‘మహారాష్ట్ర ప్రజల కంటే అదానీ ప్రయోజనాలే బీజేపీకి ముఖ్యం’

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ముంబైలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ 'ఏక్ హై తో సేఫ్ హై' నినాదాన్ని ఎగతాళి చేశారు.

Update: 2024-11-18 09:14 GMT

కాంగ్రెస్ నేత, లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర ప్రజల కంటే పారిశ్రామికవేత్త అదానీ ప్రయోజనాలకే భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ 'ఏక్ హై తో సేఫ్ హై' నినాదాన్ని ఎగతాళి చేశారు. నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీ కలిసి దిగిన ఫొటోను పాత్రికేయులకు చూపుతూ వీరిద్దరూ కలిసి ఉన్నంతవరకు సురక్షితంగా ఉంటారని చెప్పారు. ఆ తర్వాత మరో పోస్టర్‌ ప్రదర్శించారు. అది ధారవి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు సంబంధించినది. ధారవి ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. ధారవి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ కేవలం"ఒక వ్యక్తికి" ప్రయోజనం చేకూర్చడానికి తీసుకొచ్చారని ఆరోపించారు. ‘‘టెండర్లు ఎలా వేస్తున్నారు. వాటిని ఎలా దక్కించుకుంటున్నారో అర్థం కావడం లేదు. దేశంలోని అన్ని ఓడరేవులు, విమానాశ్రయాలు, సంపద ఒకే వ్యక్తికే ఇచ్చారు.’’ అని పేర్కొన్నారు.

కుల గణనపై మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించి దేశంలో కుల గణన నిర్వహించేందుకు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కృషి చేస్తాయని రాహుల్ పునరుద్ఘాటించారు. “కుల గణన అనేది మన ముందున్న అతిపెద్ద సమస్య. మేం దాన్ని పూర్తి చేస్తాం.’’ అని ప్రకటించారు.

నిరుద్యోగ సమస్య గురించి కూడా రాహుల్ మాట్లాడారు. ఫాక్స్‌కాన్, ఎయిర్‌బస్‌తో సహా రూ.7 లక్షల కోట్ల ప్రాజెక్టులను మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు తరలించడంతో మహారాష్ట్రలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కొంతమంది బిలియనీర్లు, పేదల మధ్య జరిగే పోరుగా గాంధీ అభివర్ణించారు.

Tags:    

Similar News