మడికోన దారిలో స్వాగతం పలికింది బత్తెనయ్య కోన

దీని పేరు ఇంతకు మునుపెన్నడూ విననయినాలేదు. ఇదేదో యాత్రాస్థలమని కొంచెంసేపు అటు ఇటు తిరుగుతూ, చుట్టూర ఆశ్చర్యంగా చూస్తూ గడిపినాము.

Update: 2024-05-02 08:10 GMT

(భూమన్)


బత్తెనయ్యకోన మడికోన అమ్మవారి తీర్థం. చాలాకాలం నుండి మాకు అత్యంత ఇష్టుడు , ప్రేరకుడు అయిన చెన్నై శ్రీరాం పిలుపుతో తిరుపతినుండి మేము , శ్రీరాం బ్యాచ్ 15 మంది, తిరుపతి సమీపాన ఉన్న శ్రీకాళహస్తి దగ్గరగా ఉండే మడికోనకు బయలుదేరినాము.




 పాపానాయుడు పేటకు 15 కి.మీ దూరం. పాపానాయుడుపేట పూసలకు ప్రసిద్ధి. ఒకప్పుడు చాలా కర్మాగారాలు ఉండేవి. ఇప్పుడు ఒక్కటంటే ఒక్కటి మిగిలింది. పాపానాయుడు పేటలో టిఫిన్ చేస్తుంటే మా పూర్వ విద్యార్థి విజయ కనిపించి తిరిగొచ్చేప్పుడు ఇదే దారిన రండి సార్ పూసలు ఇస్తానని గట్టిగా చెప్పినాడు.




 కార్తీక నెల పొద్దున్నే , ఆహ్లాదకర వాతావరణంలో మొదలైంది మా యాత్ర. అనుకున్న సమయానికి రావల్సిన వారందరం ముసలిపేడు గ్రామం వద్దకు చేరుకున్నారు.




 అక్కడనుండి పలుచటి అడవిలో మట్టిరోడ్డులో దాదాపు గంటన్నర ప్రయాణించి బత్తెనయ్య కోన చేరుకున్నాము. అక్కడ ఎత్తయిన కొండలు , చిక్కటి అడవి చూడచక్కగా ఉన్నాయి. చేరుకున్నామే గాని, దీని పేరు ఇంతకు మునుపెన్నడూ విననయినాలేదు. ఇదేదో యాత్రాస్థలమని కొంచెంసేపు అటు ఇటు తిరుగుతూ, దూరపు , చెంతనున్న కొండల్ని ఆశ్చర్యంగా చూస్తూ గడిపినాము.




 మేము పోవాల్సింది మడికోనకు అక్కడ పద్మావతి తీర్థము ఉంది. శ్రీరాం బృందం బత్తెనయ్యకోనకు రాకుండా నేరుగా వెళ్ళినారు. మేము దారి తెలియక నేరుగా బత్తెనయ్యకోనకు విచ్చేసినాము. బత్తెనయ్య కోనకు చేరకముందే ఒక వాగు పారుతూవుంది. ఆ వాగు వెంబడి పోవాలి.




శ్రీరాం వెనుదిరిగిన మా కోసం ఆమలుపుతో ఒక మనిషిని ఉంచినాడు. మేం పోతున్నదారిలో రకరకాల పుట్టగొడుగులు ఆకర్షణీయంగా ఉన్నాయి. అక్కడ పాడుబడిన గుడిసెలు ఉన్నాయి. అడవి సంపదకోసం వస్తూపోతే గిరిజనులవి. వాటిలోపలకు పోయిచూస్తే బీద ప్రపంచం తెలిసింది. మంచెలున్నాయి.


ఆ చక్కటి అడవిలో వాగు వెంట నడక హుషారుగా ఉంది. దాదాపు అరగంటలో మడికోన చేరుకున్నాము. మా కోసం ఎదురుచూస్తూ శ్రీరాం బృందం నీటి ప్రవాహం పరిమితంగా ఉన్నా చూడ సొంపయిన స్థలం.



