పాపనాశనం పాదాల కింద..

పాపనాశనం పాదాల కింద లోయలో ఏడు తీర్థాలను ఒకే రోజు సందర్శించడం సాహసమే!? ముప్పై ఏళ్ళుగా ట్రెక్కింగ్ చేస్తున్నా, ఇంత కష్టతరమైన ట్రెక్కింగ్ గతంలో ఎన్నడూ ఎరుగను.

Update: 2024-09-26 07:44 GMT

తాళ్ళు పట్టుకుని లోయలోకి దిగడం..! తాళ్ళు పట్టుకుని నిటారుగా ఉన్న కొండను ఎక్కడం..! పెద్ద పెద్ద బండ రాళ్ళను ఎక్కుతూ దిగుతూ లోయలో ప్రవాహానికి ఎదురుగా ఏకబిగిన పదకొండు గంటలు నడవడం..! నీటి గుండాల్లో ఈదడం..! జలపాతాల కింద తడిసి ముద్దవడం..!

పాపనాశనం పాదాల కింద లోయలో ఏడు తీర్థాలను ఒకే రోజు సందర్శించడం సాహసమే!? ముప్పై ఏళ్ళుగా శేషాచలం కొండల్లో ట్రెక్కింగ్ చేస్తున్నా, ఇంత కష్టతరమైన ట్రెక్కింగ్ గతంలో ఎన్నడూ ఎరుగను. సనకసనందన తీర్థం, అక్కగార్ల గుండాలు, మలయప్ప కోన, మలయప్ప తీర్థం, జ్వరహార తీర్థం, కాయరసాయన తీర్థం, వెంకటేశ్వర తీర్థం ; ఒక్క రోజులో సందర్శించిన తీర్థాలివి. “ఇది చాలా హార్డ్ ట్రెక్కింగ్. అందరికీ చెప్పడం లేదు. రాగలుగుతారా!?” అన్నాడు మధు. ఇష్టం కనుక కష్టమైనా వస్తానన్నాను.

తిరుమలలోని పాపనాశనం డ్యాం వద్దకు (2022 అక్టోబర్ 25) ఆదివారం ఉదయం ఆరుగంటలకల్లా చేరుకున్నాం. తిరుపతి నుంచి పదకొండు మందిమి, చెన్నై నుంచి అయిదుగురు; మొత్త పదహారుమందిమి. పాపనాశనం డ్యాం దాటుకుని అడవిలో మా నడక మొదలైంది. పావుగంటలో సనకసనందన తీర్థం చేరుకున్నాం. మండు వేసవిలో కూడా సనకసనందన తీర్థంలోని చిన్న గుంటలో నీళ్ళుంటాయి. ఏ తీర్థానికి వెళుతున్నా ఇక్కడి నుంచే నీళ్ళు తీసుకెళ్ళాలి.

దట్టమైన అడవి. దారికి ఇరువైపులా చెట్ల మధ్య ఎత్తుగా బోద పెరిగింది. చలువు రాతి బండల వద్దకు చేరుకున్నాం. సహజసిద్ధంగా ఏర్పడిన బండలతో దారంతా పరుచుకునుంది. వర్షపు నీటి ప్రవాహంతో బండలన్నీ నునుపు తేలి ఉన్నాయి. ఏటవాలుగా ఉన్న ఆ బండలపై నుంచి నడుస్తున్నాం. అప్పుడే సూర్యుడు కొండల మాటునుంచి తొంగిచూస్తున్నాడు. కిరణాలు చెట్ల వెనుక నుంచి ప్రసరిస్తున్నాయి. చెన్నై నుంచి వచ్చి ట్రెక్కర్లు ఇంగ్లీషు, తమిళం కలబోసి మాట్లాడుతున్నారు. తెలుగు వాళ్ళు వచ్చీరాని ఇంగ్లీషులో సంభాషిస్తున్నారు. అడవిప్పుడు మూడు భాషల సంగమమైంది. వీటికి తోడు నవ్వుల రేడు జైబాలాజీ సరదా కబుర్లు.

