మన ఎన్నికలంటే విదేశీయులకు అంత మోజు ఎందుకో!

భారతీయ ఎన్నికల ప్రక్రియను చూసేందుకు విదేశీ పర్యాటకులు క్యూకట్టారు. ఐక్య రాజ్య సమితీ మొదలు అగ్రరాజ్యాల వరకు ఎన్నో దేశాల వారు వస్తున్నారు. ఎందుకంటే

By :  Admin
Update: 2024-05-06 02:00 GMT

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితీ మొదలు అగ్రరాజ్యల వరకు ఇప్పుడు అందరి దృష్టి ప్రస్తుతం జరుగుతున్న 18వ లోక్ సభ ఎన్నికలపై పడింది. దేశంలోనే అతిపెద్ద పండువగా భావిస్తున్న ఎన్నికల్లో సుమారు 96 కోట్ల మందికి పైగా ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొంటున్న దేశం మరొకటి లేదు. అందుకే ఇప్పుడు ఎక్కడెక్కడి వారందరూ ఇండియా వైపు చూస్తున్నారు. నిజానికిదో పర్యాటక కేంద్రంగా మారిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి వరకు ఇండియాకు ఆధ్యాత్మిక టూరిస్ట్ కేంద్రంగా ప్రపంచ దేశాల్లో పేరుంది. ఇప్పుడు ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియ కూడా పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. అసలీ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో చూద్దామని వచ్చే వారు కొందరైతే ప్రపంచంలోనే ఇంతమంచి ప్రక్రియ లేదా అని చూడడానికి వస్తున్న వారు మరికొందరు. 2019 ఎన్నికల నాటికంటే 2024లో వచ్చే ఎన్నికల టూరిస్టుల సంఖ్య పెరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ప్రపంచ వ్యాప్తంగా 25వేల మందికి పైగా వచ్చినట్టు రికార్డులు తెలుపుతుంటే ఈసారి ఇప్పటికే అంటే మొదటి రెండు విడతల ఎన్నికలు పూర్తయ్యే సమయానికే 7 వేల మంది దాకా విదేశీ టూరిస్టులు వచ్చారు. మూడో దశ పోలింగ్ మే 7న జరుగనుంది. అప్పటికి మరికొన్ని వేల మంది రానున్నట్టు తెలుస్తోంది. వీళ్లందరూ వ్యక్తిగత హోదాలో వచ్చారు. వచ్చే వాళ్లందరూ భారతదేశ ఎన్నికల అపూర్వ దృశ్యాన్ని చూసి అబ్బురపడేవాళ్లు కొందరైతే మరికొందరు ఓటింగ్ సరళిని చూసి ఆశ్చర్యచకితులవుతున్నారు. పార్లమెంటుతో పాటు జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృశ్యాన్ని కూడా కొందరు ఆసక్తి చూపుతున్నారు. దశాబ్ద కాలంగా ఈ తరహా పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది.


