఇక్కడ రక్షణ లేదు. వారు దండకారణ్య ఆదివాసీలు కావచ్చు. మణిపూర్ కుకీలు కావచ్చు. మైనార్టీ ప్రజలు కావచ్చు. లేదా మత్యకార్లు కావచ్చు. ఇది వారు పుట్టి పెరిగిన నేల నుండి తరిమివేత మాట! అడవి బిడ్డలైన ఆదివాసీల్ని అడవుల నుండి, గిరి పుత్రులైన కుకీల్ని హిల్స్ నుండి, కడలితల్లి బిడ్డలైన మత్యకార్లను సముద్రాల నుండి, నేలతల్లి బిడ్డలైన మైనార్టీ ప్రజల్ని, మరీ ముఖ్యంగా పుడమితల్లి బిడ్డలైన రైతు కూలీల్ని తమ జన్మస్థలాల నుండి తరిమివేత కోసం నేడు "స్వదేశీ" సర్కార్ ఘోర మారణహోమాలకు బరి తెగిస్తోన్నది. ఐనా ప్రజల్లో ఒకవైపు సహజ దేశభక్తి భావాన్ని పెరగకుండా, మరోవైపు పంచరంగుల కృత్రిమ దేశభక్తి సృష్టించి బడా కార్పొరేట్ మీడియా ఒక మానసిక యుద్దాన్ని సాగిస్తూ దేశ ప్రజలతో విన్యాసాలు చేయిస్తోంది.
మన దేశం నుండి అమెరికా, యూరోప్ లకి కొనసాగే బ్రెయిన్ డ్రైన్ మాట ఒకటుంది. మన మట్టిమనుషుల నెత్తురు, చెమటలతో సృష్టించే సంపద ఆధారంగా, వారు చెల్లించే పన్నుల ద్వారా పోగుపడ్డ భారీ ప్రభుత్వ రాబడి (ఇది ప్రజాధనం) తో ఇక్కడి విద్యార్థులకి ఉన్నత విద్య అందించి వారి మెదళ్లను బాల్యం నుండే బ్రెయిన్ వాష్ చేసే విద్యా విధానం మనది. అందులో భాగంగా LKG నుండే "భారత్ వద్దు అమెరికా ముద్దు" అనే మెదళ్లను సృష్టించే విద్యా బోధన మనది. పుట్టుకతో స్వదేశం పట్ల వ్యతిరేక, విదేశాల పట్ల అనుకూల భావాల్ని మన విద్యార్థుల రక్తంలో నూరిపోసే విద్యా వ్యవస్థ మనది. ఓవైపు ప్రజాధనంతో ప్రభుత్వ విద్యాసంస్థల్ని నడిపిస్తూ మరోవైపు కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలకు ఫీజుల పేరిట లక్షల కోట్లు చెల్లిస్తూ సాధించే ప్రగతి ఏమిటో తెలిస్తే గుండెలు తరుక్కుపోతాయి. మన నేల మీద పుట్టి మన దేశ ప్రజల సొమ్ముతో విద్యా బోధన చేసి స్వదేశీ, విదేశీ బడా కార్పొరేట్లకు మేధో కూలీలను సరఫరా చేసే విద్యా విధానం మనదని తెలిస్తే మన మనస్సులు చలిస్తాయి. ఇలా విదేశీ వ్యామోహ భావజాలం అనే వింత సరుకును సృష్టించే కర్మాగారాలుగా నేటి మన విద్యాసంస్థలు నడుస్తున్నాయి. దాని ఫలితంగా దేశం పట్ల మమకారం లేకపోగా మన పౌరసత్వం వదిలేసి విదేశీ పౌరసత్వం కోసం వెంపర్లాడే యువతరం అవతరించింది. అలాంటి మనుషుల్ని వ్యూహత్మక దృష్టితో సృష్టిస్తోన్న నేటి వ్యవస్థ కార్పొరేట్ల చేత నడిపించబడుతోంది. ఆ యువతరం కంటున్న తియ్యటి కలల పై ట్రంప్ సర్కార్ నీళ్లు చల్లింది. తమ స్వర్గం ఒక్కసారి కుప్పకూలినట్లు ఆ తరం విలవిలలాడుతోంది. అదే నిన్నటి నుండి భారతదేశ ప్రధాన సమస్యగా మారి మరో సమస్య ఏదీ దేశ ప్రజలకు లేనట్లు గొప్పగా చిత్రించబడుతోంది.