పాప నాశనం లోయ లోకి దిగుతున్న ప్రకృతి ప్రియులు.

ఎదురుగా రామకృష్ణ తీర్థం వెళ్ళే కొండ. ఆ కొండకు కుడివైపున మలుపు నుంచి దిగువకు సాగుతున్నాం. పక్కన పాపనాశనం రొద చేస్తూ ప్రవహిస్తోంది. దిగువకు పోయిన కొద్దీ చుట్టూ చెట్లు కమ్మేస్తున్నాయి. సూర్యుడు కనిపించడం లేదు. మరి కాస్త దూరం వెళితే తుంబురు కోన. తుంబురుకు అరకిలోమీటరు ఈవల పాపనాశనం లోయలోకి ఒకరొకరుగా దిగాం. దిగడం కాస్త కష్టమైనా తాడు లేకుండానే దిగాం. మా బృందానికి ముందు మధు, చివరన తిరుమల రెడ్డి.

ఏడుగురు వనదేవతలు

లోయలోకి దిగి ముందుకు నడుస్తున్నాం. దక్షిణం నుంచి ఉత్తర దిశగా రాళ్ళ మధ్య ఏరు ప్రవహిస్తోంది. అనేక నీటి గుండాలను దాటుకుంటూ సాగుతోంది. ఉదయం ఎనిమిదయ్యింది. ఒక పెద్ద నీటి గుండం ముందు అగాం. వాటిని అక్కగార్ల నీటి గుండాలంటారు. ఆ గుండాల్లో మాలో కొందరు మునకలేశారు. ఆ పక్కనే కొండకు అనుకుని ఏడు అక్కగార్ల విగ్రహాలుగా భావించే రాళ్ళున్నాయి. వాటిని ఏడుగురు వన దేవతలుగా భావిస్తారు. పాపనాశనం ఏటి పైభాగం నుంచి ఉత్తర దిశగా వచ్చిన మేం, లోయలో ప్రవాహానికి ఎదురుగా దక్షిణ దిశగా నడుస్తున్నాం.

అక్క గర్ల గుండాలు

ఉదయం తొమ్మిదైంది. అయినా వాతారణం చల్లగా ఉంది. ఇరువైపులా రెండు ఎత్తైన కొండలు. ఏటిలో ఎక్కడా ఎండ పొడ కనిపించడం లేదు. ఏటి మధ్యలో ప్రవహిస్తున్న నీరు. ఏరు పక్కన ఎడమ వైపు నుంచి మా నడక మొదలైంది. ఏటిలో రకరకాల చెట్లు. మధ్యలో ఏటి ప్రవాహానికి కొట్టుకొచ్చిన రాళ్ళ పైన నడుస్తున్నాం.

మలయప్ప తీర్థం

మలయప్ప కోన

ఏటిలో ఎదురుగా ఎత్తైన కొండ. ఆ కొండ పైనుంచి జాలువారుతున్న జలపాతం. అంచెలంచెలుగా జారుతూ ముందుకు సాగిపోతోంది. నీటిగుండాలు కనిపించినా, జలపాతాలు కనిపించినా మా ట్రెక్కర్లకు పూనకం వచ్చేస్తుంది. మెట్లు మెట్లుగా ఉన్న బండలు ఎక్కి జలపాతం కిందకు చేరుకున్నారు. చుట్టూ కొండలు, కొండ చుట్టూ మహావృక్షాలు. కొండకు కుడి వైపున కాస్త లోపలకు చొచ్చుకుపోయింది. అక్కడ కూడా పెద్ద నీటి గుండమే! దానిలోకి పెద్ద జలధారపడుతోంది. ఇదే మలయప్ప కోన.