భారత దేశ ఎన్నికల సందర్భంగా వచ్చే పర్యాటకుల్ని ఆకట్టుకోవడానికి దేశంలో పలు ఏజెన్సీలు కూడా పుట్టుకువచ్చాయి. అటువంటిలో ఒకటి గుజరాత్ టూరిజం కార్పొరేషన్ ఒకటి. ఎలక్షన్ టూరిజం ఆఫ్ ఇండియా అనే మరో సంస్థ కూడా విదేశీ పర్యాటకులకు వివిధ ప్యాకేజీల రూపంలో టూరిస్టులను ఆకట్టుకుంటోంది. వచ్చిన విదేశీ టూరిస్టులు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వివిధ నియోజకవర్గాలలో, గ్రామాల్లో, వార్డుల్లో ఏర్పాటు చేసే ప్రచార సభలను, బహిరంగ సభలను, సభల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను, ఆ సభల సందర్భంగా జరిగే నృత్య ప్రదర్శనలు, పాడే పాటల్ని ఆలకిస్తున్నారు. ప్రచారానికి వెళ్లే నాయకులకు పలికే స్వాగత సత్కారాలను, నృత్యాలను, సంగీత బృందాలను, వాద్యపరికరాలు వినియోగిస్తున్న తీరుపై ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు విదేశీ పర్యాటకులు నేరుగా వాళ్లు ఎంచుకున్న ప్రాంతాలకు వెళ్లి వాళ్లు చూడాలనుకున్న వాటిని చూస్తున్నారు. పోలింగ్ రోజున బారులు తీరి ఉండే జనాన్ని, వాళ్లకు చేస్తున్న ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నారు. ఓటింగ్ స్లిప్పుల పంపిణీ మొదలు ఓటు వేసి బయటకు వచ్చే వరకు ప్రతి అంశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఈసారి ఎన్నికల టూరిస్టులు ఎక్కువగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్నాటక, హైదరాబాద్ ప్రాంతాలకు ఎక్కువగా వచ్చినట్టు తెలుస్తోంది. విమానాశ్రయాల నుంచి నేరుగా హోటళ్లకు వెళ్లే సౌకర్యం, టూరిస్టులు ఉండడానికి అనువైన వసతి, ఎన్నికల సభలకు, పోలింగ్ బూతులకు సులువుగా వెళ్లి చూడడానికి ఉన్న వెసులుబాటును దృష్టిలో పెట్టుకుని విదేశీ టూరిస్టులు ఆయా రాష్ట్రాలకు వెళుతున్నారు. మొబిలిటీ, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ప్రాంతాల పట్ల మక్కువ చూపుతున్నారు.
2012 నుంచి ఇప్పటి వరకు ఎన్నికల సందర్భంగా సుమారు 5 లక్షల మంది వరకు విదేశీ పర్యాటకులు వచ్చి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. 23 దేశాలకు చెందిన 75 మంది ప్రతినిధులు ఇప్పటికే లోక్ సభ ఎన్నికల కోసం వచ్చారు. అధికారికంగా వచ్చిన దేశాల్లో ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ ఎన్నికల పరిశీలనకు వచ్చినట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. అధికారికంగా వచ్చిన ఈ 75 మంది చిన్న చిన్న గ్రూపులుగా విడివడి ఆరు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. పోలింగ్ సరళిని ఈ బృందాలు పరిశీలిస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఉత్తమమైందనే విషయాన్ని తెలిపేలా ఈ పర్యటనలు సాగుతున్నాయి.
ఎన్నికల సందర్భంగా ప్రైవేటు ట్రావెల్ ఏజెన్సీలు, ఆపరేటర్లు హడావిడి చేస్తున్నాయి. ఎలక్షన్ టూరిజాన్ని పెంచే పేరిట సుమారు 4 వేల సంస్థలు పని చేస్తున్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తున్నాయి. మూడు రాత్రులు, నాలుగు రోజులంటూ తమ వైబ్ సైట్లలో ప్రకటించి టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి. ఆయా దేశాలను బట్టి చార్జీలను వసూలు చేస్తున్నాయి. ఈ ప్యాకేజీలు 33 వేల మొదలు మూడు లక్షల వరకు ఉన్నాయి.

ఎలక్షన్ టూరిజం వాస్తవానికి 2012లో ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రారంభమైంది. ఆవేళ కేవలం 3 వందల మంది మాత్రమే వచ్చారు. 2014 లోక్ సభ ఎన్నికల నాటికి ఆ సంఖ్య 5,300కి పెరిగింది. ఎలక్షన్లను చూడడానికి వచ్చే వాళ్లలో ఎక్కువ మంది విద్యార్థులు, జర్నలిస్టులు, పరిశోధకులు, మహిళా సంఘాల నేతలు, చరిత్రకారులు, వారసత్వ సంపదను పరిరక్షించాలనుకునే వారు, సాంస్కృతిక సంబంధాలపై ఆసక్తి ఉండే వారు వస్తున్నారు. అందుకే టూరిస్ట్ ఏజెన్సీల హడావిడి చేస్తున్నాయి.
ప్రపంచ దేశాలలో ఇండియా అంతటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మరొకటి లేదు. 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి543 లోక్ సభ సభ్యులను సుమారు 96 కోట్ల మంది ఓటర్లు ఎన్నుకుంటారు. 68 రాజకీయ పార్టీలు ఈ సీట్లకు పోటీపడుతున్నాయి. 2024 ఏప్రిల్ 19న మొదలైన ఎన్నికల ప్రక్రియ ఏడు విడతల్లో సాగుతోంది. ఇప్పటికి మొదటి రెండు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్ ఒకటిన ఏడో విడత పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికలను భారతీయ ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది.
Tags:    

Similar News