‘20 వేల మంది రైతుల బలవన్మరణాలకు కారణం BJP’

మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-21 08:36 GMT

మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర రైతులకు భారతీయ జనతా పార్టీనే అతి పెద్ద శత్రువు అని అన్నారు. రైతులకు మేలు జరగాలంటే డబుల్‌ ఇంజన్‌ సర్కారు ఏర్పాటుకు సహకరించొద్దని మహారాష్ట్ర ఓటర్లను కోరారు.

ఎక్స్ వేదికగా హిందీలో ఆయన బీజేపీపై విరుచుకుపడ్డారు. ‘‘మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలకు బీజేపీనే కారణం. రాష్ట్రాన్ని కరువు రహితంగా మారుస్తామన్న వాగ్దానం ఏమైంది? మహారాష్ట్ర రైతులకు బీజేపీనే అతి పెద్ద శత్రువు.. వారి విధానాల వల్లే 20 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయ రంగానికి నిధుల్లో భారీ కోత విధించారు. భీమా కంపెనీలకు వరాలు కురిపించిన కేంద్రం రైతులకు మాత్రం నష్టపరిహారం ఇవ్వడానికి నిరాకరించడం ఏమిటి?’’ అని ప్రశ్నించారు.

‘‘ఉల్లి, సోయాబీన్ రైతుల పంట ఉత్పత్తులపై ఎగుమతి నిషేధం విధించడం.. అధిక ఎగుమతి సుంకం భారం మోపడం.. పత్తి, చెరుకు ఉత్పత్తి తగ్గిపోయి అన్నదాతలు కష్టాలు ఎదుర్కోడానికి బీజేపీ విధానాలే కారణం’’ రాష్ట్రంలోని పాల సహకార సంఘాలు సంక్షోభంలో ఉన్నాయని ప్రభుత్వమే అంగీకరించిందని ఖర్గే గుర్తుచేశారు.

మహారాష్ట్ర వాసులు ‘‘మహాపరివర్తన్’’ కోరుకుంటున్నారని, బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారును అధికారంలోకి రాకుండా చేయడం ద్వారానే రైతులకు మేలు జరుగుతుందని ఖర్గే అభిప్రాయపడ్డారు.

పాలక మహాయుతి కూటమిలో ఏక్‌నాథ్ షిండే యొక్క శివసేన, BJP అజిత్ పవార్ నేతృత్వంలోని NCP ఉన్నాయి. ప్రతిపక్ష MVAలో కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) శరద్ పవార్ నేతృత్వంలోని NCP (SP) ఉన్నాయి.

మహారాష్ట్రలో 288 మంది సభ్యులున్న అసెంబ్లీని నవంబర్ 20 వ తేదీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

Tags:    

Similar News