కొండ అంచులో ఇరుక్కుపోయిన కాలు

ఎడమవైపు కొండ అంచులు పట్టుకుని ఎక్కుతున్నాం. మనిషెత్తు పెరిగిన చెట్ల మధ్యలో సాగుతున్నాం. కొండ అంచునే ఫెర్న్ పెరిగింది. పక్కనే లోతైన మలయప్ప కోన లోయ. ఫెర్న్ పైనుంచి జాగ్రత్తగా నడుచుకుంటూ సాగుతున్నాం. నా కుడి కాలు ఉన్నట్టుండి మోకాలి వరకు ఉన్న ఫెర్న్ కింద ఉన్న రాతి చీలికలో దిగబడిపోయింది. పక్కనే లోతైన లోయ. కాలిని ఎంత తీసినా రావడం లేదు. అతి కష్టం పైన లేవగలిగాను. కొండ పైనుంచి పడుతున్న నీటి ధార వల్ల కిందంతా చెమ్మగానే ఉంది. నా ముందు వెళ్ళిన వాళ్ళెవరూ ఫెర్న్ కింద చీలిక ఉన్నట్టు గుర్తించలేకపోయారు.

మలయప్ప తీర్థం పక్క న కొండ అంచు నే ఫెర్న్ లో నడిచి వెళుతున్న ప్రకృతి ప్రియులు

ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట పడుతూ లేస్తూనే ఉన్నారు. 'పడని వాళ్ళు పాపాత్ములు' అన్న సామెతలా తయారైంది మా పరిస్థితి. కొండ అంచులు దిగగానే నేలంతా బండలు. మళ్ళీ ఆ రాళ్ళను ఎక్కుతూ సాగుతుంటే ఎదురుగా మరో పెద్ద నీటి గుండం. పై నుంచి ఏరు పారుతోంది. ఏరుఎన్ని మెలికలు తిరిగిందో ! మెలికలు తిరిగినప్పుడల్లా వయ్యారాలు పోతోంది. పది అడుగుల ఎత్తునుంచి రెండు కొండల నడుమ ఉన్న గుండంలో పడి ముందుకు సాగుతోంది. ఆ నీటి గుండానికి పక్కనే ఆనుకుని ఉన్న ఎత్తైన కొండ. మళ్ళీ ఆ నీటి గుండంలో మునకలేశాం.

మధ్య లో మరొక నీటి గుండం

ముందు ఇంకా ఎన్ని జలపాతాలున్నాయో! ఎన్ని గుండాలున్నాయో! సాగక తప్పదు కదా! మళ్ళీ ఎడమ పక్కన కొండ ఎక్కాలి. కొండ అంచునే సాగుతున్నాం. ఏటి ప్రవాహానికి పెద్ద పెద్ద బండ రాళ్ళు కొట్టుకొచ్చాయి. ఇంత పెద్ద బండ రాళ్ళు కొట్టుకొచ్చాయంటే ఆ ఏరు ఎంత ఉదృతంగా ప్రవహించిందో! ఒక పెద్ద బండరాయి కింద నుంచి పైకి మొలుచుకొచ్చిన చెట్టు ఆ బండరాయిని పెనవేసుకుని ఎలా పైకి ఎగబాకిందో! ఏటి ప్రవాహానికి అడ్డంగా పడిపోయిన మహావృక్షం.

ఒకపెద్ద నాగుపాము కూసం ఏడడుగులుంది. ఆ కూసాన్ని ఇద్దరూ చెరొక పక్కల లాగి పట్టుకున్నారు. ఒక బండరాయి నైరూప్య చిత్రంలా ఉంది. వందల ఏళ్ళనాటి మహావృక్షం వేళ్ళు ఏటి ఉదృతికి బైటపడ్డాయి. మధ్యాహ్నమవుతోంది. ఏటిలో ఎండ పొడ కనిపిస్తోంది. సూర్యుడు నడినెత్తికొచ్చాడు. చెట్ల సందుల్లోంచి సూర్య కిరణాలు దోబూచులాడుతున్నాయి. మరొక పక్క కొండ అంచు విప్పిన పెద్ద పాము పడగలా ఉంది. ఆ కొండ పడగ కింద అంతా కాసేపు సేదదీరాం.

