మహారాష్ట్రలో సీట్ల పంపకాలపై చర్చలు కొలిక్కి వచ్చేనా?

మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలు ఇప్పటి నుంచి పొత్తులకు సిద్ధమమవుతున్నాయి.

Update: 2024-09-18 08:06 GMT

మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలు ఇప్పటి నుంచి పొత్తులకు సిద్ధమమవుతున్నాయి. మొత్తం 288 స్థానాలకు 125 సీట్లలో మహా వికాస్ అఘాడి (MVA) కూటమి సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. మిగిలిన 163 సీట్లపై క్లారిటీ రావాల్సి ఉంది.

MVA కూటమిలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన (UBT), శరద్ పవార్ నేతృత్వంలోని NCP (SP), కాంగ్రెస్ ఉన్నాయి. కాంగ్రెస్ 108-115 స్థానాల్లో, ఎన్‌సిపి (ఎస్‌పి) 90-95 స్థానాల్లో, సేన (యుబిటి) 85-90 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. సెప్టెంబరు 18 నుంచి 20 వ తేదీవరకు సీట్ల పంపకంపై కూటమి భాగస్వామ్య పక్షాలు చర్చలు జరపనున్నాయి.

ముందున్న రెండు ఫార్మూలాలు..

MVA ఇప్పుడు సీట్ల సర్దుబాటు రెండు విధాలుగా ఉండబోతుంది. మొదటి ఫార్ములా ప్రకారం.. గతంలో అవిభక్త శివసేన, అవిభక్త NCP, కాంగ్రెస్ పార్టీలు గెలుచుకున్న 154 అసెంబ్లీ స్థానాల్లో సేన (UBT), NCP (SP) కాంగ్రెస్ పోటీపడతాయి. ఆ లెక్కన 2019లో ఐక్య సేన 56, ఐక్య NCP 54, కాంగ్రెస్ 44 గెలుచుకుంది. మిగిలిన 134 సీట్ల విభజన చర్చల తర్వాత జరుగుతుంది. ఈ134 స్థానాల్లో కాంగ్రెస్, యునైటెడ్ ఎన్‌సిపి రెండవ స్థానంలో ఉన్న చోట బిజెపి 105 స్థానాలను కైవసం చేసుకుంది.

రెండో ఫార్ములా ప్రకారం.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మూడు పార్టీలు తాము ఆధిక్యంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాయి. అయితే అధికార కూటమి ఆధిక్యంలో ఉన్న స్థానాలపై చర్చించి, మూడు పార్టీలు పంచుకుంటాయి. ఈ లెక్కన లోక్‌సభ ఎన్నికల్లో MVA మిత్రపక్షాలయిన శివసేన (UBT) కంటే కాంగ్రెస్, NCP (SP) మెరుగ్గా పనిచేయడంతో వారిదే పైచేయి అవుతుంది. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు 30 స్థానాలను గెలుచుకుని సార్వత్రిక ఎన్నికల్లో MVA అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.

ఎక్కువ సీట్ల కోసం పోటీ..

లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా కాంగ్రెస్ 110 సీట్లకు పైగా కోరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పోటీ చేసిన 17 స్థానాలకు గానూ 13 చోట్ల విజయం సాధించింది. శరద్ పవార్ నేతృత్వంలోని NCP స్ట్రైక్ రేట్ 80 శాతం ఉంది. ఎందుకంటే అది పోటీ చేసిన 10 సీట్లలో ఎనిమిది లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పోటీ చేసిన 21 స్థానాలకు గాను తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ (ఎస్పీ) కూడా అదే నిష్పత్తిలో సీట్లు అడుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన (యుబిటి)ల కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు ఎన్‌సిపి (ఎస్‌పి) రాజీ కుదిరిందని, అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ సీట్లతో సరిపెట్టుకోవడానికి సిద్ధంగా లేదని ఆ పార్టీ నేతలు తెలిపారు.

