అసెంబ్లీలో అడుగు పెట్టబోయే సిక్కోలు సీనియర్లు ఎవరు?
శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుల భవితవ్యం ఏమిటి? అసెంబ్లీలో ఎవరు అడుగు పెడతారు. ఎవరు పెట్టలేరు?
Byline : G.P Venkateswarlu
Update: 2024-05-30 11:54 GMT
రాష్ట్రంలో పోటాపోటీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకులం జిల్లా సీనియర్ నాయకుల పరిస్థితి ఏమిటి? వారి రాజకీయ భవితవ్యాన్ని ఎలా రాసుకున్నారు. ఓటర్లు ఏమని తీర్పు ఇచ్చారు? ఇప్పుడు ఇదీ జరుగుతున్న చర్చ. శ్రీకాకుళం నుంచి పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆమదాలవలస నుంచి పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి స్పీకర్ తమ్మినేని సీతారామ్, టెక్కలి నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు, నర్సన్నపేట నుంచి పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ధర్మాన కష్ణదాస్‌ల రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందనేది చర్చగా మారింది. వీరంతా రాజకీయాల్లో ఉద్దండులు. ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా, మంత్రలుగా పనిచేసిన వారు.
ధర్మాన తిరిగి అసెంబ్లీలో అడుగు పెడతాడా?
శ్రీకాకుళం ఎమ్మెల్యేగా పోటీ చేసిన ధర్మాన ప్రసాదరావు గెలుస్తాడా? లేదా? అనేది పెద్ద చర్చగా మారింది. సీనియర్ నాయకుడు. రాజకీయాల్లో తలపండిన వారు. వైఎస్సార్ వంటి దిగ్గజ ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్‌సీపీలోనూ రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ఏ శాఖలో పనిచేసినా తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని నిరూపించారు. పాలన ముందుకు సాగించడంలో, ప్రజలకు చేరువ కావడానికి ఆయన ఎప్పుడూ ముందుండే వారు. ఈ ఎన్నికల్లో గెలుస్తాడా? లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈయనపై గొండు శంకర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుల మద్దతుతో రాజకీయాల్లోకి వచ్చాడు. ఈయన తండ్రి శ్రీకాకుళం రూరల్ మండలం ఎంపీపీ, శంకర్ శ్రీకాకుళం రూరల్ మండలం ఎంపీటీసీగా ఉన్నారు. అసెంబ్లీ రాజకీయాలకు కొత్త అయినా నియోజకవర్గంలో విచ్చల విడిగా ఓట్ల కోసం డబ్బులు ఖర్చుచేసినట్లు ఓటర్లు చెబుతున్నారు. సుమారు ఓట్ల కొనుగోలుకు రూ. 70 కోట్ల వరకు ఖర్చుచేసి ఉంటారనేది ఒక అంచనా. ధర్మాన ప్రసాదరావు ప్రచారానికి, ఓట్ల కొనుగోలుకు కలిపి రూ. 25 కోట్ల వరకు ఖర్చుపెట్టినట్లు స్థానికులు, ఆయన వద్ద ఉండే సన్నిహితులు చెబుతున్నారు. పైగా టీడీపీ గాలి వీస్తోందని, అందువల్ల శంకర్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.
తమ్మినేని సీతారామ్ గట్టెక్కుతారా..!
తమ్మినేని సీతారామ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, సీనియర్ రాజకీయ నాయకుడు. వరుసగా మూడు సార్లు పోటీ చేసి ఆముదాల వలసలో ఓడిపోయారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు సార్లు గెలిచారు. మంత్రిగా పనిచేశారు. 2004లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత పిఆర్‌పీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014లో ఓడిపోయి 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గెలిచి స్పీకర్ అయ్యారు. ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న తమ్మినేని ఇప్పుడు ఎన్నికల్లో ఎదురీదుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈయనపై గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కూన రవికుమార్ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేశారు. రవికుమార్ 2014లో తమ్మినేనిపై గెలిచారు. తర్వాత ఓడిపోయినా తిరిగి 2024 ఎన్నికల్లో బావపై పోటీకి దిగారు. రవికుమార్ తమ్మినేనికి స్వయానా బావమరిది కావడం విశేషం. తమ్మినేని గత ఎన్నికల్లో గెలిచినంత సులువుగా ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు చెప్పడం విశేషం.
అచ్చెన్నాయుడుకు అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమా..
టెక్కలి నుంచి టీడీపీ అభ్యర్థిగా మూడో సారి పోటీకి దిగారు కింజరాపు అచ్చెన్నాయుడు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అచ్చెన్నాయుడుకు రాజకీయ వర్గాల్లో మంచి పేరుంది. టెక్కలి నుంచి 2014లో గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో కార్మిక, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ కోసం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలో కష్టపడి పనిచేస్తున్న వారిలో ఒకరుగా చంద్రబాబు అచ్చెన్నాయుడను గుర్తించి పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా నియమించారు. ప్రస్తుతం ఈయనపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేశారు. ఎన్నికలు పూర్తయినందున వీరి భవిష్యత్ ఈవీఎంల్లో దాగి ఉంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య నుంచి కూడా విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆమె అనారోగ్యంతో ఉందని వదిలేశారు. దీంతో ఆమె 2024 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసింది. వైఎస్సార్‌సీపీ వారు నచ్చజెప్పడంతో విరమించారు. ఇలా శత్రులును దువ్వాడ పెంచుకున్నారని, సొంతవారి నుంచే వ్యతిరేకత రావడం, అచ్చెన్నాయుడు సీనియర్ కావడంతో ఆయన ముందు నిలిచే అవకాశం లేదనే ప్రచారం సాగుతోంది. అచ్చెన్నాయుడు గంతో హరిశ్చంద్రపురం నుంచి మూడు సార్లు గెలవగా, రెండు సార్లు టెక్కలి నుంచి గెలిచారు. ఇప్పుడు టెక్కలిలో తన భవిష్యత్‌ను ఓటర్లు నిర్ధేశించనున్నారు.
మాజీ మంత్రి కష్ణదాస్ మాటేమిటి?
మాజీ మంత్రి ధర్మాన కష్ణదాస్ ఓడిపోతున్నాడనే టాక్ జిల్లా వ్యాప్తంగా వినిపిస్తోంది. కష్ణదాస్ చాలా మంచి మనసున్న వ్యక్తి అనే పేరు ఉంది. అందరినీ కలుపుకొని పోవడంలో ముందుంటారు. ఆర్థిక సంబంధాలే ముఖ్యమని ఎప్పుడూ భావించలేదని, అందువల్ల ఆయనను అందరూ అభిమానిస్తారని ఆయన గురించి తెలిసిన పలువురు చెబుతారు. ధర్మాన కష్ణదాస్ 2004, 2009, ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తిపై ఓడిపోయారు. తిరిగి 2019లో బగ్గు రమణమూర్తిని ఓడించి వైఎస్సార్ కాంగ్రెస్‌లో మంత్రి అయ్యారు. రెండున్నర సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. మొత్తం నాలుగు సార్లు అసెంబ్లీకి వెళ్లారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి బగ్గు రమణమూర్తి తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రమణమూర్తి గెలిచే అవకాశాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆయన కుమారుడు కష్ణ చైతన్య, భార్య పద్మప్రియల కారణంగా ఓటమి చెందే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.