కేరళలోని వయనాడ్‌ ఉప ఎన్నికలో తగ్గిన పోలింగ్ శాతం

2019లో రాహుల్ గాంధీ పోటీచేసినపుడు పోలింగ్ 80 శాతంగా నమోదైంది. ఇటీవల జరిగిన ఎన్నికలో 74 శాతం నమోదు కాగా..ప్రస్తుతం 65 శాతానికి పడిపోయింది.

Update: 2024-11-14 06:52 GMT

కేరళలోని వయనాడ్ నియోజకవర్గానికి బుధవారం ఉప ఎన్నిక నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే పోలింగ్ శాతం గతంలో కంటే ఈ సారి తక్కువగా నమోదైంది. 65 శాతం పోలింగ్ జరిగినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసినపుడు 74 శాతంగా నమోదైంది. 2019‌లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినపుడు 80 శాతానికి పైగా నమోదయ్యింది.

పోలింగ్ శాతం 65..

పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఈ సారి ఓటింగ్ శాతం పెరుగుతుందని అన్ని రాజకీయ పార్టీలు భావించాయి. కాని వారి అంచనాలు నిజం కాలేదు. 64.69 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

తగ్గిన ఓటింగ్ శాతం ప్రియాంకపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందన్న కొందరి వాదనను కాంగ్రెస్ నేతృత్వంలోని UDF తోసిపుచ్చింది. ఎల్‌డీఎఫ్‌ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఓటర్లలో ఉత్సాహం లేకపోవడమే ఇందుకు కారణమని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీషన్‌ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎల్‌డీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ యుడీఎఫ్ వాదనను తిరస్కరించాయి. కాంగ్రెస్, దాని మిత్రపక్షాల ఆధిపత్యం ఉన్న ప్రాంతాలలో ప్రజలు ఓటు వేయడానికి రాకపోవడంతో ఓటింగ్ శాతం తగ్గిందని వాదించాయి.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగిన ఎన్నికల ప్రక్రియలో వయనాడ్, చెలక్కరలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) బ్రేక్‌డౌన్‌ మినహా ఎటువంటి ఘటనలు చోటుచేసుకోలేదు. ఈవీఎం బ్రేక్‌డౌన్‌లను ఎన్నికల అధికారులు త్వరగా పరిష్కరించినట్లు సమాచారం.

ఓటర్లకు వాహనాల ఏర్పాటు..

ఈ ఏడాది జులైలో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. వందల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. చాలా మంది కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసలో తలదాచుకుంటున్నారు. వీరంతా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి అధికారులు వాహనాలను ఏర్పాటు చేశారు.

మొత్తం ఏడు నియోజకవర్గాలు..

వయనాడ్ నియోజకవర్గంలో మొత్తం ఏడు నియోజకవర్గాలున్నాయి. మనంతవాడి (ST), సుల్తాన్ బతేరి (ST), కల్పెట్టా వయనాడ్ జిల్లాలో ఉన్నాయి. కోజికోడ్ జిల్లాలోని తిరువంబాడి నియోజకవర్గం ఉంది. మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలంబూర్ వండూర్ నియోజకవర్గాలు ఉన్నాయి.

ముగ్గురి మధ్య తీవ్ర పోటీ..

ఈ స్థానానికి మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యుడీఎఫ్ తరుపున ప్రియాంక పోటీచేయగా.. సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌కు చెందిన సత్యన్ మొకేరి, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఎ నుంచి నవ్య హరిదాస్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు.

ఉప ఎన్నిక ఎందుకు?

రాహుల్ గాంధీ ఇటీవల జరిగిన ఎన్నికలలో వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలి నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ ఆయన గెలుపొందాడు. అయితే పార్లమెంటుకు ఒక స్థానం నుంచి మాత్రమే ప్రాతినిథ్యం వహించాల్సి ఉండడంతో వయనాడ్‌ను వదులుకున్నారు. దాంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

చెలక్కర అసెంబ్లీ స్థానానికి..

త్రిసూర్ జిల్లాలోని చెలక్కర అసెంబ్లీ స్థానానికి కూడా పోలింగ్ జరిగింది. ఇక్కడి నుంచి ఆరుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. 2021లో ఇక్కడి నుంచి గెలిచిన ఎల్‌డీఎఫ్‌కు చెందిన కె రాధాకృష్ణన్ ఆలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. యుడీఎఫ్‌కు చెందిన రమ్య హరిదాస్‌ను ఓడిండి లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ సారి యూడీఎఫ్ నుంచి హరిదాస్ పోటీ చేయగా.. ఆయనకు పోటీగా ఎల్‌డీఎఫ్‌కు చెందిన యుఆర్ ప్రదీప్, ఎన్‌డీఎకు చెందిన కె బాలకృష్ణన్‌ బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 72.54 శాతం ఓటింగ్ నమోదైంది.

Tags:    

Similar News