‘జార్ఖండ్‌ను నిమ్మకాయలా పిండేశారు.. ఇకపై అలా జరగదు’

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బీజేపీపై నిప్పులు చెరిగారు. తమ రాష్ట్రాన్ని దోపిడీ చేసేశారని, అధికారంలోకి రావడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

Update: 2024-11-09 08:38 GMT

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వార్త సంస్థ పీటీఐ ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీపై విరుచుకుపడ్డారు. కాషాయ పార్టీ విభజన రాజకీయాలతో తమ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తోందని ఆరోపిపంచారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు.

సంపదను దోచుకున్నారు..

"గత 20 ఏళ్లలో జార్ఖండ్‌ను బీజేపీ నిమ్మకాయలా పిండేసింది. ఇది ఇప్పుడు అంతం కావాలి. మనం ఆవుకు మేత వేస్తే..పాలు వాళ్లు తీసుకుంటున్నారు. ఇకపై ఇది పనిచేయదు. జార్ఖండ్ సంపదను దోచుకున్నారు. వనరులు, ఖనిజ సంపద పుష్కలంగా ఉన్న పేద రాష్ట్రం జార్ఖండ్. బొగ్గు, ఇనుప ఖనిజం, బాక్సైట్, డోలమైట్ నిక్షేపాలు చాలా ఉన్నాయి. కానీ జీఎస్టీ వల్ల మా ఆదాయ సేకరణకు ఆటంకం ఏర్పడుతుంది. మా ఆర్థిక అవసరాలను తీర్చుకోడానికి ఏ మాత్రం ఉపయోగపడడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీకి పదేపదే లేఖలు రాస్తున్నాం. రాష్ట్రానికి రూ. 1.36 లక్షల కోట్ల బొగ్గు బకాయిలు క్లియర్ చేయాలని కోరుతున్నాం. అయినా స్పందన లేదు.’’ అని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విభజన అజెండా మాత్రమే వారికి తెలుసు..

"విభజన రాజకీయాలు, హిందూ-ముస్లిం పోలరైజేషన్ ఎజెండాతో బీజేపీ పనిచేస్తోంది. దేశంలో ఆరోగ్యకర రాజకీయ పోటీ తుడిచిపెట్టుకుపోయింది. అభివృద్ధి, ఉపాధి వారి అజెండాలో లేవు. వారికి తెలిసిన ఏకైక ఎజెండా విభజన. విభజన రాజకీయాల గురించే మాట్లాడతారు. మత విద్వేషాన్ని పెంచుతారు. ’’ అని ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఒక గిరిజన సీఎం తన పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేయడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అధికారం కోసం పాలన కాలం పూర్తవ్వడానికి ముందే ఎన్నికలను తెచ్చింది’’ అని విమర్శించారు.

పోచింగ్ మాస్టర్‌లా..

కేంద్ర ప్రభుత్వం ‘పోచింగ్‌ మాస్టర్‌’గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్రలోని నేతలు ప్రభుత్వాలను పడగొట్టడంలో నిష్ణాతులు. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా మీద ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తున్నారు. మా పార్టీని విచ్ఛిన్నం చేయవచ్చు. మా ఎమ్మెల్యేలను కొనొచ్చు కూడా. కాని ప్రజాశీర్వాదంతో నేను గతంలో కంటే బలంగా మళ్లీ వాళ్ల ముందుకు వచ్చాను. " అని చెప్పారు.

'మణిపూర్‌లో హింస వెనుక బీజేపీ'

మణిపూర్‌లో ఉన్నవారి కంటే జార్ఖండ్‌లోని గిరిజనులు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని బీజేపీ ఆరోపణలను సోరెన్ తిప్పుకొట్టారు. ఈశాన్య రాష్ట్రంలో హింసాకాండకు కాషాయ పార్టీనే కారణం అని ఆరోపించారు. ‘‘ఎక్కడికక్కడ విభజనలు సృష్టించే పనిలో నిమగ్నమై ఉన్నారు. తమ డబుల్ ఇంజన్ రాష్ట్రంలో ఏం జరుగుతోందో కూడా గమనించడం లేదు. వారి పాలనలో ఆ రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది. వారి డబుల్ ఇంజన్ అక్కడ పనిచేస్తుందా? ’’ అని ప్రశ్నించారు.

'చొరబాట్లు జరుగుతున్నాయని దుష్ప్రచారం'

‘చొరబాట్లు పెరిగిపోయాయని బీజేపీ ప్రచారం చేస్తోంది. అలా అయితే వాటికి ఎవరు బాధ్యులు. ఈ విషయాన్ని నేను హోం మంత్రి అమిత్ షాను అడగాలను కుంటున్నా.’’ అని అన్నారు.

ఆ పార్టీ అధీనంలోనే దర్యాప్తు సంస్థలు..

బీజేపీని "వ్యాపారుల పార్టీ"గా అభివర్ణించిన హేమంత్ సొరేన్.. కేంద్రం దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు కాషాయ పార్టీ ఆధీనంలో పనిచేస్తున్నాయని ఆరోపించారు. "వారు మేం అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. కానీ బీజేపీ కుంభకోణాల గురించి ఎందుకు మాట్లాడరు? గుజరాత్ ఓడరేవులలో భారీ మాదకద్రవ్యాల స్వాధీనం లేదా కార్పొరేషన్లకు సంబంధించిన కుంభకోణాలపై ఎటువంటి విచారణ లేదు" అని పేర్కొన్నారు.

యూజీసీ అవసరం లేదు..

యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) గురించి మాట్లాడుతూ "ఇక్కడ UCC అవసరం లేదు. గిరిజనులను రక్షణకు ఏం చర్యలు తీసుకోవాలో మాకు తెలుసు. వారు UCC, NRC లాంటి వాటి గురించి మాట్లాడతారు. కానీ సాధారణ జనం సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారు" అని వ్యాఖ్యానించారు.

81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Tags:    

Similar News