ఫడ్నవీస్ మళ్లీ మహారాష్ట్ర సీఎం అవుతారా?

ఫడ్నవీస్ నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గంలో 15,000 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఆయన పార్టీ అభ్యర్థులు కూడా ముందంజలో ఉన్నారు.

Update: 2024-11-23 09:17 GMT

మహారాష్ట్ర రాజకీయాల్లో దేవేంద్ర ఫడ్నవీస్ పేరు తెలియని వారుండరు. ముఖ్యమంత్రిగా ఆయన ఐదేళ్లు పనిచేశారు. కాని రెండోసారి రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ ఆదేశాలతో ఆయన వద్ద డిప్యూటీగా కొనసాగారు ఫడ్నవీస్. కొన్నాళ్లకు లోక్‌సభ ఎన్నికలొచ్చాయి. బీజేపీ ఘోర పరాజయం పాలైంది. అనుకున్న స్థానాల కంటే తక్కువ స్థానాలను దక్కించుకుంది. ఫడ్నవీస్ చాలా నిరాశకు లోనయ్యారు. పరాజయానికి కారణాలను తెలుసుకుని అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. వ్యూహాత్నకంగా వ్యవహరించడంతో ఈ రోజు జరుగుతున్న కౌంటింగ్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఫడ్నవీస్ నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గంలో 15,000 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఆయన పార్టీ అభ్యర్థులు కూడా ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం మొత్తం 288‌లో 124 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సారి ఎన్నికలలో మీ కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరవుతారని అడిగిన ప్రశ్నకు ‘‘ కేవలం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో ఎన్నికల్లో పోరాడుతున్నాం. సీఎం ఎవరన్న విషయం ఫలితాలు వెలువడిన తర్వాత మా భాగస్వాములతో కలిసి నిర్ణయం తీసుకుంటాం’’ అని సమాధానమిచ్చారు ఫడ్నవీస్. ఎన్నికలకు ముందు బీజేపీ ప్రధాన వ్యూహకర్త, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి చేయాల్సిన సూచనలన్నీ ఫడ్నవీస్‌కు చెప్పారు. ఎన్నికల ర్యాలీలోనూ "నేను బీజేపీకి, దేవేంద్ర భాయ్‌కి భారీ మద్దతు రావడం చూస్తాను’’ అని కూడా అన్నారు.

లోక్‌సభ ఫలితాలతో తీవ్ర నిరాశ..

2014 నుంచి 2019 వరకు ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2022లో సీఎం షిండేకు డిప్యూటీగా ఉండాలని బీజేపీ హై కమాండ్ ఆదేశించింది. హోం శాఖతో డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత కూడా మహారాష్ట్రలో శాంతిభద్రతల సమస్యలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ముంబైలో ఎన్‌సీపీ (అజిత్ పవార్) నేత బాబా సిద్ధిక్ హత్యకు గురయినపుడు విపక్ష కూటమి నేతలు ఫడ్నవీస్‌ను ఘాటుగా విమర్శించారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి పరాజయం పాలైనప్పుడు ఫడ్నవీస్‌కు మరో షాక్ తగిలింది. 48 నియోజకవర్గాల్లో 17 మాత్రమే గెలిచింది. ప్రతిపక్ష ఎంవీఏ 30 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుని మరింత బలపడింది. ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ..ఆయన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని కూడా అన్నారు 2019లో 23 స్థానాలు గెలుచుకోగా.. 2024లో కేవలం 9తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, అసెంబ్లీ ఎన్నికలలో మహాయుతి కూటమి విజయం దిశగా దూసుకెళ్తుండడంతో మరోసారి పఢ్నవీస్ సీఎం అవుతారేమో వేచి చూడాలి.

Tags:    

Similar News