Maharashtra Politics | పరాజయం పాలైన MVA కూటమి నేతలు ఏం చేయబోతున్నారు?

మహారాష్ట్రలో MVA పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతుందా? ఆ కూటమి నేతల వ్యాఖ్యలకు బీజేపీ ఎలా కౌంటర్ ఇచ్చింది..

Update: 2024-11-27 11:41 GMT

ఇటీవల మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మహాయుతి, మహా వికాస్ అఘాడి కూటములు పోటీపోటీగా తలపడ్డాయి. చివరకు ప్రజలు మహాయుతి కూటమికే అధికారం కట్టబెట్టారు. MVA కూటమి ఘోర పరాజయం పాలైంది. ఓటమికి కారణాలను విశ్లేషించుకున్న అఘాడీ కూటమి నేతలు ఎలక్ర్టానిక్ ఓటింగ్ మిషన్లే (EVM)లపై అనుమానం వ్యక్తం చేశారు. అవి విశ్వసనీయం కాదంటూ దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నారు.

MVA కూటమికి కేవలం 49 సీట్లే..

ఎన్నికలలో MVA కేవలం 49 సీట్లు గెలుచుకుంది. వీటిల్లో ఠాక్రే సేన 20, కాంగ్రెస్‌ 16, శరద్ పవార్ ఎన్సీపీ గ్రూపు 10 స్థానాల్లో విజయం సాధించింది. ఇటు బీజేపీ, అజిత్ పవార్ (ఎన్‌సీపీ)ఏక్‌నాథ్ షిండే (శివసేన) మహాయుతి కూటమి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకు 235 స్థానాలను సొంతం చేసుకుంది. వీటిల్లో బీజేపీ ఏకంగా 132 స్థానాల్లో గెలుపొందింది.

VVPAT క్రాస్ చెక్..

శరద్ పవార్ (ఎన్‌సీపీ) అభ్యర్థులు 86 స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం 10 స్థానాల్లో గెలుపొందారు. పోల్ అయిన ఓట్లను లెక్కపెట్టేందుకు ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT)కు డిమాండ్ చేయాలని ఆయన తన పార్టీ ఓడిపోయిన అభ్యర్థులకు సూచించారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు అవకతవకలు జరిగాయని శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్‌ సహా సీనియర్ ఎన్సీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు.

కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లో..

కాంగ్రెస్ కూడా 101 స్థానాల్లో పోటీ చేసి కేవలం 16 స్థానాల్లో మాత్రమే గెలుపొందడంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో కాంగ్రెస్ బాస్ మల్లికార్జున్ ఖర్గే మంగళవారం బ్యాలెట్ పేపర్ల విధానాన్ని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత రాజీనామా చేసిన కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ మాజీ అధ్యక్షుడు నానా పటోలే కూడా EVMలను తప్పుబట్టారు. EVM ట్యాంపరింగ్ చేశారని ఆయన చెబుతున్నారు. హర్యానా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత తీర్పును అంగీకరించేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. ఈవీఎంలు హ్యాక్‌ అయ్యాయని, ఓటింగ్‌ డేటాను ప్రచురించడంలో జాప్యం జరుగుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది.

బీజేపీ కౌంటర్ అటాక్..

కాంగ్రెస్, ప్రతిపక్ష నేతల వాదనను బీజేపీ కొట్టిపారేసింది. "జార్ఖండ్‌లో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి గెలిచింది. అక్కడ ఎన్నికలు 'న్యాయంగా' జరిగాయి. అక్కడ ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయలేదు. మహారాష్ట్రలో మాత్రం ఘోరంగా ఓడిపోవడంతో ఆ నెపాన్ని ఎలక్షన్ కమిషన్ మీదకు, ఈవీఎం మీదకు నెడుతున్నారు?’’ అని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.

కోర్టు అక్షింతలు..

నవంబర్ 26న బ్యాలెట్ పేపర్ విధానం తీసుకురావాలని పిటిషనర్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదే సందర్భంలో ‘‘మీరు ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలు (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్) ట్యాంపరింగ్‌కు గురికాలేదని అని అంటారు. ఓడిపోయినప్పుడు మాత్రం ట్యాంపరింగ్‌ చేశారని అంటారా?’’ అని న్యాయమూర్తులు విక్రమ్‌నాథ్, పీబీ వరాలే ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Tags:    

Similar News