Maharashtra Politics | ఎన్‌సీపీ అజిత్‌పై విరుచుకుపడ్డ భుజ్‌బల్
ఎన్‌సీపీ నేత భుజ్‌బల్‌ను ఈ సారి క్యాబినెట్‌లోకి తీసుకోకపోవడంతో ఆయన అనుచరులు అజిత్ పవార్ సొంత జిల్లా పూణేలో నిరసన వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర మహాయుతి కూటమిలో మంత్రి పదవి దక్కని వారు పార్టీ అధినేతలపై మండిపడుతున్నారు. నాసిక్ జిల్లా యోలా నియోజకవర్గం నుంచి ఎన్‌సీపీ తరుపున పోటీ చేసి గెలిచిన ఛగన్ భుజ్‌బల్‌ను ఈ సారి క్యాబినెట్‌లోకి తీసుకోలేదు. గత మహాయుతి ప్రభుత్వంలో ఈయన మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నాసిక్ జిల్లా యోలా నియోజకవర్గం నుంచి ఎన్‌సీపీ తరుపున పోటీ చేసి గెలిచారు. ఈ సారి కూడా మంత్రి పదవిలో కొనసాగుతారని ఆయనతో పాటు ఆయన అనుచరులు భావించారు. కాని ఆయనను క్యాబినెట్‌లోకి తీసుకోలేదు. ఈయనతో పాటు గతంలో మంత్రులుగా పనిచేసిన మరో ముగ్గురిని సైతం పక్కన పెట్టారు. ఎన్‌సీపీ చెందిన దిలీప్ వాల్సే పాటిల్, బీజేపీకి చెందిన సుధీర్ ముంగంటివార్, విజయ్‌కుమార్ గవిట్ ఆ జాబితాలో ఉన్నారు.
వెల్లువెత్తిన నిరసనలు..
భుజ్‌బల్‌ను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో ఆయన మద్దతుదారులు అజిత్ పవార్ సొంత జిల్లా పూణేలో నిరసన వ్యక్తం చేశారు. భుజ్‌బల్‌ను పక్కన పెట్టడం వెనుకబడిన వర్గాలను అవమానించడమేనని ఆయన మద్దతుదారులు పేర్కొన్నారు. అజిత్ పవార్ స్వస్థలం బారామతిలో ఆయన బంగ్లా వెలుపల కూడా భుజ్‌బల్ వర్గీయులు నల్ల దుస్తులు ధరించి ఆందోళన చేపట్టారు. ఓబీసీకి చెందిన భుజ్‌బల్‌కు డిప్యూటీ సీఎం పదవి కేటాయించాలని ఒక నిరసనకారుడు డిమాండ్ చేశాడు. మరాఠా కమ్యూనిటీకి OBC హోదా ఇవ్వాలని కార్యకర్త మనోజ్ జరాంగే నిరాహారదీక్షలు ప్రారంభించినప్పుడు.. భుజ్‌బల్ మాత్రమే OBCలకు అండగా నిలిచారని మరో నిరసనకారుడు పేర్కొన్నారు.
మంత్రి పదవి దక్కకపోవడంపై ఉత్తర మహారాష్ట్రలోని తన సొంత జిల్లా నాసిక్‌లో భుజ్‌బల్ విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రివర్గం నుంచి తనను తప్పించడంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు తన మద్దతుదారులను కలిశారని చెప్పారు.
‘‘నా నియోజకవర్గ ప్రజలు గందరగోళంలో ఉన్నారు. నేను గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశా. ప్రస్తుతం మళ్లీ ఎమ్మెల్యేనయ్యా. ఇప్పడు నన్ను క్యాబినెట్‌లోకి తీసుకోకపోవడాన్ని కారణాన్ని నా నియోజకవర్గ ప్రజలకు చెప్పాలి. వారంతా నాకు మద్దతుగా నిలుస్తామంటున్నారు. నేను కూడా మిమ్మల్ని వీడనని వారికి హామీ ఇచ్చాను" అని భుజ్‌బల్ అన్నారు.
నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు..
OBC కమ్యూనిటీలో బలమున్న నేతగా పేరున్న భుజ్‌బల్ ..NCP చీఫ్ అజిత్ పవార్ మంత్రి పదవులకు సంబంధించి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదని ఆరోపించారు.
అజిత్ పవార్ తన మామ శరద్ పవార్ నుంచి వైదొలిగి 2023 జూలైలో మహాయుతి కూటమిలో చేరారు. తనకు అనుకూలంగా ఉన్న వారిని దగ్గరకు చేర్చుకుని తన లాంటి సీనియర్ సభ్యులను విస్మరించారని భుజ్‌బల్ అజిత్ పవార్‌ను విమర్శించారు.
“శరద్ పవార్ మాతో కొన్ని విషయాలు పంచుకునేవారు. శరద్ పవార్‌తో మేము విభేదించినా చర్చలు జరిగేవి. ఇక్కడ చర్చ లేదు. సమాచారం లేదు. లోక్‌సభ, అసెంబ్లీ టిక్కెట్ ఎవరికి వస్తుందో కూడా తెలియని పరిస్థితి." అని భుజ్‌బల్ పేర్కొన్నారు.
"1978లో నేను శివసేన పార్టీలో ఉన్నపుడు పార్టీ ప్రతి నిర్ణయాన్ని నాతో పంచుకునేవారు. తరువాత కాంగ్రెస్‌లో చేరా. శరద్ పవార్ పార్టీని వీడినపుడు ఆయనతోనే ఉన్నా. ఆయన మమ్మల్ని లూప్‌లో ఉంచేవాడు. ప్రతి ఒక్కరికి తనదైన శైలిలో పనితీరు ఉంటుంది. నేను దానిని అంగీకరిస్తున్నాను. కొంతమంది పెద్దవారు అవుతారు. నాలాంటి వారు వెనుకబడిపోతారు.’’అని చెప్పారు భుజ్‌బల్.
బహుశా నాలాంటి ఫైటర్ అవసరం లేదేమో..
తనను కేబినెట్ నుంచి ఎందుకు తప్పించారనే అంశంపై భుజ్‌బల్ మాట్లాడుతూ.. ‘‘41 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత నాలాంటి యోధుడు కేబినెట్‌లో అవసరం లేదని ఎన్‌సీపీ నేతలు భావించి ఉండవచ్చు. ఎన్‌సీపీలో మోస్ట్ సీనియర్ లీడర్‌గా ఉన్నప్పటికీ భుజ్‌బల్‌కు క్యాబినెట్ బెర్త్ దొరకలేదు. ఇది ఓబీసీలను అవమానించడమే. మీరు సీనియర్లకు క్యాబినెట్ పదవులు కేటాయించాలని నిర్ణయించుకుంటే.. మరి భుజబల్‌కు ఎందుకు వర్తించలేదు?" అని భుజ్‌బల్ మద్దతుదారుడొకరు ప్రశ్నించారు.