పెద్ద పాము కూసం

మలయప్ప తీర్థం

ముందుకు సాగితే జలపాతపు హెూరు. ఎత్తైన కొండ నుంచి జలపాతం జాలువారుతూ ముందుకు సాగుతోంది. ఆ జలపాతం కింద మళ్ళీ తడిసిపోయాం. మద్యాహ్నం ఒంటిగంటన్నరవుతోంది. అంతా భోజనాలు ముగించుకుని బండలమీద నడుం వాల్చాం. అంతా అలిసిపోయాం. కాస్త ఏటవాలుగా ఉన్న బండపైన పడుకుని, బ్యాగును తల కింద పెట్టుకున్నాను. పడుకోగానే కునుకు పట్టేసింది. నా వెనుకనుంచి వచ్చిన ఒక కోతి నా బ్యాగును లాగేసింది. అదిలించేసరికి పారిపోయింది. పులిహోర తిని పక్కన పడేసిన కాగితాల వాసన చూసి నా దగ్గరకు వచ్చినట్టుంది. ఇటు కునుకు పట్టడం, అటు కోతి వచ్చి నా బ్యాగును లాగేయడం దానికి అటైపోయింది. సూర్యుడు పడమటి దిక్కుకు పయనమవుతున్నాడు. మధ్యాహ్నం మూడుగంటలవుతోంది. మళ్ళీ బయలుదేరాం.

తాళ్లు పట్టుకుని కొండ ఎక్కు తో ..

మళ్ళీ ఎడమ వైపున నిట్టనిలువునా ఉన్న రాతి కొండ ఎక్కాలి. బెత్తెడు ఉన్న కొండ అంచు పట్టుకుని ఎక్కిన ఒక సాహసికుడు తాడు కట్టి కిందకు వదిలాడు. అంతా ఆ తాడు పట్టుకునే ఎక్కుతున్నాం. మధు కింద ఉండి ఒకరొకరిని తాడుకు ఎక్కిస్తుంటే, పై నున్న తిరుమల రెడ్డి ఒకరొకరిని జాగ్రత్తగా అందుకుంటూ దారి చూపిస్తున్నాడు. యశ్వంత్ అందరికంటే ముందు పైలట్లా ముందు వెళుతూ దారి చూసి వస్తున్నాడు. వాళ్ళతో పోల్చుకుంటే నేను కాస్త వెనుకబడ్డా. జై బాలాజీ నా కోసం నా వెనుకే ఉంటాడు. ఎక్కడా నన్ను వంటరిగా వదలలేదు.

కాయరసాయన తీర్థం

సన్నగా పారే ఏటికి ఎటువైపు నుంచి వెళ్ళాలో ఎప్పటికప్పుడు అన్వేషణే! రాళ్ళను ఎక్కుతూ దిగుతూ సాగుతున్నాం. మళ్ళీ సన్నగా నీటి శబ్దం. అర్ధచంద్రాకారంలో ఉన్న కొండచీలికలో ఇరుక్కుపోయిన బండ రాళ్ళు. ఆ బండ రాళ్ళ సందుల్లోంచి ముందున్న గుండంలోకి రొద చేస్తూ నీటి ధారపడుతోంది. అదే కాయరసాయన తీర్థం.

సాయంత్రం నాలుగవుతోంది. అప్పటికే లోయలో చీకటి కమ్ముకుంటోంది. చలేస్తోంది. చలిని కూడా లెక్క చేయకుండా కాయరసాయన తీర్థంలోకి దూకాం. ఈదుకుంటూ ఈదుకుంటూ జలధార కిందకు చేరాం. ఇరువైపులా ఉన్న కొండ అంచులు పట్టు దొరికింది. కాళ్ళ కింద రాళ్ళు తగులుతున్నాయి. నెత్తిన జలధార పడుతుంటే అలాగే ఉండిపోయాం. ఎంతసేపైనా అలా ఉండిపోవాలనిపించింది. కానీ కాలం తరుముకోస్తోంది. చీకటి పడకముందే పాపనాశనం చేరుకోవాలి. గుండంలోంచి మళ్ళీ లేచి నడక సాగించాం. మళ్ళీతాళ్ళు పట్టుకుని కొండ ఎక్కాం. రాళ్ళ పైనుంచి అలా సాగుతున్నాం.

