Maharashtra Politics | మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంపై అసహనం
దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మొదటి మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే.
మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) సీనియర్ నాయకుడు ఛగన్ భుజ్‌బల్ అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.
దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మొదటి మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే. మహాయుతి కూటమి మిత్రపక్షాలయిన BJP, శివసేన, NCP నుంచి 39 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పది మంది మాజీ మంత్రులను తొలగించి, 16 మంది కొత్త ప్రజాప్రతినిధులకు స్థానం కల్పించారు.
ఎన్‌సీపీకి చెందిన మాజీ మంత్రులు భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, ముంగంటివార్, బీజేపీకి చెందిన విజయ్‌కుమార్ గావిట్ కొత్త క్యాబినెట్‌లోకి తీసుకోలేదు. దీంతో నాసిక్ జిల్లా యోలా నియోజకవర్గం నుంచి గెలుపొందిన భుజ్‌బల్ విలేకరులతో మాట్లాడుతూ.. తాను తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మహాయుతి మిత్రపక్షాలు తమ పదవీకాలంలో మంత్రుల పనితీరు ఆడిట్‌ను నిర్వహించేందుకు అంగీకరించాయని ఫడ్నవీస్ ఆదివారం మంత్రివర్గ విస్తరణ తర్వాత చెప్పారు. అయితే మంత్రుల పనితీరు ఆడిట్‌పై వ్యాఖ్యానించేందుకు భుజబల్ నిరాకరించారు.
మాజీ మంత్రి దీపక్ కేసర్కర్‌ను కూడా తొలగించారు. పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. అన్ని ప్రాంతాలకు, వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించడంలో భాగంగా పార్టీ అగ్రనేతలు నిర్ణయం తీసుకుని ఉండవచ్చని శివసేన నేత దీపక్ కేసర్కర్ పేర్కొన్నారు. కాగా మంత్రుల పనితీరు ఆడిట్‌లో అర్థం లేదని కాంగ్రెస్ నేత భాయ్ జగ్తాప్ అన్నారు. పనితీరు ఆడిట్‌కు వ్యవధి పారామీటర్ కాదన్నారు.