కేంద్రం నిర్ణయం హర్యానా, మహారాష్ట్రలో బీజేపీని గెలిపిస్తుందా?

గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి కారణం బోధపడినట్లుంది. అందుకే మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎగుమతులకు పచ్చజెండా ఊపింది.

Update: 2024-10-04 07:42 GMT

కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. బాస్మతి, బాస్మతియేతర బియ్యం, ఉల్లి ఎగుమతికి అనుమతించింది. హర్యానా, మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

గత లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చాలా రాష్ట్రాల్లో రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. దశాబ్ద కాలంలో మొదటిసారిగా సొంతంగా మెజారిటీ సాధించలేకపోవడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు.

కొన్ని రోజుల క్రితం ఎలక్షన్ కమిషన్ మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉల్లి, బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో హర్యానా, మహారాష్ట్ర రైతులు ప్రయోజనం పొందనున్నారు. అటు హర్యానా, ఇటు మహారాష్ట్రలో ఎన్‌డిఎ కూటమికి ఇది దోహదపడుతుంది. కాగా ఓట్ల కోసమే బీజేపీ నాయకత్వం రైతులకు ఇలాంటి ఆఫర్లు ఇస్తోందని మహారాష్ట్రకు చెందిన రైతు నాయకుడు అనిల్ ఘన్‌వత్ ఆరోపిస్తున్నారు.

రైతులకు లాభం..

“కేంద్రం తీసుకున్న నిర్ణయం మాస్టర్ స్ట్రోక్‌గా చెప్పుకోవాలి. రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులకు ఇది సంతోషకర వార్త. గతంలో నిషేధాన్ని ఎత్తివేయాలని మేం ప్రభుత్వాన్ని అభ్యర్థించాం. ప్రస్తుతం మా డిమాండ్లను అంగీకరించారు. మాకు చాలా సంతోషంగా ఉంది.” అని ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ఫెడరేషన్ (ఐఆర్‌ఇఎఫ్) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ప్రేమ్ గార్గ్ ఫెడరల్‌తో అన్నారు.

మంచి ధరలు..

“కేంద్రం బియ్యం ఎగుమతులను అనుమతించకపోతే, రైతులు తమ ఉత్పత్తులను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కంటే తక్కువ ధరకు విక్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో రైతులకు మంచి ధరలు లభించనున్నాయి. దేశంలో ఉత్పత్తి అయ్యే బాస్మతి బియ్యంలో ఎక్కువ భాగం అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతి అవుతుండగా..బాస్మతీయేతర బియ్యం ఆఫ్రికా దేశాలతో అమెరికా, యూరప్‌లకు ఎక్స్‌పోర్టు అవుతాయి” అని డాక్టర్ గార్గ్ చెప్పారు.

ఓటమికి ఉల్లి రైతులు కారణమా?

ఉల్లి ఎగుమతిని అనుమతించాలంటూ మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు కేంద్రాన్ని చాలాకాలంగా కోరుతున్నారు. ఆ డిమాండ్‌కు కూడా కేంద్రం ఓకే చెప్పింది. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు ఎదురుదెబ్బ తగిలింది. రైతుల కోపం కారణంగానే గెలిచే స్థానాలు కూడా ఓడిపోయామని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పార్టీ అగ్రనేతలకు వివరించారు. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని NDA కేవలం 17 మాత్రమే సాధించగలిగింది. ముఖ్యంగా ఉల్లి పండించే ప్రాంతాల్లోని అన్ని స్థానాలో పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు.

నిశితంగా పరిశీలించినపుడు ‘‘ఉల్లి పండించే ప్రాంతాల్లో బీజేపీ-ఎన్‌డీఏ అభ్యర్థుల ఓడిపోయారు. ఉల్లి, బియ్యం ఎగుమతికి కేంద్రం నిరాకరించడంతో రైతులు కూటమి అభ్యర్థులకు ఓటువేయలేదు.’’ అని ఘన్‌వత్ చెప్పారు.

సుంకం పెంచాలి..

ఆవాల నూనె, కొబ్బరి నూనె, సోయాబీన్ నూనెలపై కస్టమ్స్ సుంకం పెంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఫలితంగా మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల రైతులు దేశీయ మార్కెట్ నుండి ప్రయోజనం పొందుతారని చెప్పుకొచ్చింది.

“సోయాబీన్‌ను సేకరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్‌పి కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తుంది. పత్తి రైతులకు ఎంఎస్‌పి కంటే కూడా ఎక్కువ ధరను అందిస్తామని హామీ ఇచ్చింది. ఆవాల నూనె, సోయాబీన్‌, కొబ్బరిపై కస్టమ్స్‌ సుంకం పెరిగితే రైతులకు మేలు జరుగుతుందని ఘన్‌వత్‌ పేర్కొన్నారు.  

Tags:    

Similar News