కొంచెం ముందుకుపోయి ఒక పెద్ద గుండురాయిని తాళ్ళద్వారా ఎక్కి అవతలకి జారుకుంటే అద్భుతమయిన జలపాతం. కొండచీలిక మధ్యన నీటి హోరు. మినీ శేష , తుంబురు , గూండాలకోన మాదిరిగా ఉంది. గుండు ఎక్కగలిగిన వాళ్ళు , ఈత వచ్చినవాళ్ళు అవతలికి వచ్చినారు. మిగిలిన వారు తొలిచోటనే ఉండిపోయినారు.




చాలాసేపు ఈదులాడి , బాగా అలసిపోయినాక వెనక్కి వచ్చినాము. దీన్ని పద్మావతి పుణ్యతీర్థమంటారని శ్రీరాం చెప్పినారు. శ్రీకాళహస్తి చుట్టు ప్రక్కల ఇట్టాంటివి కొన్ని వందల తీర్థాలు ఉన్నాయట. శ్రీరాం బృందం కొన్ని పదులు చూసి వచ్చిందట. మేమేమో శేషాచలమేననుకుంటే , ఈ కొండలు , అడవులు అబ్బురపరుస్తున్నాయి.



తిరుగు ప్రయాణంలో వాన మొదలయింది. మా ఆనందానికి అవధుల్లేవు. అడవిలో , ఆ వానలో అట్లా నడిచే అవకాశం రావటమే ఒక భాగ్యము. ఏ పంచన చేరకుండ , చెట్లమాటుకు పోకుండా హాయిగా తడుస్తూ వస్తున్నాము.

మలుపు తిరగ్గానే ఇంతదూరం వచ్చినాము కదా, ఆ బత్తెనయ్య కోనకూడ పోయొస్తే ఒక పని ఐపోతుందికదానంటే నాతోపాటు మా శీను, భగవాన్ , కుందాసి ప్రభాకర్ , కడపనుండి వచ్చిన నరసింహారెడ్డి సరేనన్నారు. మిగిలిన వాళ్ళందరూ వారి దారిన వారు పోగా మేము మాత్రం ఆ సాయంకాలం బత్తెనయ్యకోన చేరుకున్నాము.




 రెండు వేలకు పైగా మెట్లుండవచ్చు. ఆ చిరుజల్లుల్లో సునాయాసంగా సరసరమని ఎక్కేసినాము. మళ్ళీ మబ్బవుతుందనే బెంగ మమ్మల్ని తరిమింది. పైన శివుని గుడి. అక్కడ నుండి చూస్తే చూపులకందేంత పచ్చదనం. ఎచ్చట పరుపుల చుట్టూ మంచపు కోళ్ల మాదిరిగా కొండలు. అద్భుతంగా ఉంది. ఆపక్కనే కుడివైపు ఒకదారి ఉంది. దాన్ని చూద్దామనుకుని , చీకటిపడే వేళ కనుక వెనుదిరిగినాము.




 కాళహస్తి చుట్టు ప్రక్కల ఉండే మరిన్ని ప్రదేశాలను తప్పక చూడాలని సంకల్పం చెప్పుకుని 7 గంటలకంతా పాపానాయుడుపేట చేరుకున్నాము. పూసలు ఒక సంచీనిండా వేసుకుని నాకోసం విజయ్ దారిలో ఎదురుచూస్తున్నాడు. అతడి అభిమానానికి మురిసిపోయి , ఇంకోమారు ఇంటికొస్తాన్లే అని చెప్పి దాదాపు 30 కి.మీ. ప్రయాణం ముగించి మా మా ఇళ్ళుచేరుకున్నాము.


ఈ ట్రెక్కింగ్ మంచి జ్ఞాపకం మాకు.



Tags:    

Similar News