అమ్మ చీర

నేటి మేటి కవిత;

Update: 2025-08-31 04:07 GMT

అమ్మచీర అద్భుతమైన

ఇంద్రజాలమే చేస్తుంది!

చీరచెరుగు తాను స్వయంగా

మంత్రతివాచీ అయిపోతుంది!

నీకు నిదుర వచ్చినప్పుడు

తను ఉయ్యాలగా మారిపోతుంది!

వర్షం ఆగక పడుతూంటే

అది కాపాడే గొడుగవుతుంది!

చలి నిన్ను చంపేస్తూంటే

వెచ్చనిదుప్పటై హాయినిస్తుంది!

అన్నం తిన్న తరువాత

మూతితుడిచే న్యాప్కినవుతుంది!

స్నానమయ్యాక వణుకుతూంటే

కప్పి కాపాడే తువ్వాలవుతుంది!

చాప నీకు ఒత్తుకొంటూంటే

మెత్తని బొంతగా మారిపోతుంది!

పక్క నువ్వు తడుపుతున్నప్పుడు

మొలనుచుట్టే న్యాపీఅవుతుంది!

నీకళ్ళు బాధతో తడైనప్పుడు

నిన్ను ఓదార్చే రుమాలవుతుంది!

బాధలు నిన్ను భయపెట్టినప్పుడు

అమ్మకప్పే కవచమవుతుంది!

ఔను...

అమ్మచీర అద్భుతమైన

ఇంద్రజాలమే చేస్తుంది!

చీరచెరుగు తాను స్వయంగా

మంత్రతివాచీ అయిపోతుంది!

-డాక్టర్ గోపికృష్ణ

అమృత హాస్పటల్, మదనపల్లె

Tags:    

Similar News