పుట్టబోయే పిల్లలకి కూడా ఇంతవరకూ అమెరికాలో ఆటోమేటిక్ పౌరసత్వం పొందడానికి అవకాశం వుంది. దాన్ని ట్రంప్ సర్కార్ ఇప్పుడు రద్దు చేసింది. కార్పొరేట్ మీడియా దీన్నొక దేశ సమస్యగా మార్చింది. కృత్రిమంగా దేశభక్తిని సృష్టించి మార్కెట్లోకి ఓ సరుకుగా విడుదల చేస్తున్నది. అమెరికాలో భంగపడ్డ భారతీయులు అంటూ గోల సాగుతోంది. నిజానికి ఆ ఎన్నారైలలో నేడు భారతీయత లేదు. పుట్టబోయే తమ పిల్లలకి కూడా భారత పౌరసత్వం వద్దంటున్నారు. నిజానికి వారు తమ మనస్సులో మాటను దాచుకోలేదు. తమతో పాటు తమకు పుట్టబోయే పిల్లలకి సైతం భారతీయ పౌరసత్వం అక్కర్లేదని మొహమాటం లేకుండా చెబుతున్నారు. కానీ కార్పొరేట్ మీడియా మాత్రం వారికి పదహారు అణాల భారతీయతను అంటగట్టి అమెరికాలో స్వచ్ఛమైన మన భారత దేశభక్తులకు అన్యాయం జరుగుతున్నట్లుగా తన గుండెలు బాదుకుంటూ మన 140 కోట్ల మంది దేశప్రజల చేత గుండెలు బాదుకునేలా చేస్తోంది.
ఒకవైపు భూమాత బిడ్డలుగా తాము ఇక్కడే ఉంటామన్న దేశవాసుల్ని దేశద్రోహులుగా ముద్ర వేసి మాతృగడ్డ నుండి బయటకు గెంటే ప్రక్రియ సాగుతోంది. మరోవైపు విదేశీమోజులో మునిగి మాతృదేశం భావనను కోల్పోయి అమెరికా, కెనడా, యూరోప్ లలో శాశ్వతంగా స్థిరపడాలనే వారిని గొప్ప దేశభక్తులని కితాబులిస్తూ కార్పొరేట్ మీడియా భారీ ప్రచారం సాగిస్తోంది. ఈ మీడియా ద్వారా దేశభక్తి నేడు బడా కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఓ సరుకుగా మారింది.
అడవుల్లో పుట్టి పెరిగి అడవుల్నే నమ్ముకొని తరతరాలుగా అక్కడే బ్రతికిన ఆదివాసీ ప్రజలు అక్కడే ఉంటామనడం నేరమై పోయింది. ఖనిజ వనరుల కబ్జా కోసం వారిని "నక్సలైట్ల" పేరిట "స్వదేశీ" సర్కార్ పిట్టల్లా కాల్చి చంపుతోంది. ఇదో సమస్యగా చూపించడం లేదు. పైగా ఒక పీడ విరగడ అవుతున్నట్లు మీడియా చిత్రిస్తోంది.
"ఇండియా వద్దు అమెరికా ముద్దు" ఒక మోజుగా మారింది. అమెరికా పౌరసత్వం కోసం అర్రులు చాచే ఒక యువతరాన్ని కార్పొరేట్ వ్యవస్థ సృష్టించింది. వారి కోర్కెని ట్రంప్ ప్రభుత్వం తిరస్కరిస్తే దేశంలో ఒకటే గోల! బర్త్ రైట్ సిటీజన్ షిప్ రద్దు ఉత్తర్వు మీద ట్రంప్ నిన్నటి సంతకం తర్వాత మీడియాకు ఇది తప్ప మరో గోల లేదు. గత రెండు రోజులుగా దేశ ప్రజల మెదళ్ళను ప్రభావితం చేయడానికి వ్యూహత్మక ప్రచారాన్ని అదెలా సాగిస్తుందో ఆలోచనాపరులకు తేలిగ్గా అర్ధమౌతుంది.
ఇది చదివే పాఠకులకు బర్త్ రైట్ సిటిజన్ షిప్ రద్దు చర్యని ఈ వ్యాస రచయిత సమర్ధిస్తున్నట్లు ఒక అపోహ కలిగడానికి అవకాశం వుంది. అది నిజం కాదు. ఈ వ్యాస రచయితగా నేను ట్రంప్ చర్యని ఖండిస్తున్నా. నిజానికి పెట్టుబడుల ప్రపంచీకరణతో పాటు శ్రమశక్తి ప్రపంచీకరణ కూడా సమాంతరంగా సాగుతుందని స్పష్టమైన అవగాహన వున్నవాణ్ని. అమెరికా గ్రేట్ లేదా ఫస్ట్ పేరిట ట్రంప్ అనుసరించే తాజా విధానాలు చాలా ప్రమాదకరమైనవని నమ్ముతున్న వాణ్ని. అవి సీనియర్ జార్జి బుష్ నాటి ఏకధ్రృవ ప్రపంచ స్థితిని పునరుద్దరించడానికే అని నమ్మేవాణ్ని. నా ఉద్దేశ్యం మన ప్రజల మెదళ్ళల్లో బడా కార్పొరేట్ మీడియా చేసే వ్యూహాత్మక ప్రచారం గూర్చి హెచ్చరించడమే. అది నిజమైన దేశభక్తిని ఓ పరమ దేశద్రోహంగా, కుహనా దేశభక్తిని గొప్ప దేశభక్తిగా ప్రచారం చేసి దేశ ప్రజల్ని పక్కదారి పట్టిస్తుందని చెప్పడమే.