శివసేన (యుబిటి) 100 సీట్లకు పైగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. కోస్తా ప్రాంతం, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) మినహా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశాలున్నాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఠాక్రే నేతృత్వంలోని సేన ఈ భాగంలో మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తుంది.

ముంబైలో పోటీపడుతున్న పార్టీలు..

ఇదిలా ఉండగా శివసేన (యుబిటి)కి కంచుకోట అయిన ముంబైలోని 36 అసెంబ్లీ స్థానాలపై కూటమి భాగస్వాములు కూడా విభేదిస్తున్నారు. కాంగ్రెస్, ఉద్ధవ్ నేతృత్వంలోని సేన (యుబిటి) రెండూ ముంబైలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నాయి. గత సమావేశంలో శివసేన (యుబిటి) ముంబైలోని 36 సీట్లలో 18-20 సీట్లను డిమాండ్ చేసింది. వారు గెలిచిన స్థానాలు, చాలా మంది అభ్యర్థులు ఆసక్తి చూపిన స్థానాలపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. కాంగ్రెస్ 14-16 సీట్లు కోరగా, శరద్ పవార్ ఎన్సీపీ వర్గం ఐదు నుంచి ఏడు సీట్లు కోరింది. ఏ పార్టీకి దీర్ఘకాలంగా ఎమ్మెల్యేలు ఉన్న సీట్లు ఆ పార్టీకే ఉండే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు పార్టీని వీడిన చోట్ల ఆ పార్టీకి సీట్లు వస్తాయని విశ్వసనీయవర్గాల సమాచారం.

ఆ సీట్లపైనే కన్నేశాయి..

నివేదికల ప్రకారం.. మూడు పార్టీలు వెర్సోవా, అంధేరీ ఈస్ట్‌లపై తమ వాదనను వినిపించాయి, శివసేన (యుబిటి), కాంగ్రెస్ రెండూ బైకుల్లా, కోల్బా, ధారవి, సియోన్ కోలివాడ, వడాలా, వాండ్రే ఈస్ట్, చండివాలి నుంచి అభ్యర్థులను నిలబెట్టడానికి ఆసక్తిని చూపాయి. ఆసక్తికరంగా మలబార్ హిల్, విలే పార్లే, చార్కోప్, బోరివలి, ములుండ్ - ప్రస్తుతం BJP ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదు నియోజకవర్గాల నుండి పోటీ చేయడానికి ముగ్గురు MVA భాగస్వాములలో ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అవిభక్త శివసేనకు ముంబైలో 14 సీట్లు ఉండగా, ముంబైలో శివసేన (యూబీటీ) మూడు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. మూడు MVA మిత్రపక్షాలలో తాము బలమైన స్థానంలో ఉన్నామని పార్టీ విశ్వసిస్తోంది. అందువల్ల అది గణనీయమైన ముస్లిం జనాభా కలిగిన వారితో సహా 20 స్థానాలను కోరింది. అనుశక్తి నగర్, కుర్లా, ఘట్కోపర్ ఈస్ట్, వెర్సోవా, అంధేరీ వెస్ట్ మరియు దహిసర్ సహా ఏడు స్థానాలను ఎన్సీపీ (ఎస్పీ) కోరింది. శరద్ పవార్ వర్గం వాదనను తిరస్కరించడం ఇతర రెండు మిత్రపక్షాలకు కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుశక్తి నగర్ మినహా మిగిలిన స్థానాలు ఏవీ శివసేన (యుబిటి) లేదా కాంగ్రెస్‌కు లేవు. మూడు ప్రధాన పార్టీల మధ్య సీట్ల కోసం గొడవ కాకుండా, సమాజ్ వాదీ పార్టీ వంటి చిన్న భాగస్వామ్య పక్షాలకు కూడా MVA కొన్ని సీట్లు ఇవ్వవలసి ఉంటుంది. ఇది సీట్ల భాగస్వామ్య చర్చలను మరింత క్లిష్టతరం చేస్తుంది.

Tags:    

Similar News