జ్వరహర తీర్థం

జ్వర హర తీర్థం ముందు ప్రకృతి ప్రియులు

కొంత దూరం వెళ్ళ గానే కొండ పైనుంచి దుముకుతున్న జలపాతం. కొండకున్న అంచులపై నుంచి దుముకుతోంది. కానీ, సమయం గడిచిపోతోంది. తిరిగి వెళ్ళ క తప్పడం లేదు. వచ్చిన దారినే మళ్ళీ కొంత దూరం వెనక్కి నడిచాం. కొండ ఎక్కుతున్నాం. పక్కనే వెంకటేశ్వర తీర్థం. ఇది పేరుకు తీర్థమైనా పెద్దగా నీళ్ళు లేవు. కొండ ఎక్కుతూ ముందుకు సాగుతున్నాం.

లోయలో ఒంటి స్తంభం రాయి

అటు ఒక కొండ, ఇటు ఒక కొండ. మధ్యలో లోతైన లోయ. మేం నడుస్తున్న కొండ అంచునే ఎడమ వైపున లోయవైపు నడిచాం. లోతైన లోయలోంచి ఒక పెద్ద

లోతయిన పాప నాశనం లోయ నుంచి పైకి వచ్చిన ఏక శిల పై ప్రకృతి ప్రియులు.

రాయి ఒంటి స్తంభం మేడలాగా, మేం

మధ్య లోతైన లోయ. కిందకు చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. ఆ కొండ నుంచి ఈ రాయి పైకి ఒక్కొక్కరూ చాలా జాగ్రత్తగా దాటాం. ఎవ్వరూ ఎగరవద్దని మధు సీరియస్ గా హెచ్చరించాడు. ఎగరడంలో పొరపాటున లోయలో పడితే ఇక అనవాళ్ళు కూడా దొరకవు. నిజానికి భయమేసింది. పదహారు మందిలో ఉండడం వల్ల ధైర్యమూ వచ్చింది.

నలుచదరంగా ఉన్న ఆ ఒంటి స్తంభం రాయి లోయలోంచి ఒంటరిగా పైకి నిటారుగా లేచి నిలబడింది. దాని పైన పదహారు మందిమి పట్టాం. ఒక అంచులో నేను మధు, మరొక ఇద్దరు కాళ్ళు వేలాడేసుకుని కూర్చున్నాం. భూమ్యాకర్షణకు కాళ్ళు జివ్వున లాగుతున్నాయి. మిగతా అంతా మా వెనుక నిలుచున్నారు. ఆవల ఉన్న కొండ నుంచి కెమెరా క్లిక్ మంది.

ఏమిటీ సాహసం!? మళ్ళీ ఒకరొకరుగా వెనక్కి జాగ్రత్తగా దాటుకుని కొండ అంచుకుచేరాం. తమిళనాడుకు చెందిన ఒక ట్రెక్కర్ మాత్రం వారిస్తున్నా వినలేదు. ఒంటి స్తంభం రాయిపైనుంచి కొండ పైకి ఒక్క ఉదుటన గెంతాడు. మా గుండెలు గుభేల్ మన్నాయి. కొండ ఎక్కుతూ ముందుకు సాగుతుంటే ఎదురుగా పాపనాశనం డ్యాం. దాని పక్కనుంచి పైకి ఎక్కేసరికి సాయంత్రం అయిదైంది. ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం అయిదు గంటలవరకు పదకొండు గంటల నడక. మా అడుగులు భారంగా పడుతున్నాయి. ఇక ఏ మాత్రం నడిచే ఓపిక లేదు. తిరుపతి చేరే సరికి చీకటిపడుతోంది. నిజంగా ఇది సాహసోపేతమైన ట్రెక్కింగే!

Tags:    

Similar News