ఇటు మోడీ భారత్ పట్లా, అటు అమెరికా పట్లా భారీ వ్యామోహం పెంచుకున్న భారతదేశ మధ్యతరగతి ప్రజలకు ఇదో గుణపాఠం. తాము భద్రజీవులమని ఇప్పుటి వరకూ గాఢంగా నమ్మిన మధ్యతరగతి ప్రజలకు ఇదో షాక్! ముఖ్యంగా సాఫ్ట్ వేర్ వంటి కొన్ని అధికాదాయ వర్గాలకు ఇదో పెద్ద షాక్! రానున్న ఆర్ధిక సంక్షోభాలతో రేపు అధికాదాయ ఉద్యోగుల సోకాల్డ్ భద్రజీవితాలు సైతం పేకమేడలా కూలి పోతాయనే వాస్తవాన్ని చెప్పడమే నా ఉద్దేశ్యం. అపరిమిత సాంకేతిక అభివృద్ధిని సాధించిన వర్తమాన సామ్రాజ్యవాద వ్యవస్థలో ఇదో సహజ పరిణామమని చెప్పడం నా ఉద్దేశ్యం.
ఈ దేశ ప్రజల మౌలిక సమస్యలెన్నో ఉన్నాయి. ఉపాధి, అధిక ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి, కుంభకోణాలు, ఉపా, NIA, బూటకపు ఎదురు కాల్పులు, ప్రైవేటీకరణ, గిట్టుబాటు ధరలు, లేబర్ కోడ్ల వంటి సమస్యలెన్నో ఉన్నాయి. ఇవేవీ మన మీడియాకి అక్కర్లేదు. కానీ తల్లుల గర్భాల్లో ఎదిగే పిండాలకు అమెరికా పౌరసత్వం మంజూరు గూర్చి నేడు దేశం అట్టుడుకుతోంది. వారింకా పుట్టలేదు. తల్లి గర్భం నుండి భూమిపై పడలేదు. ఆ పుట్టబోయే పిల్లలకు అమెరికాలో పౌరసత్వం గూర్చి ఇంత గోల జరుగుతోంది. కానీ ఇక్కడే పుట్టి పెరిగే భూమి పుత్రుల్ని తరిమివేస్తుంటే, ఇక్కడి నుండి కదిలేది లేదన్నందుకు ఘోరంగా చంపుతుంటే వాళ్లకు పట్టడం లేదు.
మధ్యతరగతి, విద్యాధిక ప్రజలకు ఓ స్నేహపూర్వక విజ్ఞప్తి
తల్లుల గర్భాల్లో ఎదిగే పిండాలకు అమెరికాలో పౌరసత్వ జన్మహక్కు కోసం అక్కడి మన వాళ్ళ తపన కొట్టిపారేసే అంశం కాదు. సానుభూతితోనే అర్ధం చేసుకుందాం. వారి మనస్సుల్ని సరుకుగా మార్చిన వ్యవస్థ పై ఉండాల్సిన కోపం వారి పై ఉండనక్కర్లేదు. కావున సానుభూతిని ప్రదర్శిద్దాం. కానీ అమెరికాలో మన వాళ్ళకి పుట్టబోయే పిల్లలకు పౌరసత్వ జన్మ హక్కును ట్రంప్ సర్కార్ రద్దు చేసినందుకే స్వర్గం కూలినట్లు తెగ గోలచేసే సమయంలో మరో కోణం కూడా చూడాలి. తమ ఇళ్ళు, వాకిళ్ళు, వూళ్లు, చెట్లు, పుట్టలు, పొలాలు, అడవులు, కొండలు కబ్జా చేసి కట్టుబట్టలతో బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం స్వదేశీ ప్రభుత్వం చేత నిర్దాక్షిణ్యంగా బయటకు వెళ్లగొట్టబడే భూమిపుత్రుల (SONS AND DAUGHTERS OF THE SOIL) మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయాలని మధ్యతరగతి, విద్యాధిక, అధికాదాయ ఉద్యోగ వర్గాలకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా.
ఇకనైనా మధ్యతరగతి భారతీయులు ఆలోచన చేయాలి. ఎప్పటికైనా భారత దేశ శ్రామిక వర్గాల ప్రజాదరణ ఉంటేనే తప్ప మధ్యతరగతి ప్రజలకు నిజమైన రక్షణ ఉండదు. సకల పీడిత ప్రజలు ఐక్యంగా ఉంటేనే రక్షణ ఉంటుంది. ఈ నిజం గుర్తించడానికి ట్రంప్ సంతకం ఓ సాధనంగా సహకరిస్తుందని ఆశిద్దాం.