ముంబైలో యోగి ఫొటోతో ఉన్న 'బటేంగే తో కటేంగే' ఫ్లెక్సీలకు అర్థమేమిటి?

ఆగ్రాలో జరిగిన ఒక బహిరంగ సభలో దేశంలోని హిందూ సమాజానుద్దేశించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ముంబై నగరంలో ఫెక్సీల మీద కనిపిస్తున్నాయి.

Update: 2024-10-22 10:24 GMT

మహారాష్ట్రలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్త విశ్వబంధు రాయ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫొటో పక్కనే “బటేంగే తో కటేంగే” నినాదంతో కూడిన ఫ్లెక్సీలను ముంబైలోని పలు చోట్ల ఏర్పాటుచేయడం వెనక కారణాన్ని బయటపెట్టారు విశ్వబంధు రాయ్. ప్రతిపక్షాల రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశామని ఆయన చెప్పుకొచ్చారు.

 ‘‘ఉత్తర భారతదేశ ప్రజలు యోగి ఆదిత్యనాథ్, ఆయన నినాదం 'బాటేంగే టు కటేంగే'ని నమ్ముతారు. అందుకే మేం మహారాష్ట్రలో కూడా ప్రతిపక్ష వ్యూహాలకు సమాధానం ఇవ్వడం ప్రారంభించాం. హర్యానాలో ప్రజలు బీజేపీకి ఎలా మద్దతిచ్చారో మీరు చూశారు. ఇప్పుడు మహారాష్ట్రలోనూ అదే తరహాలో ముందుకువెళ్తున్నాం’’ అని వివరించారు.

బంగ్లాదేశ్‌నుద్దేశించి యోగీ నినాదం..

పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని తొలగించిన తర్వాత అక్కడి హిందువులపై జరిగిన అకృత్యాల గురించి ప్రస్తావిస్తూ..యోగి ఈ నినాదాన్ని ఇచ్చారు. ఆగస్టు మూడో వారంలో ఆగ్రాలో జరిగిన ఒక బహిరంగ సభలో దేశంలోని హిందూ సమాజానుద్దేశించి ఇలా అన్నారు.

“దేశానికి మించింది ఏదీ లేదు. మనం ఐక్యంగా ఉన్నప్పుడే దేశం సాధికారత సాధిస్తుంది. 'బటేంగే తో కటేంగే' బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఆ తప్పులు ఇక్కడ పునరావృతం కాకూడదు. 'బటేంగే తో కటేంగే, ఏక్ రహేంగే తో నేక్ రహేంగే (విడిపోతే..నష్టపోతాం..ఐక్యంగా ఉండాలన్నది యోగీ ఉద్దేశం)" అని అన్నారు.

యోగిపై విపక్షాల మండిపాటు..

మరోవైపు బంగ్లాదేశ్‌పై యోగి ఆదిత్యనాథ్ చేసిన “బటేంగే తో కటేంగే” వ్యాఖ్యలు ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

విదేశీ వ్యవహారాల్లో జోక్యం తగదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ యోగీకి హితవు పలికారు. “ముఖ్యమంత్రి యోగి ఇలాంటి ప్రకటనలు గతంలోనూ చేశారు. ఢిల్లీ తీసుకునే నిర్ణయాల్లో ఆయన జోక్యం చేసుకోకూడదు. 'ఢిల్లీ-వాలే' అతనికి అర్థమయ్యేలా చెబుతారని ఆశిస్తున్నాను'' అని గతంలో అన్నారు అఖిలేష్.

ముస్లింల ఇళ్లను ఆదిత్యనాథ్ బుల్డోజర్లతో కూల్చివేయిస్తున్నారని, సమాజంపై విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు.

Tags:    

Similar News